మెయిన్ ఫీచర్

పాటలో’నేముంది!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కంటిన్యూ అయితే.. ఇవే పా(త)ట పదాలు.. వాటిలోని చమత్కార సౌరభాలు.. రేపన్నరోజున పోస్టర్లపై మరింతగా దర్శనమివ్వొచ్చు. ఆ మహత్తు మనల్ని థియేటర్లకు లాక్కెళ్లేలా చేయొచ్చు. ఆ తరువాత -సినిమా హిట్టా ఫట్టా అన్నది -శక్తినిమించి ప్రదర్శించగలిగే కథా విధానంపై ఆధారపడి ఉంటుంది. వేరే విషయం.
***

తెలుగు చిత్రసీమ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ -వేళ్లమీద లెక్కపెట్టే చిత్రాలనుంచి వేలల్లో లెక్కపెట్టాల్సినన్ని సినిమాలొచ్చాయి. సినిమా లెక్క ఏపాటిదైనా -కథ మాత్రం నవరసాల ఫ్రేమ్‌దాటి పోయే అవకాశం ఎలాగూ ఉండదు. ఏదోక రసంమీదో, మేళవించిన రసాల నిష్పత్తిపైనో -కథ సాగితీరాలి. కనుక -చెప్పిన కథనే తిప్పితిప్పి, మెలితిప్పి, పురితిప్పి చెప్పాల్సిన పరిస్థితి ఎలాగూ వస్తుంది. ఎమోషనల్ ఈక్వేషన్స్‌లో కొత్త ఈక్వేషన్లు కనిపెట్టి కథలల్లుకోవాల్సిన స్థితి వచ్చింది, మరింత వస్తోంది. ఇలా -పాత కథను కొత్తగా చెప్పే పద్ధతి పదునుదేరిన తరువాత, ఆ కథకు ‘శీర్షిక’ పెట్టడమూ సవాలైంది. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆరుగాలం కష్టపడి నిర్మించిన సినిమా పంటను ఆడియన్స్‌కు అమ్ముకోవాలంటే -టైటిల్ మేకప్ టాప్ లెవెల్లో ఉండాలన్న నిర్ణయాలు అనుభవపూర్వకంగా బలపడ్డాయి. అట్రాక్టివ్‌గా ఉండాలన్న నమ్మకాలు నిరూపించబడ్డాయి. టైటిల్‌తోనే థియేటర్లకు లాక్కురాగలిగే శక్తియుక్తులు ప్రదర్శించాలన్న ఆలోచనలు పదునుదేరాయి. అలాంటి పరిస్థితుల నుంచే టైటిల్‌కు -ప్రాధాన్యత పెరిగింది. కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. కొత్త సమాసాలు ఏర్పడ్డాయి. సరికొత్త ప్రయోగాలు సృష్టించబడ్డాయి. జోనర్‌ను నర్మగర్భంగా చెప్పగలిగే వ్యూహాత్మక అన్వయింపులు ఆవిష్కృతమయ్యాయి. ఇలా -టైటిల్స్‌లో ఎన్నో మెళకువలు చూపించాల్సి వచ్చింది, వస్తోంది.
ఒక సినిమాకు టైటిల్ పెట్టడం వెనుక ఆసక్తికరమైన తాజా కథను ఇక్కడ చిన్నగా చర్చిద్దాం. ట్రెండ్‌గా మారిన ఒక ధోరణి తరహా చిత్రాల్లో భాగంగా ఇటీవలే వచ్చిన ఓ సినిమా -ఆర్‌ఎక్స్ 100. టాలీవుడ్‌లో సెనే్సషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్. చిత్రానికి వైవిధ్యమైన, బాగా పరిచయమైన టైటిల్ పెట్టి దర్శకుడు ఆసక్తి రేకెత్తించాడు. కథా ధోరణిని ట్రైలర్, టీజర్లలో రుచి చూపించి ఆడియన్స్‌ని థియేటర్లకు లాక్కొచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌కు -స్క్రీన్ వెనుకున్న అంతస్సూత్రమిదే. ‘యమహా ఆర్ ఎక్స్ 100’ బైక్ క్యారెక్టరైజేషన్ హీరోకి అప్లయి చేస్తే -అన్న ఆలోచన నుంచి కథ పుట్టుండాలి. అందుకే -‘హీరో క్యారెక్టర్‌కు అనుగుణంగానే టైటిల్ పెట్టాల్సి వచ్చింద’ని చెప్పుకొచ్చాడు దర్శకుడు భూపతి. ఆర్‌ఎక్స్ 100 బైక్‌కు క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేస్తే -ఎమోషనల్, అగ్రెసివ్ ఫీల్ కలుగుతుంది. కథలో హీరో శివకు అలాంటి ఉద్రేకాలనే అప్లయి చేసి, పాత్రను సృష్టించాడు. టైటిల్ విషయంలో న్యాయపరమైన చిక్కులురాకుండా జాగ్రత్తపడ్డాడు. భూపతి సక్సెస్‌లో ఇదొక కాదనలేని అంతర్లీన సూత్రం. ‘పెళ్లిచూపులు’ టైటిల్‌తో తరుణ్‌భాస్కర్, ‘అర్జున్‌రెడ్డి’ టైటిల్‌తో సందీప్ వంగ, ‘తొలిప్రేమ’ టైటిల్‌తో వెంకీ అట్లూరిని -ఇలాంటి ప్రయోగాల లిస్ట్‌లోకే చేర్చాలి. సినిమాల జయాపజయాలు వేరే కోణం.
నిజానికి ప్రతి చిత్రానికి టైటిల్ పెట్టే విషయంలో పెద్ద కసరత్తే నడుస్తుంది. కథను సిద్ధం చేసిన స్క్రిప్ట్ విభాగం ఒక టైటిల్‌ను సూచిస్తే -దానిమీద చర్చోపచర్చలు సాగుతాయి. స్క్రిప్ట్ వింగ్‌నుంచి డైరెక్షన్ వింగ్‌కు షిఫ్టయిన తరువాత -మార్కెట్ స్ట్రాటజీని పరిగణనలోకి తీసుకుని టైటిల్‌పై చర్చిస్తారు. వివిధ విభాగాల నుంచి ఏకాభిప్రాయం సాధించి.. తరువాత -టైటిల్ పాయింట్‌లోని కీలకాంశాన్ని కథలో బలంగా ఉందో లేదో కసరత్తు చేస్తారు. ఇలా అనేక కోణాల్లో విస్తృత చర్చల తరువాత -టైటిల్‌పై ఒక నిర్ణయానికొస్తారు. ఎందుకంటే ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసే ఫస్ట్ పాయింట్ -టైటిలే కనుక. మిగిలిన భాషా చిత్రాలు, జాతీయ చిత్రాలకు సంబంధించి మరీ ఇంత కసరత్తు సాగకున్నా -టాలీవుడ్‌లో మాత్రం ఒకింత కసరత్తు ఎక్కువేనన్నది టైటిల్స్ చూస్తే అర్థమవుతుంది.
***
కొత్త కథలకో, మెలితిప్పి చెప్పే పాత కథలకో -ఆసక్తికరమైన టైటిల్ పెట్టడం సవాల్‌గా మారిన ప్రతిసారీ ‘టాలీవుడ్’ సరికొత్త ధోరణిని స్క్రీన్‌మీదకు తేవడం పరిపాటిగా మారింది. ఈ ధోరణులు ఒక్కొసారి సెంటిమెంట్‌గానూ మారుతూ వచ్చాయి. కథానుగుణంగా టైటిల్ పెట్టడం కొన్నాళ్లు సాగితే.. రెండు మూడక్షరాలతో టైటిల్స్ పెట్టడం కొన్నాళ్లు సాగింది. తెలుగులో స్థిరపడిపోయిన ఇంగ్లీష్ పదాలు.. ఆంగ్ల పదాలుగా మార్చుకోగలిగే (ఉచ్ఛారణ) తెలుగు పదాలతోనూ టైటిల్ తెరమీదికొచ్చాయి. ఒక్కోసారి జనం నాల్కలమీద స్థిరపడిన ఏ భాషా పదాన్నైనా కథకు ఏదోకవిధంగా అన్వయించి టైటిల్ పెట్టడం, కథానాయకుడి పాత్రపేరునే టైటిల్ చేయడంలాంటి ప్రయోగాలు టాలీవుడ్‌లో తక్కువేం కాదు. వీటి చర్చ అంత సులువుగా తెగేది కాదు కనుక -లెటెస్ట్ ట్రెండ్‌ని పరిశీలిద్దాం. -పాత పాటల పల్లవి పదాలను ‘టైటిల్’ చేయడం లేటెస్ట్ ట్రెండ్‌గా కనిపిస్తోంది. నిజానికి ఇది ఇప్పుడే మొదలైన ట్రెండని అనలేం. చాలాకాలం క్రితంనుంచే ఈ ప్రయోగం అమల్లోకి వచ్చినా, ఈ ధోరణి కాస్త ముదిరి పాకానపడింది అంతే. కారణం -ఆ‘పాత’ మధుర గీతాలు, హృదయాంతరాలపై ముద్రవేసిన చిత్రాలూ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో పదిలం. వాటిని గుర్తు చేస్తూ, వాటి మహత్తును టైటిల్లో పొందుపర్చడంపై దృష్టి పెడుతున్నారు. ఈ టైటిల్స్ ఆడియన్స్‌లో ఆసక్తి, అంచనాలు పెంచుతున్నాయని చెప్పడానికి సాహసం చేయక్కర్లేదు. కాకపోతే, వాటి సక్సెస్ రేటుపై చర్చను సింపుల్‌గా తేల్చాయాలి.
గత మూడేళ్లలో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే -2016లో కనీసం 20 చిత్రాల వరకూ ఒకప్పటి పాట పల్లవితో వచ్చినవే.
చాందిని తమిళరాసన్, సౌమ్య, శుభశ్రీ ప్రధాన పాత్రలతో దర్శకుడు భానుప్రకాష్ బలుసు తెరకెక్కించిన హారర్ కామెడీ ‘చిత్రం.. భళారే విచిత్రం’; నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలతో దర్శకుడు కళ్యాణకృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయిన’; రాజ్‌తరుణ్, ఆర్తన హీరోహీరోయిన్లుగా గవిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీసిన రొమాంటిక్ సినిమా ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు; అజ్మల్, నిఖిత నారాయణ్ ప్రధాన పాత్రధారులుగా వంశీ తెరకెక్కించిన డ్రామా ‘వెనె్నల్లో హాయ్‌హాయ్’; రుద్ర, వెనె్న, రఘుబాబులతో ఎంవి సాగర్ తీసిన హారర్ చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’; నాగసౌర్య, మాళవికనాయర్, రాశిఖన్నాలతో నందినిరెడ్డి తీసిన లవ్‌స్టోరీ ‘కళ్యాణ వైభోగమే’; నారా రోహిత్, ఇషా తల్వార్‌తో ప్రదీప్ తెరకెక్కించిన కామెడీ ‘రాజా చెయ్యివేస్తే’; తరుణ్ శెట్టి, అవంతిక మిశ్రాతో హుస్సేన్ షా కిరణ్ తీసిన రొమాంటిక్ కామెడీ ‘మీకు మీరే మాకు మేమే’; చేతన్, పార్వతీశం, కృతికా జయకుమార్‌తో మురళీకృష్ణ ముదిదాని తీసిన రొమాన్స్ ‘రోజులు మారాయి’; అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠితో పరుశురామ్ తీసిన రొమాన్స్ ‘శ్రీరస్తు శుభమస్తు’; సుశాంత్, సోనమ్‌బజ్వాతో జి నాగేశ్వర్ రెడ్డి తీసిన రొమాంటిక్ సినిమా ‘ఆటాడుకుందాం రా’; నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కాసాండ్రాతో శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ‘జో అచ్యుతానంద’; నిఖిల్, హెబాపటేల్, నందితా శే్వత, అవికాగోర్‌లతో దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన రొమాన్స్ థ్రిల్లర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’; శ్రీనివాసరెడ్డి, షమ్నకసింలతో శివరాజ్ కనుమూరి తెరకెక్కించిన లవ్‌స్టోరీ ‘జయమ్ము నిశ్చయమ్మురా’; వౌర్యాని, నవీన్ సంజయ్‌తో టి సతీష్‌బాబు తెరకెక్కించిన లవ్‌స్టోరీ ‘జానకిరాముడు’; అల్లరి నరేష్, కృతిక జయకుమార్, రాజేంద్రప్రసాద్‌లతో జి నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన హారర్ కామెడీ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’... ఈ టైటిల్స్ అన్నీ ఒకప్పటి పాటల పల్లవులే కావడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగా పెట్టారా? కథానుగుణంగా వాడుకున్నారా? యాధృచ్చికంగా జరిగిందా? అన్న చర్చను పక్కనపెడితే -ఈ టైటిల్స్‌కు మూలం పాత పాటలన్నది వాస్తవం.
2017లోనూ ఈ తరహా టైటిల్స్‌తో డజను చిత్రాలు పురుడు పోసుకున్నాయి. వాటిలో జి బాల తీసిన ఎరోటిక్ రొమాన్స్ ‘ఏరోజైతే చూశానో నిన్ను’, సతీష్ వేగెశ్న తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘శతమానం భవతి’, కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన డివోషనల్ బయోగ్రాఫికల్ ‘ఓం నమో వెంకటేశాయ’, కళ్యాణకృష్ణ కురసాల తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘రారండోయ్ వేడుక చూద్దాం’, శివ నిర్వాత తీసిన రొమాంటిక్ స్టోరీ ‘నిన్ను కోరి..’, సంపత్ వి కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కలవరమాయె మదిలో’, బెల్లంకొండ శీనుతో బోయపాటి శీను తెరకెక్కించిన ‘జయ జానకీ నాయక’, గోవర్థన్ గజ్జల డైరెక్ట్ చేసిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం’, శివబాలాజీతో ఉప్పుటూరి మహేష్ తెరకెక్కించిన డ్రామా ‘స్నేహమేరా జీవితం’, తానే హీరోగా లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్ డైరెక్ట్ చేసిన ‘వానవిల్లు’, విశాఖ వెంకట్ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘మామా చందమామ’, మళయాలం డబ్బింగ్ సినిమాగా తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సమీర్ తాహిర్ చిత్రం ‘హేయ్ పిల్లగాడ’... ఇవన్నీ పాట పల్లవిని టైటిల్ చేసుకున్న చిత్రాలే.
ఈ ఏడాదీ దాదాపుగా రావాల్సిన సినిమాలన్నీ వచ్చేశాయ్. ఫెస్టివల్ సెలబ్రేషన్ టార్గెట్‌గా రావాల్సిన పెద్ద హీరోల చిత్రాలు తప్ప. వీటిలోనూ నితిన్, మేఘా ఆకాష్ లీడ్ రోల్స్‌తో కృష్ణచైతన్య తెరకెక్కించిన మెలో డ్రామా ‘చల్ మోహన్‌రంగ’; తానే హీరోగా తల్లాడ సాయికృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం ‘ఎందరో మహానుభావులు’; నితిన్, రాశిఖన్నా, నందితా శే్వత లీడ్‌రోల్స్‌తో సతీష్ వేగ్నెశ్న తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’, జానీ జై, రష్మిగౌతమ్ జంటగా వచ్చిన హారర్ సినిమా ‘అంతకుమించి’; ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితికాసింగ్ కీలక పాత్రలుగా హరినాథ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ నీవెవరో; నాగశౌర్య, కాష్మీరా పరదేశి, యామినీ భాస్కర్‌లతో శ్రీనివాస చక్రవర్తి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ‘అట్-నర్తనశాల’, నందు, పునర్ణవి భూపాలంలతో కోటి వడ్డినేని తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘ఎందుకో ఏమో’; సుధీర్‌బాబు, నభానటేశ్‌లతో ఆర్‌ఎస్ నాయుడు తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘నన్ను దోచుకుందువటె’; నవీద్, యామినీభాస్కర్‌లతో మురళీకృష్ణ ముదిదాని తీసిన రొమాంటిక్ డ్రామా ‘్భలే మంచి చౌక బేరము’; రామ్‌పోతినేని, అనుపమా పరమేశ్వరన్, ప్రణీతి సుభాష్‌తో నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ‘హలో గురు ప్రేమ కోసమె’... ఈ టైటిల్స్ అన్నీ పాటల పల్లవులు కాదనలేం.
అంతెందుకు -సీమ ఫ్యాక్షన్‌కు ఫుల్‌స్టాప్ కోణాన్ని చూపిస్తూ జూ.ఎన్టీఆర్, పూజాహెగ్దెలతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలోనూ ‘సీతా సమేత రఘురామ’ పాట అన్వయింపే వినిపిస్తుంది. మెగా కాంపౌండ్ హీరో రామ్‌చరణ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ టైటిల్‌లోనూ పాత పాటల ‘సంప్రదాయ’ ధోరణి కనిపిస్తోంది. నిజానికి ప్రస్తావించిన చిత్రాలు గుర్తున్నంత వరకే. ఇవికాకుండా ఈ మూడేళ్లలో మరిన్ని చిత్రాలు -పాత పాటల పల్లవులు, పాత చిత్రాల పేర్లతో వచ్చిఉండొచ్చు. ఏదేమైనా -ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందన్నది చూడాలి.
*

-- మహాదేవ