వీరాజీయం

‘మాయ’దారి ఏనుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం మొత్తం మీద ‘విగ్రహ పుష్టి’ ఎవరికి వున్నదయ్యా అంటే, ఇంకెవరికి..? ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజనుల ఆరాధ్యదేవత మాయావతికే అని ప్రతిపక్ష నాయకులు కూడా ఒప్పుకుంటారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్లు బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు- తనకి తగ్గ లెవెల్‌లో పార్టీ సింబల్‌ని కూడా ఎన్నుకున్నది. ఆమె పర్సనాలిటీకి ‘సూట్’ అయ్యే ‘గజరాజు’ని తన పార్టీకి సింబల్‌గా ఎంచుకున్న మాయావతి ఈమధ్య కాలంలో, అదేపనిగా వోడిపోతోంది గానీ, నాలుగుసార్లు అతి ఘనత వహించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ఆమె ముఖ్యమంత్రిగా చక్రం తిప్పింది.
ఐతే, సరిగ్గా పార్లమెంటు ఎన్నికలు అవతలి తలుపు తట్టుతూండగా- ఈ మహానాయకురాలి తలుపును మరెవ్వరో తట్టారు. లక్నో మహానగరంలో వున్న నూట ముప్ఫై నాలుగు అతి భారీ ఏనుగు బొమ్మల సాక్షిగా ఆమెకి గుండెల్లో రాయిపడ్డది. చాలాసార్లు చెప్పిందామె- రేప్పొద్దున్న నేనీ శరీరాన్ని వదిలిపెట్టి పోయినా- భావితరాలకు నా విగ్రహాలు ‘లైట్ హవుసుల్లా’గా మార్గదర్శకాలు అవుతాయని. ఏనుగు (అనగా కంచు ఏనుగు) లేని పార్కు కూడా ఒక ఉద్యానవనమేనా? బౌద్ధమతంలో కూడా తెల్లఏనుగు అనగా ఐరావతం చాలా ముఖ్యం- పవిత్రమైనదీ కూడాను. ఐరావతం జయప్రదం, శుభప్రదం. బుద్ధ్భగవానుడికి ప్రీతికరం అయిన గజరాజును ఆమె ఎన్నికల గుర్తుగా ఎన్నుకున్నప్పుడే- ‘అయ్యో! మాకెవ్వరికీ ఇలాంటి ఐడియా రాలేదే?’’అని వాపోయిన ప్రజానాయకులు వున్నారు. గానీ ఆమె రాష్టమ్రంతటా తన బొమ్మ పక్కనే ఏనుగు బొమ్మ పెట్టి- మండపాలు, మందిరాలు, కూడళ్లు, పార్కులు, ముఖ్య కార్యాలయాలు వగైరా అన్నిచోట్లా ‘శోభ’నీ ‘షాన్’నీ ఇనుమడింపజేస్తే- కళ్లల్లో కిట్టనివాళ్లు నిప్పులు పోసుకున్నారు.
ఇప్పుడు కాదు. ఎప్పుడో 2009లోనే ఒక కిట్టని లాయరు- రవికిరణ్ నామధేయుడు- నేరుగా సుప్రీం కోర్టుకే పోయి, ఓ ‘పిల్’ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) కొట్టాడు. ‘పిల్’ అంటే మాయావతి లాంటి మహానాయకుల పాలిట కూడా చేదు మాత్రే అవుతుంది. జనహితాన్ని కోరి నేరుగా సుప్రీం కోర్టుకెక్కే అవకాశం ఈ పిటిషన్ కలుగజేస్తుంది. దళితుల మహారాణిగా తనను తాను అభివర్ణించుకునే మాయావతీజీ- ‘తనకీ, ఏనుగులకీ జనుల సొమ్ములు తగలేస్తోంది. మధ్యమధ్య కొన్ని కాన్షీరామ్, అంబేద్కర్ విగ్రహాలు కూడా వున్నా- అధికాంశం తనదీ, తన సింబల్ అయిన గజరాజుదీ బొమ్మల్ని లక్నోలో, నోయిడాలో తెగ నిర్మించేస్తోందని’- ఎందరో విమర్శలు గుప్పించినా, ఆమె ఇంత పిసరు కూడా చలించలేదు.
2009లో మాయావతీజీ కొన్ని కాన్షీరామ్‌ని, మిగతావి, తనవీ- పక్కపక్కనే దూరదూర ప్రాంతానికి కూడా గోచరించే ఏనుగు బొమ్మల్ని తయారు చేయించింది. రవికిరణ్, రమాకాంత్‌లనే యిద్దరు ఆడ్వొకేట్లు- రుూ ‘శోభ’ని తట్టుకోలేకపోయారు. ఒకేసారి కొన్ని డజన్ల విగ్రహాలను ఆవిష్కరించి ప్రపంచ రికార్డుకి ఎక్కాలనుకున్న మాయావతికి ‘కల చెదిరిపోతుంది’- అన్న భయం వేసింది. ప్రజల సొమ్ములే అయినా భూమ్యాకాశాల మధ్య ఠీవీగా నిలబడ్డ కంచు ఏనుగులు ‘వేస్ట్’ అయిపోతాయేమోనని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆమె భయపడ్డది.
‘పిల్’కొట్టారు కిట్టనివాళ్లు. సుప్రీం కోర్టు ‘స్టే’ అంటుందేమోనని, ముందే ఆమె జాగ్రత్తపడ్డది. అసలు 2009 జులై ఏడో తారీఖున తనదీ, ఏనుగుదీ- అక్కడక్కడా మధ్యలో కాన్షీరామ్‌జీ నిలబడ్డదీ, బొమ్మల్ని పెట్టి- లక్నో నగరాన్ని ప్రపంచ రికార్డుల పుస్తకానికి ఎక్కిద్దామని, తాను ఎంతో సద్భుద్ధితో ఉవ్విళ్లూరితే- ఈ చేదు మాత్ర (పిల్) ఏమిటీ? అనుకుంది. అందుకని అదే ఏడాది జూన్ 25వ తేదీనాడే ముఖ్యమంత్రి మాయావతి- మందీ మార్బలం వెంట తీసుకుని ఏనుగు బొమ్మల మీద, తన విగ్రహాల మీదావున్న ముఖమల్ క్లాత్ ముసుగులను లాగేసింది. అతి సున్నితంగా- అశేష బహుజనుల శ్రేయస్సు, రాష్ట్ర యశస్సు కోరుతూ, ఆమె చకచకా కదిలి పదిహేను విగ్రహ మండపాలకి ప్రారంభోత్సవాలను బ్రహ్మాండంగా కానిచ్చేసింది ముందుగానే.
సుప్రీం కోర్టువారు ఒకవేళ ‘స్టే’యిచ్చినా తాను జులైలో చేస్తానని చెప్పిన విగ్రహావిష్కరణల మీద కదా ‘స్టే’యిస్తారు. కానీ, అప్పటికే ఆవిష్కరింపబడి- ‘సెంటర్స్’లో ఆకర్షణగా- ట్రాఫిక్‌లో జనం ఆగి నిలబడి, ముక్కున వేలు వేసుకొని చూసేలా తన విగ్రహాలు, పక్కనే గజరాజులు శోభిస్తూ వుంటే యింకేమి చెయ్యగలదు సుప్రీం కోర్టు? అనుకున్నది.
తన నివాస గృహానికీ ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చుచేయగల ప్రజా‘్ధనపతి’ (‘పత్ని’ అనరాదేమో!) ఆమె! ఐతే, ఆ‘పిల్’ని సుప్రీం కోర్టువారు అప్పుడు డబ్బాలో పదిలంగా పెట్టేరు. తొమ్మిదేళ్ల తర్వాత దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దీనిమీద ఇప్పుడు విచారించింది. ఇంత భారీగా జనుల ఖజానా నుంచి వేల కోట్ల రూపాయల్ని దుబారాగా ఖర్చుచేయడమా? అని కూడా ‘విచారించారు’. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం- రుూ బొమ్మల కేసుమీద విచారించేందుకు కూర్చుంది. మిగతా జడ్జీలు- దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాలు కూడా గోగోయ్ గారితో ఏకీభవించి ‘‘బాబోయ్! యింత చేటు ప్రజాధనం దుర్వినియోగమా?’’అని నెవ్వెరపోయారు. వెర్రీ పిచ్చీ ఎత్తిపోయినట్లు విగ్రహ వ్యామోహంతో తనకితాను కంచుబొమ్మలు బెత్తాయించి దిమ్మల మీద నిలబెట్టి ఆవిష్కరించుకోవడమా? మాయాజీ తన బొమ్మలకీ, ఏనుగుబొమ్మలకీ పెట్టిన రెండువేల కోట్ల రూపాయలు తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమచేయాల్సిందే’ అంటూ బల్లగ్రుద్దారు. కాకపోతే, తుది నిర్ణయం, ఏప్రిల్ రెండో తారీఖున ప్రకటిస్తామన్నారు. (ఇది నిజంగా చచ్చే సస్పెన్స్..!)
మాయాజీది నిబ్బరమయిన గుండే కనుక రుూ దెబ్బని తట్టుకుంది. ‘‘ఏప్రిల్ రెండు లోగా మీడియా వారూ.. సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని చిలవలు పలువలుగా వర్ణించి నన్ను మరింత కుంగదీయకండి’’- అంటూ ‘ట్వీట్స్’ చేసింది. ఈసారి పుట్టిన రోజు వేడుకలు, కానుకలు కూడా లేవు. రెండువేల కోట్ల రూపాయల దాకా- ఆమె వేస్ట్ చేసింది.
అదంతా యిప్పుడు సొంత ఆస్తుల నుంచి ‘కక్కాలి’అంటే పాపం! కష్టం కాదా?.. అంటూ చాలామంది నారీమణులు సానుభూతి చూపెడుతున్నారు. ఒక్కో ఏనుగుకి డెబ్భై లక్షల రూపాయల దాకా ఖర్చుచేసిందామె. అసలు ఇవి నిజానికి ఒక్కోటి ఐదు లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖరీదు చెయ్యవు. ఇదంతా ఒక పెద్ద ‘స్కామ్’ అని అంటారు ప్రతిపక్ష నాయకులు- అఖిలేష్ సహా. అదో అవినీతి కుంభకోణం అని ఆమెమీద దూకడానికి ఎదురుచూస్తోంది ఎదుటి పక్షం. దీనివల్ల నీతి ఒకటి అందరికీ తెల్సింది- ‘నీ బొమ్మను నువ్వు బతికి వుండగా పెట్టుకోకు- అదీ.. సర్కారు సొమ్ముతో.’
లెట్ దిస్ బీ ఏన్ ఐ ఓపెనర్ టు ఆల్..!

92900 99512