వీరాజీయం

నితీశ్ ‘కిస్సా కుర్సీకా’ సుఖాంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతాదళ్ యునైటెడ్- అంటే ఎవరితోనో ఒకరితో లేదా ఏ ఇద్దరితోనో యునైటెడ్ ముఖ్యమంత్రి కుర్చీలో ఆశీనుడవడం అన్నమాట! బీహార్ మహాఘట్బంధన్ మూడు ముక్కలైపోయింది. పాపం చితికిపోయింది కాంగ్రెస్సు ముక్కే- ఎన్నికలకి ముందు ఒప్పందం ప్రకారం తన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా లాలూ యాదవ్- ‘‘నేను మాటకి కట్టుబడి నితీష్ భయ్యానే ముఖ్యమంత్రి గద్దెమీద కూచోబెట్టాను’’ అంటూ దెప్పిపొడుస్తూనే కొడుకులకి కుచ్చు కుర్చీలు వేయించుకున్నాడు. చినకొడుకు పేరే ‘తేజస్వి’ గనుక ఉప ముఖ్యమంత్రి పదవి అతనికోసం లాక్కున్నాడు. నితీశ్‌కుమార్‌కి లాలూ కుటుంబమే పాపం ‘కడుపులో బల్లలాగా’ అయిపోయింది.
ఇంచుమించు లాలూప్రసాద్- అతని వర్గమూ నీ కుర్చీ మా దయాధర్మభిక్ష అన్నట్లు తనని తృణీకరిస్తూవుంటే- నితీష్‌కి సెగలోనుంచి పొగలోకి వచ్చానా? అనిపించింది. మద్యనిషేధం విషయంలోనే విచిత్ర మిత్రులు ఇద్దరిమధ్య ఛిద్రమొచ్చింది. లల్లూజీప్రసాద్‌కి తెల్సును- తానూ జెయిలులో ఉండటానికి బదులు బెయిలుమీద ఉండటమే గొప్ప. అంచేత చాలా చాకచక్యంగా పావులు కదుపుతూ వచ్చాడు. రాజకీయ చదరంగంలో ఎవరికి ఎవరూ ఏమీ కారు, ఎంతవరకో బంధం అంతవరకే.. ఎవరి ఎత్తుగడలు వారికి వుండాల్సిందే. అందుకే, ముందు ఎత్తు నితీష్ వేశాడు. తేజస్వి నిస్తేజుడైపోయి మూడు రోజుల వ్యవధిలో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దొర్లిపడిపోయి ప్రతిపక్షంలో నిరాయుధుడిగా నిలబడిపోయాడు. దేశమంతా, బీహార్ అసెంబ్లీ రణరంగమై పోయి నెత్తురోడుతుంది అనుకున్నారు. కానీ రెండుసార్లు మూజువాణీ ఓటుతో నితీష్- సుశీల్మోడీలు పెట్టుకున్న విశ్వాస తీర్మానం మీద అవసరమయినదానికన్నా ఎనిమిది వోట్లు ఎక్కువ సంపాదించుకున్నది భాజపా జెడి-యు ఘట్బంధన్. ప్రత్యక్ష ప్రసారం లేదు. కుర్చీలు బల్లలు విరిగిపోలేదు. ఆఖరి యత్నంగా ఆర్‌జెడి హైకోర్టుకు స్టేకోసం వెళ్లి భంగపడ్డది. కేసు అందుకున్నది కోర్టు అంతే ఊరట.. ఊరిమీద వూరు పడ్డా కారణం మీద కాసు పడలేదని- రాజీనామా చేసిన పధ్నాలుగు గంటలలోపే, కొత్త భాగస్వామి పార్టీకి చెందిన- అంటే భాజపాకి చెందిన సుశీల్మోడిని ఉపముఖ్యమంత్రిగా పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు గడుసు నితీష్. ఇదంతా ‘ఆమ్ఫాట్’ అంటే అయిపోయినట్లు అయిపోయిందా? లేదు అనుకున్నాడు వెర్రివాడు. కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరిచినప్పుడే లాలూ యాదవ్ - నువ్వు శత్రు శిబిరంలో చేరిపోయావు అంటూ బంధన్‌కి రామ్ రాం కొట్టాల్సింది గాని అప్పటికే తనమీద తన కుటుంబం యావన్మంది మీద సిబిఐ దండయాత్ర చేసేసి- మిగిలిన కొమ్ములు కోరలు పీకేసిందే.
నితీష్ నరేంద్రమోడి మీద ధ్వజమెత్తి- బయటికి వచ్చినవాడు- మరో సారి కూడా తానే ముఖ్యమంత్రి అన్నమాట దక్కించుకున్నాడు కాని యాదవ్ ప్రసాద్ కుటుంబానికి అవినీతి రొంపిలో (కేసుల) నుంచి బయటకి లాగడానికి- గచ్చ పిక్కలు తీసే పిల్లిలాగా ఉపయోగపడటానికి కాదు అని నిరూపించుకున్నాడు. ‘‘నాకంటే రాజకీయం తెల్సిన మొనగాడు లేడు- ఘోటాల కేసులు ఎదుర్కోడంలో నేను ఎక్స్‌పర్టుని అంటూ బోర విరుచుకుని మీడియాకెక్కి మోదీని వీరబాదుడు బాదేస్తాను అన్న లల్లూజీ- కేంద్రంలో వున్నది నంగిరిపింగిరి వెర్రిబాగుల కాంగ్రెస్ గవర్నమెంటు కాదు అని- నమో ప్రభుత్వం తీరు వేరు అని గ్రహించాడు. తిరగబడ్డ నితీష్ చేతనే ‘నమో నమో’ అనిపించుకోగల పొలిటికల్ ఖిలాడి ప్రభుత్వం అని ఆలస్యంగా గ్రహించాడు ఆర్జెడి బాస్.
కాంగ్రెస్‌ను నమ్ముకుని వీళ్లకి వచ్చిన నలభై సీట్ల బలంతోనే 2019లో ప్రతిపక్ష కూటమి కట్టాలని అనుకున్నవాళ్ళు అమాయకులు.
నితీష్‌కి ఆత్మరక్షణ కావాలి పదవి కావాలి అంటే - అది కాంగ్రెస్ ఇవ్వలేదని ఈ తేజస్వి కేసులోనే తెలిసిపోయింది. ‘నాకు ముందే తెలుసు’ అన్నాడు శ్రీమాన్ రాహుల్ గాంధీజీ- ‘‘తిరిగి పాతగూటికే పోతాడు నితీష్’’ అని. ఔను, నితీష్ రాహుల్‌ని కలిసి తేజస్వి ఉదంతం నా పీకకి ఉచ్చులాగా తగుల్కున్నది అని మొరబెట్టుకున్నాడుట. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లు - కాంగ్రెస్ నాయకత్వం- మొహం చాటుచేసుకున్నది. ఇది రాజకీయం. ఇక్కడ నీతి శతకాలు- పాప పుణ్యాలు లాంటి కబుర్లు చెప్పుకోవడం కనీసం ఏడు దశాబ్దాల అనుభవం వున్నవాళ్ళు అయినా మానెయ్యాలి- వీలయితే ఛాతిపోటు లేదా వెన్నుపోటు. ఇదే రాజ్(కీయ)నీతి. ఎన్నికల సమయంలో అయితే వోటర్లకి చెప్పుకోవచ్చు- ఇలాంటప్పుడు గోడకి చెప్పుకోవాలి. నమో లెవెల్‌కి తగ్గ బుర్ర లేదని- అమిత్‌షా లాంటి చెయ్యి కూడా లేదని ప్రతిపక్షాలు ఎప్పుడు గ్రహిస్తాయి?
మోదీజీ విదేశాలలో హమేషా ‘్ధనరు’ లేపేసే ఉపన్యాసాలు చేస్తూనే బిజీగా ఉంటాడు కాని ఇక్కడ దేశంలో ఎవడి తోక ఎలాగా కత్తిరించాలి అన్నది అతనికి తెలుస్తూనే ఉంటుంది. గోవా విషయంలో మణిపూరు విషయంలో జరిగినదేమిటి? రక్షణ శాఖని చక్కగా నిర్వహిస్తున్న వాడిని (మనోహర్ పారికర్ని)గోవాకి తోలేశాడు. తిమ్మిని బమ్మిని చేసి గోవాని హస్తగతం చేసుకోలేదా? అక్కడికి కాంగ్రెస్ తరఫున వెళ్లింది ఎవరు? శల్యసారథ్యం చేసే వాళ్లని రీప్లేసు చేసుకోలేని నాయకుడువున్న కాంపాకి కనీసం లల్లూజీమీద భరోసా లేదు. నీ కొడుకుని ముందు రిజైను చేయించు ఆనక వెనకనుంచి తెద్దాం అని చెప్పి ఏదో విధంగా మహాఘట్‌బంధన్‌ని కాపాడగలిగితే నీ నాయకత్వానికి విలువ ఎవ్వరైనా ఇస్తారు?
మోదీజీ నితీష్‌కి వెంటనే ‘‘బీహార్‌ని భాజపాతో కలసి ప్రగతిపథంలో నడిపించగలవు నువ్వు అంటూ ‘ట్వీట్’ ఇచ్చాడు. అలిగిన శరద్ యాదవ్‌ను బుజ్జగించమని కూడా అరుణ్ జైట్లీకి పురమాయించాడు. జెడియులో చీలిక రాకుండా చూసుకున్నాడు. ‘‘మాకు అన్యాయం జరిగిపోయిందోనని గోలెట్టేస్తే ఏం లాభం? దిగ్విజయసింగు కన్నా నీకు గతి లేదు అనీ తెలిసిపోయింది. ఇవాళ దెబ్బతిన్నది ఒక్క బీహారు అలయెన్సు మాత్రమేనా? దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు అటు వీరంగం వేస్తూ- మోడీకి నా తడాఖా చూపెడతా? అన్న లాలూజీని ఇటు అలిగి బయటకు వెళ్లిపోయిన కుమార్‌నితీష్‌ని కూడా ‘‘అదుగో మీ జాగా’’ అని చెప్పగలిగిన రాజకీయ చాతుర్యం ఇవాళ ఏ పార్టీ నాయకుడికి వున్నది?
దేశంలో ‘ఖతర్నాక్’ల వుంటే వాళ్ళని మీ థింక్ టాంకులోకి తెచ్చుకోండి. ‘‘అసలు టాంకే లేదు’’- అరిగిపోయిన మాటలు సెక్యులరిజం, కమ్యూనలిజం లాంటివి వినడానికి రోతగా వున్నై. టెర్రరిజం, వెన్నుపోటిజం మాటలు నేర్వండి. హిందూ దేశంలో మొదటినుంచి చాణక్యం వున్నది. ఒక్కో పార్టీ నాయకత్వాన్ని మోదీ ఫార్ముల దెబ్బతీస్తూ వుంటే వీళ్ళకి తెలియకున్నది.
నితీష్‌కి సెక్యులరిజం కాపాడమని ప్రజలు ‘మేండేటు’ ఇస్తే కమ్యూనలిజం కొమ్ము కాస్తున్నాడట. అవినీతి పనులు లంచగొండి కార్యక్రమాలు అక్రమ బినామీ ఆస్తి సంపాదనలు ఇవన్నీ చేస్తో వుండటం- వీటిని నిర్మూలిస్తాము అంటూ జనాలకి హామీలివ్వడమూ ఇదేనా? సెక్యులరిజం? ఇదేదో ఫార్సుగా తయారైంది. నితీష్‌కి తేజస్విని తీసేసే దమ్ములేకనేగా ఇటుంటి ట్రిక్కు వేశాడు. బీహార్‌కి ప్రత్యేక హోదాకి బదులు ఇస్తానన్న నిధులు నేను కేంద్రాన్ని అడిగి తెస్తానంటున్న నితీష్ గడుసువాడు. దానికోసమే పొత్తు పెట్టుకున్నాను అన్నట్లు చెబుతున్నాడు. కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకే పార్టీ గవర్నమెంటు వస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని ఇదంతా ‘సేవ’ కోసమేగాని ‘మేవా’కోసం కాదు అన్నాడు. లాలూగారి కుటుంబ సేవ కోసం కాదు అన్నాడు.
ఒకటి నిజం- కంప్యూటర్ సిస్టంలో వైరసు వస్తే దాన్ని తొలగించకపోతే మొత్తం ఫార్మటు చేసుకో అంటారు నిపుణులు. అదే పని ఇప్పుడు చేశాడు నితీషుడు. పనిలో పనిగా ‘విండోస్’ కూడా మార్చుకున్నాడు. నిజమే- నితీష్ నీళ్ళు నములుతూ బజారునపడి- రాహుల్ గాంధీగారిలాగా నన్ను ఆర్‌జెడి ఏడిపిస్తున్నదో అని ఏడవకుండా- ‘నమో ఎఫెక్టు’తో దెబ్బకొట్టేడు కనుక బ్రతికిపోయాడు. లేకపోతే ఆ పని యాదవులు చేసి చూపించేవారు. ఏది ఏమైనా జనాల సొమ్ములతో జనాల ప్రాణాలు తోడేసే మధ్యంతర ఎన్నికలకన్నా భాగస్వామ్యం మారడమే మంచిది అన్నవాళ్లు ఎక్కువే ఉన్నారు ఇవాళ.
కిక్‌ది పార్ట్‌నర్స్ అవుట్ అండ్ కీప్ ద చైర్!
*

veeraji.columnist@gmail.com