వీరాజీయం

లాలూజీని ‘సమోసా’తో కొట్టిన నితీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ అంటే అది ఒకప్పుడు లలూప్రసాద్ యాదవ్ గారి ఇష్టారాజ్యం- తానొక సమోసాలాంటివాణ్ని అనేవాడు శ్రీమాన్ లలూ ప్రసాద్ యాదవ్‌గారు. సమోసాను మించిన సామాన్యుడి తిండి మరొక్కటి లేదు. అందుకనే లాలూజీ ఎప్పుడూ బిహారులో సమోసాలు, ఆలు వున్నంతకాలం లాలూ వుంటాడు అంటూ గర్వంగా మాట్లాడుతూ వుండేవాడు. కాని యివాళ లాలూప్రసాద్‌గారి పార్టీ సమ ఉజ్జీ అయిన బలం వున్నా ఆయనకి గద్దెమీద కూర్చునే ఛాన్స్ లేదు. జైలులో వున్నా, బెయిలుమీద వున్నా- ఎన్నికలలో పోటీకి అనర్హుడు అంటున్నది కదా చట్టం! దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌గారు ఎన్నికలలో గెలిచి కూడా వోడిపోయినవాడు ఐనాడు. పాపం! సమోసా వుంది కాని అధికారంతో ఆయనకి సంధి, సమాసం కుదరలేదు. కాకపోతే కొడుకుకి ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. ఐనా కూడా బిహారు రాష్ట్రంలో లాలూజీకి అత్యంత ప్రియమైన సమోసా యిప్పుడు మరీ అత్యంత ‘ప్రియం’ అయిపోతోంది. నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి మూడోసారి అయినది కేవలం లాలూజీ సహకారంతోనే. లాలూ లాంతర్‌ని నితీష్ సైకిల్‌కి కట్టి ప్రచారం చేశాడు కనుక ఆర్.జె.డి ‘రొట్టె విరిగి నేతిలో పడ్డది’- అక్కడ సమోసాలను ఉదారంగా పంచి పెట్టి వుంటే బాగుండేది.
లాలూజీ గెల్చిన సమయంలో ముఖ్యమంత్రి నితీష్ అయిననేమి? మరొక గితీష్ అయిననేమి- లాలూజీ నెత్తిమీద కిరీటం లేకపోతేనేమి? మకుటంలేని మహారాజు, ‘సూపర్ ముఖ్యమంత్రి’ లల్లూజీయే కదా! మొన్ననీమధ్య లాలూగారు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో తొలగించబడ్డ నర్సుల్ని తక్షణం తిరిగి పనులలోకి తీసుకోమని అసాధారణ ఆర్డర్ వేస్తే వెంటనే అది అమలు అయిపోయింది. చక్రం నితీష్ చేతిలో వున్నా దాన్ని తిప్పే చెయ్యి- ఎవరిది? యాదవులదే అక్కడ రాజ్యం- ప్రతి నలుగురు సభా ప్రతినిధులలో ఒకడు యాదవుడే- ఏ విధంగా చూసినా యాదవుడే మహనీయుడు అని పాడుకుంటున్నారు సామాన్య జనం. అతిగా ప్రేమించే తిండి పదార్థం ఏది? సమోసా- మనది బిహారు రాష్ట్రం కాకపోయినా ‘టక్కున’ మన జనాలు కూడా ‘సమోసా’, ‘సమోసా’- కచోడి, కచోడి - బజ్జీ బజ్జీ అంటూ కోరస్‌గా వినిపిస్తారు ఇక్కడ కూడా మన జనం. అటువంటి సమోసా మీద దాని నడ్డి విరిగేలాగ పన్ను విధించాడు బిహారు ముఖ్యమంత్రి- అనగా ‘వ్యాట్’ అంటున్నారా? అవును, నిజమే. ‘వ్యాట్’- 13.5 శాతం పన్ను విధించాడు. సమోసా, నమ్‌కీన్, కచోడి, అతి సామాన్య రుచికర భోజ్య పదార్థాలన్నీ యికమీదట ‘లగ్జరీ సరుకులై’ పోయాయి. ఆటోవాలా, టాంగావాల, మోటార్ సైకిల్‌వాలా, లాల్‌కుర్తావాలా అయినా లేక ఏ సామాన్యుడయినా- టీకొట్టుకుపోయి ‘‘్భయ్ సాబ్ ఒన్ బై టూ చాయ్, ఒన్ బై టూ సమోసా కొట్టు భాయ్’’ అని అడగాల్సిందే.
మైదాపిండి, శనగపిండి లాంటి పిండి పదార్థాలతో కమ్మగా, ఎర్రగా, ఉప్పు ఉప్పగా, మజాగా చేసే ఏ వేపుళ్లయినా అవి భోగ వస్తువులేనన్నది బిహారు మంత్రివర్గం. అలాగే కిలో ఐదు వందలకన్నా మించిన జిలేబి లాంటి తీపి పదార్థాలమీద కూడా పదమూడున్నర శాతం పన్ను దిగ్గొడుతున్నారు. ‘నార్త్’లో ప్రొద్దునే్న జిలేబితోపాటు చాయ్ కలిపి కొట్టేస్తూంటారు. ఆ మాటకొస్తే మనకి మిర్జీ బజ్జీ ఎలాగో సమోసా అలాగా, మనకి మసాలా దోసె ఎలాగో వాళ్ళకి ‘కోచడి’ అలాగ- ఉత్తర దక్షిణ భారతాలమధ్య కమ్మని రంజైన ‘వారధి’ సమోసా అన్నది మాత్రమే- ఇడ్లీ సాంబార్ అనడంకన్నా సమోసా చాయ్ అన్న మాటలే వినబడతాయ్ నవాబు దర్జాగల జంటనగరాలలో. ఇంతకాలం ఆ దేశంలో లల్లూగారి హయాం వున్నా లేకపోయినా సమోసామీద పన్ను లేదు. నిజానికి నితీష్‌కుమార్‌గారు ఎన్నో పదార్థాల మీద అదనపు పన్నుల మోత వినిపించాడు కాని ‘సమోసా’ని ముట్టుకోకుండా వదిలేయాల్సింది-సబ్సిడీ యిచ్చి ఖరీదు తగ్గించాల్సింది. రెండు సమోసాలకి ఒక ‘టీ’ ఉచితం లాంటివి. ప్రకటనలు లాలూ ప్రసాదు గౌరవార్థం సామాన్యుడికి కర్ణపేయంగా ఉండేలాగా ఒక ప్రకటన చేయవలసింది. కాని నితీష్‌కుమార్‌గారు ‘ఆలూ’చిప్స్‌మీద కూడా వ్యాట్ వ్యాట్‌మంటూ పదమూడున్నర శాతం పన్నుకొట్టారు. సాతాళించిన శనగలు, బఠానీలకు కూడా భోగవస్తువులేనా? చెప్పండి. జిలేబీలు, లడ్డూలు సంప్రదాయబద్ధమైన స్వీట్సు- వాటిమీద పన్నా? పోనీ రాజీపడి వీటిని అప్పో, సప్పో సగమో చేసుకుని తిని సాధ్యమైనంత హాయిగా తొంగుం దాం అని దోమల మందు పెట్టుకోబోతే ‘్ఫట్’మని దోమల మందు మీద కూడా అదే మోతాదులో పన్నుకొట్టాడు. ‘దోస్త్ దోస్త్ నా రహో- సమోసా సమోసా నా రహో’ అంటూ లలూ అనుయాయులు విషాదగీతికలు ఆలపించుకోవాలా? లేక నితీష్‌మీద ఒత్తిడి తెచ్చి సూపర్ ముఖ్యమంత్రిగా తనని తాను లాలూజీ నిరూపించుకోవాలా? వద్దా?
యాదవుల మహానాయకుడు శ్రీమాన్ కృష్ణపరమాత్మగా వారు భావించే లాలూజీ సమోసా రేటు విషయంలో ‘ఉద్యమం లేవతీయాలా’ లేక ‘సూపర్ ఆర్డర్’ పాస్ చేసి, చవకధరల దుకాణంలో అమ్మించాలా? తక్షణమే మిగతా వస్తువుల మాట ఎలా వున్నా సమోసాల మీద సుంకం ఎత్తివేయాలని లాలూజీ ప్రతినిధులు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో భేటి అవ్వాలా? వద్దా? ‘విత్ ఆలూ’ ఆర్ ‘వితౌట్ ఆలూ’ సమోసా మస్ట్ అంటూ బిహారులో ఒక ఉద్యమం లేచునా?
వెయిట్ అండ్ సీ!