వీరాజీయం

ఎన్నికల అను‘బూతులు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలింగ్ ‘బూతులా’? కావు.. ఎన్నికల్లో వేరే ‘బూతులు’ కూడా కలవు. దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్‌కి మనం అందుకున్నాము. ఇంకా మూడు దశలున్నాయి. పోలింగ్ ముగిసిన రాష్ట్రాల ప్రజలకి, ఇంకా పోలింగ్ జరగని ప్రాంతాల ప్రజలకు తలవాచి పోతోంది. వొళ్లు పులిసిపోతోంది. కొందరికేమో కాలక్షేపం, కొంతమందికి పార్టీల మీద వెర్రి అభిమానంతో చెలరేగిపోతున్న ఇంచుమించు ఉన్మాద దశ. అసలు రుూసారి ఎన్నికలు ఎన్నడూ లేనంత అను‘బూతుల్ని’ కలిగిస్తున్నాయి అన్నాడు- ఐదారు ఎన్నికల సందడిని అనుభవ పూర్వకంగా రుచి చూసి, ఆ జ్ఞాపకాలను నెమరువేస్తున్న సీనియర్ సిటిజన్ ఒకడు.
నాలుగో దశలో 72 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ చాలాచోట్ల హింసాత్మకంగా కొనసాగింది. ఈ 72 స్థానాలు ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో లేవు. మొత్తం 9 రాష్ట్రాలలో 961 మంది అభ్యర్థులు కుమ్ములాడుకుంటున్నారు. అధికారులు భారీ ఏర్పాట్లు చేశామంటున్నప్పటికీ- పోలింగ్ సందర్భంగా అవకతవకలు, అవినీతి అనే గోల తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో కన్నా చాలా స్పీడుగా మమతాదీదీ రాష్ట్రం (బెంగాల్)లో జోరుగా పోలింగ్ సాగింది. ఈ స్పీడు ఎవరికి లాభదాయకమో? అన్న చర్చలు, మీమాంసలు, వాగ్వివాదాలు, గలాటాలు, కలియబడి కొట్టుకోవడాలు ఎక్కువై పోతున్నాయి.
నాలుగో విడత పోలింగ్‌లో- ముంబయిలో ‘‘హాయ్ రే హాయ్‌రే’’ సెక్సీతార, కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ మటోండ్కర్ ఓటు వేసింది. వోటర్ల కన్నా చూపరులు అక్కడ ఎక్కువగా పోగయ్యారు. అజయ్ దేవగన్, కరీనా కపూర్ అన్నట్లు రాఖీసావంత్ కూడ పోలింగ్ చోట వుందండోయ్. అమితాబ్, అమీర్ ఖాన్ సతీసమేతంగా పోలింగ్‌కు రావడం- ప్రేక్షకులకీ, పోలీసులకి కూడా మంచి కాలక్షేపం యిచ్చింది. కానీ, బెంగాల్‌లో ఘర్షణలు రక్తం చిందేలా జరిగాయి. కొట్లాటలు, రాళ్ళు రువ్వడం మాత్రమే కాదు అసభ్య పదజాల ప్రయోగం, యివన్నీ లెఫ్ట్ పార్టీలకి- అధికార పార్టీకి మధ్యకాక భాజాపాకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరగడం గమనించాలి. ప్రధాని మోదీ ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కి ఇంటర్‌వ్యూ యిస్తూ- అందులో భాగంగా మమతాదీదీని బాగా కవ్వించాడు. ఆమె తనకి మిఠాయిలు పంపించిందని అన్నాడు మోదీ. ‘ఈసారి ఆయన నాకు వోట్లు బాగా పంపిస్తాడు..’ అంటూ మమత జవాబు ఇచ్చింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా మోదీ, అమిత్ షా, మాయావతి, సిద్ధూ వంటివారు తీవ్ర పదజాలం వాడారు. అసభ్యత అన్న మాట దీనికి చాలదు. అశ్లీలం, అభ్యంతరకరమైన చెత్త పదజాలంతో- దొంగతనం, రంకుతనం, మోసం, దగా లాంటి చేష్టలనెన్నో ఒకరికినొకరు అంటకట్టుకుంటూ, తిట్టిపోసుకున్నారు. ఎన్నికల అనుభూతులు కాదు. ఎన్నికల అను‘బూతులు’గా యివి మిగిలిపోతున్నాయి.
సోషల్ మీడియా ఈసారి ప్రధాన భూమిక వహిస్తోంది. భాజపా ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని తినుబండారాల కన్నా, శయనాగార సుఖాల కన్నా- వేడివేడి మిర్చి బజ్జీల్లా అమ్ముడుపోయినవి ‘స్మార్ట్ ఫోన్లు’. 90 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో మూడవ భాగం కన్నా ఎక్కువ సంఖ్యలో ఈ ‘అరచేతి స్వర్గాలు’ అనదగ్గ స్మార్ట్ఫోన్లు ముప్ఫయి రెండు కోట్లున్నాయట! ఇరవై నాలుగు గంటలూ సవాలక్ష చానళ్లలోనే కాదు- ప్రెయివేటు ‘‘యూ ట్యూబ్ చానళ్ల’’లో ప్రచారం- వీడియోలు తామరతంపర అయిపోయాయి. ఇదో అత్యవసర ఇండస్ట్రీ అయిపోయింది. మోదీ నిజానికి ‘వెనుకబడిన జాతివాడు కాదు, అగ్రకులం వాడే. వోట్లకోసం అబద్ధమాడాడు’అని బీఎస్పీ నాయకురాలైన మాయావతి అనడంతో అది- ‘వాస్తవమ్ము మాయా బెహన్ మాట’ అన్నట్లు ఊపు అందుకుంది. దీనిమీద చిలువలు పలువలు- సాక్ష్యాలు- సోషల్ మీడియాకి స్క్రిప్టులు రాసి, కథలు రాసి వేషాలు వేసి రకరకాలుగా ప్రచారం చేయగల- గోబెల్స్ జాతి పరంపర తయారయ్యారు, నాలుగురాళ్లు చేసుకుంటున్నారు.
ఎండలు పేలుతున్నాయి అంటే పేలవా? వడగండ్లు పడవా? ఈ అను‘బూతులు’- తిట్టుకవిత్వం- దూషణ దుష్ట ప్రచారవేడి యిదంతా ఈ భూమీద కక్ష తీర్చుకుంటున్నది అన్నదో బామ్మగారు. కరపత్రాలు, పోస్టర్లు, బాకాలు, పాటల కన్నా ఎక్కువగా చానళ్లలో, యూ ట్యూబ్‌ల మీద దిగిపోతున్న ప్రచార ‘దిగజారుడు తనం’ చివరికి ఎన్నికల కమిషన్ మీదకి కూడా మళ్ళింది. ‘ఎన్నికల కోడ్’ని ఎన్నికల సంఘం ప్రభుత్వపరంగా ప్రయోగించటం లేదు అంటున్నారు. మోరల్ కోడ్ కాదు ‘మోదీ కోడ్’ను రుూ ధర్మనిరతి సంఘం అనుసరిస్తున్నదని సర్వే సర్వత్రా ఆరోపణలు.. చివరికి కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం విచారణలో వున్నది. కుర్చీమీద కూర్చున్నప్పుడే మర్యాద. రోడ్డుమీదకు జుబ్బాచేతులు మడిచి ప్రత్యర్థుల మీదికి దూకితే, మోదీ అయినా, అంతకన్నా గొప్పవాడైనా ‘‘బరాబర్’’గా తిట్లు తినాల్సిందే...
చివరికి ‘బయోపిక్‌ల వార్’ కూడా రంజుగా సాగుతోంది. ఈసీ అనగా ఎన్నికల కమిషన్- శేషన్ కాలంలో ఎలా వున్నది? నేడు ఎలా వున్నది? అని అడిగాడో విశే్లషకుడు. ఈసీపై నిందలు, నిష్ఠూరాలు, ఆరోపణలు, కోర్టుకెక్కడాలు ఇదివరకు లేవు. పైగా జడ్జీలపై సందట్లో సడేమియా అన్నట్లు యిదే టైములో భయంకరమైన ఆరోపణలు..! నడక, నడవడిక రెండూ యివాళ బ్యాలెన్స్ తప్పాయి. మిగిలిన మూడు దశల పోలింగ్ ముగిసి, కౌంటింగ్ తేదీ మే 23 ఎప్పుడు వస్తుందో భగవంతుడా? అంతవరకు వెర్రిబాగుల తల్లి భారతమాత- ‘అందరూ నా వాళ్ళే. అన్ని మతాలు జాతులు నావే’ అంటూ మురిసిపోతుంది. ఆమెని, ఆమె సమైక్య హృదయ భావనను, ఆమె త్యాగాలు చేసి సాకారం చేసుకున్న ప్రజాస్వామ్యం అనే కలను సార్థకం చెయ్యి- అంటూ మొర పెట్టడం కన్నా ఏం చెయ్యగలం? ‘నలభై మంది మీ ఎమ్మెల్యేలు నా చేతిలో వున్నారు. ఫలితాలు వెల్లడి కాగానే వాళ్ళంతా నీ పార్టీకి తిలోదకాలు ఇస్తార’ని సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీ అంటున్నారు అంటే ప్రజాప్రతినిధుల్ని కేవలం వేలంపాట సరుకుగా భావిస్తున్నది రుూ దేశం అని తెలియడం లేదా? ఇంత దిగజారుడు ఆది నుంచి అంతం దాకా వున్నది అంటే- నైతిక విలువల గురించి ఎవరు మాట్లాడాలి?
ఓ గాడ్- అల్లా- పరమాత్మా... సేవ్ డెమోక్రసీ!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512