వీరాజీయం

హోర్డింగుల బెడద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా గత ఏడాది మే నెలలోలాగే- రుూసారి కొంచెం ముందుగానే జంట నగరాలపై పిడుగులు-వడగండ్లు కురిపించేస్తూ అకాల వర్షం యమయాతన పెట్టేసింది. పగలంతా ఎండ మండుతూ కాస్తుంది. సాయంకాలం అసలు ఒక వార్నింగూ, ముందస్తు సందడీ సవ్వడీ లేకుండా- మొన్న సోమవారం అకాల వర్షం జనాల్ని పిడుగుల పిడి గుద్దులు గుద్దేసింది.
ఈ వానలకి ముందు మేఘాల మోహరింపూ, దానికి ముందు ఆకాశం మూతి ముడిచేసుకోడం- అలుగుడ్డల్లాంటి మేఘాలు చెట్టాపట్టాలేసుకురావడం- యిది ఒక రివాజు. కానీ మొన్న.. పొంచి వున్న బెబ్బులి లాగా మీద పడి, ఎడాపెడా వడగండ్ల కడగండ్లు తెచ్చేసింది పాడు ‘అకాలం’. నిజానికి రుూ మెఱుపులు, ఆనక పిడుగులు, కుండపోతగా ఓ గంటో, గంటన్నరో జనాల్ని-దొరికిన వాళ్లని దొరికినట్లు బాదేయడం వాళ్లు మొర్రో మొర్రోమంటూ కనబడ్డ ప్రతి ‘షెల్టర్’లోనూ దూరిపోవడం- అక్కడికీ, వానకాస్తా ముదిరి వెంటాడటం- ఇవన్నీ మన తెలుగు ప్రాంతాలలో రెండుచోట్లా- ప్రధాన నగరాలను లక్ష్యంగా పెట్టుకుని- అలాగే పక్కదారంట పోయి గ్రామాలను కూడా తొక్కేయడం- ఎలక్ట్రిక్ స్తంభాలను- ‘‘హిరణ్య కశిపుడరా- నిన్ను ఇరుచుక తింటారా’’ అన్నట్లు కబళించడం జరిగింది.
పల్లెల్లో తాటిచెట్లమీద పిడుగులు పడతాయి అంటారు. అక్కడ జనసమ్మర్ధం అంతగా వుండదు. కానీ మహానగరాల్లో- అందులోనూ అసలు సిసలు పీఠభూమి నగరం- ‘హైదరాబాద్- సికింద్రాబాద్’లో వానదేవుడిని సవాలు చేసే హోర్డింగులు, అడ్వర్‌టైజ్‌మెంట్ ఫ్లెక్సీలు వగైరా- అడుగడుగునా యిలా యిరుక్కుపోయి- ఒకదాన్నొకటి చలికాలంలో ప్రేయసీ ప్రియుల్లాగా వాటేసుకున్నంత సరసంగా నిలబడి బాటసారులను కన్నుగీటి కవ్విస్తూ వుంటాయి. అదే పాయె- పాదచారులకు జన సాంద్రత మధ్య కాస్తంత రిలీఫ్ అనుకుందాం గానీ మోటారుకారు డ్రైవర్లను, పాసింజర్లను, బస్సు డ్రైవర్లను యివి స్పీడుబ్రేకర్ల లాగా అడ్డగిస్తూంటాయి.
మొన్నటి వడగండ్ల పిడుగుల దాడిలో-మరీ అన్యాయం- లాల్‌బహదూర్ స్టేడియమ్‌లోని ఫ్లడ్ లైట్ టవర్ మొదలు నరికిన మహావృక్షంలాగా ధడాలున కూలిపోయింది. ఒక గవర్నమెంటు ఉద్యోగి బలి అయిపోయాడు. సాధారణంగా అంతరిక్ష సౌధాలు వుంటాయి. వీటిలో చారిత్రాత్మకమయినవి వుం టాయి. అలాగే తాజాగా కడుతున్న దొంతర భవనాలు ‘ఆకాశాన్ని తాకుతాం’ అంటున్నట్లు మొండిగా పైకి లేస్తూంటాయి. ఇవీ అవీ కూడా ఓల్డ్.. రుూమధ్య కూలిపోతున్నాయి. ‘ఓల్డ్’ ‘పాతవి’గా వున్నా; ‘న్యూ’-‘బోల్డ్’గా కట్టబడుటలేదు- కావున అవి యివీ గూడా కూలిపోతున్నాయి. ఇది నడుస్తున్న చరిత్ర. కానీ, దానికి అదనం రుూ వానబాదుడు. దానికితోడుగా గాలి విసురుడు, అధ్వానపు రోడ్లు.
ఈమధ్యనే హైకోర్టు కూడా రుూ ‘యాడ్’ల పెర్మనెంట్ నిర్మాణాల మీద- కార్పొరేషన్ నెత్తిమీద అక్షింతలు కూడా చల్లింది. దారి పొడుగునా- ‘హైవే’ల మీద- ట్రాపిక్ సిగ్నల్స్ కన్నా, కవ్వించే అడ్వర్‌టైజ్‌మెంట్‌ల బోర్డులే ఎక్కువగా వున్నాయి. వీటిని తొలగించడం- జన సంరక్షణ చెయ్యడం పురపాలకుల ‘విధి’కాదా? ఈదురు గాలులకి తోడు పలికేది- ‘నిప్పుకు గాలి’అన్నట్లుగా దోహదించేది. మేఘాలను ముద్దాడుతూ ముచ్చట్లు చెప్పే దెయ్యం హోర్డింగులే కదా? రంభా ఊర్వశీ తిలోత్తమా వగైరాలు- నిలబడి అందాల దుస్తులు- కొండకచో చాలీచాలని దుస్తులు ధరించిన సుందరాంగనలు నోరూరించే మనసును ఉల్లాసపరిచే అడ్వర్‌టైజ్‌మెంట్లు- ముఖ్యంగా ‘‘మొబైల్ యాడ్‌లు’’ నగరంలో లెక్కకుమించి కనబడతాయి. చేతిలో వుంటుంది ‘ఒకటి’-కానీ, వెధవ తాపత్రయం ‘బొమ్మ’లో వున్నది కావాలి. ‘లాగేస్తాంది- లాగేస్తాంది నీ జీను ప్యాంటూ’’.. అన్న పాటలాగా దృష్టిని లాగేసుకుంటుందీ- ప్రకటనల జోరు.
మొన్నటి బీభత్సానికి రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ క్రికెట్ స్టేడియమ్‌లో కూడా - ‘‘కేబుల్ టవర్’’ ఒకటి తలవంచింది. అక్కడ ఐ.పి.ఎల్. ఫైనల్సు జరుగుతాయంట- ‘‘వోరి బాబోయ్!’’అని ముందే భయపడుతున్నారు ‘సిటీజనం’. ప్రతి రోడ్డుమీదా తోరణాలు- స్వాగత ప్రచార ఆర్భాటాల ఫ్లెక్సీలు- వామ్మో... ‘‘పిల్లలు కావాలా? (ఐమీన్ సంతానం) అటు చూడుము’’- ఇరవై ఇంటూ అరవై సైజు మొదలు- మూడంతస్థుల భవనం అంతలేసి బ్యానర్‌లు, ప్రకటనల ఫలకాలు, వీటికీ గాలికీ ‘‘చెలగాటం’’ సరదా. జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కృష్ణనగర్, ఎల్.బి.నగర్, నాగోల్ మొదలు హయత్‌నగర్ దాకా, రుూ వాన భీభత్సం ఓ ‘రేవు’ పెట్టేసింది.
‘మెట్రో’ ఎక్కితే అటూ, యిటూ హోర్డింగులే- ప్రచార బోర్డులే దర్శనమిస్తాయి. గాలి వస్తేచాలు యివి ‘మెట్రో’నెత్తిన పడతాయేమోనని భయం.
‘‘ఆమధ్య ఒక స్టూడెంట్ అమ్మాయి మెట్రోలో నిలబడి, కాస్తవంగి- కిటికీలోనుంచి ఎడ్వర్‌టైజ్‌మెంట్ల సౌభాగ్యాన్ని వీక్షిస్తూ, నెత్తిన తన- వ్యానిటీ బ్యాగు పెట్టుకుంది. ‘‘ఏంటమ్మా.. అదీ? వాన పడటం లేదుగా?’’అంటే- ‘‘ఏమోనబ్బా రుూ బోర్డుల దెయ్యాలు నెత్తిన పడతాయేమో’’నంటూ, తన సెన్సాఫ్ హ్యూమర్‌కి తానే నవ్వేసింది.
‘వాన బాదుడు’కీ- ‘గాలి వీచుడు’కీ- ద్విచక్ర వాహన- చోదకులు- వాటిని పక్కన పెట్టేసి- దొరికిన షెడ్‌లోకో, షెల్టర్ లోకో దూరిపోగలరు గానీ, మోటారుకార్ల వాళ్లు? సిటీ బస్సులు? ఇవన్నీ చిక్కులు పడిపోతాయి. ఇందులో జనాలు చిక్కుకుంటారు. ఆ టైములో నెత్తిన పడతాయి ఎలక్ట్రిక్ పోల్స్- మహావృక్షాలు, సరే- రుూ రెండు జన జీవనానికి ‘మస్టు’. కానీ రుూ దిక్కుమాలిన భూతాల్లాంటి హోర్డింగుల మాటేమిటి? ‘‘ముప్పాతిక నగ్న సౌందర్యాలు’’- వాటి డిస్కవుంట్ కవ్వింపులతో వుండే యివి అలా దూరంగా వుంటేనే ఆకర్షణ. కానీ, నెత్తిన పడిపోతున్నాయి. ‘కోకెత్తుకెళ్లింది సుడిగాలీ’’- అంటూ హోర్డింగులు, రేకుల-షెడ్‌ల టొపారాలు లేచి, ఎగిరిపోతూంటే- కింద- ప్రాణాలకీ, ఆస్తులకీ కూడా హడలే! గుండె దడలే!...
ఆదిలాబాదు, కర్నూలు, బెజవాడ, గుడివాడ, రాజమండ్రీ దాకా రుూ వానలూ, గాలి దుమారాలూ రాలేదా? అంటే, అక్కడ రుూ హోర్డింగులూ, ‘నడ పర్వతాలు’ యిన్ని వుండవుగా? జంక్షన్లు అని అక్కడా యిక్కడా-‘చౌరాస్తాలు’, ‘ట్రై రాస్తాలూ’, అంటారు. ఓ విగ్రహంతో దాన్ని అడ్డంగా మూసేస్తూ ‘‘యిలా పట్టుకో గురూ!’’ అన్నట్లు దానిముందు హోర్డింగులు!
‘‘దురదలా? మా ‘గోకింగ్ కింగ్’ స్ప్రేకొట్టండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. హోమ్ డెలివరీ కూడా గలదు.’’ - ఐటమ్ గాళ్స్ యిద్దరు ఒకరి వీపు మరొకరు- నున్నని పాలరాయి చప్టామీద గోక్కున్నట్లు గోకేసుకుంటూ- బొమ్మలు హైదరాబాద్ నగరం మెట్రో వంతెనల క్రింద- అటూ యిటూ స్తంభం అనగా ‘‘పిల్లర్’’లకి ‘యాడ్’ఫ్రేములు పెట్టారు. అబ్బే! వాటికి డిమాండ్ లేదు. దారికడ్డంగా ఉండాలి యాడ్‌లు- టిక్కెట్ కోసం- కదిలే రైలు గేటుకోసం- పరిగెత్తే సిటీబస్ కోసం హడావుడిగా- ప్రమాదదారులంట- హడావుడిగా పరుగులు తీస్తూ వుంటే- దిక్కుమాలిన ‘యాడ్’లు- కొంగట్టుకొని- (అది లేదా? ఏముంటే దానే్న) లేదా, కాలర్ అట్టుకుని లాగేస్తూ వుంటాయి.
నిజమే! మున్సిపల్ కార్పొరేషన్‌కి యిది ఆదాయమే. కానీ, ఒక లైసెన్సు మీద, ఓ హోర్డింగు మాత్రమే ఎంతమంది నిలుపుతున్నారు? ఒక టిక్కెట్ మీద పది మంది దూరిపోగలరా? కానీ, నగరంలో ‘అనాధీకృత’అనగా అన్ ఆథలైజ్డ్ హోర్డింగులు లెక్కకుమించి వున్నాయి. అందుకే, లెక్కపెట్టకుండా వదిలేస్తున్నారు కాబోలు సదరు అధికారులు. ఏ వేలం వెర్రికయినా లిమిట్ వుండాలి. స్పీడ్ బ్రేకర్లుండాలి. సెన్సారుండాలి. చూపరుల చూపులకి గురిపెట్టేముందు- వాళ్ల తలకాయలు పగిలేలాగ మీద పడకుండా ఏర్పాట్లుండాలి. అసలు- నీ అరచేతిలో, నీ జేబులో, నీ యింట్లో, హాల్లో, బజార్లో, శబ్దకాలు ష్యం మరింత చేస్తూ- వెంటాడుతున్న ‘యాడ్’లు, ‘ఆప్’లు చాలవా? ప్రాడెక్టు అమ్ముకోడానికీ? హోర్డింగ్‌లు ఏల?
బ్యాన్ ది డేంజరస్ హోర్డింగ్స్.. ఐ సే..!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512