విజయవాడ

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 11: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత రైతులు వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ చెప్పారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కలిగించే బ్యానర్లు, కరప్రతాలను జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. భూమి సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలు తెలియచేస్తూ గ్రామ రెవిన్యూ అధికారి నుంచి గుర్తింపు పత్రం తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రంలో దాఖలు పరచాలన్నారు. ఈ నిబంధన కేవలం దళారీలు, మధ్యవర్తులు, కమిషన్ ఏజెంట్లు చొరబడకుండా నివారించేందుకు, నేరుగా పంట పండించిన రైతులకే ప్రభుత్వం గిట్టుబాటు ధర లభించేందుకు మాత్రమే అని తెలిపారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో దళారుల ద్వారా తమ పేరుతో రికార్డులు సృష్టించి ధాన్యాన్ని అమ్మినా, అమ్మేందుకు ప్రయత్నించినా వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 264 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా 219, డీసీఎంఎస్ ద్వారా 22, పౌర సరఫరాల సంస్థ ద్వారా 23 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 9.24 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని రెవిన్యూ డివిజన్లలో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూడాలని ఆయన సూచించారు.
ప్లాస్టిక్ స్థానే క్లాత్ బ్యానర్లు
కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతిసారి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను వినియోగిస్తున్నారని, అయితే జిల్లాలో ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకున్న చర్యల్లో భాగంగా వాటి స్థానంలో క్లాత్ బ్యానర్లు తయారుచేసి అన్ని కొనుగోలు కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు సిద్ధం చేసిన జాయింట్ కలెక్టర్ మాధవీలతను కలెక్టర్ అభినందించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు తమ ధాన్యం కనీస మద్దతు ధరకు విక్రయించుకోవడంలో ఏవైనా సమస్యలుంటే నివృత్తి చేసేందుకు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్లు హెచ్‌ఎం ధ్యానచంద్ర, స్వప్నిల్ దినకర్ ఫుండకర్, ఆర్డీఓ సత్యవాణి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.