వీరాజీయం

నల్లేరుపై నడక కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్ ప్రసాద్ నడ్డా.. సింపుల్‌గా ‘నడ్డా’ అంటున్నారు. ఆర్నెల్ల అనుభవం తర్వాత.. పూర్తి అధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ పగ్గాలు పట్టుకున్నాడు. అందరికన్నా ముందు షష్టిపూర్తి సంవత్సరంలో ప్రవేశించిన నూతన అధ్యక్షుణ్ణి నరేంద్ర దాస్ మోదీ గారు ఏ విధంగా అభినందించాడు అన్నది చూస్తే - జె.పి. నడ్డాకి రాబోయే అయిదేళ్లు ఎట్లా గడుస్తాయి? అన్నది అర్థం అవుతుంది.
‘నడ్డా ఆధ్వర్యంలో పార్టీ నూతన ఔన్నత్యానికి చేరుకుంటుంది’ అని ప్రధానమంత్రి మోదీగారు రెండు చేతులా అభినందించాడు. ఆర్.యస్.యస్. మూలాలు వున్న ఈ కొత్త అధ్యక్షుడికి, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ మాదేనని ప్రగల్భంగా చెప్పుకుంటున్న కమలనాభులకు ఎంతవరకు సంతృప్తి నిస్తాడు? పార్టీ లోపల అతని సమర్థత అందర్నీ కలుపుకుని రాగల చాకచక్యం ఎంతవరకూ ఉంటాయి? అన్నది పార్టీ థింక్ టాంక్ చూసుకోవాల్సి ఉంటుంది. అతనికి బీహార్‌లో విద్యార్థి నాయకుడిగా ఏ.బి.వి.పి.లో, అపార అనుభవం గడించినా హిమాచల ప్రదేశ్‌లోనే పార్టీ కలాపాలను చక్కబెట్టినవాడు. అక్కడే మంత్రి అయినవాడు.
అప్పుడు నరేంద్ర మోదీ కూడా హిమాచల్ ప్రదేశ్ పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ చేస్తూ - జె.పి. నడ్డా ‘నడ్డి’ మీద, అంటే అతని స్కూటర్ వెనుక సీటు మీద కూర్చొని తెగ తిరిగానని జగత్‌ప్రసాద్ యొక్క దీక్ష, సమర్థత వగైరాలు తమకు తెలుసునని - తెగ ఆకాశానికెత్తేసినా - అవతల అమిత్‌షా తోకలాగా - ఆరు మాసాలుగా - గత జూన్ నుంచీ పని చేస్తూ వస్తున్నాడు కనుక - అమిత్ షాగారి ‘హయాం’ అంత తేలికగా తీసుకోకూడదు అనీ - దేశ ఆంతరంగిక వ్యవహారాల మంత్రియే గాకుండా - పార్టీ హోంమంత్రిగా కూడా అమిత్‌షా చక్రం తిప్పుతాడని నడ్డాజీకి తెలుసు.
2014కి 2019కీ మధ్య పార్టీని మోదీషాలు ఒక తిరుగులేని జగన్నాథ రథ చక్రాల శకటంలాగా నడిపించారు. కానీ పార్టీ యొక్క పదకొండవ అధ్యక్షునిగా - జె.పి. నడ్డాకి ఇది ఒక ముళ్ల కిరీటమే. కేంద్రంలో ఆరోగ్యమంత్రిగా చేసిన నడ్డాజీకి రెండు రాష్ట్రాలలో దైనందిన పార్టీ కార్యక్రమాలలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా అనుభవం ఉంది.
అమిత్‌షా సంగతే వేరు. అతనికి, పార్టీ మహర్దశ నందుకున్నప్పటి నుంచీ - అనుభవం, అదృష్టం కలిసొచ్చాయి. ఇవాళ నడ్డాజీకి ఇద్దరు శిఖర నాయకులు - షా మోదీలు లేదా మోదీ షాలు జంట కవులుగా సాగుతున్న దశలో - ఇద్దరి మధ్యా సర్కస్ ఫీట్స్ చేస్తున్నట్లు శ్రమ పడాల్సి వస్తుంది. అన్ని రాష్ట్రాలకన్నా పెద్దదయిన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సన్నాహాలు చేసిన అనుభవం వున్న జగత్ ప్రసాద్‌గారి బీహార్ ఎన్నికలు కొరకరాని కొయ్యగా అవుతాయి.
బీహార్‌లో నితీష్ ఆధ్వర్యంలో ఎన్నికలు అంటున్నారు గానీ - నితీష్ సి.ఏ.ఏ. - మా రాష్ట్రంలో బిల్‌కుల్ న చలేగా.. కాహేకో?’ అంటున్నాడు. అతణ్ని ఎన్.డి.ఏ.లో నుంచి గెంటివేసి, వోటర్‌లను ‘మమ్ములను గెలిపించండి’ అంటూ అభ్యర్థులు అడగగలరా?
దేశంలో మంచి చెడ్డలను పక్కనబెట్టండి. పౌరసత్వపు బిల్లు పెద్ద చీలిక తెస్తున్నది. రాజ్యాంగం ఏర్పడ్డనాటి నుంచీ ఇవాళ్టి దాకా ఎన్నడూ లేని పేచీ కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వచ్చింది. రాజ్యాంగం పార్లమెంటుకి ఇచ్చింది అనుకున్న హక్కులను - కేరళ, పంజాబ్‌లు - సుప్రీంకోర్టులోనే సవాలు చేస్తున్నారు. ఆ దశలో నడ్డాజీ దక్షిణాదికి కాషాయ జెండాని తీసుకుని పోగలగాలి - అంటే ఎదురుగాలి తగలదా?
తక్షణ సమస్య నడ్డాజీకి ఢిల్లీ ఎన్నికలు. ఇంతవరకు ఢిల్లీ కార్పొరేషన్‌లో వున్న ఆధిపత్యం కూడా తగ్గుముఖం పడుతోందని అభిజ్ఞ వర్గాలంటున్నాయి.
మోదీ మాట - మోదీ బాట - దేశంలోగల - దళితులు, మైనార్టీలు వేదవాక్కుగా అంగీకరించిన దశ మారింది. భాజపాకి నడ్డాజీ ఆర్.ఎస్.ఎస్. మూలాలు వుండటం చేత - అట్నుంచి నైతికమైన మద్దతు, వత్తాసు వుంటాయి. గానీ క్షేత్ర స్థాయిలో వీచే వ్యతిరేక పవనాలను ఎదుర్కోవాలీ అంటే ‘మోదీ షా’ల ఫార్ములాలో పట్టూ విడుపూ ముఖ్యం. ఎంతటి మహా నాయకుడైనా జనాగ్రహం ముందు - సునామీ ముందు బొప్పాసి చెట్ల తోట అయిపోయే ప్రమాదం ఉంది.
భాజపాలో ఇవాళ సంఘ పరివార్ అన్న మాట చాలా ‘డొల్ల’గా వుంటున్న దశ. మొదట సంఘ పరివార్‌ని కూడగట్టుకోవాలి. రెండోది శివసేన చూపించిన మార్గమే మిగతా కుటుంబ సభ్యులు అనుసరించకుండా చూడాలి. మూడోది - ఎన్.డి.ఏ.లో నుండి విడిపోతాం అనకుండా పార్ట్‌నర్స్‌ని కాపాడుకోవాలి. వాళ్లు వుండి యిస్తున్న మెజారిటీ సపోర్టు కేవలం ‘నేతి బీరకాయలో నెయ్యి’ కావొచ్చును గానీ వాళ్లు బయటికిపోతే మాత్రం ఏకు మేకులు అయ్యే ప్రమాదం వుంది. ఏదైనా సరే - ఇష్యూ బేస్డ్‌గా ఆలోచించి పార్టీ నాయకుడికి, పార్టీకీ మద్దతు యిచ్చేవాళ్లే అసలు బలం ఏ పార్టీకయినా.
పశ్చిమ బెంగాల్ సరిహద్దు రాష్ట్రం. అక్కడ ‘దీదీ’కి కూడా మోదీగారి లాగ ఎటువంటి ఝంఝాటం లేదు. ‘బెంగాల్ ప్రతిష్ఠ ముఖ్యం’ అంటున్నది. ఒక్కో రాష్ట్రాన్ని వొదులుకుంటున్న స్థితి - ‘ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా - నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథా’ అన్నట్లు - పాలనలో వున్నవారి మీద వెగటూ, వ్యతిరేకతా వస్తున్న దశ ప్రారంభమైంది.
అట్టితరి జె.పి.నడ్డా గారి నడ్డి మీద పడ్డ గురుతర బాధ్యత యింతా అంతా కాదు. ఒకసారి పార్టీ అధ్యక్షుణ్ని చేశాకా - ‘కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువే’ అన్న చందాన అతనికి స్వేచ్ఛ యిస్తేనే - వ్యతిరేక పవనాలకు అడ్డుకట్ట వెయ్యగలరు. కేవలం ‘నామ్‌కే వాస్తే’ నడ్డాజీ పలికించెడిది - మోదీషాల శక్తి అనుకుంటే ఇవాళ దేశకాల మాన పరిస్థితులు భాజపాలో కొంత ఒడిదుడుకులకు ఆలవాలమయ్యే స్థితి కాన వస్తున్నది. ఇక్కడ ఉత్తర దక్షిణాల మధ్య నైసర్గికమైన ‘అంతరం’ వుంది. దాన్ని తగ్గించే ప్రయత్నం భాజపా చేయాలి లేదా, కేవలం - లుంగీలు ధరించితే దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా ఆంధ్రా, తెలంగాణల లాంటివి కాదు అని నడ్డాగారికి స్వాగతం చెబుతూ, మనం హెచ్చరించవలసిన అవసరం వుంది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి అధికారం లభించే కృషి చెయ్యడమే నడ్డాగారికో సవాల్.
‘స్పీడ్ బ్రేకర్స్ ఆర్ అహెడ్, నడ్డాజీ!’!

veeraji.columnist@gmail.com 92900 99512