వీరాజీయం

దేశానికి తండ్రి..??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను ‘ భారత దేశపు సేవకుడి’గా అభివర్ణించుకోవడం ఆయన సౌజన్యానికి, దేశం పట్ల ఆయన వినమ్రతకు చిహ్నం. నరేంద్ర మోదీని ‘ భారతపిత- ఫాదర్ ఆఫ్ ఇండియా-!’ అని అభివర్ణించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనభిజ్ఞత- ఇగ్నోరెన్స్-కు నిదర్శనం. మోదీ వినమ్రత, డొనాల్డ్‌ట్రంప్ అనభిజ్ఞత సమాంతరంగా ప్రస్ఫుటించాయి. మంగళవారం న్యూయార్క్‌లో ఉభయ దేశాల ప్రభుత్వ అధినేతలు సమావేశమై చర్చలు జరిపిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అతిగా అభినయించాడు. మితిమీరిన ఈ అభినయ విన్యాసాల సందర్భంగా ట్రంప్ దొర తన అనభిజ్ఞతను బయటపెట్టుకున్నాడు. ఈ అనభిజ్ఞత ‘పరిభాష’కు సంబంధించినది. ఈ అనభిజ్ఞత ‘జాతి’కి, జాతీయ వికాసానికి సంబంధించినది. ఈ అనభిజ్ఞత మాతృదేశ మమకార వాస్తవానికి సంబంధించినది. ఈ అనభిజ్ఞత చారిత్రక, ప్రాకృతిక, భౌగోళిక, సాంస్కృతిక విజ్ఞానానికి సంబంధించినది. ‘నరేంద్ర మోదీ భారతదేశపు తండ్రి’ అని చెప్పడం ట్రంపు దొర ప్రకటించిన అనభిజ్ఞత! ‘‘ట్రంపు దొర గొప్ప అహంకారి’’అన్నది అంతర్జాతీయ ప్రచారం. అహంకారం, అజ్ఞానం కవల పిల్లలు. అహంకారం పుట్టిన వెంటనే అజ్ఞానం కూడ పుట్టుకొని రావడం సహజ మానవ స్వభావం. నరేంద్ర మోదీని అతిగా ప్రశంసించాలన్న తపనతో అతిగా అభినయించిన ట్రంపు తన అనభిజ్ఞతను బయటపెట్టుకున్నాడు. భారతదేశపు వజ్రాల బిడ్డను ‘‘్భరతదేశపు తండ్రి’’అని పిలవడం, పేర్కొనడం ఎవరికి ఆనందకరం?? ‘పరిభాష’ మారడం వల్ల వాస్తవాలు వక్రీకరణకు గురికావడం అనివార్యం అన్నది చరిత్రలో అనేకసార్లు ధ్రువపడింది. ఐరోపా వారి అనభిజ్ఞత వల్లనే భారతదేశం మొదటిసారిగా క్రీస్తుశకం 1947లో ఒక ‘జాతి’-నేషన్-గా ఏర్పడిందన్న కృతిక సిద్ధాంతం ప్రచారమైంది. ‘పరిభాష’ మారినందువల్ల, ‘పరిభాష’ను తప్పుగా అన్వయించుకోవడంవల్ల ఈ ఘోరమైన వక్రీకరణ జరిగింది. వక్రీకరణను వాస్తవమని భ్రమించడం భావదాస్యం! ‘భాష’ భావ వ్యక్తీకరణకు మాధ్యమం. ‘పరిభాష’ భావజాలపు నిర్దిష్టత, నిర్దుష్టత నిగ్గుతేలే ‘నికషం’- గీటురాయి-! అందువల్ల పరిభాష మరింత ప్రధానమైనది. పాశ్చాత్యులకు దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం వరకు ‘జాతి’ ‘జాతీయత’, ‘మాతృభూమి’, ‘సంస్కృతి’ స్వరూప స్వభావాలు తెలియవు. ఇలాంటివారు ‘పాలించిన’ సమయంలో మన దేశంలోని ‘పరిభాష’ వక్రీకరణకు గురి అయింది! ట్రంప్ దొరకు పరిభాష తెలియకపోవడం వల్ల మనకు నష్టం లేదు. కానీ అతగాడి పరిభాష మనకు సంక్రమించడం ప్రమాదకరం! మన దేశంలో అనాదిగా ఒకే జాతి ఉంది. అది భారత జాతి లేదా హైందవ జాతి! కానీ బ్రిటన్ దురాక్రమణ ఫలితంగా ‘‘తెలుగుజాతి, కన్నడ జాతి, ద్రవిడ జాతి, వంగజాతి, కశ్మీరీ జాతి’’ వంటి వక్రీకృత పరిభాషను మేధావులు ‘అనేకమంది’ప్రచారం చేస్తున్నారు. వాస్తవ పరిభాష తెలిసిన వారికి ‘‘ఒకే- అద్వితీయ- భారత జాతిలో ‘తెలుగు జన సముదాయం’, కన్నడ జన సముదాయం, ద్రవిడ జన సముదాయం, వంగ జన సముదాయం, కశ్మీరీ జన సముదాయం అవిభాజ్యమైన విభాగాలన్న వాస్తవం కూడ తెలుసు! ‘జాతి’, జన సముదాయం వేఱువేఱు పరిభాషా పదాలు. జాతిలో ‘జన సముదాయం’ ఒక అంశం.. ఈ పరిభాష ఔచిత్యం పాశ్చాత్యులకు తెలీదు, ట్రంప్‌కు తెలీదు. అందువల్లనే భారతదేశపు బిడ్డడైన మోదీని ‘‘భారతదేశపు తండ్రి’’అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు, అనభిజ్ఞతను ప్రదర్శించాడు!
ఈ ‘అనభిజ్ఞత’ భారతీయులను ఆవహించరాదు. ప్రస్తుతం గాంధీ మహాత్ముని సార్థ శతతమ జయన్తి- నూటయాబయ్యవ పుట్టినరోజు- సంవత్సర ఉత్సవాలు అనేక దేశాలలో జరుగుతున్నాయి. మహాత్ముడు భరతమాత బిడ్డలలో ఒకడు, బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ నాయకులలో అగ్రగణ్యుడు. పాశ్చాత్యుల ‘పరిభాష’ ప్రాతిపదికగా మహాత్మాగాంధీ ‘జాతిపిత’- భారత జాతిపిత- అన్న ప్రచారం జరుగుతోంది. ‘జాతి’ ‘జాతీయత’ గురించి అనభిజ్ఞత ఆవహించిన ట్రంప్ ఈ శాశ్వత-సనాతన-తత్త్వం గురించి భ్రాంతికి గురి అయి ఉండవచ్చు! ‘‘నాగరికత’’- సివిలిజేషన్- గురించి తప్ప ‘జాతీయత’- నేషనలిజమ్- గురించి కాని, ‘జాతి’- షన్- రాజకీయ రాజ్యాంగ వ్యవస్థల కంటె భిన్నమైనదని కాని అవగాహన లేని ట్రంప్ నరేంద్ర మోదీని ‘్భరత పిత’అని ఆర్భాటించి ఉండవచ్చు. కానీ పాశ్చాత్యులు ‘‘్భరత జాతిపిత’గా గుర్తించిన మహాత్ముని సార్థ శతతమ జయన్తి వత్సర ఉత్సవాలు జరుగుతున్న సంగతి అతగాడికి తెలుసు. న్యూయార్క్‌లోని ‘ఐక్యరాజ్యసమితి’ ఆవరణలోనే ‘‘గాంధీ శాంతి ఉద్యానవనం’’ ‘‘గాంధీ సౌరశక్తి ప్రాంగణం’’ నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆరంభమైన సంగతి ట్రంప్‌కు తెలుసు.. మరి పాశ్చాత్యుల ‘కొలమానం’ప్రకారం గాంధీ ‘‘జాతిపిత’’అయి ఉండగా మళ్లీ నరేంద్ర మోదీ ‘‘్భరత పిత’’- ఫాదర్ ఇండియా- ఎలా అవుతాడు? జాతీయతత్త్వ వాస్తవ పరిజ్ఞానం లేకపోవడమే కాదు ట్రంప్‌కు సమకాలీన ఇంగితజ్ఞానం కూడ లేకపోవడం విచిత్రమైన వాస్తవం!
అనాదిగా భారత జాతి ఉంది. ఈ జాతీయ వికసనం మతాలకు, భాషలకు, ఆచార వ్యవహారాలకు, రాజ్యాల సామ్రాజ్యాల నిర్మాణాలకు, పతనాలకు, రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా యుగాలుగా కొనసాగుతోంది. మహాయుగాలుగా, ‘మన్వంతరాలుగా’, ‘కల్పాలు’గా ప్రస్ఫుటిస్తోంది. ఇదీ జాతీయత సనాతన స్వభావం. సనాతన-శాశ్వత- సృష్టిగత వాస్తవాలు భారత జాతికి మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలకు, అన్ని జాతులకు అనాదిగా అన్వయవౌతున్నాయి. వీటిని గుర్తించని పాశ్చాత్యులు, భారతదేశంలోని వెలుపలివారు జాతులుగా ఏర్పడలేదు. క్రీస్తుశకం పనె్నండవ పదమూడవ శతాబ్దులలో మాత్రమే పాశ్చాత్యులు ‘జాతీయత’ను అలవర్చుకోగలిగారు. కానీ ఈ ‘జాతీయత’ కేవలం ‘రాజ్యాంగ వ్యవస్థ’ పరిధికి పరిమితమైపోయింది. అందువల్లనే దురాక్రమణకు గురి అయి ఉన్న ‘దేశం’ ఒక జాతి కాదని, ఆ దేశం స్వతంత్ర దేశంగా మారి రాజ్యాంగ వ్యవస్థను నిర్మించుకున్నప్పుడు మాత్రమే ఆ దేశ ప్రజలు ‘జాతి’గా ఏర్పడుతారని పాశ్చాత్యులు ‘భ్రాంతి’కి గురి అయ్యారు. ఈ ‘భ్రాంతి’ ఆవహించిన మన దేశంలోని బ్రిటన్ ప్రభావిత మేధావులు క్రీస్తుశకం 1947 ఆగస్టు పదిహేనవ తేదీకి పూర్వం మనదేశం ఒక ‘జాతి’కాదని ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. వీరి ‘భ్రాంతి’ప్రకారం ‘‘బ్రిటన్ దురాక్రమణ ముగిసిన తరువాతనే మన దేశ ప్రజలు చరిత్రలో మొదటిసారిగా ‘జాతి’-నేషన్-గా ఏర్పడినారు. అందువల్ల ఈ ‘‘ఏర్పాటును చేసినవారిలో మొదట లెక్కింప గాంధీ ‘జాతిపిత’ అయ్యాడు..’’ ఇదీ పాశ్చాత్యుల అజ్ఞాన సిద్ధాంతం!! జాతీయత, రాజకీయం ఒకటేనన్నది ఈ సైద్ధాంతిక భ్రాంతి!!
కానీ మహాత్మునికి పూర్వం కోట్లాది సంవత్సరాలుగా ‘్భరతజాతి’ ఉంది. ఇదీ కృత్రిమ సిద్ధాంతవాదులకు ధ్యాసలేని వాస్తవం. ‘‘మహాభూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి నేను ఆమె బిడ్డను- అన్న సనాతన- శాశ్వత- వాస్తవం ఒక ‘జన సముదాయం’ లేదా అనేక ‘జనసముదాయాలు’ ఒక ‘జాతి’గా వికసించడానికి సృష్టిగత ప్రాతిపదిక! భారతీయులు అనాదిగా ఈ వాస్తవాన్ని గ్రహించారు. అందువల్ల ‘్భరత జాతి’ అనాదిగా ఏర్పడి ఉంది. మతాలు, భాషలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, దురాక్రమణలు, జయాలు-అపజయాలు, రాజ్యాంగ వ్యవస్థలు, వాణిజ్య వ్యవసాయ విద్యావ్యవస్థలు, ఇంకా ఎనె్నన్నో ‘జాతీయ’ నిరంతర వికాసక్రమంలో సంభవించే పరిణామాలు. ఇవన్నీ కాని, వీటిలో కొన్ని కాని ఉన్నప్పుడు, ఇవి లేనప్పుడు కూడ భారత జాతి ఉంది. అందువల్ల మహాత్మా గాంధీకి పూర్వం, యదుకుల కృష్ణునికి పూర్వం, రఘురామునికి పూర్వం, దిలీపునికి పూర్వం, అసంఖ్యాక మహాపురుషులు పుట్టక పూర్వం కోట్ల సంవత్సరాలుగా, అనాదిగా ఈ భరతఖండం ఒక ‘జాతి’గా ఏర్పడి ఉంది, సంస్కారాల సమాహారమైన సంస్కృతి వికసిస్తోంది.. అందువల్ల వివిధ కాలాల్లో భారత జాతిని నడిపించిన అసంఖ్యాక జాతీయవీరులు, మహాత్ములు ‘భరతమాత’ బిడ్డలు.. కానీ భారత జాతికి వారు తండ్రులు కాదు. గాంధీ మహాత్ముడు భరతమాత కీర్తిని పెంచిన వరాల బిడ్డడు, మనకు అగ్రజుడు.. స్ఫూర్తిదాయకుడు... అంతే కాని అనాది జాతికి ఆయన ‘పిత’కాజాలడు. ‘పరిభాష’ పాశ్చాత్య భావదాస్యం నుండి విముక్తం కావాలి!
రంజుగా ‘హౌడీ మోడీ’
అమెరికాలోని హూస్టన్‌లో జేగీయమానంగా సాగిన, హ్యాపీగా ముగిసిన ‘హౌడీ మోడీ’ తరువాత టింగురంగా అన్నాడు నరేంద్రదాస్ మోదీ. డిట్టో అన్నాడు డొనాల్ట్ ట్రంప్. ‘మా బాల్యం మాకు యిచ్చేయండి- మేం యించక్కా చెట్టాపట్టాలేసుకు ఆడుకుంటాం’ అన్నట్లు యిరుదేశాల అగ్రనాయకులు స్టేడియమ్ అంతా కలయజుట్టేసి కేరింతలు కొట్టారు. మోదీ జయహో అంటే ట్రంప్ ‘ట్రయంఫ్’ అంటూ తియ్యతియ్యని మాటలతో నేరుగా సభాప్రాంగణంలో వున్న అరవై వేల మంది ‘‘అమెరికన్ ఇండియన్’’లనే గాక, ఇండియాలో వున్న అశేష జనవాహినిని కూడా ప్రత్యక్ష ప్రసారంలో ఓలలాడించారు. రెండేళ్ళ క్రితం బ్రహ్మాండమైన ఈ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ‘జంబో ప్రాంగణంలో ఒక రాక్ ఎన్‌రోల్’’ సమారోహం జరిగిందిట. మళ్ళీ అలాటి ‘‘జోష్’’ అటువంటి ‘‘ఊపుతో’’ రుూ అమెరికన్ ఇండియన్ అధినేతల ‘‘షో’’ అంత కోలాహలంగా ముగిసింది. ‘అబ్‌కీ బార్ ట్రంప్’’అన్నాడు నరేంద్రదాస్ మోదీ. ట్రంప్ దొర మురిసిపోయి ‘‘ఇంతకన్నా నేస్తం మరొకడు ఉండడు’ అని తెగ సంబరపడిపోయి, ‘ మోదీ భాయ్ రెండోసారి ఏలికగా వచ్చినాక, మూడు ముప్ఫయి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు..’ అంటూ ప్రశంసించాడు.
ముద్దొచ్చినపుడు చంక ఎక్కమన్నారు.. అని ఓ సామెత ఉంది. అట్లాగా మోదీ అమెరికా అధ్యక్షుడి ఒడిలో కుదిమట్టంగా యిమిడిపోయాడని అన్నది ఓ అమెరికన్ ఇండియన్ వృద్ధమహిళ. ట్రంప్ ప్రసంగం ఆద్యంతం ఉల్లాసంగా మోదీ స్టయిల్లో సాగింది అన్నాడో ఇండియన్ పరిశీలకుడు. అంటే? అనడగకండి- ట్రంప్ ఈ సభకు చీఫ్ గెస్ట్‌గా రావడమే కాదు; తన ప్రభుత్వం యింతవరకూ చేసిన ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి కార్యక్రమాల్ని ఏకరవుపెడుతూ ఇదేదో ఎన్నికల ప్రచార సభ అనిపించాడు.
మోదీజీ ట్రంప్ మహాశయుని ఎన్నికల ప్రచారానికి తాను ఎగిరి వచ్చానా? అన్నట్లు తన వాగ్దాటిని (హిందీలో) ప్రదర్శించాడు. డోనాల్డ్ చాలా దుందుడుకు మనిషి. ఒక్కోసారి యిప్పుడన్న మాటని మరో ఘడియకి మార్చేస్తాడని విమర్శించిన వాళ్ళుకూడా అమితోల్లాసంగా ట్రంప్ మహాశయుడు- ఇండియా అమెరికాల మధ్య యిటీవల జరిగిన ‘‘క్రూడ్ ఆయిల్’’ వాణిజ్య ఒప్పందంపై ప్రస్తావించగా లేచి నిలబడి చప్పట్లు చరిచారు.
‘‘చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలసిన ముచ్చట్లు’’అన్నారు. అట్లాగా అమెరికాలోని ‘‘ఉక్కు’’ రంగంలో భారతీయుల పెట్టుబడుల ఆరంభాన్ని అమెరికన్ జనాలు- అమెరికన్ ఇండియన్ జనాభా కూడా హర్షిస్తున్నారు. అమెరికా జనాభాలో ఒక శాతం భారతీయులు. అక్కడ వున్నారు కనుక వీరిని ‘అమెరికన్ ఇండియన్‌లు’ అంటున్నారు. అరవై ఆరు లక్షల మంది దాకావున్న మనవాళ్ళు నిన్నటిదాకా అధికాంశం డెమోక్రాట్ల వైపు మొగ్గుచూపెడుతున్నవారే. వారిని యిప్పుడు తనవైపు త్రిప్పుకోడానికి యింతకన్నా మంచి అవకాశం మరొకటి లేదని ట్రంప్ అనుయాయులు, రిపబ్లికన్‌లు కొందరైనా అనుకోడంలో తప్పులేదు.
ఇది రెండోసారి భారత ప్రధానమంత్రిగా ఎన్నికై అమెరికాకు వెళ్ళిన మోదీకి గెలుపా? ఆ ప్రశ్నవస్తే నిస్సందేహంగా యిది భారత ప్రధానిగా ఒక వ్యక్తిగా కూడా అతని దౌత్యానికి- రాజకీయ చతురతకి కూడా ఒక గీటురాయి. పదేళ్ళ క్రితం ఈ గుజరాతీ నాయకుడైన నరేంద్ర మోదీని ‘‘అమెరికన్ గడ్డమీద అడుగుపెట్టటానికి ఒప్పుకోం’’ అన్నారు. ‘‘బాయ్‌కాట్’’లాంటిది జరిగింది. కాని యివాళ అదే అమెరికన్ నాయకత్వం, ఇండియన్ ప్రైమినిస్టర్‌గా మోదీకి ఎర్ర తివాచీలు పరుస్తోంది. సుహృద్భావం- పెట్టుబడులను యిచ్చిపుచ్చుకోడం అనే విషయాలలో మన పాలిటిక్స్ యిటీవల కాలంలో పండిపోయాయి. మోదీ మీద ట్రంప్ మహాశయునికి ఎంత మోజు ఏర్పడినదంటే మళ్ళీ పర్యావరణం, వాతావరణం అంటూ మోదీ చేస్తున్న ప్రసంగానికి- ట్రంప్ వచ్చి కూర్చొని శ్రద్ధగా తిలకించాడు. ఈ ‘షో’- అంతా బుల్లితెరలమీద చూస్తున్న చైనా, పాకిస్తాన్ జనాలకు ఎలా వుంటుందో? వేరే చెప్పనక్కరలేదు. పైగా అక్కడే వున్నాడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్- మర్నాడే అమెరికన్ ప్రెసిడెంట్‌తో భేటీ అవడానికి. ‘ఇండో- పాక్ రిలేషన్స్’ అతి సున్నితమైన స్థితిలో ఉన్నప్పుడు- రుూ సంబరం అమెరికాలో జరిగింది. ఎందరో ఇండియన్ ముసల్మానులు కూడా అక్కడ వుంటారు. ఇమ్రాన్‌ఖాన్‌కి వొంటికి ఉల్లి మిరియం దంచి రాసుకుంటున్నట్లుగా వుంటుంది. అసలు టెక్సాస్‌లోని హూస్టన్ పరిసరాలలో ‘‘గాలివాన’’ సూచనలు లేచాయి. గవర్నర్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించాడు. కానీ సమావేశం వేళకి ప్రశాంతం అయింది. ప్రాంగణం కిటకిటలాడింది. మువ్వనె్నల ముద్దు పతాకాలు పట్టుకుని అమెరికన్ ఇండియన్‌లు ఆనందంగా కేరింతలు కొడుతూ ‘‘మోదీ, మోదీ’’ అంటూ వంత పాడసాగారు. నేపథ్యం చూడండి- డెబ్భయి సంవత్సరాలుగా ప్రత్యక్షంగా మనకి దక్షిణాసియాకి పరోక్షంగా ప్రపంచానికి కొరకరాని కొయ్యగా మారిపోయి నిరంతరం తలనొప్పిగా పరిణమించిన ‘కశ్మీర కల్లోలం’ ఇటీవల ఓ కొలిక్కి వచ్చింది. మోదీ ప్రభుత్వం చూపించిన చొరవ ‘రెండువైపులా వాడి ఉన్న కత్తిలాంటిది’. అంతర్జాతీయంగా ‘బూమ్‌ర్యాంగ్’ అవ్వాలని ఎందరో మన పాలిట దుష్టులయినవాళ్ళు అభిలషించారు. కాని కథ మరో మలుపు తిరిగింది. రక్తం చిందకుండా ఆర్టికల్ 370 ‘‘అంతిమశ్వాస’’ తీసుకుంది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లాంటి అగ్ర రాజ్యాలు ఫారూక్ అబ్దుల్లాని ఇంట్లోనే పెట్టి నోరునొక్కేస్తే కిమ్మన లేదు. అట్టితఱి భారతదేశం అమెరికాకు పోయింది. మేళ తాళాలతో ‘మనవాళ్ళకు’ స్వాగతం లభించడమే కాదు. దీనిని అమెరికా ఆదరించి మన్నించింది. సోకాల్డ్ డిప్లొమాటిక్ విక్టరీ అంటే ఏమిటి? కాగితం ముక్కల మీద సంతకాలు పెట్టి, ఆ ‘పెన్ను’లు విరగగొట్టటమా? కాదు. ప్రజల హదృయంలో గౌరవం, జాలి, మన్నన పొందడం. నూట ముప్పయి కోట్ల మంది జనాలు చెప్పింది చేయడమే నా పని అన్న ‘మోదీ’కి లభించిన జేజేలు యివి. ఇటీవల ఇండియన్ ‘పాలసీ’కి వీరతాడు వేయాల్సిన సందర్భం ఇది. చీటికీ మాటికీ అమెరికా గడ్డబొమ్మని తగలేస్తూ ఉండటం.. అదేదో ఘనకార్యం సాధించాం అనుకోడం లాంటి ప్రదర్శనలు యిటీవల మనం చూడలేదు. అదే జనాలలో ‘మెచ్యూరిటీ’కి నిదర్శనం ఇది. ‘370’ ఆర్టికల్ మూడువేల రకాలుగా సీమాంతర రాజకీయాలలో దుమారం అయిపోతుంది అన్న భయం గోడ దూకేసింది.
క్రికెట్ మైదానంలో ‘్ధనీ’, ‘్ధనీ’ అంటూ వినబడే కోరస్ లాంటిదే. ఎన్‌ఆర్‌జి మైదానంలో ‘మోదీ, మోదీ’ అంటూ ప్రతిధ్వనించింది- జయహో!
‘‘ఇండియన్ అమెరికన్‌లకి నేను నెలనెలా వెయ్యి డాలర్‌లు అదనంగా లభించే విధంగా మార్పులు తెచ్చాను’’అన్నాడు ట్రంప్ దొర. ఏటా మూడువేల డాలర్ల మేరకు పన్ను రాయితీ కల్పించానని కూడా అన్నాడు. ఇదేదో ఎన్నికల బాకా.. అన్నారు కొందరు. అయితే ఏమిటటా? ఒకప్రక్క టెర్రరిస్టు ఆగడాల భయం. మరోప్రక్కన అమెరికన్ ప్రభుత్వం ఏ క్షణాన ఏ మొట్టికాయ వేస్తుందో, ఏదో సాకు మీద ‘‘అర్ధచంద్ర ప్రయోగమే చేస్తుందోనన్న భయంతో కాలక్షేపం చేస్తున్న ‘‘అమెరికన్ భారతీయుల’’కి ‘‘భరోసా’’గా ట్రంప్ దొర శ్రవణానందకర ప్రసంగం సాగింది-ఇది యాభై అరవై వేల మంది భారతీయ మూలాలున్న జనాలు-అన్ని రంగాలలో స్థానికంగా రాణిస్తున్నవారు పాల్గొన్న మహాసమావేశం. అక్కడ వారి కోణం నుంచి ముందుగా ఈ సభ జయాపజయాలు బేరీజు వెయ్యాలి. ట్రంప్ ఎగుమతి సుంకాల సంగతి ఏమి చేస్తాడు? మోదీ ఎగుమతి సరుకుల జాబితాలో ఏమి చేర్చుకుంటాడు? అన్నది ఉపఫలం తప్ప- ఇరు ప్రభుత్వాల మధ్య అధికారికంగా సాగిన ఒడంబడికల సమావేశం కాదు... అందుకనే ట్రంప్ దొర అధికారిక లాంఛనంగా తాను నిలబడే వేదికపై ఆసనం ఏర్పాటుచేసుకుని ప్రసంగించలేదు.
ఆర్టికల్ 370ని- కాశ్మీర్ సమస్యను అమెరికా అధ్యక్షుడు తన సుదీర్ఘమయిన ప్రసంగంలో ప్రస్తావించలేదు. టెర్రరిజం విషయంలో మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌ని ‘‘చావుతిట్లు’’ (ఓ యిల్లాలు అన్న మాటలు) తిట్టినా మందహాసం చిందించాడేతప్ప ‘‘డిప్లొమసీ’’అంటూ ఏమీ అనలేదు. పైగా అంతరిక్ష ప్రయోగాలలో, రోదసీ రంగంలో పూర్తిగా సహకరిస్తాం అంటూ ముచ్చట పడ్డాడు కూడా. మొన్న మొన్నటిదాకా మన రోదసీ విజయాలను ‘‘పిల్లర్స్’’గా కూడా వేయని పాశ్చాత్య దేశాల పత్రికలు ముఖ్యంగా అమెరికా మీడియా యివాళ పెద్దపీట వేస్తున్నది మనకి. భారత్‌లో ఆ ప్రాజెక్టుకి రుణం, రుూ పథకానికి అప్పు అంటూ సాగే ప్రసంగం కాదు యిది... మున్ముందు రుూ రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య కుదిరే వాణిజ్య సయోధ్యకి హూస్టన్ సమావేశం దోహదిస్తుంది. అంతవరకే ఇది. రెండు దేశాల జనాల జీవితంలో గెలుపూ, ఓటమికన్నా ముఖ్యమైన మరొకటి స్నేహానందం. న్యాయం, ధర్మం వంటి వాటిపట్ల అవగాహనం. ఇవి ముఖ్యం. ఇటువంటి దిశలో ‘‘హౌడీ-మోడీ’’ ఉభయ తారకమైంది. ‘‘అంతా బావుంది’’...
ఎవ్విరిథింగ్ ఓకే!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512