క్రైమ్ కథ

ఇరుగు పొరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను టేక్సులు చెల్లించే ఈ దేశ పౌరుడ్ని. నా ఆస్థి మీద మీరు ఇలా దాడి చేసి నాశనం చేస్తున్నారు. మళ్లీ ప్రతీది మీరు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాను’ వారెన్ కోపంగా చెప్పాడు.
‘మిస్టర్ వారెన్! మీకా విషయంలో చింత వద్దు. మేము వెదికేది మాకు దొరికినా, దొరక్కపోయినా అలాగే చేస్తాం’ డిటెక్టివ్ సార్జెంట్ లిట్లర్ చెప్పాడు.
అతను తన భార్య శవం గురించి చెప్తున్నాడని వారెన్‌కి తెలుసు. అంతదాకా వాళ్లు వెదికినా అది దొరకలేదు.
‘మీరు మళ్లీ నా ఇంటిని సక్రమంగా చేయడానికి చాలా సమయం ఖర్చు చేయాలి సార్జెంట్. నీ మనుషులు నా తోటనంతా తవ్వేశారు. ఇంటి ముందు లాన్ దున్నిన పొలంలా ఉంది. మీరు నా ఇంట్లో నేలని అక్కడక్కడా కొద్దికొద్దిగా తవ్వుతున్నారు. మీ వాళ్లు జాక్‌హేమర్‌ని బేస్‌మెంట్లోకి తీసుకెళ్లడం ఇప్పుడే చూసాను’ వారెన్ ఆక్రోశంగా చెప్పాడు.
వారెన్, లిట్లర్లు వంటగదిలో కాఫీ తాగుతూ కూర్చున్నారు. లిట్లర్‌లో తను వచ్చిన పని సాధిస్తాననే నమ్మకం కనిపిస్తోంది. అతను తను జ్ఞాపకం పెట్టుకున్న విషయాన్ని చెప్పాడు.
‘అమెరికా మొత్తం విస్తీర్ణం 3,026,789 చదరపు మైళ్లు - నీళ్లు కూడా కలిపి’
‘అది హవాయి ద్వీపం, అలాస్కా కూడా కలిపా మిస్టర్ లిట్లర్?’ వారెన్ ఏవగింపుగా అడిగాడు.
‘అవికాక. ఈ మొత్తం విస్తీర్ణంలో పర్వతాలు, నగరాలు, పొలాలు, గ్రామాలు, ఎడారి, నీరు, మైదానాలు ఉన్నాయి. ఐనా ఓ మనిషి తన భార్యని చంపాక ఆమె శవాన్ని తప్పకుండా తన ఆస్థి పరిధుల్లోనే పాతి పెడతాడు’
‘అది అత్యంత భద్రమైన చోటు’ అని వారెన్ అనుకున్నాడు. అడవుల్లో పాతితే ఏ బాయ్ స్కౌటో లేదా పెంపుడు కుక్కో ఎప్పుడైనా తవ్వి తీయచ్చు.
‘మీ ఇంటి విస్తీర్ణం ఎంత?’ లిట్లర్ ప్రశ్నించాడు.
‘అరవై బై నూట ఏభై అడుగులు. నేను నా తోటని తీర్చిదిద్దడానికి చాలా సంవత్సరాలు పట్టింది’
పోలీసులు వచ్చి రెండు గంటలైంది. లిట్లర్ తను వారెన్ భార్య శవాన్ని కనుక్కోగలననే ఆశతోనే ఇంకా ఉన్నాడు.
వారెన్ కిటికీలోంచి బయటకి చూసాడు. పోలీసుల ఆధ్వర్యంలో ఎనిమిది మంది కూలీలు తోటలో గోతులు తవ్వుతూ కనిపించారు.
‘మేము ఏ పనైనా చాలా వివరంగా చేస్తాం. మీ చినీలోని మసిని తీసుకెళ్లి ఎనలైజ్ చేస్తాం. మీ ఇంటి ఫర్నేస్‌లోని బూడిదని కూడా కెమికల్ ఎగ్జామినేషన్ చేస్తాం’
‘నేను నా భార్యని చంపలేదు. నిజానికి ఆమె ఎక్కడుందో నాకు తెలీదు’ వారెన్ చెప్పాడు.
లిట్లర్ ఖాళీ కప్పులోకి మరి కొంత కాఫీ పోసుకుని, రెండు షుగర్ క్యూబ్స్ వేసుకుని అడిగాడు.
‘ఆమె మీ ఇంట్లో లేకపోవడం మీద మీ వివరణ ఏమిటి?’
‘నా వివరణ ఏమీ లేదు. ఎమిలీ సూట్‌కేస్‌ని సర్దుకుని నిన్న రాత్రి నన్ను వదిలి వెళ్లిపోయింది. ఇంట్లో ఆమె ఖరీదైన దుస్తులు లేకపోవడం మీరు గమనించి ఉండాలి’
‘ఆమెకి ఏం దుస్తులు ఉన్నాయో, ఏం లేవో నాకేం తెలుసు?’
‘మీరు మా ఫేమిలీ ఆల్బం ఇప్పటికే చూశారు. ఆమె ఆ ఫొటోల్లో ఖరీదైన దుస్తులని ధరించింది. ఇంట్లో అవేమీ లేవు’
‘మీరు ఆమెని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇది వ్యక్తిగత ప్రశ్న కాదు కాబట్టి నొచ్చుకోకండి.’
‘ప్రేమించి’
అది సార్జెంట్ నమ్మలేదు.
‘మీ భార్యకి లక్ష డాలర్ల ఇన్సూరెన్స్ ఉంది. దానికి లబ్ధిదారు మీరే. అవునా?’
‘అవును’
ఆమె మరణానికి ఆ పాలసీ కూడా ఓ ప్రధాన కారణం అని వారెన్ మనసులో అనుకున్నాడు. కాని ఆమెని హత్య చేయడానికి అసలు కారణం ఇక ఆమెని భరించలేక తను ఆమెని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెతో తీవ్ర ప్రేమలో ఉన్నాడు. పైగా చాలాకాలం బ్రహ్మచారిగా ఉండటంతో ఇక పెళ్లి కాదనే భయం మరో కారణం. ఎమిలీ, వారెన్ మార్నల్ పేపర్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూండగా వారికి పరిచయం. వారెన్ సీనియర్ అకౌంటెంట్‌గా, ఎమిలీ టైపిస్ట్‌గా పని చేసేవారు. ఇక తనకి పెళ్ళైయ్యే గీత లేదని ఆమె కూడా భావించింది. ఆమెకి ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలీదు. సాధారణ తెలివితేటలు గలది. రోజు విడిచి రోజు దినపత్రికని తిరగేయడంతో వచ్చిన లోకజ్ఞానమే ఆమెలో ఉంది. వాతావరణం గురించి తప్ప ఇంకే విషయం పెద్దగా మాట్లాడలేదు. ఎమిలీతో పెళ్లి శృంగార సుఖం కోసం కాక వైవాహిక జీవితం కోసం అనుకుని వారెన్ అనుకున్నాడు.
పెళ్లికి ముందు నిశ్శబ్దంగా ఉండే ఎమిలీ, తను పెళ్లి చేసుకున్నందుకు కృతజ్ఞతగా ఉండే బదులు పెళ్లైయ్యాక గయ్యాళిగా మారడం అతన్ని ఆశ్చర్యపరిచింది.
‘మీకు, మీ భార్యకి మధ్య సంబంధం ఎలా ఉంది?’ లెట్లర్ అపశ్నించాడు.
‘మాకుండే అభిప్రాయ మేధాలు మానుకున్నాయి. ప్రతీ జంటకి ఇది మామూలే కదా?’ వారెన్ జవాబు చెప్పాడు.
సార్జెంట్ దగ్గర ఈ విషయంలో చాలా సమాచారం ఉంది.
‘మీ ఇరుగు పొరుగు చెప్పిందాన్నిబట్టి మీరు, మీ భార్య రోజూ తీవ్రంగా పోట్లాడుకుంటూండే వాళ్లు. అవునా?’ అడిగాడు.
‘ఇరుగు పొరుగు అంటే, మీరు చెప్పేది ఫ్రెడ్, విల్యాల గురించా?’
‘ఈ ప్రశ్న దేనికి అడిగారు?’
‘నాది కార్నర్ ఇల్లు. మా ఎదురిల్లు వారిదే. ఎమిలీ కంఠం మా సందు చివర ఉన్న మారిసన్స్ ఇంటి దాకా వినిపించదని నా అనుమానం’
‘ఫ్రెడ్, విల్యాలు మీ పొట్లాటల్ని చాలాసార్లు విన్నారు. దాదాపు ప్రతీ రాత్రి’
‘మా పోట్లాటలు అనేది అబద్ధం. ఎమిలీ నాతో పోట్లాడింది విన్నారని అనండి. నేను ఎన్నడూ గొంతు పెంచి పెరగను’ వారెన్ చెప్పాడు.
‘ఎమిలీని వాళ్లు ఆఖరిసారి చూసింది శుక్రవారం సాయంత్రం ఆరున్నరకి. మీ ఇంట్లోకి వస్తూండగా’
‘అవును. ఆమె సూపర్ బజార్ నించి ఫ్రోజెన్ ఫుడ్, ఐస్‌క్రీంలతో వచ్చింది. ఆమెకి వంట చేతకాదు. నా బ్రేక్‌ఫాస్ట్‌ని నేనే చేసుకుంటాను. లంచ్ కంపెనీ కేఫ్టీరియాలో తింటాను. రాత్రుళ్లు నా భోజనం నేనే వండుకుంటాను. వాళ్లు ఆమెని ఆఖరిసారి చూసింది అప్పుడే. కాని నేను ఆమె పక్క మీదకి వెళ్తూండగా ఆఖరిసారి చూసాను. ఉదయం నిద్ర లేచాక చూస్తే ఆమె లేదు. సూట్‌కేస్ కూడా లేదు’
కింద నించి జాక్‌హేమర్ బేస్‌మెంట్లోని కాంక్రీట్ నేలని పగలకొట్టడం వినిపించసాగింది. ఆ శబ్దాన్ని భరించలేక వారెన్ లేచి బేస్‌మెంట్ మెట్ల తలుపుని మూసి చెప్పాడు.
‘విల్మాకి, ఎమిలీకి కొంత పోలిక ఉంది. వాళ్లిద్దరూ లావుగా ఉంటారు. ఇద్దరూ కూడా కోపంలో పొడుగైన వాళ్లు. శాంతంలో మరుగుజ్జులు. ఫ్రెడ్ స్వభావరీత్యా నాలా శాంతపరుడు. భార్య గయ్యాళితనం వల్ల అతను ఇంకాస్త శాంతపరుడు అయ్యాడు.’
వారెన్ రిలాక్స్ అయ్యేది ఫ్రెడ్‌తో కలిసి చదరంగం ఆడేప్పుడే. ఇద్దరి భార్యల్లో ఎవరో గట్టిగా పిలిచేదాకా ఆడతారు. అతను మేథావి కాదని వారెన్ ఆడేప్పుడు గ్రహించాడు.
‘శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెడ్ మీ ఇంట్లోంచి భయంకరమైన చావుకేకని విన్నాడు’ లిట్లర్ చెప్పాడు.
‘్భయంకరమైన? అంటే?’ వారెన్ ప్రశ్నించాడు.
‘అది అతను ఉపయోగించిన మాట’
‘ఫ్రెడ్ అబద్ధం చెప్పాడు. అతని భార్య కూడా విన్నదా?’
‘లేదు. ఆమె గాఢనిద్రలో ఉంది. ఆ కేకకి అతనికి మెలకువ వచ్చింది.’
‘ఈ భయంకరమైన చావుకేక మారిసన్స్‌ని కూడా నిద్ర లేపిందటా?’ వారెన్ ఎకసెక్కంగా అడిగాడు.
లిట్లర్ పైప్‌లో పొగాకుని నింపుకుంటూ మళ్లీ చెప్పసాగాడు.
‘ఫ్రెడ్ తన భార్యని వెంటనే లేపాలని అనుకున్నాడు. కాని కోపంతో అరుస్తుందని ఆ పని చేయలేదు. అతనికి వెంటనే నిద్ర పట్టలేదు. తెల్లారుఝామున రెండుకి మీ తోటలోంచి అతనికో శబ్దం వినిపించింది. వెంటనే తన భార్యని లేపి జరిగింది చెప్పాడు. వాళ్లు ఇద్దరూ మీరు చేసేది గమనించారు.’
‘వాళ్లిద్దరూ దుర్మార్గపు గూఢచారులన్న మాట. మీకు ఆ విధంగా తెలిసిందా?’ వారెన్ అసహనంగా అడిగాడు.
‘అవును. మీరు అంత పెద్ద పెట్టెని ఎందుకు ఉపయోగించారు?’
‘నాకు వెంటనే దొరికింది అదొక్కటే. కాని అది శవపేటిక అంత పొడుగైంది కాదు.’
‘విల్మాకి శనివారం అంతా ఎమిలీ కనపడలేదు. మిమ్మల్ని అడిగితే ఆమె ఏదో ట్రిప్‌కి వెళ్లిందని, కొంతకాలం దాకా తిరిగి రాదని చెప్పడంతో మీ భార్య శవాన్ని ఆ పెట్టెలో పట్టించి పాతిపెట్టారని భావించింది.’
‘దాంట్లో మీకా శవం దొరికిందా?’
‘లేదు. చచ్చిన పిల్లి ఉంది’
‘అంటే నేను చచ్చిన పిల్లిని పాతిపెట్టడం నేరం అంటారా?’
‘మీరు సూటి సమాధానాలు చెప్పలేదు మిస్టర్ వారెన్. ముందు మీరేం పాతిపెట్టలేదని అబద్ధం చెప్పారు.’
‘అది మీకు సంబంధం లేనిదని నేను చెప్పలేదు.’
‘తర్వాత మీరా పిల్లి సహజంగా మరణించిందని చెప్పారు.’
‘ఆ సమయంలో నాకు అలాగే అనిపించింది.’
‘అది మీ భార్య పెంపుడు పిల్లి. ఎవరో దాని తల పగలగొట్టి చంపారు’
‘చచ్చిన పిల్లి ఎలా చచ్చిందో పరిశీలించే అలవాటు నాకు లేదు’
లిట్లర్ తన పైప్‌ని వెలిగించి, ఓ దమ్ము లాగి చెప్పాడు.
‘మీరు మీ భార్యని చంపాక ఆమె పిల్లిని కూడా చంపారని నా అనుమానం’
‘నాకు నా భార్యతో పేచీ తప్ప పిల్లితో పేచీ ఏం ఉంటుంది’ వారెన్ విసుగ్గా అడిగాడు.
‘చంపినా ఆమె మీద కోపం చల్లారక దీన్ని చంపి ఉండచ్చు. లేదా ఆ పిల్లి మీ భార్యని గుర్తు చేస్తుందనుకుని చంపి ఉండచ్చు. లేదా మీ భార్య శవాన్న పాతడం అది చూడటంతో మాకు అది ఆ ప్రదేశాన్ని..’
‘ఆపండి సార్జెంట్’ వారెన్ విసుగ్గా అడ్డుపడ్డాడు.
‘తన యజమాని లేదా యజమానురాలు పాతిపెట్టబడ్డ చోటుని పెంపుడు జంతువులు తవ్విన సందర్భాలు చాలా జరిగాయి. సాధారణంగా కుక్కలు ఆ పని చేస్తాయి. పిల్లులు కూడా చేయచ్చేమో అని మీరు అనుకుని ఉండచ్చు’
తనకి కూడా అలాంటి ఆలోచనే కలిగిందని వారెన్ అనుకున్నాడు. లిట్లర్ కొద్దిసేపు జాక్‌హేమర్ చేసే శబ్దాన్ని విని చెప్పాడు.
‘ఎవరైనా తప్పిపోయారని మాకు ఫిర్యాదు అందితే మిస్సింగ్ పర్సన్స్ బ్యూరో ద్వారా బ్రోషర్ని పంపడం మా పద్ధతి. తర్వాత వేచి ఉంటాం. సాధారణంగా వారానికో, రెండు వారాలకో తప్పిపోయిన వాళ్లు తిరిగి వస్తారు. వాళ్ల దగ్గర డబ్బు ఖర్చైపోయాక.’
‘ఎమిలీ విషయంలో మీరు ఎందుకు వేచి ఉండలేదు? కొద్దిరోజుల తర్వాత ఎమిలీ తిరిగి రావచ్చుగా? నాకు తెలిసినంత వరకు ఎమిలీ వంద డాలర్లు మించి తీసుకెళ్లలేదు’
‘కాని భార్య మాయమై, ఒకరు ఆమె చావుకేక విని, ఇద్దరు సాక్షులు వెనె్నల్లో శవాన్ని పాతిపెట్టడం చూడటాన్ని నేర లక్షణాలుగా మేము గుర్తిస్తాం. అలాంటప్పుడు వేచి ఉండం.’
తను కూడా వేచి ఉండలేదు. ఎమిలీ శవాన్ని శాశ్వతంగా దాచలేదు. అందుకే తను పిల్లిని చంపి దాన్ని వాళ్లు చూస్తూండగా పాతిపెట్టాడు.
‘దాంతో మీరు పలుగులు, పారలు తీసుకువచ్చి ఓ పౌరుడి ఆస్థిని నాశనం చేస్తారా? ప్రతీ ఇటుక రాయికి, చెక్కముక్కకి మీ మీద నష్టపరిహార దావా ఏస్తాను’ వారెన్ హెచ్చరించాడు.
ఫ్రెడ్ కంచె అవతల నించి లిట్లర్ మనుషులు తోటలో తవ్వడాన్ని గమనించడం చూసిన వారెన్ కోపంగా లేచి చెప్పాడు.
‘నేనా వెధవతో మాట్లాడుతాను’
లిట్లర్ అతన్ని బయటకి అనుసరించాడు. వారెన్ తవ్విన మట్టికుప్పల నించి కంచె వైపు నడిచాడు.
‘ఇది మంచి పొరుగ్గా ఉండటం అంటావా?’ వారెన్ తీవ్రంగా చూస్తూ ప్రశ్నించాడు.
ఫ్రెడ్ ఓ గుటక వేసి చెప్పాడు.
‘వారెన్. నేను నీకు ఎలాంటి హానీ చేయాలని అనుకోలేదు. నువ్వు ఎమిలీని చంపావని కూడా నేను నమ్మడం లేదు. అదంతా విల్మా ఊహ. నాతో బలవంతంగా పోలీసులకి తనే ఫోన్ చేయించింది.’
వారెన్ అతని వంక నిప్పులు కక్కేలా చూస్తూ చెప్పాడు.
‘ఇక మీదట మన మధ్య ఎలాంటి చదరంగపు ఆటలు ఉండవు’
తర్వాత లిట్లర్ని అడిగాడు.
‘ఈ దంపతుల ఫిర్యాదుని పక్కన పెడితే నేను నా భార్యని చంపానన్న ఆధారాలు మీకేం దొరికాయి?’
‘మీ కారు. మీరు శుక్రవారం సాయంత్రం ఐదున్నరకి దాన్ని ముర్రే వీధిలోని ఈగిల్ ఫిల్లింగ్ స్టేషన్‌కి తీసుకెళ్లి టేంక్ ఫుల్ చేయించి తెచ్చారు. పనయ్యాక మీ కార్లో ఆ పని చేసిన ఉద్యోగి స్టికర్ని అతికించాడు. అందులో పని ఎప్పుడు పూరె్తైంది. మీ స్పీడోమీటర్ మైలేజ్ వివరాలు ఉన్నాయి. అప్పటి నించి మీ కార్ స్పీడోమీటర్ ప్రభావం మైల్లో ఎనిమిదో వంతు మాత్రమే తిరిగింది. అది ఆ గేరేజ్ నించి మీ ఇంటికి ఉండే దూరం. అంటే ఆ కార్లో మీరు సరాసరి ఇంటికి వచ్చారు. శనివారం మీ ఆఫీస్‌కి సెలవు. ఇవాళ ఆదివారం. అంటే శుక్రవారం నించి మీ కారు కదల్లేదు.’
పోలీస్ ఆ స్టిక్కర్ని గమనిస్తాడని వారెన్ ఆశించాడు. లేదా ఏదో విధంగా వారి దృష్టిని దాని మీదకి మళ్లేలా చేద్దామని అనుకున్నాడు.
‘నేను నా భార్య శవాన్ని చుట్టుపక్కల గల ఖాళీ స్థలానికి మోసుకెళ్లి పాతి ఉంటానని మీకు తోచలేదా?’ నవ్వి అడిగాడు.
‘అతి దగ్గర్లోని ఖాళీ స్థలం అరమైలు దూరంలో ఉంది. అర్ధరాత్రి అంత దూరం మోసుకెళ్తే ఎవరైనా చూస్తారనే భయం ఉండదా?’
‘వారెన్. నీ డాలియా మొక్కల్ని తవ్వబోతున్నారు. వాటిని నాకు ఇస్తావా?’ ఫ్రెడ్ నెమ్మదిగా అడిగాడు.
వారెన్ జవాబు చెప్పకుండా ఇంట్లోకి నడిచాడు. మధ్యాహ్నం గడిచి సాయంత్రం ప్రవేశించేసరికి కూలీలు ఎక్కడా శవం దొరకలేదని చెప్పడంతో లిట్లర్ మొహం పాలిపోయింది. సాయంత్రం ఆరున్నరకి చీకటి పడ్డాక బేస్‌మెంట్లోని జాక్‌హేమర్ శబ్దం కూడా ఆగిపోయింది.
సార్జెంట్ ఛిల్టన్ వంటగదిలోకి వచ్చాడు. అతని దుస్తులకి మట్టి అంటుకుని అలసటగా, ఆకలిగా కనిపించాడు.
‘కింద లేదు.’
‘అంతా జాగ్రత్తగా వెదికావా?’ లిట్లర్ ప్రశ్నించాడు.
‘ఈ ఆవరణలో శవం ఉంటే అది నాకు కనపడేది. అన్ని చోట్లా ఐదడుగుల లోతుకి తవ్వాం.’
లిట్లర్ వారెన్‌తో కోపంగా చెప్పాడు.
‘నువ్వు నీ భార్యని చంపావని నాకు రూఢీగా తెలుసు.’
‘మంచిది. ఈ రాత్రికి లివర్, ఉల్లిపాయలతో స్ట్యూ చేసుకుని తింటాను’ వారెన్ హుషారుగా చెప్పాడు.
తోటలోంచి ఓ పోలీస్ అధికారి లిట్లర్ దగ్గరికి వచ్చి చెప్పాడు.
‘నేను ఫ్రెడ్‌తో మాట్లాడుతూంటే వారెన్‌కి ఓ సరస్సు పక్కన సమ్మర్ కాటేజ్ ఉందని తెలిసింది.’
వెంటనే వారెన్ చేతిలోని ఉల్లిపాయలు కిందకి జార్చాడు.
‘ఫ్రెడ్ వాగుడుకాయ’ కోపంగా అరిచాడు.
లిట్లర్ పెద్దగా నవ్వి చెప్పాడు.
‘హంతకులు సాధారణంగా భార్య శవాన్ని తమ స్థలంలోనే పాతుతారు’
‘మీరు అక్కడ ఒక్క అడుగు నేల కూడా తవ్వడానికి వీల్లేదు. ఇటీవలే ఇరవై వేల డాలర్లు ఖర్చు చేసి దానికి మరమ్మతులు చేయించాను. దాన్ని కూడా మీరు నాశనం చేయడం నేను ఒప్పుకోను’
లిట్లర్ అతని మాటలు పట్టించుకోకుండా ఛిల్టన్‌తో చెప్పాడు.
‘కొన్ని ఫ్లడ్‌లైట్లని, కొందరు కొత్త కూలీలని తీసుకురా. వారెన్! మీ కాటేజ్ ఎక్కడ ఉంది?’
‘నేను చెప్పను. ఐనా నేను అంత దూరం శవాన్ని మోసుకెళ్లలేనని మీకు తెలుసు. నా కార్ స్పీడోమీటర్ని చూసానన్నారుగా. శుక్రవారం సాయంత్రం నించి నేను ఎక్కడికీ వెళ్లలేదు.’
‘స్పీడో మీటర్ని నేరస్థులు వెనక్కి తిప్పడం నాకు తెలుసు. మీ కాటేజ్ అడ్రస్ ఏమిటి?’
‘నేను చెప్పను.’
‘మమ్మల్ని ఆపలేరు. లేదా ఈ రాత్రి అక్కడికి దొంగతనంగా వెళ్లి శవాన్ని మాయం చేద్దామని అనుకుంటున్నారా?’
‘నాకు అలాంటి ఉద్దేశం లేదు. అసలు శవమే లేదు. పౌరుడిగా నేను నా హక్కులని కాపాడుకో దలచుకున్నాను.’
లిట్లర్ పక్కింటి ఫ్రెడ్ నించి ఆ సమాచారాన్ని తెలుసుకుని, వారెన్ ఫోన్ లోంచే ఏర్పాట్లు మాట్లాడి ముప్పావు గంటలో అక్కడ నించి బయలుదేరాడు. వెళ్లబోయే ముందు చెప్పాడు.
‘రేపు మా మనుషులు వచ్చి ఇక్కడంతా సరి చేస్తారు.’
‘ప్రతీ చెట్టు, ప్రతీ పువ్వు యథాస్థానంలో ఉండాలి. లేదా మా లాయర్ మీతో మాట్లాడుతాడు.’
ఆ రాత్రి వారెన్ వండుకున్న స్ట్యూ రుచిగా ఉన్నా సరిగ్గా తినలేక పోయాడు. రాత్రి పదకొండున్నరకి తలుపు మీద ఎవరో మృదువుగా కొడితే తెరిచాడు. ఎదురుగా ఫ్రెడ్.
‘ఐయాం సారీ’ ఫ్రెడ్ చెప్పాడు.
‘నా కాటేజ్ గురించి ఎందుకు చెప్పావు?’ వారెన్ చిరాగ్గా అడిగాడు.
‘మాటల్లో నోరు జారింది’
‘వాళ్లా కాటేజ్‌ని నాశనం చేసేస్తారు’ వారెన్ కోపాన్ని అణచుకోలేక అరిచాడు.
ఫ్రెడ్ బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు.
‘విల్మా నిద్రపోతోందా?’ అడిగాడు.
‘అవును. రేపు ఉదయం దాకా నిద్ర లేవదు’
వారెన్ కోట్ తొడుక్కుని ఫ్రెడ్ వెంట అతని బేస్‌మెంట్‌కి వెళ్లాడు. ఎమిలీ శవం మీద కేన్వాస్ బట్ట కప్పి ఉంది. విల్మా వారానికో సారి మాత్రమే వాషింగ్ మెషీన్‌ని ఉపయోగించడానికి అక్కడికి వస్తుంది కాబట్టి అది శవాన్ని దాచడానికి చక్కని చోటు.
ఫ్రెడ్, వారెన్ కలిసి ఎమిలీ శవాన్ని వారెన్ బేస్‌మెంట్‌కి మోసుకెళ్లారు. అది యుద్ధ రంగంలోని ట్రెంచ్‌ని గుర్తు చేసేలా ఉంది. వాళ్లు ఆ శవాన్ని అన్నిటికన్నా లోతైన గోతిలో పడేశారు. వారెన్ పార తీసుకుని శవం కనపడకుండా అడుగున్నర మట్టిని కప్పాడు.
‘వాళ్లు రేపు దాన్ని చూడరుగా?’ ఫ్రెడ్ భయంగా అడిగాడు.
‘చూడరు. దేన్నైనా దాచే మంచి ప్రదేశం ఓసారి వాళ్లు వెదికిన ప్రదేశమే. రేప్పొద్దున పనివాళ్లు గోతులు నింపి పైన సిమెంట్ చేస్తారు’ వారెన్ చెప్పాడు.
ఇద్దరూ వంట గదిలోకి వెళ్లారు.
‘నేనో సంవత్సర కాలం వేచి ఉండాలా?’ ఫ్రెడ్ అడిగాడు.
‘అవును. మన మీద పోలీసులకి అనుమానం రాకూడదు. ఏడాది తర్వాత నువ్వు విల్మాని చంపి శవాన్ని నా బేస్‌మెంట్లో దాచచ్చు. నీ ఇల్లంతా ఇలాగే వెదికాక నీ బేస్‌మెంట్లో పూడ్చచ్చు.’
‘ఇంకా ఏడాది పాటు విల్మాతో కలిసి జీవించడం కష్టం. కాని మనం వేసుకున్న బొమ్మా బొరుసులో నువ్వే గెలిచావు. ఇందాక నువ్వు చెప్పింది నిజమేనా వారెన్?’
‘ఏమిటి ఫ్రెడ్?’
‘నాతో చదరంగం ఆడను అనడం’
‘ఆడతాను. కాకపోతే పోలీసులకి మన మధ్య మిత్రత్వం ఉందని తెలీకుండా ఆడాలి.’
‘నేను వెళ్లి బోర్డ్, పావులు తెస్తాను’ ఫ్రెడ్ ఆనందంగా చెప్పాడు.
*
(జాక్ రిట్జ్‌కి కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి