వీరాజీయం

జైలు కష్టాలు.. లాలూ విన్నపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముక్కు కోస్తూ వుంటే రక్తం తాగే మొండి ఘటాలు మనకి సామెతల్లోనే కానవస్తారు అనుకోకండి- ఇలలో కూడా వుంటారు. శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్- బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్‌జెడి చీఫ్‌కి మూడున్నర ఏండ్ల జైలుశిక్ష- పది లక్షల జరిమానా పడగానే కథ ముగియలేదు. ఇంకా రెండు కేసులు ఉన్నాయి.. ఎప్పుడో ఇరవై ఏండ్లనాడు తినేసిన పశుగ్రాస నిధుల గురించి ఇవాళ బాధ ఏముంటుంది? అరిగిపోయేయిగా.. ఆ తరువాత కేసుదారిది దానిదే- ‘మహానాయకుల’కు జీవితంలో దూషణ భూషణ తిరస్కారాదులు పరిగణనలోనికి రావు. జయిలైనా బెయిలయినా- వాళ్లు కర్తవ్యమ్ వదిలిపోరు. తనను నమ్ముకున్న పార్టీ- దాని అనుయాయులు వీళ్లే లాలూజీకి ప్రజలు. వాళ్లు తమ నాయకుడు జైల్లో పడ్డా ‘చెడ్డవాడు’ కాడు పడ్డవాడే అని, ఆఫ్టరాల్ తిన్నది పశుగ్రాస నిధులే కదా? మా పాలిట మా యాదవుడు శ్రీకృష్ణుడే అనుకుంటున్నారుట. ఈమాటే శ్రీమాన్ జడ్జిగారికి చతురలు చమత్కారాలు చేర్చి పేర్చి మరీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగుకి చెప్పడానికి ప్రయత్నించాడు- నన్ను గనుక ఓపెన్ జైల్లో పెడితే జన హత్యలయిపోతాయ్ అన్నాడు. అని మొన్న గురువారం ఖైదీగానే- రెండో కేసులో విచారణకి రాంచి ప్రత్యేక కోర్టుకి తీసుకొని రాబడిన లల్లూజీ జడ్జి శివ పాల సింగుకి ‘్ధమకీ’ కూడా ఇచ్చాడు. ఈనెల మొదటివారంలో మూడు వాయిదాల అనంతరం సిబిఐ ప్రత్యేక కోర్టు - ఈ జన ప్రియ పశుపాలక నాయకుడికి మూడున్నర సంవత్సరాల ఖైదు- పది లక్షల రూపాయల జరిమానా విధించింది. అక్షరాల 89 లక్షల 27 వేల రూపాయలు కైంకర్యం చేసిన డుమ్కా నేరంలో- ఈసారి తీర్పు - దీని మీద కూడా మన మహానాయకుడు స్పందిస్తూ ఏమి సామి? మూడు ఏండ్ల కన్నా తక్కువ శిక్ష వెయ్యలేకపోయావా? నేరుగా బెయిలు తెచ్చుకొనేవాణ్ణిగా అన్నాడు. న్యాయమూర్తికి అప్పటికే బెదిరింపులు అందుతున్నాయి అని గోలెట్టేస్తున్నాడు. కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రదర్శించి - ‘లాలూజీ మీకు ఆరుబయలు జైలుశిక్ష వేశానుగా’ అన్నాడు- అంతేనా? పుండుమీద కారం జల్లినట్లు అక్కడ అయితే మీరు పశువుల్ని సాకుతూ కాలక్షేపం చెయ్యవచ్చు అన్నాడు. మండిపోయింది- ఇంకా నయం- పేడ పిడకలు పెట్టుకొమ్మన్నావ్ కాదు- అంటూ గొణిగాడు సారు.
‘‘పోయినసారి జనవరి ఆరు సంగతి నేను చెబుతూ వుంట.. ఎలా వుంది? మీ యొక్క జైలు సెల్?’’ అంటూ భోగట్టా చేశాడు జడ్జిగారు. నా బొందలాగా వుంది.. చలి వేస్తోంది సార్ అన్నాడు డెబ్బైలో అడుగుపెట్టిన మాజీ సిఎం- ఫోనులో ఈపాటికే బెదిరింపులకు గురి అయిన జడ్జిగారికి వొళ్లు మండిపోయింది. తబలా వాయించుకో సామీ అన్నాడు. లల్లూకి తెల్సిపోయింది- ఇదంతా తన శత్రువు నితీష్‌కుమార్ కుట్ర అనుకున్నాడు. కొడుకు తేజేస్వర్‌కి కబురెట్టాడు- ‘హైకోర్టులో పిటిషన్ పడీ’’ బాబ్జీ అని- నిజానికి, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌మీద వున్నాడు శ్రీమాన్- ‘మా జనం తిరగబడతారేమో? నాన్న భయం కానీ, లేకపోతే ఓపెన్ ఎయిర్ జైలైనా ఖుషీయే సాబ్’ అన్నాడు. అతను అన్నది నిజమే- ఓ ఇద్దరు అనుయాయులు లక్ష్మణ్ యాదవ్, మాధవ్ యాదవ్ అనే వాళ్లు తమ ప్రియ నాయకుడికి జైలులో కమ్మగా వండి పెట్టడానికి- కాళ్లు పట్టడానికి - చోరీ కేసు, దౌర్జన్యం కేసు రెండూ అర్జెంటుగా తమపై పెట్టించుకొని బిర్సాముండాకి నేరుగా పెట్టే బేడా పట్టుకుని వచ్చేశారు. అదండీ సామిభక్తి కాని, పోలీసులు మరోసారి దర్యాప్తు చేసి దొంగ వెధవల్లారా!.. ఉత్తుత్త కేసులు బనాయించుకుంటారురా అంటూ బెయిలు ఇప్పించి పంపించేశారు.. ఆ ఇద్దరు పరారీలో ఉన్నారుట.. అదే మరి- లాలూగారి మహిమ. తనకి, లోగడ ఓ గెస్టుహౌసుని జెయిలుగా మార్చి ఇచ్చారు. ఇప్పుడూ అలాంటిదే ఇస్తారేమో అనుకున్నాడు. శివపాల్ సింగుగారు మరీ ‘కర్కోటకుడు’. నేరుగా లల్లూజీని ‘ఫేసు’ చెయ్యలేక వీడియో కాన్ఫరెన్సు పెట్టి శిక్ష చెప్పేశాడు (ఔరా?).
మరి, మొన్న గురువారం అదే జడ్జీగారు రెండో కేసు విచారిస్తూ నేరుగా తన ఎదుట బోనులో నిలబడ్డ అపర గోపాలకృష్ణమూర్తిని- ఎలా వుంది సార్! మీ ప్రస్తుత ఖైదు సెల్ అంటూ పరామర్శించాడు. తొణకలేదు బెణకలేదు. వెనుకటికి జైలునుంచే పిడకలు మాత్రం పెట్టనేర్చిన శ్రీమతి రాబ్డీదేవిని గద్దెమీద కూర్చుండబెట్టి పరిపాలనా చక్రం తిప్పిన ‘మహానాయకుడు’. లాలూ మహాశయుడు - శివపాల్‌సింగ్ గారి స్పెషల్ కోర్టులో గొప్ప డ్రామా ప్రదర్శించాడు. నేనుకూడా శిక్షణ పొందిన లాయర్నే అన్నాడు. సరదాగా కనబడ్డాడు. జోకులు కట్ చేశాడు. ‘నాకు రెండున్నర ఏండ్ల శిక్షే వెయ్యకూడదా? ఈ డుమ్కా కేసులోనైనా.. లేదా, నా ప్రజలు ఎడబాటు తట్టుకోలేరు అన్నట్లుగా మాట్లాడాడు. ‘జైల్లో వాళ్లు నన్ను ఫ్రీగా తిరగనియ్యడంలేదు సార్?’ అంటూ ఫిర్యాదు చేశాడు. విలన్లు అయినా హీరోలయినా ఇలాంటి జన ప్రియులకి నాలిక చివర సంభాషణ చాతుర్యం వుంటుంది అంటారు ఇదేనేమో? ‘నాకు ఓపెన్ జైలు వద్దండీ’ అన్నాడు. ఈ ఆరుబయలు జైలు హజారాబాగ్‌లో రాంచికి వంద మైళ్ల దూరంలో వుంది. వంద కాటేజీలు కట్టారు. లోగడ 2013లో ‘బాగుపడతాం జనంలో కొస్తాం అన్న నక్సలైట్ల కోసం వీటిని నిర్మించారు. ఇక్కడైతే జైలులో అయితే చెప్పాడు జడ్జిగారు- మీరు జైలు బుక్ ప్రకారం నడుచుకోవాలి- అక్కడయితే హాయిగా పశువులు పాడీ వున్నాయి- మీరు మీ అనుయాయులు పశుదాణా, జంతువుకు కావాల్సిన మందులు వగైరా గురించి తెలిసినవాళ్లు కనుక - అక్కడికి పంపిస్తున్నా- ఇంచక్కా డెయిరీ ఫార్మ్ వుంది, పాలు పిండి పంపండి అన్నాడు న్యాయమూర్తి. అరవై ఐదు పైబడ్డ వాళ్లని వాళ్ల ఇష్టం లేకుండా అక్కడికి పంపరాదు కదా? సర్! అని లా పాయింటు లాగాడు మాజీ ముఖ్యమంత్రి. ‘హాయిగా సకుటుంబంగా కూడా వుండవచ్చు సామీ!’ అన్నాడు జడ్జి. ‘అది నక్సలైట్లకోసం కదా కట్టారు. నేను అక్కడ వుంటే రిస్కు వుంది- జనాలు వచ్చి పడిపోతారు- అదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్’ అన్నట్లు హెచ్చరించాడు ఖైదీ. మరేం ఫర్వాలేదు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం- ఇరవైవేలమంది సిబ్బంది వున్నారు. మీ జనాల్ని గోడ అవతల నుంచే మిమ్మల్ని చూడనిస్తారు. హాయ్! అంటూ చెయ్యి ఊపవచ్చు అంతే- ఖైదీలంతా సకుటుంబంగా వుంటున్నారు అక్కడ అన్నాడు జడ్జి.
‘‘మీ ఇరవై వేల సెక్యూరిటీ పోలీసులు చాలరు సామీ!’’ అన్నాడు. మొండివాడు రాజుకన్నా బలవంతుడు అంటే ఇదే. న్యాయమూర్తి ఇరవై నాలుగుకి వాయిదా వేశాడు. ఈసారికూడా బహుశా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తీర్పు చెబుతాడేమో? శివపాల్ సింగ్జీ- అది అలా వుండగా లాలూజీకి అతని పార్టీకి పోయినసారి గ్రాండ్ అలయెన్స్‌లో 178లో 80 సీట్లు వచ్చాయి. జెడియుకి 71 మాత్రమే వచ్చాయి. ఇవాళ ఆ పార్టీలు విడిపోయాయి. అయినా జనాలలో లాలూజీ ఆకర్షణ పడిపోతుంది అని చెప్పడం కష్టం అంటున్నారు పరిశీలకులు. ఇంకా, అప్పీల్ పర్వం- విచారణ జాప్యం వగైరా చాలా కథ వుంది. టు జి స్కాం రాజా- తాజాగా ఓ పుస్తకం రాశాడు. త్వరలో విడుదల కాబోతున్నది. అలాగే జైలులో వున్న లాలూజీ తన అనుభవాల్ని ప్రోది చేసి ఓ బుక్ రాయొచ్చు.. లేదా ఓపెన్ జైల్లో అయితే ‘‘మీ దుంపలు తెగ మీ వల్లనే నేను జైలు పాలయ్యాను’’ అని - ఓపెన్ జైలులో పాలు పితుకుతూ వున్నప్పుడు తిట్టుకుంటూ అక్కడ నుంచే చక్రం తిప్పే ప్రయత్నం చేయొచ్చును.
- టూ ఎర్లీ టు వర్కౌట్ హిజ్ ఇంపాక్ట్ ఆన్ 2019

veeraji.columnist@gmail.com