వీరాజీయం

‘విరాట్’పర్వంలో వాటర్లూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టులు, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీలలో అన్నింటా అత్యుత్తమ నాయకుడు అవార్డులు 2015లో గెల్చి - ‘క్రికెట్ సమ్రాట్ విరాట్’ అంటూ జేజేలు అందుకున్న - విరాట్ కోహ్లీకి ‘గుండెలలో గునపాలే గ్రుచ్చారే నీ వాళ్లు’ అన్నట్లు 2018 సంక్రాంతి కాంతి విహీనమైపోయింది. గ్రహణం పట్టిన సూర్యుడైపోయింది. ‘అరివీర భయంకర్ అర్జున్’లాంటిది మా ఇండియన్ టీము అన్నాం - మొత్తం కవచ కుండలాలు దానం చేసిన కర్ణుడు మాదిరి అయిపోయింది. తమ మాజీ ‘క్యాపటన్’తో సమానంగా రికార్డు అవార్డులు నిన్ననే అందుకున్న విరాట్ - నెపోలియన్ బోనాపార్టీ లెవెల్లో-2015 నుంచి మొన్నటిదాకా ఇరవై ఒక్క మ్యాచ్‌లు గెలిచినా - దక్షిణాఫ్రికాలో అతని కోసం ‘వాటర్లూ’ పొంచి ఉంటుందని ఊహించలేకపోయాం - అంటూ అభిమానులు కలత చెందుతున్నారు. వర్సగ్గా.. తొమ్మిది సిరీస్ గెల్చినా - మొన్నటి రెండు ఓటములు ఇండియన్ క్రికెట్ ప్రతిష్ఠ ముక్కు కోసేశాయ్.. అంటున్నారంతా.. ముందునుంచి అక్కడ ద.ఆ.లో స్థితి భయంకరంగా వుంటుందని తెలిసినా - నాయకుడు, కోచ్ కూడా టీంని సమాయత్తం చెయ్యలేకపోయారనే అంటారు కానీ ఒక్కమాట - వంటినిండా రికార్డుల పతకాలే ధరించి - బరిలోకి దిగిన టాప్ ఆర్డర్ ‘బ్యాట్-వీరులు - పెద్దపులిలా గాండ్రించడం మరచిపోయి పిల్లికూనలైపోయారెందుకని? - కొత్తకుర్రాడు ఇరవై రెండేళ్ల బచ్చా - ‘లుంగీఎంజిడి’ - బంతులు విసురుతూ వుంటే... - ఓ యువ అభిమాని చెప్పాడు - ‘సార్, షారుక్‌ఖాన్ తీసిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోని లుంగీ డ్యాన్సు చూశారుగా-అలాగ ‘లుంగీ’ డ్యాన్సు చేసి పెవిలియన్‌కి పారిపోయారు సార్ మనోళ్లు అన్నాడు - రాబాడా లుంగీలు ఇండియన్ టీముని పచ్చడి చేసేశారు. నిజమే 34 ఏండ్ల తరువాత పరమచెత్త రికార్డు సంపాదించారు. ప్రపంచంలోనే నంబర్‌వన్ టెస్టు టీము మనది అలాంటిది నెంబర్ 2 చేతిలో - విలవిలలాడిపోవడం దారుణమే అన్నారంతా. పోరాడి ఓడితే అది ఒక పద్ధతి. అల్లాంటి ‘శీను’ ఏదీ అక్కడ - తొలిటెస్టులో విరాట్ సాధించిన ‘సెంచురీన్నర’ పరుగులు తప్ప - కానరాలేదు. అందరూ నెంబర్ ‘నైన్’ ‘టెన్’ ఆటగాళ్లలాగ - అవుట్‌సైడ్ ది ఆఫ్ స్టంప్ మీదుగా స్లిప్పులోకి పోతున్న బంతుల్ని వెంటాడారు. తొలి టెస్టులో 92 పరుగులకే ఏడు వికెట్లు పోగొట్టుకున్న ఇండియన్స్ - మలి టెస్టులో - ఏడు వికెట్ల నష్టానికి 82 పరుగులు మాత్రమే చేశారు. నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లు రెండో టెస్టులో ఇంకా నాసిగా బ్యాటింగ్ చేసింది టీం... సునీల్ గవాస్కర్ మొదట టెస్టు అవంగానే - ‘అశ్విన్ నీ బౌలింగు ఓకే, కానీ బ్యాటింగులో బంతుల్ని వెంటాడుతున్నావ్ ‘టేక్కేర్’ అని రాసినా - పాండ్యకి బాధ్యతాయుతమయిన బుర్ర అవసరం అని మాజీలంతా చెప్పినా - తోక బెటరు అనిపించేలాగా బ్యాటింగ్ చేశారు - గ్రేట్ పుజారాకి కొత్త రికార్డు వచ్చింది. అదేమిటి అనుకుంటున్నారా? రెండు రన్నౌట్లు సాధించాడు. ప్రపంచంలోనే జిడ్డు ఆటకి పేరుగాంచిన మన ఆట అవసరమొచ్చినప్పుడు - ‘జిడ్డు’ కాదు అనుకోవాలి. రెండో ఇన్నింగ్సు చివరిలో మహమ్మద్ శమీ దక్షిణాఫ్రికా బౌలింగుని తీసి పారేశాడు - కానీ వనే్డ ఆటగా ఆడారు మనవాళ్లు - గెలుపు అసాధ్యం - డ్రా చేయడానికి తలవొంచి ప్రతీ బంతినీ అది ‘లూజుబాల్’ అయ్యేదాకా నొక్కుకుంటూ పోతే, మ్యాచ్ డ్రా అయ్యేది - థర్డ్ టెస్ట్‌కి జనాలు వచ్చేవారు. ఇండియా అంటేనే స్పిన్ మాంత్రికుల దేశం - అటొకడు ఇటొకడు - అశ్విన్ జడేజాలు తగుల్కుంటే - కేవలం ఫాస్ట్ బంతులకే అలవాటుపడ్డ ప్రత్యర్థులు సుడులు తిరిగి వికెట్లు పారేసుకునేవాళ్లు.. కానీ వాళ్లు నలుగురు ‘స్పీడ్‌గాళ్ల’ని వేసుకుంటే మనకీ వున్నారు నలుగురు - అని స్నిన్నర్ని అయిష్టంగా వేసుకుంటే?.. క్యా బాత్ హై? కామెంటేటర్లు - ‘బాబూ నీకో స్పిన్నరున్నాడ్రా!’ అని గోలెట్టేదాకా - నీ బవులర్ల స్పీడుకి నువ్వే మురిసిపోతే? - మొట్టమొదటి పది ఓవర్లలోనే ‘మూడ్’ వికెట్లు పోగొట్టుకున్న ప్రత్యర్థులు పుంజుకోరా? అంట. వాళ్లు శ్రీలంక నుంచి జింబాబ్వే నుంచి రాలేదు - విరాట్ గెలుపుల వీరుడు అనుభవం 2015 నుంచి 21 సార్లు గెలుపు - హుర్రే అందుకున్నవాడు కోహ్లి. తన టీముకి చెప్పాలి అబ్బాయ్, అక్కడికి వెళ్లి క్రీజుకి అతుక్కుపోవాలి - డ్రా చెయ్యాలి మనం - ఇది టెస్టు మ్యాచ్ - రోజంతా వుంది - ఎంత హిడింబాసురులైనా ఫాస్ట్ బౌలర్లు అలసిపోతారు. అప్పుడు.. మనం బ్యాట్ ఝళిపించాలి అని చెప్పాల్సిన బాధ్యత క్యాప్టన్,కోచ్‌లది - పైగా టీమంతా ద్రోణాచార్యులే.. కాని, రాబడా, ‘మార్కెల్’ కూడా చేతిలో బంతిని మొహం పగిలేలాగా సంధించారు. ఇండియాలో - బంగళూరు మోహాలీ కలకత్తాలు పెద్ద స్కోరులకి - బౌలర్ల పాలిట శాపాల్లాంటి గ్రౌండ్లు చాలా వున్నాయి. కాని దక్షిణాఫ్రికా - పిచ్ - విసుర్లకి, బౌన్సర్లకి, ఇన్‌స్వింగుకీ పెట్టింది పేరు.
విజయుడయిన నాయకుడు కోహ్లీకన్నా ఎక్కువ ‘హైప్’ ఇచ్చి - ‘వీరపాండ్యా’ అంటూ మునగ చెట్టెక్కించి - ఈ కుర్రాడే మన రక్షకుడు - అన్నట్టు హార్దిక్‌ని పంపడం - ఆచితూచి ఆడడం అలవాటులేని కుర్రవాణ్ని నమ్ముకోడం - ఫాస్ట్ బౌలర్స్ అలిసిపోయే దాకా స్పిన్నర్ని రంగంలోకి దించకపోడం - క్యాచ్‌లు డ్రాప్ చెయ్యడం ఇవన్నీ - సీనియర్లు గవాస్కర్ ద్రావిడ్, సెహ్వాగ్లు గమనించి హెచ్చరించారు. ధోనీతో సమానంగా రికార్డు సాధించి అందరి ముద్దుమురిపాలు అందుకున్న విరాట్‌కి - ఈ ఏడాది ఆరంభమే బాగాలేదు. పాపం జరిమానా డిమెరిట్ పత్రం కూడా అందుకున్నాడు - హిమాలయ శిఖరాగ్రంనుంచి కన్యాకుమారికి జారిపోయినట్లు.. అందుకే అంటారు.. పెద్దలమాట సద్దిమూట అని.. తన కోపమే తన శత్రువు కాకపోవచ్చును చాలాసార్లు - కాని ‘‘తన గర్వమే తన శత్రువు’ అన్నది మన ఇండియన్ టీముకు వర్తిస్తుంది - ‘‘డెత్ ఓవర్ల’’లో బాదుడు బాదే కుర్రాడా? రాహుల్స్ రోహనాలు చటేశ్వర్లు ధవన్లు రోహిత్‌లు వీళ్లు చతికిల బడటానికి వెళ్లారు? అసలు డే-యిల్‌స్టేయిన్‌కి దెబ్బ తగిలితే, మరో కుర్రాడు లుంగీ రంగంలోకి వచ్చాడు. మనవాళ్లు ఒకడు కాకపోతే మరొకడయినా - క్రీజులో పాతుకుపోయి ఓటమిని తప్పించేవాళ్లు ఇదివరకు ప్చ్.. ఆ ‘ఎరా’ పోయింది అంతేనా? ఈసారి అవగాహన, ఓర్పుకూడా పోయాయి. అయితే గెలిస్తే నాయకుడే జేజేలు అందుకున్నట్లే - ఓటమికి అతనినే బాధ్యుణ్ని చేస్తారు. అది సహజం. సునీల్ గవాస్కర్ అంతటివాడు - ధోనీ టీములో వుండే ఇప్పుడు బాగుండునేమో అనేశాడు. కెప్టెన్‌గా కాకపోయినా విక్కెట్కీపర్‌గా ఉన్ననూ చాలు - అనడం సునీల్‌కే చెల్లు. ఇంకా మొన్ననేగా లక్ష్మణ్ - నేరుగానే ధోనీని నిందించాడు. కుర్రాళ్లకే అవకాశం ఇచ్చి ధోనీ.. నువ్వు తప్పుకోవాలని అన్నాడు. అదిసరే, బాట్స్మన్‌కి కూడా ఓ జరిమానా ఓ మెమోలాంటివి వుండాలి - ఏడాది చివర కోట్లకొలది రూపాయలు అందుకునే వీరులు - ‘నామ్ బడా దర్శన్ తోడా’ అంటే ‘ఏనుగు డ్యాష్’’ అన్నట్లు ఆయితే - మందలింపు వద్దా? క్యాష్ రూపంలో శిక్ష వుండాలి అని ఎందరో అంటున్నారు. మెడికల్ ఎక్స్పర్టుల్లాగా, ఫీల్డింగుకి ఓ కోచ్, బ్యాట్టింగుకి మరొకడు, స్పిన్నోడు, స్పీడ్‌కొకడు, కర్రపెత్తనానికి ఇంకోడు... మళ్లీ ఇంతమంది వున్నా స్లిప్స్‌లో క్యాచ్‌లు డ్రాప్ ... లోకంలో ఓ అపవాదు వుంది. ఇండియాలో జనాలు స్పిన్ బౌలింగుని ఎంతో ఇదిగా ఎంతసేపైనా అలా ఓపిగ్గా తిలకిస్తారని (జిడ్డుగాళ్లనా) కానీ అదే మరచిపోయాం..
సరే, అద్భుతమైన - ఎదురులేని విజయాల సిరీస్ - జేగీయమానంగా సాగి - విరాట్ వివాహం కూడా క్రికెట్ పండుగగా సాగింది. ఆ గొప్ప అధ్యాయం దురదృష్టవశాత్తు ముగిసింది. కాని మనవాళ్ల పర్యటన ఇంకా చాలా వుంది. అందుకే ఈ పోస్టుమార్టం అవసరమయింది. విరాట్ టీముకి ఇది ఒక స్పీడ్‌బ్రేకర్ మాత్రమే కావాలని ఆకాంక్ష..
ది గ్రేట్ సోలెస్ ఈస్ స్టిల్ వుయ్ ఆర్ ‘నం వన్ టెస్ట్ టీం’ ఇన్ ది వరల్డ్!

veeraji.columnist@gmail.com