విజయవాడ

అమరావతి రాజధానిగా కొనసాగించేవరకు పోరాటాలు ఆగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 19: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేవరకు పోరాటాలు ఆగవని జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. కృష్ణలంక 23వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అమె మాట్లాడుతూ ప్రజా సంఘాలు, రైతులు, రాజకీయ పార్టీలు, మహిళలు చేస్తున్న పోరాటాలకు అందరం మద్దతు తెలపాలని కోరారు. రాజధాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం, దాడులకు తెగపడటం, నోటీసులిచ్చి ఇళ్లలోని నాయకులను బయటకు రాకుండా చేయడం, చట్టవ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఎవరెన్ని చర్యలకు పాల్పడినా ఉద్యమం ఆగదని తెలిపారు. 29 గ్రామాల నుంచి రైతులు ఇచ్చిన 33వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వానికి త్యాగం చేశారని, వారి త్యాగాలను వృథా కానివ్వబోమని స్పష్టం చేశారు. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపర్ కమిటీల పేరుతో తప్పుడు నివేదికలు తెప్పించుకొని అమరావతిని తరలించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈకమిటీల నివేదికలన్నీ బోగస్‌వేన్నారు. ఆనాడు అమరావతిలో రాజధాని అని ప్రకటించినప్పుడు జగన్‌తో సహ అన్ని పార్టీల వారు అసెంబ్లీలో ఆమోదించారని, కానీ నేడు మాటమార్చిన జగన్ అమరావతి రాజధానిని తరలించాలని చూడటం అన్యాయమన్నారు. అమరావతిలో ఇప్పటికే 130 సంస్థలకు స్థలాలు కేటాయించటం జరిగిందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరిగాయన్నారు. అమరావతిలో అనేక సంస్థలు అభివృద్ధి చెంది నిర్మాణాలు పూర్తయితే అనేక కంపెనీలు వచ్చి రేపటి తరం మన పిల్లల ఉద్యోగాలకు ఢోకా ఉండదనే ముందుచూపుతోనే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే, కేవలం చంద్రబాబు, టీడీపీపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే అమరావతి రాజధానిని తరలించాలని జగన్ చూడటం సరైన నిర్ణయం కాదని హితవుపలికారు. అమరావతిని రాజధానిని కొనసాగిస్తామని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొరిపర్తి నరసింహారావు, వేములపల్లి రంగారావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి అనూరాధ ఆర్థిక సాయం అందచేశారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి
కంకిపాడు, జనవరి 19: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండలంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. దీనిలోభాగంగా తెనే్నరులో ఆదివారం మహిళలు, రైతులు సుమారు 100మందితో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన రైతులు,ప్రజలందరూ వ్యితిరేకిస్తున్నారన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటే మేలన్నారు. 31రోజులుగా రాజధాని రైతులు, ప్రజలు రోడ్లెక్కి అమరావతి కోసం ఆందోళన చేస్తున్నా వారి గురించి పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో రాజధాని కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి సమాధానం చెప్పకపోవటం సిగ్గుచేటన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతో కాలం పాలన చేయలేరన్నారు. విశాఖపట్నంలో 52వేల ఎకరాల భూములు కొట్టేసేందుకే అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భూములను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు విశాఖకు మకాం మారుస్తున్నారని విమర్శించారు. ప్రజలు కోరేలా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, టీడీపీ నాయకులు యార్లగడ్డ రాజా, లాం రామకోటయ్య, జీ రవీంద్ర, బత్తవత్యలరావు, తదితరులు పాల్గొన్నారు.

రాజధానిని మార్చమని ఎవరైనా అడిగారా?
* నాయకులు తప్పు చేస్తే ప్రజలకెందుకు శిక్ష
* అమరావతినే రాజధానిగా కొనసాగించాలి * సీపీఎం ధర్నాలో వక్తలు* నోటీసు ప్రతుల దగ్ధం

విజయవాడ, జనవరి 19: రాజధానిని అమరావతి నుంచి మార్చమని ఎవరైనా అడిగారా? అని పలువురు వక్తలు ప్రశ్నించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రైతులు, మహిళలపై అక్రమ కేసులు ఎత్తేయాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ పశ్చిమ కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడ ధర్నాచౌక్‌లో ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రజలు మాట్లాడటానికి వీలు లేకుండా గొంతునొక్కాలని చూడటం దుర్మార్గమన్నారు. 144 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చారని, చంద్రబాబు ప్రభుత్వం నుంచే 144 సెక్షన్ అమల్లో ఉందని చెబుతున్నారని అన్నారు. పాలన మారుస్తానని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని, అయినా మార్చలేదని అన్నారు. అమరావతినే కొనసాగిస్తూ వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌తో తప్పు చేసిన నాయకులను శిక్షించాలని, నాయకులు తప్పు చేస్తే ప్రజలకెందుకు శిక్ష వేయాలని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ 32 రోజులుగా రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. సీఐటీయు నాయకులు పీ అజయ్‌కుమార్ మాట్లాడుతూ రాజధానిని తరలించడం ప్రజా వ్యతిరేక నిర్ణయమన్నారు. ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మూడు రాజధానులు చేయాలని ఎవరైనా కోరారా? అని ప్రశ్నించారు. సీపీఎం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నా జగన్ గుండె కరగడం లేదన్నారు. అంతక ముందు అసెంబ్లీ ముట్టడికి, నిరసనలకు అనుమతి లేదని, పాల్గొనకూడదని నాయకులకు పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ధర్నాలో సీఐటీయు రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరావమ్మ, హోటల్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.