వీరాజీయం

ములాయంకి ‘సన్ స్ట్రోక్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అతి పెద్ద, అతి ముఖ్యమైన రాష్ట్రం యు.పి. దీన్ని ‘అప్’ అంటారంతా చాలా విషయాలలో. ఇవాళ ఏ విధంగా చూసినా అక్కడ అతి పెద్ద పార్టీ- కుటుంబం- ములాయమ్‌సింగ్ అజమాయిషీ లోని సమాజ్‌వాదీ పార్టీ కుటుంబమే!
‘గాంధీ’ల ఆధిపత్యాన్ని నిరోధిస్తూ తిరగబడ్డ ములాయమ్ 1969లో మొట్టమొదటిసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయినాక, ఇక వెనుదిరిగి చూడకుండా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే అయినాడు. మూడుసార్లు ఏ లెక్కనయితేనేం- ముఖ్యమంత్రి పదవిలో తన ‘ఎత్తుకి పై ఎత్తుల’తో రాణించాడు. అందరూ ‘నేతాజీ’ అంటారు ములాయమ్‌ని. ‘జనాబ్ ములాయమ్’ అంటారు ముసల్మానులు. పెద్ద వటవృక్షంలా ఊడలు దించేసుకున్న ములాయమ్ కనీసం ఓ పాతిక మంది తన బంధువులయిన మనుషుల్ని- వారిలో సొంత తమ్ముడు శివలాల్, తనయుడు అఖిలేష్ సహా పార్టీలో అతి కీలకమయిన పదవులలోకి అప్రతిహతంగా దింపేశాడు. ఆఖరికి మనుమణ్ని కూడా ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాడు.
ఐదవసారి ఎంపీగా కొనసాగుతున్న ములాయమ్ ‘నేతాగిరీ’కి యిప్పుడు డబుల్ ‘సన్‌స్ట్రోక్’ తగలేలా వున్నది. పరోక్ష యుద్ధంగా అఖిలేష్ ప్రవర్తన ఆగస్ట్ 15నుంచే వెల్లడి చేస్తూ వచ్చిన ఈ కుటుంబ ‘రగడ’ వెనకాతల ములాయమ్‌జీ ద్వితీయ కళత్రం సాధనాగుప్తా పన్నాగం వున్నది- అని అనుమానించిన సిఎం అఖిలేష్ తన పక్షాన వున్న నాయకుల్ని రంగంలోకి దింపాడు. దింపాక వారిచేత తన మాటలను చెప్పిస్తున్నాడు.
ములాయమ్ జీవితంలో రాజకీయ పార్శ్వమే కాకుండా ప్రేమగాధ కూడా ఒకటి వున్నది. అది 2007 దాకా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టలేదు. గానీ 2003లోనే ‘నేతాజీ’ ఈ విషయాన్ని వెల్లడి చేశాడు. పెద్ద భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్ 1973లో జన్మించగా, రెండో భార్య సాధనాగుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్ 1988లో జన్మించాడు. అన్నదమ్ములైన అఖిలేష్, ప్రతీక్‌ల మధ్య అంత వయోభేదం వుండటంతోనూ, రాజకీయాల్లోకి దింపడం నేతాజీకి యిష్టం లేకపోవడం వల్లా- ప్రతీక్‌కి వ్యవసాయం అప్పజెప్పడంతో ఈ ఘట్టం తెరవెనుక వుండిపోయింది.
నేతాజీకి రెండు బలహీనతలనండి, ప్రలోభాలనండి.. లేదా ఔదార్య లక్షణాలనండి.. మొత్తంమీద వున్నాయి. అవి యింత లేటు వయసులో (77) అతని నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాయి. చాలామందికి జ్ఞాపకం వుందో లేదో గానీ ములాయంజీ పూర్వాశ్రమంలో ‘వస్తాదు’. ‘బస్తీమే సవాల్’ అంటూ కుస్తీలు పట్టేవాడు గానీ రాజకీయ వస్తాదుగా నాడే మారిపోయాడు. తండ్రిలాగే ప్రతీక్‌యాదవ్ కూడా బాడీ బిల్డర్‌గా, వస్తాదుగా పెరిగాడు చాలా కాలం దాకా.
ఐతే, ప్రతీక్ భార్య అరుణయాదవ్ తన అత్తగార్ని బాగా పురెక్కించింది. పాలిటిక్స్‌లోకి తాను కూడా దిగింది. ఈసారి ఆమె లక్నో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటోంది. ములాయం సాధారణంగా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చెయ్యడం, బ్రహ్మాండంగా గెలవడం.. ఆనక వాటిలో ఒక స్థానాన్ని బై ఎలక్షన్స్‌లో తన ‘వాడికి’ ఇప్పించడం చేస్తూ వచ్చాడు. గానీ, ప్రతీక్ విషయంలో పెద్ద కోడలు అడ్డం పడిపోయిందని అంటారు.
మొత్తానికి సాధనాగుప్తా ములాయం కోసం తన ప్రేమను సార్థకం చేసుకోవడం కోసం- యుపి లోని వైశ్య కులస్థులందరినీ- నేతాజీ వైపు తిప్పడంలో కృతకృత్యురాలయింది. తను బనియా కనుకనే భర్తకి అంత ‘ఓట్ బ్యాంకు’ దొరికింది అంటుందామె. కనుక యిప్పుడు ‘కైకేయి వరం’ అడిగి రెండో కుమారుడు ప్రతీక్‌ని కూడా యిప్పుడయినా ఓ ‘మంత్రివాణ్ని’ చెయ్యమంటున్నది. ఈ దశలో అమర్‌సింగ్‌ని తిరిగి పార్టీలోకి తెచ్చుకున్న ములాయం- అటు అమర్‌సింగ్ మీదా, యిటు కజిన్ రామగోపాల్‌యాదవ్ మీదా యిప్పుడు ఆధారపడుతున్నాడు. రాజకీయంగా అమర్‌సింగ్ పునరుత్థానం- సినీనటి జయప్రదను ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి వైస్ ఛైర్మెన్‌ని చెయ్యగలిగింది!
ఎన్నికల రథాలలో జయప్రదంగా ఒక రథం సాగుతుంది అన్నమాట- కానీ యింత మంది మహారథులున్న యుపిలో అఖిలేష్ రేషన్‌కార్డుల మీద కూడా తన బొమ్మ గుద్దించుకున్న సాహసుడయినాడు. పైగా అయినవాళ్లను బయటికి ధైర్యంగా నడిపించేశాడు. కానీ- కథ ‘బూమ్‌రాంగ్’ అయింది. ఎన్నికల ప్రచారానికి పార్టీ యువరాజుగాకాక నేటి ముఖ్యమంత్రిగా మాత్రం ‘వికాస్ రథం’ ఎక్కుతున్నాడు. సమాజ్‌వాదీ ‘సైకిల్‌కి’ రజతోత్సవాలు యిప్పుడు. ఆ ఫంక్షన్‌కి కూడా అఖిలేష్ ‘డుమ్మా’ కొడతాడంటున్నారు పరిశీలకులు.
ఈ పరిస్థితిలో నేతాజీ అఖిలేష్ మీద బాంబు పేల్చాడు. ‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి?’- అని మీడియా ప్రశ్నిస్తే.. ‘ఎన్నికలయినాకా శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ కమిటీ సిఎం అభ్యర్థిత్వం సంగతిని చూసుకుంటాయ’ని ములాయం తేల్చేశాడు. అన్నట్లు నేతాజీ రెండో ప్రలోభం పైన పేర్కొనలేదు. అదే- తాను ఈ దేశానికి ప్రధానమంత్రి అవాలన్న కోరిక! కేంద్ర రక్షణశాఖ మంత్రిగా గతంలో ఆయన పనిచేశాడు. కానీ ఇంకా పెద్ద ‘కల’గన్నాడు. ఇవాళ సదరు- ‘మేషాండభ్రమ’ తొలగిపోయింది. అవతల కాంగ్రెస్ పార్టీ కూడా అఖిలేష్‌ని ‘మంచి బాలుడు’ అంటూ సమాజ్‌వాదీ పార్టీపై జాగ్రత్తగా బాణాలు సంధిస్తున్నది. సమాజ్‌వాదీ పార్టీ కూడా నేరుగా కాంగ్రెస్‌కు అటాక్ యివ్వడం లేదు అంచాత ఎన్నికల తరువాతి చిత్రంలో కాంగ్రెస్, ఎస్పీలు కలియావల్సి వస్తే- ‘సైకిల్’ నడిపేందుకు ‘హస్తం’ సాయం కావాలన్న ధోరణి ఒకటుంది ప్రస్తుతానికి. ఈ కారణంగా నేతాజీ నేరుగా పగ్గాలు పట్టి- ముఖ్యమంత్రిగానైనా సెటిల్ అవ్వాలని- లోపల లోపల లడ్డూలు తింటున్నాడేమోనంటున్నారు హితైషులు-
జస్ట్ నౌ... సన్ అండ్ ఫాదర్ ఆర్ ఈస్ట్ అండ్ వెస్ట్!
*