బిజినెస్

‘జెట్ హబ్’గా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: విశాఖలో జెట్ హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ సిఇఒ క్రేమర్ బాల్ తెలియచేశారు. విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు కొత్త విమానాలను నడిపేందుకు ఉన్న అవకాశాలపై నగరానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన శుక్రవారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబయికి కొత్త విమాన సర్వీసులను నడపడానికి నిర్ణయించామన్నారు. డిసెంబర్ 15నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు, విశాఖ ఎంపి హరిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా విశాఖకు ఇప్పటికే గుర్తింపు లభించిందని, ఇది స్మార్ట్ సిటీ అయిన తరువాత ఈ నగర ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు. పర్యాటకంగా కూడా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు విశాఖకు రావల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ నుంచి జెట్ ఎయిర్‌వేస్ ద్వారా ముంబయి, ఢిల్లీ చేరుకున్న ప్రయాణికులకు అక్కడి నుంచి 51 ప్రదేశాలకు కనెక్టివ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయని క్రామర్ బాల్ వివరించారు. అలాగే నార్త్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ దేశాలకు కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఉదయం 6 గంటలకు రోజూ ఒక విమాన సర్వీసును నడపాలని విజ్ఞప్తి చేశారు. ఏడు గంటలకు హైదరాబాద్‌లో దిగే ప్రయాణికులకు అక్కడి నుంచి దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్లడానికి విమానాలు అందుబాటులో ఉంటాయని, వారు ఆయా ప్రాంతాల్లో పనులు ముగించుకుని తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్ చేరుకుంటే విశాఖకు విమాన సర్వీసు లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి విశాఖ రావడానికి సాయంత్రం ఆరు గంటలకు ఆఖరి విమానం ఉండడం వలన పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి తొమ్మిది గంటలకు మరో విమాన సర్వీసును విశాఖకు నడపాలని ఆయన కోరారు. కాగా, విశాఖ నుంచి పెద్ద ఎత్తున కార్గో దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, విశాఖలో కార్గో విమాన సర్వీసులు లేకపోవడంతో చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. అలాగే దుబాయ్, థాయిలాండ్, శ్రీలంకకు వారానికి రెండు, లేదా మూడు రోజులు విమాన సర్వీసులు నడపడం వలన చాలా ప్రయోజనం ఉంటుందన్నారు.