కథ

అనాథాశ్రమం - కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంకటేశ్వరా వృద్ధాశ్రమ ప్రాంగణంలో వాకింగ్ చేస్తున్న రమ ఎందుకో బాధపడుతున్నట్లుగా మైథిలికి తోచింది.
‘రమా పిల్లలు ఫోన్ చేశారా?’
‘లేదు మైథిలీ! పెళ్లిళ్ల గురించి అడుగుతానని అవాయిడ్ చేస్తున్నారు. నేను చాట్ చేద్దామని కూర్చుంటే వాళ్లు లాగ్ ఇన్ అయి నేనా విషయం మొదలెట్టిన వెంటనే లాగ్ ఆఫ్ అయిపోతున్నారు. ఏం చేయమంటావు? మేమిక్కడ, వాళ్లక్కడ... తూర్పూ... పడమరా.. నాకేమీ దిక్కుతోచడం లేదు. నీవంటే బాధ్యతలున్నాయని మానసికంగా ఎదగని నీ చెల్లెలి కోసం పెళ్లి మానుకున్నావు. ఆమె పోయేవరకూ స్వంత పిల్లల కంటే ప్రేమగా చూసుకున్నావు. నలభయ్యో పడిలో పడుతూ కూడా వీళ్లెందుకు పెళ్లి మాట ఎత్తనివ్వరో అర్థం కావడంలేదు. పెళ్లీ, పిల్లలూ బాదరబందీ లెందుకనుకుంటున్నారేమో... మావారేమో ఎక్కువగా ఆలోచించద్దంటారు.’
ఆరు పదులు దాటిన వాళ్లిద్దరూ దారిలో కలిసిన శైలజతో ‘మనవడు మాట్లాడుతూంటే మన వాకింగ్ గుర్తు రాలేదా?’ అన్నారు. ఏడు పదులు దాటిన శైలజ, వాళ్లతో కలిసి ముప్పై సంవత్సరాలు ఒకే ఆఫీసులో పని చేసింది. వాళ్ల స్నేహ మాధుర్యం నలుగురూ ఆస్వాదించేలా రమ కోరిక మీద వాళ్లాయన అదే ఆశ్రమంలో వాళ్ల పక్కనే రూం తీసుకున్నాడు. అక్కడే ఏర్పడిన స్నేహ బృందంతో తన శేష జీవితం అక్కడే హాయిగా గడిపేస్తున్నాడు.
తెల్లవారుతూనే అదే ప్రాంగణంలో ఉన్న ఆలయానికి ముగ్గురూ వెళ్లి ఒక గంట ప్రశాంతంగా గడిపి డైనింగ్ హాల్‌కి వెళ్తారు. టిఫిన్ కార్యక్రమం పూర్తవగానే సిక్ రూమ్స్‌లోని వాళ్లని ప్రేమగా పలకరించి వాళ్లకేమి కావాలో అడిగి తెలుసుకుంటారు. నిజానికి వాళ్ల అవసరాలు తీర్చడానికి నర్సులున్నారు గానీ ఈ ముగ్గురూ వారిని ఆత్మబంధువుల్లా సేద తీరుస్తారు.
ఒకే వృద్ధాశ్రమ ప్రాంగణంలో గుడి, బడితోపాటు సకల వైద్య సౌకర్యాలున్న వార్డులు, డాక్టర్లు, నర్సులు ఉండటం వల్లనే బాగా నచ్చి మనసులు దగ్గరైన లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ముగ్గురూ ఊరికి దూరమైనా సరే అక్కడే ఉందామని నిర్ణయం తీసుకున్నారు. బడి అంటే చదువులు చెప్పే బడి కాదు... చదువుల తల్లి.. సరస్వతీ నిలయమైన లైబ్రరీ! పగటి వేళల్లో టీవీ రూంలో గానీ, కంప్యూటర్ రూంలో గానీ, లైబ్రరీలో గానీ గడిపేస్తారు. రమా వాళ్లాయనకున్న లాప్టాప్‌లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటారు. సహృదయుల సహకారముంటే ఏది మాత్రం అసాధ్యం?
సాయంత్రం టీ తాగాక వాకింగ్ చేస్తున్న వాళ్లతో విజయ ‘ఇది విన్నారా? మన దేశంలో సరోగసి క్లినిక్స్ ముందు ఆడవాళ్లు బారులు తీరుతున్నారట... పిల్లలు కావాలనుకునే వాళ్లు తొమ్మిది నెలలు వాళ్ల పిల్లలను మోసినందుకు నాలుగు వేల పౌండ్లు ఇస్తున్నారట. పదేళ్లు కూలీ చేసినా సంపాదించలేని మొత్తం ఒక్క సంవత్సరంలోనే కనిపిస్తూంటే, కుటుంబావసరాల కోసం మన దేశంలోనే ఎక్కువగా పేద ఆడవాళ్లు ఇతరుల పిండాలను శిశువులుగా తయారుచేయడానికి తమ గర్భాలను అద్దెకిస్తున్నారట. సరోగసి క్లినిక్స్ మన దేశంలో బేబీ ఫార్మ్స్‌లా పారిశ్రామిక లెవెల్లో విస్తరిస్తున్నాయట.’
శైలజ విజయ మాటలు వింటూ ఆలోచిస్తూంది.. అంతా చట్టబద్ధంగా జరుగుతూంటే తప్పేమున్నది? పిల్లలు కావాలనేవాళ్లు ఇతర దేశాల నుండి వచ్చి పండంటి పాపాయిలతో సంతోషంగా వెళ్తున్నారని తనూ ఎక్కడో చదివింది.. ‘రిచ్ అమెరికన్ ఫాదర్ బాట్ ఆన్ ఎగ్ ఫ్రం యూరోపియన్ ఉమన్ హూ సోల్డ్ ఇట్ ఫర్ 750 పౌండ్స్’ అంటే అమెరికన్ పురుష బీజ కణంతో యూరోపియన్ అండం కలిసి ఏర్పడిన పిండం మన దేశంలోని ఒక బీద వనిత గర్భంలో పెరిగి ఒక తెల్లజాతి శిశువుగా మళ్లీ అమెరికా వెళ్లిపోతుంది.. ఇదేదో మల్టీ నేషనల్ బిజినెస్‌లా ఉంది.
ఇంతలో మైథిలి తన మనోగతం విప్పింది.. ఇంకో నలభై ఏళ్లల్లో ప్రపంచ జనాభా రెట్టింపవుతుందట. ఈ జనాభాలో తొంభై అయిదు శాతం వృద్ధి చెందుతున్న దేశాల్లోనే పుడుతున్నారట. అమెరికా వంటి వృద్ధి చెందిన దేశాల్లో కాదు. అమెరికన్ సిటిజెన్షిప్ కోసం మన వాళ్లు అక్కడ పిల్లల్ని కంటున్నారు. అక్కడి వాళ్లు ఇక్కడి ఆడవాళ్ల నుపయోగించుకుంటున్నారు. అయినా పిల్లలు కావాలనుకునేవాళ్లు అనాథల్ని దత్తత తీసుకుంటే పుణ్యం.. పురుషార్థంతోపాటు జనాభా కూడా తగ్గుతుంది కదా?
రమ నవ్వుతూ.. ‘మైథిలీ! నువ్వూ, నా పిల్లలూ పెళ్లిళ్లు చేసుకోకుండా జనాభా తగ్గించేశారుగా? కొంతమంది సొంత పిల్లలు కావాలనుకుంటారు. సైన్స్ అందుబాటులో వున్నది... పైగా చేతినిండా డబ్బు... సరోగసి క్లినిక్స్ ద్వారా ఎంతో మందికి ఉపాథి, బీద ఆడవాళ్లకు ఆ తొమ్మిది నెలలూ జీవితంలో ఎప్పుడూ రుచి చూడని పళ్లూ ఫలహారాలూ! విటమిన్లూ, హార్మోన్లూ! నడవనీ’
వీళ్ల సంభాషణ వింటున్న శైలజకి తన కుటుంబ వైభవం గుర్తొచ్చింది. తను జాబ్ చేసేప్పుడు పిల్లలతో హడావిడిగా జీవితం గడిపేసింది. భర్త పోయేవరకూ తను వంటింటి పనుల వరకే చూసుకునేది. బంధువులు తమ వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి తరచుగా వస్తూండేవారు. బెల్లం చుట్టూ ఈగల్లా తన భర్త చుట్టూ బంధువులు తియ్యగా కబుర్లు చెప్తూ తిరుగుతుండేవాళ్లు. బయటి వ్యవహారాలూ, పిల్లల బాధ్యతలూ తోడయ్యాక తన కష్టాల్లో రమ, వాళ్లాయన, మైథిలి ఇచ్చిన చేయూత తను నిలదొక్కుకునేలా చేసింది. ఫ్యామిలీ పెన్షన్, తన జీతం, పిల్లలకో దారిచూపాయి. ఇద్దరూ అమెరికాలో స్థిరపడి హాయిగానే ఉన్నారు. తనూ వాళ్ల పెంపకం కోసం చాలాసార్లు అమెరికా వెళ్లి వచ్చింది. ఇక తన కోసం తను బ్రతకాలనుకుని ఈ డెబ్బై రెండేళ్ల వయసులో మైథిలితో కలిసి ఉంటూన్నది.
* * *
మొక్కలుగా ఉన్నవి వృక్షాలయ్యాయి. పూల పరిమళం, ఎనె్నన్నో రకాల పళ్ల మాధుర్యం, కోయిల గానం, ప్రకృతి సౌందర్యం ఆ సర్వాంతర్యామిని గుర్తు తెస్తూంటే సాయంత్రం వేళల్లో అందరూ కలిసి మొక్కల మధ్యలో గడుపుతారు. ఆ తరువాత గోశాలకి వెళ్లి అరగంట గడిపి కావలసిన పాలు తెచ్చుకుంటారు. అవి మినీ ఫ్రిజ్‌లో పెట్టుకుని కావలసినప్పుడు, స్నేహితులు వచ్చినపుడు కాఫీ, టీలు పెట్టుకుంటారు. కూరగాయల పెంపకంలో కూడా తలో చెయ్యి వేస్తారు. తమ ప్రాంగణాన్ని స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దిన నిర్వాహకులకు చేతనైన సాయమందిస్తారు. ఈ వయసులో వారికి ఇంతకంటే ఏం కావాలి!
శైలజ ఆలోచనలకి విజయ అడ్డుకట్ట వేసింది. ‘రమా, మీ పిల్లలు పెళ్లి చేసుకోరా? ఈ మధ్య ఎక్కడో చదివాను, ‘లివిన్ రిలేషన్‌షిప్’ గురించి. మా బంధువు ఒకాయన ‘టులెట్’ బోర్డ్ పెడితే, ఒక జంట వచ్చి ‘కొద్దికాలంలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మీ ఇంట్లో కలిసి ఉంటాము. మా ఇద్దరి పేరెంట్స్ ఫోన్ నెంబర్లు ఇస్తాము. కావాలంటే వాళ్లని కూడా కనుక్కోవచ్చు’ అన్నారట. వాళ్లు కూడా ఒప్పుకున్నారట. సంవత్సరమైనా ఇంకా పెళ్లి చేసుకోలేదట! మీ పిల్లలు జాగ్రత్తమ్మా! అసలే అమెరికాలో ఉన్నారు!’
విజయ మాటలకు రమ బాధ పడుతుందేమోనని మైథిలి ‘వాళ్ల పిల్లలకి అంత టైం లేదులే... మన దేశంలోనే ఈ మధ్య లివిన్ పార్ట్‌నర్ పిల్లలు కూడా తండ్రి ఆస్తి హక్కు పొందే చట్టం చేస్తున్నట్టు అన్నారెవరో... అయినా మనకు అర్థం కాని గొడవలేమైనా ఉంటే డిఎన్‌ఏ నమూనాలు డిసైడ్ చేస్తాయిలే... నీవేమీ కంగారు పడకు’
విజయది విచిత్రమైన మనస్తత్వం. భర్తతో పడక వృద్ధాశ్రమానికి వచ్చేసింది. ఆమె ఒక్కగానొక్క కూతురు తనకి చాకిరీ చేసినంతకాలం తల్లిదండ్రులిద్దరినీ ఇష్టంగా చూసుకుంది. తరువాత వాళ్లకి చాకిరీ చేయడం తనకి చాలా కష్టమని తేల్చి చెప్పేసింది. అంతవరకూ కూతురే సర్వస్వంగా బతికిన విజయలో తిరుగుబాటు ధోరణి మొదలయింది. ఆమెలోని అభద్రతాభావం భర్తను కూడా దూరం చేసింది. తనకిక పరిష్కరించుకునే సమస్యలేమీ మిగలక ప్రపంచంలోని సమస్యలన్నీ తనవిగానే ఆలోచిస్తూ ఇలా వృద్ధాశ్రమంలో వృధా కాలక్షేపం చేస్తున్నది. రక్తం పంచుకు పుట్టిన కూతురు ఆస్తులన్నీ అనుభవిస్తుందే గానీ, కాసిని నీళ్లతోనే కడవరకూ నీడనిచ్చే మొక్కల్తో ప్రేమ పంచుకోమని మైథిలి హితబోధ చేస్తూనే ఉంటుంది. ఆమెని తమ దారికి తెచ్చకోవడానికి ముగ్గురూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
* * *
కల్తీలేని ఆవుపాలతో చేసిన కమ్మని కాఫీ తాగుతూ అందరూ రమా వాళ్ల రూంలో సమావేశమయ్యారు. రమా వాళ్లక్కయ్య ఈ మధ్యే పోవడంతో ఆమె కొడుకూ, కోడలూ పిల్లలతో సతమతమవుతున్నారని రమ వెళ్లి రెండు నెలలుండి వచ్చింది. పిల్లలు బాగా అలవాటయి నాయనమ్మని చూడాలంటున్నారని మధ్యాహ్న భోజన వేళకు అందరూ వచ్చేశారు.
కాఫీ తాగుతూ కోడలు తన కోరిక బయటపెట్టింది. ‘అత్తయ్యగారూ... మీరిద్దరూ మాతో ఉండరాదూ! మీ పిల్లలిద్దరూ ఎలాగూ అమెరికా నుండి వచ్చేది లేదు.. మీకెవరూ లేనట్లు అనాథల్లా ఈ ఆశ్రమంలో కాలక్షేపం చేయడం ఎందుకు? మేమూ ఉద్యోగాలతో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక పోతున్నాము. మాకూ అండగా ఉన్నట్లుంటుంది. ఎన్ని సౌకర్యాలున్నా, రక్త సంబంధీకుల ఇంటిలా ఇక్కడెలా ఉంటుందీ? వచ్చేయండి అత్తయ్యగారూ! పిల్లలు మీకు బాగా అలవాటయిపోయారు...’
కల్మషం లేని కోడలి మాటలు కల్తీలేని కాఫీలా కమ్మగా ఉన్నా రమ ఒక్క క్షణం ఆలోచించి ‘ఆ విరజాజి పందిరి పైనున్న పిచ్చుక గూళ్లు చూడు... వాటిని నేనే ఏర్పాటు చేశాను. ఈ మాలతీ లత మా గదిని ఎంతగా పెనవేసుకున్నదో చూడు.. నిరుడు నాటిన జూకా మందార అప్పుడే ఎన్ని అందమైన పూలతో హుందాగా ఉందో!
జామ చెట్టుపైనున్న ఉడతలూ, సీతాకోక చిలుకలూ ఎంత చక్కగా సహజీవనం చేస్తున్నాయో! అలా దూరంగా చెట్ల మధ్యలో స్వేచ్ఛగా తిరుగాడుతున్న నెమళ్లు, మా గోశాలలోని ఆవులూ, పక్కనే మేము పెంచుకుంటున్న కుందేళ్లు, అన్నింటినీ మించి రిమా కబుర్ల కోసం ఉదయమే ఎదురుచూసే సిక్‌రూంలో ఉన్న మా సోల్‌మేట్స్ మమ్మల్నీ ఆశ్రమంలోనే కట్టిపడేశాయమ్మా! మా వంశాభివృద్ధి ఈ మొక్కలూ, పశువుల్లోనే చూసి మురిసిపోతాము. అవునూ! దొంతరమల్లికి అంటు కట్టాను. తీసికెళ్లి మీ ముంగిట్లో పెట్టు. ఓ ట్రీగార్డ్ పెట్టి పిల్లలతో నీళ్లు పోయిస్తుంటే, రెండేళ్లలో మీ ఫ్లోర్‌ని అందుకుంటుంది. ఏమర్రా పిల్లలూ... మాకూ వైఫై పెట్టిస్తున్నారు. మీతో వచ్చే వారం నుండీ చాట్ చేస్తానులే... బుద్ధిగా అమ్మానాన్నల మాట విని చదువుకోండి. ఎప్పుడైనా వస్తుంటానులే’
‘పిన్నీ! వృద్ధాశ్రమమంటే బ్రతుకుబండిని భారంగా ఈడుస్తూ తమ వారి కోసమే ఎదురుచూసే బలహీనులే ఉంటారనుకున్నాను. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న మీవంటి సహృయుల చిరునామా ఈ ఆనందాశ్రమమని తెలుసుకున్నాను. చూశారా! పిల్లలూ! నాయనమ్మ ఇటువంటి పచ్చని పరిసరాల నొదిలి మన కాంక్రీట్ జంగిల్‌కి ఎలా వస్తుంది చెప్పండి?’
‘అయితే నాన్నా! మనమూ ఇక్కడికే వచ్చేద్దాము’ అన్నారు పిల్లలు.
అందరూ హాయిగా నవ్వుకున్నారు.
=================
ముసునూరు ఛాయాదేవి
ఫ్లాట్ నెం..301. ఇం.నెం.ఎఫ్-32, మధురానగర్
హైదరాబాద్- 500 038 సెల్ నెం: 93910 11891

-ముసునూరు ఛాయాదేవి