వీరాజీయం

ఆవుకి జాతీయ హోదా ఇస్తే.. అందరికీ మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అ’ అంటే అమ్మ, ‘ఆ’ అంటే ఆవు.. అని చదివించడం మొదలెడతాము మన పిల్లలకి అక్షరాభ్యాసం కాగానే. ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక గోమాత ఎక్కడైనా తోక ఎత్తిందీ అంటే చుట్టుపక్కల నుంచి ఐదారుగురయినా వయోవృద్ధులు అటు పరుగులు తీస్తారు. ఎందుకో..? ఈ దేశంలో పుట్టి అమెరికాలో సెటిల్ అయినవాళ్ళకి కూడా తెలుసు. తెలియకపోతే, యోగాగురు బాబా రాందేవ్‌ని అడగండి. ఇలాంటి ఆవు వుండగా, అసలు మనవాళ్ళు గాండ్రు గాండ్రుమంటూ ఆవులని చంపుకుతినే బెంగాల్ టైగర్ ఎందుకు? జాతీయ సింబల్‌గా హోదా ఇచ్చారు గనుకే- కరెన్సీ నోట్లమీదకి పెద్దపులి ఎక్కింది? ఆ మాటకొస్తే, మన దేశంలో పెద్దపులి కూడా ఆవుని తినకుండా జాలిగా వదిలిపెట్టేస్తుంది. అది పంచతంత్రం కథ.
ఆ కథ అనాదిగా చెబుతున్న నీతి ఏమిటి? చిన్నకథలకి చందస్సులాంటి ‘ఆవు-పులి’ కథను మరిచిపోయారా? అడవిలో ఆకలితో నకనకమంటున్న పెద్దపులికి- కొమ్ములున్నా పొడవడం రాని ఆవు ఒకటి ఎదురయ్యింది. ‘నిన్ను తినేస్తా.. గెట్ రెడీ’ అన్నది వ్యాఘ్రరాజము. ఆవుఅంటే అమ్మ లాంటిది కనుక వెంటనే- మిస్టర్ టైగర్ ‘స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్’ అన్నది. ‘నాకో దూడ వున్నది. అదీ నీలాగే ఆకలితో, అరుపులో తేడా తప్ప నీలాగే అలమటిస్తోంది. దూడ అంటే రేపటి ఎద్దు- రేపటి వ్యవసాయ సంపద- దానికి పాలు పెట్టి ప్రామిస్‌గా తిరిగివస్తాను..’ అన్నది ఆవు. పులి ఆలోచించింది. సత్యహరిశ్చంద్రుడి దేశం మనది. ఆవును నమ్మాలి అనుకొని ‘సరే, పోయిరా’ అన్నది. ఆ తర్వాత ఏమి జరిగింది? ఇంగ్లీషు మీడియం పిల్లకాయ కూడా చెపుతాడు- ఆవు, పులి కూడా అంత నీతిగా, నిజాయితీగా వున్న పవిత్ర భారతదేశంలో ఆవుని ‘రాజకీయం’ చేశారు, చేద్దామనే చూస్తున్నారు.
తిండి అలవాట్లు మా హక్కులంటూ కొంతమంది గోమాంస మొక్కటే తిండి అయినట్లు చేసిన అల్లరి చల్లారింది. ఇప్పుడు ఆవులకి అంబులెన్సులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం దాకా వచ్చింది. అంతటితో ఆగక ఆధార్ కార్డులు దాకా వచ్చింది వాటి స్టేటస్. కాని, దేశవ్యాప్తంగా ఒక పాలసీ లేదు. కేరళలో ఒక భాజపా అభ్యర్థి తనకు వోటేస్తే గో మాంసం పెడతానన్నంతదాకా వచ్చింది. అవతల పోయినేడాదే.. హర్యానా భాజపా సీనియర్ మంత్రి అనిల్ విజ్- ‘ఆవుని జాతీయ జంతువుగా డిక్లేర్ చెయ్యండి సమస్యలుండవు’ అంటూ ట్వీట్ చేశాడు. యుపిలో ముఖ్యమంత్రిగా ఆదిత్యనాధ్ రాకతో గోమాంస భక్షణకే కాదు, మాంస భక్షణకే తకరారు వచ్చింది. అక్రమ కబేళాలు, దుకాణాలు మూసేయించాడు. ఐతే, గోసంరక్షకుల పేరిట జరుగుతున్న హింస మోదీని, యోగీని, మనల్ని కూడా వర్రీ చేసేస్తోంది. ఇట్టి తరి: ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ బాస్ మోహన్ భాగవాత్ గోవధని యావత్ భారతదేశంలోనూ నిషేధిస్తూ ఏ కాండి చట్టం తేవాలని- గోసంరక్షణ పేరిట జరిగే హత్యలు, హింసలూ ఆగిపోవాలని అని కరాఖండీగా అప్పీలు చేశాడు. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెం కాకముందే, ఆవును కాపాడే మరో పక్కా సూచన దేశంలోనే అతి పెద్దదయిన ముస్లిం పండిత మత గురువుల సంస్థ అయిన జమైతే ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు వౌలానా సయ్యద్ మదాని నుండి వచ్చింది. ఆవుకి జాతీయ జంతువుగా అత్యున్నత హోదా ఇచ్చినట్లయితే తమ మద్దతు ఉంటుంది, గోమాంస భక్షణని నిరోధించగలుగుతున్నామని అన్నాడాయన. గోసంరక్షణ పేరిట కొంతమంది చేస్తున్న లూటీలు, హత్యలు,హింస నిరోధించబడాలి అన్న వౌలానా మాటలకి కూడా ఎవ్వరూ అభ్యంతరం చెప్ప పనిలేదు.
రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే పథ్యంగా ఇచ్చాడు అన్న సామెత చందాన- దేశంలో ఆవుకు అనాదిగా, అధునాతనంగా కూడా కోరబడుతున్న ప్రతిష్ఠ వచ్చే అవకాశాలు ఇప్పుడు బాగా మెరుగయినాయి. అజ్మీర్ దర్గా ప్రధాన మతగురువు కూడా, పోయిన నెలలో ముస్లింలు గో మాంస భక్షణ మానెయ్యాలని అప్పీలు ఇ వ్వడం గమనార్హం. అ యితే, ఆ క్రెడిట్ తమకు దక్కకుండా పో తుందేమో అని అనుకొనే రాజకీయులు కొందరు వుంటారు. సోకాల్డ్ సెక్యులర్ మూస పేరిట అభ్యంతరం చెప్పే వాళ్ళు మరీ డేంజర్. అసలు ఆ రెండిటికీ తాడి చెట్టుకి దూడ గడ్డికి వున్న సంబంధమే వున్నదని గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీకి అసలు మొదట ఎద్దులు- కాడియే సింబల్, ఆనక ఆవు దూడ అయింది. ఆ గుర్తుని పోగొట్టుకున్న తరువాతనే ఆ పార్టీకి ‘మొండిచెయ్యి’ దొరికింది. ఆవుని గుర్తిస్తేనే కాంగ్రెస్ వాళ్లకి మోక్షం అన్నదో బామ్మగారు. అసలు ఎవరి పేరు చెప్పి ఆవుని కేవలం ‘తిండి వస్తువు’గా చేసి ఖుషీ మనాయిస్తున్నారో వాళ్లే ఆవుకి ప్రత్యేక హోదా ఇస్తే ప్రాబ్లెమ్స్ పరిష్కరింపబడతాయని చెపుతూ వుంటే వాళ్ళు తినలేకపోతున్నారో అనీ, వాళ్ళు తినకపోతే వీళ్ళ పరువు ఏదో పోయిందన్నట్టు కొన్ని వర్గాలు కంగారు పడుతున్నట్టుగా కనపడుతున్నది. కానీ, మారిన పరిస్థితుల్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత బెటర్ అన్నాడో శాకాహార ఉద్యమకారుడు.
పెద్దపులిని అంతరించిపోతున్న జాతి అంటూ సకల శక్తులూ పెట్టి కాపాడుతున్న వాళ్ళు- ఆవులు కూడా అంతరించిపోతున్న జాతి అని, వోటు బ్యాంకు భ్రమ వల్ల గ్రహించలేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఆవుల జాతులు ఉండేవి. ఇవాళ కేవలం ఇరవై తొమ్మిది జాతులు మిగిలాయట. అయితే జెర్సీ ఆవులాంటి సంకర జాతులు కూడా వున్నాయి. కపిల, దయోని, పుంగనూరు, షాహియత, ఒంగోలు జాతి సరేసరి- ఇవన్నీ కాపాడుకోవలసిన గోజాతులు- తిరుపతి వెంకన్నకి పుంగనూరు ఆవు పాలతోనే అభిషేకం చేస్తారట. వీటిని కాపాడమని అందరి కోరిక. హిందూ సోదరుల మత విశ్వాసాన్ని గౌరవిస్తామని ప్రధాన మైనారిటీకి చెందిన వారే చెబుతూ వున్న ఈ దశ, నిజంగా ఆవుని పరిరక్షించాలని వున్న అధికార పార్టీకి కూడా భలే మంచి సమయం. పులిని సమ్మర్లో కూలర్లు, ఏసీలు పెట్టి కాపాడుదాం. ఆవుని కూడా అమ్మ అని, అమ్మపాలు లేని సందర్భంలో ఆవునే అమ్మగా భావించి దాని పాలు తాగి పెరిగిన వాళ్ళు ఈ పాడిపంటల సస్యశ్యామల దేశాన్ని దాని ప్రతిష్ఠని పరిరక్షించడానికి సిగ్గెందుకు పడాలి? జాతీయ జంతువుని ఎవడూ తింటానని అనడుగా? బైదిబై.. ఆవుని నేపాల్ జాతీయ జంతువుగా ప్రకటించింది.. తప్పేమీ లేదు, అట్టి చిన్న దేశం మార్గదర్శకత్వాన్ని తీసుకొని మనం కూడా ఆవుని జాతీయ హోదా ఇచ్చి గౌరవిద్దాం.. అయితే- సొరకాయ, తోటకూర మాత్రం తినేవాళ్లకి ఆవుమాంసం బిజినెస్ ఎంత పోతున్నదో ఎలా తెలుస్తుంది? అన్న మేధావులున్నారు. అట్టివారికి ఒక్కటే సమాధానం- దేశ ప్రతిష్ఠకోసం ఎన్నో త్యాగం చేశాం- ఇదీ చేద్దాం..
లెట్ బిజినెస్ గో అండ్ కౌ స్టే!
*