వినమరుగైన

సాక్షి( పానుగంటి లక్ష్మీ నరసింహారావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షి వ్యాసాలలో మచ్చుకు ఒకటి రెండు విషయాలు చూద్దాం. పంతులుగారికి స్వభాషాభిమానం ఎక్కువ. పరాయి భాషలు నేర్చుకొనటం జ్ఞానాభివృద్ధికేగాని, మాతృభాషను మరచిపోవటానికి కాదు. స్వభాష అనే వ్యాసంలో ఆంధ్ర బాలక సంఘంలో ఉపన్యసించటానికి వచ్చిన ఒక తెలుగువాడు తనకు తెలుగు రాదని ఆంగ్లంలో మాట్లాడతానని చెప్పాడు. ఆ సందర్భంలో జంఘాలశాస్ర్తీ నోటినుండి పానుగంటివారు పలికించిన మాటలు చూడండి. ‘‘మ్యావుమని అరవలేని పిల్లి ఎచ్చటనైనా వుండునా.. ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైనా అనవరత శ్రవణమున ఆంధ్రమున మాట్లాడుచుండగా.. ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే.. ఆంధ్రమున మాటలాడలేకుండునా’’-
ఇక్కడి చమత్కారం చూడండి. పక్షివెధవ అనేది నీచమైన తిట్టు. తెలుగురాని ఆ పెద్దమనిషిని అంతకంటే నీచుడుగా చిత్రించారన్నమాట పానుగంటి.
భూతవైద్యం అనే వ్యాసం దయ్యాలు భూతాల పేర్లు చెప్పి, జనాన్ని మోసం చేసేవారిపై చక్కని సెటైరు. జంఘాలశాస్ర్తీ తన గురువైన భూతవైద్యుణ్ణి గురించి ‘‘ఒక భార్యనంటకట్టుకొని లొడితెడు సంసారములో గుడుగుడు గుంజములాడుట కిష్టపడక, బ్రహ్మచారియై లోకముమీద విరుచుకుపడి, తెగిపడ ఉపకారము చేయుచున్నాడు’’ అంటాడు ఆయన. ఒక ముద్దుగుమ్మకు పట్టిన పిశాచాన్ని వదలించటానికి దానింటికిపోయి ఆ తంత్రం లో నిమగ్నమై ఉండగా, ఆ పిశాచం దాని భర్త రూపంలో వచ్చి కాలుతున్న ఇస్ర్తి పెట్టె వీపుపై పెట్టిందట. ఇలాంటి వ్యంగ్య కథా కథనాలెన్నో సాక్షి వ్యాసాల్లో వున్నాయి.
పానుగంటివారి విమర్శలు కొన్ని చాలా ఘాటుగా వుంటాయి. కొందరు కాశీలో ఏదో కాయ పండో వదలిపెట్టి మహాత్ములైనట్లు భావిస్తారు. కానీ ఏ ఒక్క అవలక్షణం వదులుకోరు. ‘‘కాయగూరలను కాశీలో వదలుట’’ అనే వ్యాసం చూడండి.
ఒక సంతర్పణలో భోజనం చేస్తున్న జంఘాల శాస్ర్తీ ప్రక్కన ఒక బ్రహ్మచారి కూర్చున్నాడు. వాడు జంఘాల శాస్ర్తీతో తానుంచుకున్న స్ర్తి పరమ యోగ్యురాలని, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల దయవల్ల గర్భవతి అయిందని, వేవిళ్ళు ఎక్కువగా వున్నాయని ఏదో వాగుతున్నాడు. ఈ లోపల వడ్డనవాడు అతని విస్తరిలో పులుసు పోశాడు. ఉగ్రుడై ఆ బ్రహ్మచారి వాడ్ని చెడామడా తిట్టాడు. ఇంతకూ కారణమేమిటంటే అతడు కాశీలో వదలిపెట్టిన బెండకాయ ముక్క పులుసులో వచ్చిందట.
అక్కడ పానుగంటివారి వ్యాఖ్య చూడండి.
‘‘బెండకాయ పులుసు చేతనంటదగదు కాని, పింజారి దాని మోవినంటదగును కాబోలు. కాయశుద్ధి, చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి ఇచ్చునది శాక పరిత్యాగమేకాని, వ్యభిచార పరిత్యాగము కాదు కాబోలు’’- ఈ ఉదాహరణలు మిఠాయి మచ్చు మాత్రమే. తరువాత కొందరైనా అచ్చుకొంటారని ఆశిద్దాం.
ఒక చిన్న విషయం చిలవలు పలవలుగా పెంచి వ్రాయటం పానుగంటివారి లక్షణం.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

పింగళి వెంకట కృష్ణారావు