వీక్లీ సీరియల్
ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -9
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఏం చెప్పమంటారు? ప్రతి బ్యాంకులోనూ ఎన్నో కుంభకోణాలున్నాయి. కేవలం దోపిడీ వలన మనీ మనీ బ్యాంక్‌కి గ్రహణం పట్టడం నిజంగా దురదృష్టకరం. మీకో విషయం చెబుతా వినండి.
ఇండియన్ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం వలన ఏర్పడిన నష్టం 4500 కోట్లు పైనే ఉందట. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ద్వారా ఈ విషయం బయటపడిందని... ది టెలిగ్రాఫ్ అనే పత్రిక వెల్లడించే వరకూ.. ఎవరికీ తెలియదా బ్యాంక్ కుంభకోణం.
బోఫోర్స్, హవాలా, బీహార్ పశుగ్రాస కుంభకోణం వంటివి ప్రాచుర్యం పొందినంతగా మన దేశంలో ఈ ఇండియన్ బ్యాంక్ వెలుగు చూళ్లేదు.
అలాంటిది మా మనీ మనీ బ్యాంక్ దోపిడీ గ్రామీణ స్థాయిలో కూడా ప్రచారమయ్యింది.
రుణాల మంజూరులో జరిగిన అవకతవకలు, లోటుపాట్లకి రాజకీయ నాయకుల హస్తం ఇండియన్ బ్యాంక్ కుంభకోణంలో ఉన్నా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.’’
పెదవి విరుస్తూ ఒక్క క్షణం ఆగాడు. షణ్ముగం ముఖకవళికల్లో మార్పు లేదు.
‘‘పర్లేదు కంటిన్యూ చెయ్యండి’’ అన్నాడు షణ్ముగం.
‘‘మనీ మనీ బ్యాంక్‌లో జరిగిన ఇరవై ఆరు కోట్ల దోపిడీకి ఈ బ్యాంక్‌ని నిందించడం, విమర్శించడం బాధాకరం. సాక్షాత్తూ ఇండియన్ బ్యాంక్ చైర్మన్ యం.గోపాలకృష్ణ చట్టవిరుద్ధంగా కొన్ని ప్రైవేటు సంస్థలకి ప్రయోజనాలు కలుగజేసి ఈ స్కామ్‌కి పాల్పడ్డాడు. పెద్దగా పట్టించుకోలేదెవరు. ఎవరో దుండగుడి నాయకత్వంలో ఒక ముఠా చేసిన అకృత్యపు దోపిడీకి తీవ్రంగా స్పందిస్తూ మనీ మనీ బ్యాంక్‌పై విముఖత ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.’’
పాండవీయం స్వరంలో మార్పు కలగడం గమనించారు షణ్ముగం.
అతని ఆవేదనలో వాస్తవం లేకపోలేదన్పించింది.
షణ్ముగం పెదవి విప్పాడు.
‘‘బ్యాంకుల అంతర్గత లొసుగులు కేవలం మన దేశంలోనే ఉన్నాయనుకోవడం పొరపాటు. ఆ మధ్య ఓ న్యూస్ పేపర్లో చదివినట్టు గుర్తు. ఏమిటంటే.
జపాన్‌లో సైతం.. ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులను తనిఖీ చేసే తేదీలను ముందుగానే తెలుసుకోవటం కోసం... ‘‘నాలుగు బ్యాంకులు ఇన్‌స్పెక్షన్ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌కీ.. లక్షల కొద్దీ యెన్‌లను లంచంగా ఇచ్చారట. ఈ ముడుపుల కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ అక్కడి ప్రస్తుత ఆర్థిక మంత్రి హిరోషి మిత్సుజుక స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశాడనుకోండి. అది వేరే విషయం.
దేశ విదేశాల్లో సైతం బ్యాంక్ లొసుగులున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మరి మన దేశంలోని ఆర్థిక మంత్రయినా రాజీనామా చేసిన దాఖలాలున్నాయంటారా? దిసీజ్ ఇండియా.
జాతీయ బ్యాంక్ కదా అని ఇండియన్ బ్యాంక్‌ని వదిలి ప్రైవేట్ బ్యాంక్‌గా విస్తరించిన మీ మనీ మనీ బ్యాంక్‌పై విముఖత ప్రదర్శిస్తున్నారేమో జనం’’ చెప్పడం పూర్తి చేశాడు.
షణ్ముగం వ్యాపార సరళి కాదు. అద్భుతమైన తెలివి తేటలు కూడా ఆశ్చర్యపరిచాయి పాండవీయాన్ని.
‘‘అందుకే కదండీ దోపిడీ జరిగిన ఈ బ్యాంక్ ప్రభావం మిగతా బ్రాంచ్‌లపై పడింది. బిజినెస్ టర్నోవర్ తగ్గుముఖం పట్టి కొద్ది సంవత్సరాల్లో బ్యాంక్‌ని మూసివేసే పరిస్థితి ఏర్పడేటట్టుంది. మీ వంటి పెద్ద వారిని ఆశ్రయించే ఉద్దేశం కూడా అదే. మా బ్యాంక్ మినహా సిటీలోని అన్ని బ్యాంకులతో మీకు సంబంధాలున్నాయని తెలిసింది. మా బ్యాంక్‌తో కూడా అటాచ్‌మెంట్ ఏర్పర్చుకోమని కోరుతున్నాను.
ఎంతో కొంత ఎవౌంట్‌ని డిపాజిట్ చేయండి చాలు’’ అన్నాడు అభ్యర్థనగా.
ఇదే సమయానికి అఖిల్ ఇంట్లో
* * *
ఆయన చెప్పిన పూజా వస్తువులన్నీ నివేదిత తెచ్చి పెట్టింది.
హాలులో ఒక చోట ఎర్రని వస్త్రం పరిచాడు. అఖిల్ వేసుకున్న దుస్తుల్ని విప్పేసి వాడికి ఎర్రని పంచె మొలచుట్టూ చుట్టి దక్షిణం వైపుకి ముఖం ఉండేలా ఆ వస్త్రం మీద కూచోబెట్టాడు. వాడికెదురుగా పీట వేశాడు. ఆ పీటపై కూడా ఎర్రని వస్త్రాన్ని పరచి బ్యాగ్‌లోంచి తీసిన హనుమంతుడి పటాన్ని అక్కడ పెట్టాడు.
‘‘ఈ తతంగమంతా చూస్తూంటే నీకు భయం వేస్తోందా?’’ గుడ్లప్పగించి ప్రతీ చర్యని ఆసక్తిగా గమనిస్తున్న నిట్టూని నవ్వుతూ అడిగాడాయన.
అడ్డంగా తలూపుతూ ‘‘అదేం లేదు తాతగారూ’’ అన్నాడు వాడు.
‘‘నీకస్సలు భయం కలగడం లేదా?’’ తిరిగి ప్రశ్నించాడు.
‘‘్భయం కలగడం లేదు గానీ, మరే ఓ చిన్న సందేహం కలుగుతోంది’’ అన్నాడు.
‘‘సందేహమా... ఏమిటది?’’
‘‘అందరికీ మీలా పిలకలుండవు. ఎందుకని?’’
‘‘అందరికీ అంటే...’’ అర్థం కానట్లు ముఖం పెట్టాడాయన.
‘‘మరే మా వీధి శివాలయం పూజారి సుబ్రహ్మణ్యం శాస్ర్తీ గారికి మీలా పిలక లేదుగా. నాకులా చిన్న కటింగ్ మాత్రమే ఉంటుంది. అందుకని అడిగాను.’’
వాడి సందేహమేంటో అప్పుడర్థం అయ్యిందాయనకు. వెంటనే నవ్వొచ్చింది.
‘‘నిజమే అందరికీ నాలా కొప్పు ఉండాలనేం లేదు. కేవలం వేదశాస్త్ధ్య్రాయనం చేసిన వారికి మాత్రమే నాలా శిఖ తప్పనిసరి. ఈ శిఖలో అయిదు రకాలుంటాయి. వాటికి పంచ, శిఖ, ధాత, హోం గారి పప్పలని పేరు. అందుకే వీటిని పంచశిఖలంటారు. చిన్నవాడివి ఇవన్నీ నీకెందుగ్గాని, కాసేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా తలూపాడు వాడు.
ఎదుటివారు విసుగు చెందేలా విషయాన్ని కూలంకుషంగా చెప్పేవాడే, అందుకిది సమయం కాదని, పైగా ప్రశ్నించిందో పిల్లాడని వదిలేశాడాయన.
హనుమంతుడి పటానికి బొట్టు పెట్టి చందనం రాశాడు. ఆ పటం పాదాల చెంత చిన్న రాగి పళ్లాన్ని ఉంచాడు. దానిలో ‘సిద్ధ భజరంగ యంత్రం’ స్థాపించి, సింధూరంతో దానికి బొట్టు పెట్టాడు.
హనుమంతుడి పటంపై అక్షింతలు చల్లుతూ పూజ ప్రారంభించాడు. మంత్రపఠనం కావించుతూ తిరిగి ఆ అక్షింతల్నే యంత్రంపై పోశాడు.
నివేదిత ఓ పక్కన కూర్చుని ఆయన పనుల్ని తిలకిస్తోంది. అఖిల్ మంత్రముగ్ధుడిలా నిష్టగా కూర్చుని ఉన్నాడు. అఖిల్ భక్తి ప్రపత్తుల్ని చూస్తుంటే ముచ్చటేస్తోందాయనకు.
వాడి నుండి దృష్టి మరలుస్తూ ‘‘మీ గోత్రనామాలేటమ్మాయ్’’ అని నివేదితని అడిగారు. చెప్పింది.
అఖిల్ కుడి చేతిలో నీరు పోసి గోత్రనామాల్ని బిగ్గరగా చదువుతూ వాడితో సంకల్పం చేయించాడు. నివేదిత మనోవాంఛితాన్ని స్మరిస్తూ ఆ నీటిని నేలపై వదిలింప జేశాడు.
తర్వాత రుద్రాక్షమాలని చేతుల్లోకి తీసుకొని భక్తి శ్రద్ధలతో కింది మంత్రాన్ని జపం చేశాడు.
‘‘ఓం హుం హుం హుం హ్రోం హుం హుం హుం ఫట్.’’
ఆ హాలంతా ప్రతిధ్వనించి తరంగాలు రూపేన ఆ ఇంటి అణువణువుని స్పర్శించేలా ఆ మంత్రాలన్నీ అతి స్పష్టంగా యాభై ఒక్కసారి ఉచ్చరించాడు.
ఆయనలా మంత్రాచ్ఛరణ కొనసాగిస్తున్నంత సేపూ నివేదిత భక్త్భివంతో కళ్లు మూసుకొని దైవనామ స్మరణ కావించింది. తదనంతరం ఆ పూజారి 1, 5, 7 వత్తుల దీపాలతో స్వామికి హారతి సమర్పించాడు. దాంతో ఆ పూజా కార్యక్రమం ముగిసింది.
యంత్రానికి పూసిన సింధూరాన్ని తీసి అఖిల్ నుదుటిన దిద్దాడు. ఆంజనేయస్వామి ఫోటో ఉన్న చిన్న తాయెత్తుని వాడి మెడలో వేశాడు.
‘‘బాబూ ఇది ఆంజనేయుని తాయెత్తు. ఈ తాయెత్తులో ఆయన విశ్వరూపం ఫోటో ఉంటుంది. దీన్ని నీవు సదా ధరించాలి. ఇది నీ మెడలో ఉన్నంత కాలం ఎలాంటి విపత్తు నీ దరిదాపుల్లోకి కూడా రాదు. అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టకు. సరేనా?’’ అన్నాడు.
‘‘ఓ అలాగే!’’ అంటూ తలూపాడు.
‘‘మరే దీన్ని నేను కట్టుకుంటే ఏమవుతుంది స్వామీ? మంచి పేరొస్తుందా, క్లాసులో ఫస్ట్ వస్తానా?’’ అమాయకంగా అడిగాడు.
‘‘ఏం ఇప్పుడు క్లాసులో ఫస్ట్ రావడం లేదా?’’
‘‘గతంలో వచ్చే వాడిని. మరే ఈమధ్యే మా స్కూల్‌కి కొత్తగా హిమశ్రీవాక్య అనే అమ్మాయి వచ్చింది. ఆమె రాకతో నేను సెకండైపోయాను. మొన్నటి ఎగ్జామ్‌లో ఆ అమ్మాయే ఫస్ట్ వచ్చింది’’ కాస్త ఉక్రోషం మిళితమైన గొంతుకతో గబాగబా చెప్పేశాడు.
‘‘అదా సంగతి. ఇది కట్టాగా, ఇక నుండి ఎప్పటిలా క్లాస్‌కి నువ్వే ఫస్ట్ వస్తావు’’ వాడికి ధైర్యం చెప్పాడు.
ఆయన మాటలు విన్నాక నిట్టూ కళ్లు కాంతితో మిలమిలా మెరిశాయి.
నివేదిత వైపు తిరిగి పూజారి అన్నాడు.
‘‘అమ్మాయి, ఇది హనుమత్ సాధన. కష్టాలను, రోగ శోకాలను, వివిధ పీడలను, సంతాపాలను, బాధలను తొలగించి సమస్త శుభాలను కల్గిస్తాడు హనుమంతుడు. ఎలాంటి వ్యాధి అయినా నివారణ అవుతుంది. అందుకే ఆయనకు సంకట మోచనుడని భక్తులు పేరిడారు. ఆ మూర్తిని స్వచ్ఛందంగా భక్తితో ధ్యానించడం వలన బలం, బుద్ధి, శక్తి సిద్ధిస్తాయి. మానసిక దుర్భల స్థితులలో స్థైర్యం కూడా లభిస్తుంది. ఇది తథ్యం.
వీలైతే ప్రతి మంగళ లేదా శనివారం ఈ హనుమదష్టకాన్ని అయిదేసి సార్లు బాబు చేత పారాయణ చేయించు, అంతా అనుకూలమే అవుతుంది.
పోతే తన మేలు కోసం గానీ, లోక కళ్యాణార్థం గాని సాధన చేయాలి తప్ప ఇతరులకి హాని, అపకారం కలిగించడానికి మాత్రం వాడకూడదు. అలా జరిగిన పక్షంలో సాధకునికే ప్రమాదం. అందుకనే మరోసారి హెచ్చరిస్తున్నాను. పరమార్థం కోసం తప్ప ఈ సాధన స్వార్థ్భరిత కీడు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. గుర్తుంచుకో.’’
గంభీర వదనంతో ఆయన ప్రవచిస్తుంటే భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా ఆలకించింది నివేదిత.
పూజారి మాటలకు కాస్త నొచ్చుకుంది.
‘‘మీరు అనుమానిస్తున్నట్లు అలా ఎప్పటికీ జరగదు స్వామీ. నా చిట్టి తండ్రి ఆరోగ్య దృష్ట్యా మీ చేత ఈ పూజ జరిపించాను. అంతే తప్ప మరో చెడు తలంపే నా మనసులో లేదు. మేలు కోరుకునే దానే్న కానీ కీడు ఆశించేదాన్ని కాదు’’ అంది బాధగా.
‘‘పూజా ఫలితం విశదపరచడం నా వంతు బాధ్యత కాబట్టి చెప్పాను. నిన్ను కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదమ్మా’’ ఆమె ముఖకవళికల్ని గమనిస్తూ అన్నారాయన.
‘‘చిన్నా స్వామీజి కాళ్లకి దణ్నం పెట్టు’’ అంది అఖిల్‌తో. తల్లి చెప్పిన మరుక్షణం ఆయన కాళ్లపై సాష్టాంగపడి పాదాభివందనం చేశాడు.
ఆ చిన్నారి వినయవిధేయతలకి ముగ్ధుడైన ఆ పూజారి వాడిని మనసారా దీవించాడు. తన చేతులతో పైకి లేవనెత్తి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నివేదిత అందించిన తాంబూలం స్వీకరించి అక్కడి నుండి నిష్క్రమించాడాయన.
ఇప్పుడు నివేదిత మనసెంతో హాయిగా ఉంది. పెద్ద గండం గడిచి ప్రశాంతత చేకూరినట్లయ్యింది.
కానీ అఖిల్ మస్తిష్కంలో మెల్లగా మొలకెత్తుతున్న ఆలోచనల్ని ఒక్కసారి ఆమె ఊహించగలిగి ఉంటే ఆమె పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. ఆమెని ప్రశాంతత మాయమై అంతరంగం మళ్లీ కల్లోల సాగరమయ్యేది.
ఎందుకంటే.
వాడి ఆలోచనలన్నీ ఇప్పుడు తాయెత్తు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ చిన్ని కంప్యూటర్ బుర్రలో... తాయెత్తుపై పరిశోధన సాగించాలన్న తపన అప్పుడే మొదలయ్యింది. కానీ పైకి కనిపించే అరమరికల్లేని వాడి చిరునవ్వే నివేదితని
ఆనందింప జేస్తోంది.
* * *
‘‘సరే మీరే చెప్పండి. ఎంత డిపాజిట్ చేయమంటారో?’’ పాండవీయానే్న అడిగాడు షణ్ముగం. అతనంత తొందరగా కన్విన్స్ అవుతాడని పాండవీయం ఊహించలేదు.
‘‘మీ లాంటి హైటెక్ బిజినెస్‌మాన్ డిపాజిట్స్ మా బ్యాంక్‌లో ఉన్నాయన్న వార్త చాలు. మా బ్యాంక్‌కి అపూర్వమైన ప్రచారం లభించినట్టే. ఇకపోతే డిపాజిట్ ఎవౌంట్ మీ ఇష్టం. నేనడిగిన వెంటనే మీరు యస్ అనడం మా బ్యాంక్‌కు పూర్వదశ రాబోతుందనడానికి శుభసూచకంగా భావిస్తున్నాను.
ఎనీ హౌ మా బ్యాంక్ స్థితిగతులు బాగా లేకపోయినా, లిఫ్ట్ ఇచ్చే సదుద్దేశంతో మీరు ఓకే అన్నారు. బ్యాంక్ తిరిగి ఎదిగితే మాత్రం ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. థాంక్స్ ఫర్ యువర్ కో-ఆపరేషన్.’’
‘‘నో నో, చేసేది చేయించేది నేనే అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మధ్యలో నేనెవర్ని చెప్పండి. నాలో ఈ సంకల్పం కల్పించింది ది గ్రేట్ గాడ్. కాబట్టి అంతా ఆ దేవుడి చలవ. ఇందులో నా ప్రమేయం లేదు.’’
‘‘అది మీ మంచితనం. డిపాజిట్స్ ఎంత వేయాలో నేను చెబితే బావుండదు. మీరెంత ఫిగర్ అనుకుంటున్నారో ఆ సంఖ్య మీ నుండే రానీయండి’’ అన్నాడు పాండవీయం.
‘‘సరే ఇప్పుడు చెప్పడమెందుకు. మా వాళ్లతో ఎవౌంట్ పంపిస్తా, డిపాజిట్ చేసుకోండి. టైమ్ పీరియడ్ కూడా మీరే డిసైడ్ చేయండి.’’
‘‘చిన్న రిక్వెస్ట్...’’
‘‘చెప్పండి...’’
‘‘మీరెప్పుడైనా డిపాజిట్ చెయ్యండి. ఫర్వాలేదు. కాస్త ఆలస్యమైనా ఇబ్బంది లేదు. కానీ స్వయంగా మీరే వచ్చి మా బ్యాంక్‌ని విజిట్ చేస్తే బావుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి బ్యాంక్ దాకా రమ్మనడం లేదు. సంఘంలో పరపతి ఉన్న మీ లాంటి వారు మా బ్యాంక్‌కి రావడం ప్రస్తుత పరిస్థితుల్లో మాకెంతో ప్లస్ పాయింట్‌గా ఉంటుంది’’ అంటూ కోరాడు పాండవీయం.
అప్పుడు ఆలోచన్లో పడ్డాడు షణ్ముగం.
అది గమనించి ‘‘ప్లీజ్. కాదనకండీ’’ అంటూ అభ్యర్థించాడు పాండవీయం.
‘‘చేసేది చేయించేది అంతా నేనే అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మీ అభ్యర్థన మేరకు ఒప్పుకుంటున్నాను. స్వయంగా నేనే మీ బ్యాంక్‌కి వస్తానె్లండి. బట్ ఓ కండిషన్’’ చెప్పాడు షణ్ముగం.
‘‘మీ కండిషన్స్ అన్నింటినీ మేం శిరసా వహిస్తాం. చెప్పండి.’’
‘‘నేను మీ బ్యాంక్‌కి వచ్చి వెళ్లేంత వరకు మీరు ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వకూడదు. మనీ డిపాజిట్ అనంతరం మీ ఇష్టం.’’
షణ్ముగం అలాంటి కండిషన్ ఎందుకు పెట్టాడో పాండవీయానికి అర్థం కాలేదు. కారణం అడగబోయిన వాడల్లా చప్పున ఊరుకుండిపోయాడు. ఆ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకోనూ లేదు.
‘‘మీరు చెప్పినట్లే జరుగుతుంది’’ అని హామీ ఇచ్చి పాండవీయం అక్కడి నుండి కదిలాడు.
అప్పుడు నవ్వాడు షణ్ముగం తన సహజధోరణిలో.
ఆ నవ్వు వెనక
అతనిలో సరికొత్త ఆలోచనొకటి మెదిలింది పొదల మాటు నల్లతాచు కదలికలా.
* * *
ఏ రోజూ ప్రెస్ మీటింగ్‌లో పాల్గొనలేదు సి.ఐ. ద్వివేది. తను కూడా స్వయంగా ప్రెస్ మీటింగులను ఏర్పాటు చేయలేదు. పబ్లిసిటీకి దూరంగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. ప్రచారం కంటే ప్రతిభ, పని పట్ల శ్రద్ధ, అంకితభావం ముఖ్యమని నమ్ముతాడు.
అలాంటిదీ రోజు-
ఆయనే స్వయంగా వర్తమానం పంపి ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయించడం పలువుర్ని ఆశ్చర్యపర్చడమే కాదు. మాస్ మీడియా రంగంలో సంచలన చర్చయి కూర్చుంది.
అందుకే అన్ని మీడియాల నుండీ వచ్చిన రిపోర్టర్స్ అందరూ సి.ఐ. ద్వివేది రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రిపోర్టర్స్ వెంటపడి ఏది అడిగినా ఏనాడు కూడా పెదవి విప్పని ద్వివేది ఇలా ప్రెస్ వాళ్లందర్నీ స్వయంగా ఆహ్వానించాడంటే ఏదో స్పెషల్ న్యూస్ రిలీజ్ కాబోతోందని ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత నెలకొని ఉంది.
అందుకే ఆయనతో ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడాని విలేకరులకి టెన్షన్‌గా ఉంది.
ఎలర్ట్ అయిపోయారంతా.
వాస్తవానికి యస్సై వేదవ్యాస్ అభ్యర్థన మేరకు ద్వివేది ఆ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయించాడు.
ద్వివేది ఇచ్చిన సమయం దాటింది. అప్పటికే పద్దెనిమిది నిమిషాలు ఆలస్యమైంది. అయినా ఆయన ఆగమనం జరగలేదు.
పంతొమ్మిది... ఇరవై నిముషాలు గడిచాయి.
అదిగో అప్పుడు...
తన చిరునవ్వును చూపరులకి అందిస్తూ హుందాగా మీటింగ్ హాల్‌లోకి ప్రవేశించాడాయన.
గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారంతా.
రెండు చేతులూ జోడించి అందరికీ అభివాదం చేశాడు. సబార్డినేట్స్ ముందుగానే సెల్యూట్ చేశారతనికి.
తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు.
ఆయన రాకతో దూరదర్శన్, ప్రైవేట్ టీవీ ఛానెల్స్ వారి వీడియోలన్నీ ఒక్కసారిగా స్టార్టయ్యాయి. పత్రికా రిపోర్టర్ల ఫ్లాష్ కెమెరాలు తమ పని తాము చకచకా చేసుకుపోసాగాయి.
అందరూ వౌనంగా ఉండి ఎవరూ పెదవి విప్పకపోవడంతో.
తన సహజ గాంభీర్యాన్ని వదలి ‘‘ఇక మీరు మీ ప్రశ్నల శస్త్రాల్ని సంధించవచ్చు.’’ అన్నాడు ద్వివేది.
వెంటనే రియాక్టవుతూ ‘‘మేం మీతో యుద్ధం చేయడానికి రాలేదు సార్’’ ఎవరో రిపోర్టర్ సరదాగా అన్నాడు.
‘‘నిజమా! మరి రిపోర్టర్స్ నిరంతర అక్షర యోధులని విన్నానే’’ ఆ సమాధానం వినవచ్చిన దిక్కుగా చూపు సారిస్తూ చురక అంటించాడు.
మరో వైపు నుండి దూసుకు వచ్చిందో ప్రశ్న. ‘‘మీరు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం?’’
’’నథింగ్. నేనెప్పుడూ ప్రెస్ మీటింగ్స్‌లో అసలే పాల్గొనని నా మీద మీ మీడియా వాళ్లంతా అభియోగం మోపారుగా. జస్ట్.. ఆ అపవాదు తొలగించుకుందామని. ‘‘అంతే’’ చిరునవ్వుని మేళవిస్తూ సమాధానమిచ్చాడాయన.
‘‘యూ మీన్.. దెరీజ్ నో స్పెషల్ మ్యాటర్. అవునా?’’ నిట్టూరుస్తూ పెదవి విరిచాడో విలేకరి.
‘‘వెంటనే అలా చెబితే మీరు నన్ను వదలి పెడతారా?’’ ఎదురు ప్రశ్నించాడు ద్వివేది.
‘‘అయితే విషయం ఏంటో సూటిగా చెప్పండి’’ మరొక విలేకరి.
‘‘ప్రభుత్వం, ప్రజలు, మాస్ మీడియా వాళ్లు మరచిపోయిన ఓ కేసుని మా డిపార్ట్‌మెంట్ తిరిగి ఓపెన్ చేయబోతోంది. ఆ విషయం ముందుగా మీకు తెలపడానికే ఈ సమావేశం’’ చెప్పాడు ద్వివేది.
(ఇంకా వుంది)