వీరాజీయం

రజనీ కోసం ‘కమలం’ ఎదురుచూపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండల్ని మించి మండిపోతున్న వార్త ఏమిటి? సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా కరికాళన్’ ఎ ప్పుడు రెడీ అవుతుందా? అన్నది కాదు. ‘రజనీకాంత్ ది గ్రేట్’ పోలిటిక్స్‌లోకి దూకుతాడా? లేదా? అన్నదీ కూడా కాదు- అసలు రజనీ అనగా ‘తలవై’ తమిళుడు ఔనా? కాదా? అన్నది వివాదం. అతను కన్నడిగుడు- కనుక, తమిళనాడు పరిపాలనకి తగడు అంటూ ‘నాన్ద తమిళ్’, ‘నాన్ తమిళ్’ అంటే- అరవలు, అరవలు కాని వారు అని అర్థం. రెండు గ్రూపులు రోడ్డున పడ్డాయి.. అంతేనా? సూపర్ స్టార్ రజనీకాంత్ దిష్టిబొమ్మ తగులబెట్టారు. చాలామంది చెన్నై తెలుగువాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. భగవత్ సంకల్పం వుంటే రాజకీయాల్లోకి దిగుతానని సూపర్ స్టార్ అన్నాడో లేదో భగ్గుమన్నది అప్పడే లేచిన ప్రత్యర్థి వర్గం..
అభిమానులను నిలువరించడానికి కాదు, దుండగులను ఆందోళనకారులను నిరోధించడానికి పోలీసులు డబుల్ బందోబస్తూ చెయ్యవలసి వచ్చింది. రజనీకాంత్‌కిది షాకే.. ‘మహానాయకా రావయ్యా! మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా’అంటూ తోరణాలు వీరణాలు ఎదురొస్తాయి అనుకున్నచోట - రోడ్లమీద.. సోషల్ మీడియాలో కూడా. ‘కిట్టని’ వాళ్ళు ఇంత పరుషంగా స్పందిస్తారని ఊహించని మహానటుడు కంగుతిన్నాడు. పనె్నండు సంవత్సరాల తరువాత తన వీరాభిమానులను కలసి ఫొటోలు తీయించుకుంటున్న సూ పర్ స్టార్ అనుకోకుండా- ‘యుద్ధం వస్తుంది రెడీగా వుండండి అందాకా ఇండ్లకు పోయి మీమీ పనులు చూసుకోండి. నేను పిలుస్తాను’అన్న ధ్వనితో పరోక్షంగా పోరుకి పిలుపునిచ్చి సర్ది చెప్పి పంపవలసి వచ్చింది-
‘తమిళనాడులో మంచి నాయకులే వున్నారు కాని- వ్యవస్థ కుళ్లిపోయింది.. ప్రజాస్వామ్యం అస్తవ్యస్తమైపోయింది. దీన్ని రిపేరు చెయ్యాలి’అన్నాడు సూపర్‌స్టార్. తన నూతన అవతారం అందుకేనని అభిమానులకి ప్రకటించినట్లయింది. వీధి గొడవల మీద తమిళనాడు బిజెపి నాయకురాలు తమిళ్ సాయి సుందరాజన్ స్పందించి ఇదంతా స్టంటు అంటూ ప్రత్యర్థి అయిన టిఎంపి పార్టీని కొట్టిపారేసింది. బయటవాళ్ళూ ఇ తర రాష్ట్రాల నాయకులూ ఉత్తరాది సినిమా తారలు- అందరు స్వాగతమ్ అంటూ చేతులు జాచినా, తమిళ సినీ రంగం మాత్రం చీలిపోయి అసలు రంగు ప్రదర్శించింది. తమిళనాడులో తమిళ నాయకులే లేరా? ఎక్కన్నుంచో వచ్చిన కన్నడ మహాపురుషుడు మనల్ని పరిపాలించాలా? అని డైరెక్టర్ భారతీరాజా లాంటివాడు, నటీమణి రాధిక లాంటి వారు నేరుగానే అనేశారు- స్టార్స్ శరత్‌కుమార్, సిమ్రన్, కార్తీక్ వీళ్ళంతా- ‘రజనీ సూపర్ స్టారే గాని సూటబుల్ స్థానిక నాయకుడు కాదు’ అని పొమ్మన్నారు. ఇది కూడా రజనీకాంత్ ఊహించని సంగతే. నేను పూర్తిగా తమిళ బిడ్డనే- నలభైమూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ, ఈ గడ్డ ముద్దుబిడ్డనయ్యాను.. ఇరవయ్ మూడేళ్ళు కర్నాటకలో వున్నాను- నిజమే, ఇక్కడికి మరాఠీ- కన్నడిగుడిగా వచ్చినా తమిళనాడు నన్ను అక్కున చేర్చుకుని అన్నీ ఇచ్చింది- ఇవాళ నేను పరిపూర్ణ తమిళుడిని - పరాయివాడ్ని కాను , కావాలంటే మా తాతముత్తాతలు క్రిష్ణగిరి జిల్లాకి చెందినవాళ్ళు’’- అంటూ డిఫెన్సులో పడిపోయాడు రజనీ. పైగా డిఎంకె నేత స్టాలిన్‌ని, పిఎంకె నాయకుడు అంబుమని రామదాసుని కూడా పొగిడాడు.
తమిళనాట కాంగ్రెస్, భాజపా నాయకులు రజనీ రాజకీయ రంగప్రవేశానికి ‘ఒకే’ చెప్పారు- అరవై ఏడేళ్లు వచ్చాయి కనుక- ఇదే సరి అయిన సమయం అని కూడా- ‘తెలివి’జన్లమీద చర్చలు పెట్టి రుంజ వాయించేస్తున్నారు. కానీ, జయలలితమ్మ మరణం తర్వాత - ఆమె పార్టీ రెండుగా చీలిపోవడంతో- తమిళనాడులో గట్టి ముఖ్యమంత్రి అవసరం ఏర్పడిపోయింది- ఈ గ్యాప్ సరయినది.. ట్రై చేద్దాం అని అనుకొన్న సూపర్ స్టార్స్‌లో కమలహాసన్ కూడా వున్నాడు. వీళ్ళిద్దరిది ‘అంతులేని కథ’- అంటే వైర-ప్రేమ అన్న మాట. ఈ ఇద్దర్నీ డైరెక్టర్ బాలచందర్ తన పెద్దరికంతో కలిపేవాడు అని ఫీల్డులో అందరికీ తెలుసు-కాకపోతే, కమల్‌కి దేవుడు ‘‘ఇల్లే’’అనగా నాస్తిక సుపర్ స్టార్ అన్నమాట- రజనికాంత్ భగవంతుడి దయ వుంటే అని దేవుణ్ణి స్మరించే ఆస్తికుడు- అసలు కర్నాటకలో కొంతకాలం క్రితం ప్రేక్షకులు- రజనికాంత్‌ని రాఘవేంద్రస్వామీ అవతారంగా కీర్తించారుట. ఆ మహనీయుని పాత్రని అంత అద్భుతంగా పోషించాడు. అయితే ఈ ఇద్దరు పరస్పరమ్ ‘‘దధి’’ ప్రయోగం చేసుకుంటూనే వుం టారు. ‘‘సోపు’’వెయ్యడం అంటారు తమిళంలో.. కాకపోతే కమలహాసన్ ఇప్పుడు బయటపడిపోయాడు. ‘‘రజనీ కెమారా ఎక్కడ వుందో అక్కడ ప్రత్యక్షమవుతాడు’’- ఇదంతా తన కొత్త సినిమా ‘‘కాలా’’కి హైప్ కోసం ఆడుతున్న స్టంటు సీన్ అని వేలాకోలం చేశాడు. ఎవడికయినా, వెండితెర మీద ‘వేలుపు’ స్టేటస్ వస్తే- తనకి ఇక ముఖ్యమంత్రి పదవికి అర్హత వచ్చినట్లేనని నమ్మకం ఏర్పడిపోతుంది మన దేశంలో. అందరికీ తాము ఎజీఆర్, ఎన్టీఆర్‌లంత వాళ్ళమేనని లోపల ఆశ పురుగై దొలుస్తూ వుంటుంది- కాకపోతే, సినిమా స్టార్‌గా రజనీకాంత్ కీర్తిప్రతిష్టలు అంత లెవెల్‌లోనూ వుంటాయని ఎందరో నమ్ముతారు. దక్షిణాదిన వున్నంత ‘హీరో పూజ’ ఉత్తరాదిలో లేకపోయినా అక్కడా, రాజకీయాలలోకి దూకి చేతులు కాల్చుకున్న సూపర్ స్టార్లు అమితాబ్, రాజేష్‌ఖన్నా, గోవిందా, ‘షాట్ గన్లూ’ వున్నారు- షాట్గన్ అంటే జ్ఞాపకం వచ్చింది- శత్రుఘ్నసిన్హా ఉన్నాడుగా- రజనికి మంచి ఫ్రెండు, ఫ్యాన్ కూడానుట. అతను ట్వీట్స్ దంచేస్తున్నాడు.. రజనీ భాయ్- నీ రాజకీయ రంగప్రవేశానికి ఇదే సరి అయిన సమయం- దూకేయ్ అంటూ సలహా ఇచ్చాడు. అసలు ‘షాట్‌గన్’ బీహార్లో ముఖ్యమంత్రిగా విరాజిల్ల వలసినవాడు. కానీ, అక్కడికి- అమిత షా వెళ్లాలి- భాజపాని గెలిపించాలి అప్పుడు మోదీగారు మోజుపడాలి..
ఇదంతా శానా దూరం కాని- రజనీకి మాత్రం ఈ బిహారిబాబు- సూపర్ ఎంపి గారు కదా? అంచేత నేనున్నాను అని ఆత్మీయంగా పిలుపునిచ్చాడు నువ్వు ‘టైటానిక్ స్టార్’వి అన్నాడు. కానీ, తమిళనాడులో ఆస్తికతకీ, నాస్తికతకీ కూడా పాలనని అప్పగిస్తారు. నల్లకళ్లద్దాలలో నుంచి తప్ప లోకాన్ని చూడలేని వాడే కానీ- చక్రాల కుర్చీలోనుంచే చక్రం తిప్పగల సమర్ధుడు కరుణానిధి ఐదుసార్లు ముఖ్యమంత్రి అయినాడు. జయమ్మ తరువాత మాదే వంతు అనుకుంటున్నది డిఎంకె.
రజనీకి అశేష అభిమాన ధనం వుంది కాని రాజకీయ పరిభాషలో క్యాడర్ అంటారే అది లేదు- లోగడ స్వయంగా గూడారుకట్టుకుని మరీ, నరేంద్ర మోదీ సూపర్‌స్టార్ ఇంటికి వెళ్ళిన సంగతి జ్ఞాపకం ఉందిగా? ఆ మోజు ఇప్పుడూ ఉందేమో? అమిత్‌షా రజనీకి స్వాగతం పలికాడు. చెన్నై ఫిలిం ఫీల్డు మాత్రం చీలిపోయింది- జయమ్మ పార్టీలోని ముక్కలు రెండూ- తన్ను మాలిన ధర్మంగా ముందుకి వచ్చి ‘రావయ్యా.. సిఎంగా నువ్వే తగినవాడివి అని అర్ధ్యపాద్యాదులు పట్టుకుని వస్తారు అనుకోవడం షూటింగుకి పనికిరాని స్క్రిప్టు రాసుకోడమే.. ఏది ఏమయినా, మన టైటానిక్ స్టార్- స్టాలిన్‌ని గొప్ప దక్షుడు అని ఎందుకు కొనియాడినట్లు? అది అడ్లుండ నిండు. ‘కావేరి జల వివాదంలో నోరు విప్పని వాడివి.. నువ్వేం తమిళుడివి?’ అన్న బృందం ఒకటి బలపడి రజనీకి వ్యతిరేకంగా రెడీ అవుతోంది. కాని అదీ తేలిపోతుంది స్టార్ వాల్యూ ముందు.
‘ఒక్కసారే చెపుతాడు బాషా’ అన్నది తమిళనాట ఇంటింటి మాట- ‘నాన్ ఒరు తడవసొన్నా నూరు తడవ సొన్నా మాదిరి’ అన్న బాషా ‘మాట’ ఇప్పుడు దక్కించుకోవాలి అన్నదే ఈ టైటానిక్ స్టార్ ముందున్న సవాల్!
‘ఒకవేళ నీకు 67వ ఏట రాజకీయ గండం వున్నదని ఓ జ్యోతిష్కుడు చెప్పినా గోదాలోకి వ్యవస్థని రిపేరు చెయ్యడానికే రుూ నా త్యాగం’ అని దూకక తప్పదు. రజనీ సారుకి ఇప్పుడు- సొంత పార్టీ పెట్టినా మద్దతు కావల్సిన స్థితి సూపర్‌స్టార్‌కి ఉత్పన్నమయింది. చుట్టూ చూస్తున్నాడు.. పార్టీ పె ట్టాలా? ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న పార్టీలోకి దూకాలా? లేక ‘హిమాలయాల్లో’కి పోవాలా?
ఎనీ వే, ఎడ్వాంటేజ్ భాజపా!
*