వీరాజీయం

దూకుడు రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో యిప్పుడు జరుగుతున్నదంతా జగన్ మోహన్‌రెడ్డి- చంద్రబాబు నాయుడుల మధ్య జరుగుతున్న పోరాటం. జగన్‌కి చంద్రబాబు మీద వున్న అక్కసు, ఆగ్రహం వెండెట్టా ‘‘తప్ప మరోటి కాదు,’’ అన్నాడు- ఆంధ్రా, గుంటూరు నుంచి వచ్చిన పెద్దమనిషి ఒకడు.
మధ్యలో రైతులు అల్లాడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రెండో ఆలోచన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య జనాన్ని విస్మయంలో పడేస్తున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి అనూహ్యమైన మెజారిటీతో నెగ్గి గద్దెమీద కూర్చున్న క్షణం నుంచీ, ప్రతీరోజూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూన్న వార్త వస్తున్నది. ఇదంతా చూడగా- మాజీ ముఖ్యమంత్రి- తాజా ముఖ్యమంత్రుల మధ్య పోరాటం- రాష్ట్రాన్ని అయోమయం నుంచి అల్లకల్లోలంలోకి నెట్టేస్తున్నదా? అనిపిస్తున్నది అన్న జనవాక్యం వినవస్తున్నది.
మూడు రాజధానులు అంటారో లేక దానిని మూడు ముక్కల రాజధాని అని అంటారో తెలియటం లేదు. ఏది ఏమయినా యిట్లా మూడుచోట్ల పరిపాలనా యంత్రాంగం వుండి- అథార్టీ చేయడంలో గవర్నమెంటుకి- ప్రజల సొమ్ము వున్నది కనుక- అంత యిబ్బందిగా వుండక పోవచ్చును గానీ సామాన్య జనాలకు ‘లంక మేతా- గోదావరి రుూతా’లాగా తయారవుతుందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
అర్జెంటుగా మూడు ముక్కల తీర్మానాన్ని ఆమోదించిన జగన్మోహన్ ప్రభుత్వం దానిని మండలికి పంపించడం- చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేసిన విషయం అది- అన్నది రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో కూడా వినబడుతున్న జనవాక్యం. కాకపోతే జగన్‌మోహన్‌రెడ్డిగారు తనకి మాజీ ముఖ్యమంత్రి మీద వున్న ‘కసి’ని ఎక్కడా- అసెంబ్లీలోనూ, వెలుపలా కూడా దాచుకోవడం లేదు. అవకాశం దొరికితే చాలు- ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా- ‘ఓ పోటు’- వీలైతే, ఓ ‘వేటు’వేస్తూనే వున్నాడు.
ఇక పవన్‌కళ్యాణ్ కున్న ఒకే ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో జగన్ తీర్మానానికి పొలైట్‌గా లేచి నిలబడటంతో- షాక్ ఏమీ తినలేదు గానీ- ‘జానేదేవ్’ అని, అనుకునే వుండవచ్చునేమో గానీ- యికమీదట తన రాజకీయ భవిష్యత్తు కోసం భాజపా మీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. అదే మంచిది అన్నారు అభిమానులు- మంచివాళ్లు.
జగన్ దూకుడుకి విలవిలలాడుతున్నది- పాపం! నాయుడుగారు, అతని అనుయాయులుకీ, పోతే.. అమరావతి రైతులకీ యిది ప్రాణ సంకటమైంది. వైజాగ్‌నుంచి వీరి ఆవేదనకి- ఉగ్రరూపంలో వారు సాగిస్తున్న ఉద్యమానికి కూడా తగినంత మద్దతు రావడం లేదు. అమరావతికి ‘జై’కొట్టి- తమ పట్టణానికి రాబోతున్న ‘అందలం’ వదులుకోడానికి- బంగాళాఖాత వాసులు అంతగా ‘మ్రొగ్గు’ చూపెడుతున్నట్లు లేదు. కాకపోతే అమరావతి రైతుల తీక్షణ భీషణ ఉద్యమం పట్ల కేంద్రంలో- అధికారంలో వున్న పార్టీలో నాయకత్వానికి సానుభూతి వ్యూహం దండిగా వున్నట్లే కనబడుతున్నది.
పవన్‌కళ్యాణ్ అర్జెంట్‌గా ఢిల్లీవెళ్లి కాషాయ దీక్ష తీసుకుని తిరిగి వచ్చి- తీవ్రరూపంలో మూడు రాష్ట్ర రాజధానుల- లేదా (మూడు ముక్కల రాజధాని) వ్యవహారంపై విరుచుకుపడుతూండటాన్ని బట్టి జగన్‌మోహన్‌రెడ్డి ‘దూకుడు’ కొంతవరకూ- ‘కళ్లెం’ అట్నుంచి పడే ఛాన్సుందా? అని, చంద్రబాబుగారి సానుభూతిపరులు అనుకుంటున్నారని, పరిశీలకుల విశే్లషణ.
ఇది యిలావుండగా- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారి స్పీడుకి- ‘తన-పరా’- బేధం కనబడటం లేదు. తాను తీసుకుంటున్న చర్యలకి తానే హర్షాతిరేకం పొందుతున్నాడు. మండలి రద్దుకు అర్జెంటుగా తీర్మానించి- దాన్ని కేంద్రానికి పంపడంలో- విజ్ఞత, ఆలోచనా- ఎంత వున్నదీ అన్నది పరిశీలకుల బుర్రలకి పనిచెబుతున్నది.
మండలిని రద్దు చేయంగానే- అది చట్టం అయిపోదు. దానికి చాలా ‘ప్రాసెస్’ వున్నది అన్న సంగతి అందరికీ తెలుసు. దీనికి నేపథ్యంగా- లోగడ మండలిని రద్దు చేసింది టి.డి.పి. సూపర్ బాస్- ఎన్.టి.ఆర్ కదా? ఇవాళ సిద్ధాంతపరంగా- చంద్రబాబు మండలి ఉనికి కోసరం ప్రాకులాడ్డం ఎందుకు? అంటే వరదల్లో కొట్టుకుపోయేవాడికి, ఏదో ఒక ‘ఆధారం’ కావాలిగా?
‘డిఫెన్స్’లో, అన్నివిధాలా పడిపోతున్న చంద్రబాబుగారికి- జగన్ దూకుడుని నిలవరించడానికి- మీడియా ముందు ఆవేదన వెల్లడించుకోవడం తప్ప మరేమీ దక్కదా? అడుగడుగునా పోలీసు బలగాన్ని- వర్తమాన ప్రభుత్వం దండిగా ప్రయోగిస్తూ వుంటే- ప్రజలు ముక్కున వ్రేలేసుకు చూడటం తప్ప, మాజీ మంత్రి తరఫున ఉద్యమంలో ‘దూకుతాం’- అన్న సాహసం ఒక్క అమరావతి ప్రాంతంలో తప్ప యితరత్రా, తీవ్రంగా కానరావడం లేదని ‘మీడియా’ రిపోర్టర్లు చెబుతున్నారు.
‘మండలి రద్దు’ వ్యవహారం జగన్ పార్టీలో కూడా కనీసం యిద్దరు మంత్రులకి ఎసరు పెట్టిందేమోనంటున్నారు. ‘రేపటి ఎమ్.ఎల్.సి.’లుగా, కలలు కంటున్న జగన్ మద్దతుదారులు, సన్నిహితులూ అయినవారున్నారు. వారికిది పెద్ద ‘షాకు’! మండలి రద్దు.
కేంద్రంలో- బండ మెజారిటీతో వున్న పార్టీ దయా ధర్మభిక్షగా- యివాళ, త్వరగా ఆమోదం పొందవచ్చును. లేదా, రెండేళ్ల తర్వాత, యింకా ఆలస్యంగా ఆమోదం పొందవచ్చును. అదికూడా ఒక రాజకీయ డ్రామానే!
ఇవాళ స్థితి చూస్తూ వుంటే- ‘‘అమరావతి కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న రైతాంగానికి- కర్ణాటకా రైతులనుంచి సానుభూతి వచ్చిందే తప్ప- రాయలసీమ మొదలు ఉత్తరాంధ్రా దాకా- ప్రతిధ్వనులు- దిక్కులు పిక్కటిల్లేలాగా రావటం లేదు’’ అనుకుంటున్నారు. కాకపోతే విదేశాలలో- రుూ మూడు ముక్కల రాజధాని మీద- అమరావతియే రాజధానిగా కొనసాగాలన్న అంశం మీద- ఎన్.ఆర్.ఐ.లు- బాహాటంగా మద్దతు యిస్తూ- రోడ్లమీద ప్రదర్శనలు- అటు లండన్ నుంచి ఇటు అమెరికా, వర్జీనియా దాకా- తీవ్ర ఆందోళన సాగిందీమధ్య. అట్లాంటాలో ‘ర్యాలీ’లు సాగేయి గానీ- జగన్‌మోహన్ దూకుడుకీ- యివి స్పీడు బ్రేకర్లు గాకపోగా- కనీసం పాదచారుల- జీబ్రా చారల్లాంటి ఆటంకాలు కూడా కావు.
‘అమరావతి’ అన్నది చంద్రబాబుగారి ‘కల్పనకల’ (‘కళ’అని కూడా అనవచ్చునా?) కనుక- దాన్ని ‘ఎత్తేయ్యాలి’ అన్న ప్రతీకార వాంఛకి- అసెంబ్లీలో లభించిన బండ మెజారిటీ వూతం యిచ్చింది. ‘‘కాకా’’ అంటూ- (సి.ఏ.ఏ.;) ఎన్.ఆర్.పి.; ఎన్.ఆర్.సి.ల) పంతంలో యిరుక్కున్న భా.జ.పా.కి- తమ పాలనలో లేని రాష్ట్రాలలో చుక్కెదురు. ఈ వ్యతిరేక తీర్మానాల ‘స్కోరు’ పెరగకుండా చూసుకోడంతోనే టైమంతా గడిచిపోతోంది-
దీనిమీద సుప్రీంకోర్టుకి వెళ్తున్న పిటిషన్ల స్కోరు డబుల్ సెంచురీ కొడుతుందా? అన్న సందేహం వస్తోంది. బంతి పూర్తిగా కోర్టులో పడకముందే, కోలుకోవాలి అన్న కేంద్ర ప్రభుత్వానికి- ఆంధ్రా తెలంగాణాలు- ‘ఎటో’ అన్న సందేహం పీడిస్తున్నది. కె.సి.ఆర్.గారు శషభిషలు లేకుండా చెబుతున్నా - జెగన్‌కి యిక్కడ చిన్న అడ్వాంటేజ్ వుంది. ఈ అంశం ఒక బేరసారాలలో- పనికి రావచ్చును-అన్న ఆశ కూడా వుండవచ్చును’’ అంటున్నాడో కమ్యూనిస్టు.
‘‘మీ నాన్నగారు పెట్టిన మండలి యిది’’ అని, వీళ్లు అనగా-‘‘మీ పార్టీ అధికార నేత రద్దుచేసి పారేసిన మండలి యిది. దీనిమీద యింత ప్రాకులాట యేల?’’అని వీళ్లు వాదులాడుకుంటున్నారు. 2014 విభజన చట్టం చలవ వల్ల దొరికిన రుూ ‘మండలి’ని చంద్రబాబుగారు కాపాడుకోలేకపోడానికి- మహాభారత కురుక్షేత్రంలో కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో- అన్ని శాపాలు వున్నాయి. ఉభయ పక్షాలూ- ‘బిలోది బెల్ట్’ స్థాయికి దిగజారిపోయాయి’’అన్న తటస్థులున్నారు.
నిజానికి యివాళ ఆంధ్రుడికి- నాలుగు రాజధానులు లెక్కకి చెప్పుకోవచ్చును’’ అన్నాడో కొంటి పరిశీలకుడు. విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు- ఉమ్మడి రాజధాని హైదరాబాదు మాటేమిటి? తొందరపడి ఉమ్మడి రాజధాని యొక్క అడ్వాంటేజ్ తీసుకోకుండా- హెచ్చులు పోయిన ‘నారా’వారు- యివాళ కేవలం ‘నారా’లకే అంటే కేకలకీ, నినాదాలకీ మాత్రమే. ఆంధ్రులకు యిది గతాన్ని జ్ఞాపకం తెస్తోంది.
1953 అక్టోబర్‌లో మద్రాసుని వదులుకున్నాకా రాజధాని కర్నూలు, 1956, నవంబర్ 1నుంచీ, హైదరాబాదు- 2014 నుంచీ ఉమ్మడి రాజధానిగా, ఆనక, నాయుడిగారి అమరావతీ- యిప్పుడు మరో రెండు కలిపితే- అరవై ఏండ్లలో అరడజను రాజధానులవుతాయని- ‘చతురు’లు వేస్తున్నారు చాలామంది. ‘‘ఇప్పటివరకు రాష్ట్రంలో సచివాలయం ఒకచోట- అసెంబ్లీ యింకోచోటా లేవు. మహారాష్టల్రో మాత్రం ఏడాదికోసారి- నాగపూర్‌లో శాసనసభా సమావేశాలు జరుగుతాయి. కాశ్మీర్‌లో వాతావరణం వల్ల- మొత్తం రాజధాని బదిలీ అవుతుంది. ఆంధ్రా కూడా సమ్మర్ శాసనసభని వైజాగ్ తీరంలో పెట్టుకోవచ్చును,’’ అని టెన్త్‌క్లాస్ బాలిక చెప్పింది.
ఏది ఏమయినా, ఆంధ్రులకు కంటి నిండా కునుకులేకుండా అయింది. జగన్‌మోహన్‌రెడ్డిగారికి హైకోర్టులో మాత్రం మొట్టికాయలు పడుతున్నాయి. సెలక్షన్ కమిటీ అనే టెక్నికల్ పాయింట్ యిప్పుడు ఏమి ఫలితం యిస్తుంది? అన్నదో మీమాంస.
అయోమయంలోంచి అల్లకల్లోలంలోకి రాకుండా రాజకీయాల్ని- ‘వెండెట్టా’ దశనుంచి వెసులుబాటుకి మళ్లించడం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అవసరం. జనాలకి మనశ్శాంతి కావాలి- మండలి వాళ్ల ‘తలనొప్పి’ కాదు.
‘వాంటెడ్ డీసెంట్ పాలిటిక్స్!’

veeraji.columnist@gmail.com 92900 99512