క్రైమ్ కథ

ఫొటో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోనీతో అతను పనిచేసే అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీ మేనేజర్ రస్సెల్ చెప్పాడు.
‘సీటన్ సోప్ ప్రకటన మనకి వచ్చింది. వారి షాంపూ, సోప్‌లకి పత్రికా ప్రకటనలకి చక్కటి ఫొటోలు కావాలి’
టోనీ తల ఊపాడు. అతను ఫ్రీలాన్సర్. ఆ ఏజెన్సీకి అతను తరచు ఫొటోలని అమ్ముతూంటాడు. అతను ఫొటో తీస్తున్నాడంటే మోడల్స్ అంతా ఉత్సాహం చూపిస్తారు. కారణం వారిలోని చక్కటి కోణాన్ని ఆవిష్కరించి, అంతదాకా వారు కనపడనంత అందంగా వారిని కెమెరా ఫిల్మ్ మీద బంధిస్తాడు. ఏటా అతనికి అడ్వర్టయిజ్‌మెంట్ పోటీల్లో ఒక్క బహుమతి అయినా వస్తూంటుంది.
‘మోడల్ ఎవరు?’ టోనీ అడిగాడు.
‘నా భార్యే’
టోనీ అతని భార్య కోరాని ఒకటి రెండుసార్లు పార్టీల్లో చూశాడు. సన్నగా, అందంగా ఉంటుందామె. ఆమెవి పూడుల్ కుక్కకి షాంపూ చేసేంత అందమైన చేతులు కావని అనుకున్నా టోనీ నిరాకరించలేకపోయాడు.
‘నువ్వు నీ మోడల్స్‌ని హానీ, డార్లింగ్, స్వీట్‌హార్ట్ అని సంబోధిస్తూంటావు. ఈసారి ఆ అలవాటు మానుకోవాలి. కారణం ఆమె నా భార్య’ రస్సెల్ నవ్వుతూ చెప్పాడు.
టోనీ బదులు మాట్లాడలేదు. రస్సెల్ అతనికి తన భార్య ఫొటోలు ఉన్న కవర్ని ఇచ్చి చెప్పాడు.
‘మృదువైన చర్మం. స్పష్టమైన ఫీచర్స్. నీ కెమెరా ఆమెని ప్రేమించి తీరాలి’
‘అలాగే’
రస్సెల్ మర్నాడు మధ్యాహ్నం మూడుకి తన ఇంట్లోనే ఫొటో సెషన్‌ని ఏర్పాటు చేశాడు.
* * *
టోనీ ఆ సమయానికి రస్సెల్ ఇంటికి చేరుకున్నాడు. చేతిలో చిన్న చవక రకం బాక్స్ కెమెరాతో ఉన్న వారి పదేళ్ల కూతురుని తన ఫొటోగ్రాఫర్ కళ్లతో చూశాడు. ఆమెది ఫొటోజెనిక్ ఫేస్ కాదు. ఆమెతో చెప్పాడు.
‘ఫొటో సెషన్ పూర్తయ్యేదాకా ఇక్కడ పిల్లలు ఉండకూడదు హానీ’
‘ఇది మా వారి ఇల్లు. ఆయన కూతుర్ని ఇంట్లోంచి బయటకి పంపే అధికారం మీక్కాని, నాక్కాని లేదు’ కోరా విసుగ్గా చెప్పింది.
‘నా పేరు మార్టీ. నేను వెళ్లి నా కెమెరాలో రీల్ వేసుకుని వస్తాను’ ఆ పాప చెప్పింది.
‘అది మంచి పేరు’ టోనీ చెప్పాడు.
‘మార్తా! నీ పేరు మార్టీ కాదు. మార్తా’ కోరా చిరుకోపంగా చెప్పింది.
మార్తా వెళ్లాక కోరా నవ్వుతూ చెప్పింది.
‘దానికి ఆ పేరంటే ఇష్టం. మార్టీ పేరు ఎందుకు పెట్టలేదని అడుగుతూంటుంది’
కొద్ది నిమిషాల్లో మార్తా మళ్లీ ఆ బాక్స్ కెమెరాతో వచ్చింది. ఆమె ఫొటోసెషన్‌లో అడ్డుపడుతూనే ఉంది. ఒకటి, రెండుసార్లు క్లిక్ చేసేప్పుడు ఫొటో బేక్‌గ్రౌండ్‌లోకి వచ్చింది. ఐతే అవేమీ ఓకే అయేంత గొప్ప ఫొటోలు కావు కాబట్టి సరిపోయింది. ఓసారి ఆమె ట్రిపాడ్‌ని తాకడంతో అది కింద పడిపోయింది. అప్రమత్తంగా ఉన్న టోనీ దాన్ని అందుకోవడంతో కెమేరాకి ఏం కాలేదు. టోనీ ఆమెని పక్కకి జరగమని అర్థించి తన పనిని కొనసాగించాడు. రస్సెల్ అక్కడ లేకపోతే మార్తాని గద్దించేవాడే. తన పని టోనీకి తృప్తి కలిగించక పోవడానికి కారణం ప్రతీ దానికి అడ్డు చెప్పే రస్సెల్.
‘అలా కాదు టోనీ. నీ ఫ్రేమింగ్ కరెక్ట్‌గా ఉన్నట్లు లేదు. కోరా, నువ్వు కొద్దిగా పక్కకి వంగితే నీ వెనక రంధ్రం మూసుకుంటుంది’ కెమేరా వ్యూ ఫైండర్లోంచి చూసి చెప్తాడు.
టోనీ ఆమె కళ్లల్లో సబ్బు నురగని ఉంచుకోమని, నురగని రెండు చేతులతో కనపడేలా పట్టుకోమని ఇచ్చిన సూచనలని ఆమె పాటించసాగింది.
‘మార్తా! నీ డొక్కు కెమేరాని తీసుకుని బయటకి వెళ్తావా? లేదా? ఇక్కడ ఫొటోలు తీయాల్సింది నువ్వు కాదు. టోనీ. న్యూసెన్స్ చేయకు’ కోరా కోప్పడింది.
‘కోరా! నీ ఎడం చేతిని కొద్దిగా పైకి లేపుతావా.. అలాగే ఉంచు. కదల్చక..’
‘ఆమె చెయ్యి అవుటాఫ్ ఫోకస్‌లో ఉంది. ఇందాక వంచినట్లుగానే ఉంచు...’ ప్యూఫైండర్లోంచి చూసి రస్సెల్ చెప్పాడు.
‘ఇది ప్రాథమికం’ టోనీ ఫోకస్‌ని ఎడ్జస్ట్ చేసి చెప్పాడు.
‘నా కెమేరాలో రీల్ అయిపోయింది’ చెప్పి మార్తా లోపలకి పరుగెత్తింది.
‘ఇంక రాకు. పని బాగా సాగుతుంది’ కోరా అరిచింది.
‘చేతుల నిండా నురగ తీసుకుని ఆ కుక్క మీద వేయండి.. అలా కాదు.. దాని వంక చూస్తూ.. గుడ్’
వ్యూఫైండర్లోంచి చూస్తే టోనీకి అంతా సరిగ్గా కనిపించింది. కుక్క కోరా సరైన ప్రదేశాల్లో ఉన్నారు. నురగ మీద అతి పెద్ద బుడగలు ఉన్నాయి. కోరా మొహం రిలాక్స్‌డ్‌గా కనిపించింది. సరిగ్గా క్లిక్ చేసే సమయంలో రస్సెల్ అతన్ని పక్కకి తోసి చెప్పాడు.
‘ఒక్క క్షణం. నన్ను చూడనీ’
కావాలని రస్సెల్ ఫోకస్‌ని మార్చాడు. కోపంతో అతన్ని కొట్టడానికి ఎత్తిన చేతిని టోనీ తమాయించుకుని నిగ్రహించుకుని దింపాడు. ఇది రస్సెల్ గమనించలేదు. ఆ సమయంలో మార్తా ఫోన్ క్లిక్‌మంది. రస్సెల్ తలని తృప్తిగా ఆడించి చెప్పాడు.
‘బావుంది. క్లిక్ చెయ్యి’
కాని కుక్క కదిలింది. కోరా మొహంలో ఇందాకటి చిరునవ్వు మాయమై సీరియస్‌నెస్ కనిపించింది. పదవ ఆఖరి ఫిల్మ్ రీల్ కూడా ఖర్చయ్యాక టోనీ కనీసం ఒక్క ఫొటో బాగా వచ్చినా బావుండును అనే నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. రస్సెల్ అతన్ని పై గదిలోకి ఆహ్వానిస్తూ చెప్పాడు.
‘షాంపేన్ బాటిల్‌ని తెరుద్దాం’
‘నేను కూడా కొద్దిగా రుచి చూడచ్చా?’ మార్తా తండ్రిని ఆశగా అడిగింది.
వెంటనే కోరా ఉగ్రంగా చెప్పింది.
‘నువ్వు ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టావు. నీ కెమేరాని అక్కడ ఉంచి నీ గదిలోకి వెళ్లు. నేను పిలిచేదాకా అక్కడే ఉండు. అర్థమైందా?’
తల్లి కంఠస్వరంలోని తీవ్రతని గుర్తించిన మార్తా భయంగా తల ఊపి కెమేరాని మేకుకి తగిలించి బయటకి వెళ్లిపోయింది.
‘నేను వెళ్లి మేకప్ తీసేసి వస్తాను’ కోరా చెప్పి బాత్‌రూంలోకి వెళ్లింది.
‘నీ వర్క్‌తో ఇవాళ నీకు తృప్తి కలిగినట్లు లేదు?’ రస్సెల్ టోనీని ప్రశ్నించాడు.
టోనీ వెంటనే చప్పుడయ్యేలా తన కెమేరా కేస్‌ని టేబిల్ మీద ఉంచి అడిగాడు.
‘ఎందుకు మీరు కావాలని నా వర్క్‌ని పాడు చేసారు?’
‘అది నువ్వు చెప్తే వినాలనుకుంటున్నాను టోనీ. నీ మోడల్‌తో నీకు ఎంతకాలం నించి పరిచయం?’
‘ఏమిటి మీరనేది? ఆమెతో ఇదే నా మొదటి సెషన్’
‘ప్రకటనల ఫొటోగ్రాఫర్‌గా నీ సమర్థత తగ్గిందని నేను మన సర్కిల్స్‌లో చెప్పదలచుకున్నాను. అందుకు ఇవాళ నువ్వు తీసిన ఫొటోలు అందుకు మంచి రుజువు’ రస్సెల్ క్రోధంగా నవ్వుతూ చెప్పాడు.
టోనీ నివ్వెరపోయాడు. రస్సెల్ ఇంత అసూయాపరుడని అనుకోలేదు. ఇంత దుర్మార్గాన్ని అతను ఎదురుచూడలేదు. మేకప్ తుడిచేసుకుని, డ్రెస్ మార్చుకుని వచ్చిన కోరా అడిగింది.
‘రస్ డార్లింగ్. నాకు డ్రింక్ ఇస్తావా?’
అతను వంగి బాటిల్‌ని అందుకుంటూంటే ఆమె టోనీ కెమేరా ట్రిపాడ్ అందుకుని బలంగా అతని నెత్తి మీద బాదింది. రస్సెల్ చిన్నగా మూలుగుతూ తక్షణం కింద పడ్డాడు. మూడో దెబ్బకి అతని పుర్రె పగిలింది. కోరా ట్రిపాడ్‌ని నేల మీద పడేసి గ్లవ్స్‌ని విప్పుతూ చెప్పింది.
‘నాకు రస్సెల్ అంటే ద్వేషం, అసహ్యం. మీరీ పని చేయకుండా ఉండాల్సింది’
‘ఏమిటి నేను చేయకుండా ఉండాల్సింది?’ ఆ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయిన టోనీ అడిగాడు.
అతనికి కాళ్లల్లోంచి వణుకు వచ్చింది.
‘మార్తా! మీ నాన్నని చంపేశాడు. పోలీసులకి ఫోన్ చెయ్’ ఆమె గట్టిగా అరుస్తూ బయటకి పరిగెత్తింది.
టోనీకి అంతా అయోమయంగా ఉంది. రస్సెల్ శవాన్ని చూశాడు. తన ట్రిపాడ్‌ని అందుకుని అనాలోచితంగా దానికి అంటుకున్న రక్తాన్ని తన చొక్కా అంచుతో తుడిచాడు. అతనికి తన కెమేరా అన్నా, దానికి సంబంధించినవి ఏవైనా అన్నా ప్రాణం.
కింద నించి కోరా కంఠం వినిపించింది.
‘నా భర్తని చంపేశాడు.. నా కూతురికి, నాకు ప్రాణభయం ఉంది. ఎందుకంటే హంతకుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. వెంటనే రండి.’
* * *
సార్జెంట్ టోనీని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. అతను జరిగింది చెప్పింది నమ్మలేదు. అకస్మాత్తుగా, అకారణంగా కోరా తన భర్తని ఎందుకు చంపుతుంది?
మర్నాడు జైల్ సెల్‌లోని టోనీకి అతను రస్సెల్‌ని కొట్టబోతున్న ఫొటోని చూపించి అడిగాడు.
‘హతుడి మీద మీకు ఎందుకు ఇంత ద్వేషం?’
మార్తా ఆ దృశ్యాన్ని సరిగ్గా ఆ సమయంలో ఫొటో తీయడం తన దురదృష్టం, కోరా అదృష్టం అనుకున్నాడు.
కోరా కూడా టోనీ తన భర్తని హత్య చేయడానికి కారణం చెప్పలేకపోయింది. కాని తను బాత్‌రూంలో ఉండగా వారి మధ్య తీసిన ఫొటోల విషయంలో వాగ్యుద్ధం జరగడం విన్నానని చెప్పింది. తను ఆ గదిలోకి రాగానే అకస్మాత్తుగా టోనీ తన భర్త మీద మూడుసార్లు కొట్టాడని, ఆ తాత్కాలిక కోపంతో కొట్టి ఉండచ్చని చెప్పింది. రస్సెల్ అంటే టోనీతో సహా ఎవరికీ పడదని అతని ఆఫీస్ సిబ్బంది కూడా చెప్పారు. టోనీ మీద హత్యానేరం కేస్‌ని బుక్ చేశారు. ఆ రాత్రంతా కూడా టోనీ సెల్‌లోనే గడిపాడు. తన లాయర్‌కి జరిగింది చెప్పాడు.
మర్నాడు ఉదయం సెల్ తలుపు తెరచి సార్జెంట్ చెప్పాడు.
‘సారీ మిస్టర్ టోనీ! మీరు హత్య చేయలేదని, మీరు చెప్పినట్లు హంతకురాలు కోరానే అని తెలిసింది. స్వేచ్ఛగా ఇంటికి వెళ్లచ్చు’
‘ఎలా తెలిసింది?’ టోనీ సంభ్రమంగా అడిగాడు.
సార్జెంట్ అందించిన కవర్ని తెరచి చూస్తే మార్తా అతి చవక కెమేరా ప్రమాదవశాత్తు తగిలించిన మేకు నించి జారి కిందపడ్డప్పుడు క్లిక్ అయి, లో ఏంగిల్‌లో తీయబడ్డ ఫొటో కనిపించింది. కోరా కింద పడ్డ తన భర్తని మూడోసారి కొట్టే దృశ్యం అందులో స్పష్టంగా కనిపించింది.
‘నేను ప్రేమించే కెమేరానే నన్ను రక్షించిందన్న మాట’ టోనీ సంతోషంగా చెప్పాడు.
(లారెన్స్ ట్రీట్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి