మెయిన్ ఫీచర్

ఎదురొస్తున్న థియేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ-రోజులు వేరు!
ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత -అరచేతికే స్మార్ట్ స్క్రీన్ వచ్చేసింది. లేదూ.. బహిరంగ వీధుల్లో ఆకాశమంత స్క్రీన్ మీద సినిమా నడుస్తోంది. ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాల్లో జనం దగ్గరకు చేరాలో అన్ని మార్గాల్లోనూ సినిమా అందుబాటులోకి దూసుకొచ్చేస్తోంది. ప్రేక్షకుడి దగ్గరకే సినిమా అంటూ వచ్చిన వీడియో క్యాసెట్లు, సిడీల కాలమూ పూర్తిగా మారింది. వీధికో మల్టీప్లెక్స్ సాక్షాత్కరించింది. ఒకే గొడుగు కింద నాలుగైదు స్మార్ట్ స్క్రీన్లు వచ్చాయి. ఒకే స్క్రీన్ మీద నాలుగైదు సినిమాలూ నడిచేస్తున్నాయి. అలుపులేని టెక్నాలజీ ఆధునిక పోకడలతో దూసుకొచ్చేస్తుంటే -పోను పోను ప్రేక్షకుడ్ని వెతుక్కుంటూ థియేటర్లే క్యూకట్టబోతున్నాయి.
***
‘తరలిరాదా తనే వసంతం/ తన దరికిరాని వనాల కోసం’ అన్నాడో సినీ కవి. వసంతం మాటేమోగాని సినిమా మాత్రం పోనుపోను ప్రేక్షకుడ్ని వెతుక్కుంటూ పోతోంది. ఒకపక్క -విడుదలైన నెలల్లోనే ఇంట్లో చానెల్స్‌పై సినిమా వాలిపోతుంది. అయితే, ఈ ఛాన్స్ అన్ని సినిమాలకూ ఉండదు. కేవలం అగ్ర హీరోలకు, హిట్ టాక్ సొంతం చేసుకున్న చిన్న సినిమాలకే. చిన్న సినిమాల విషయంలో థియేటర్లు కరవవుతున్నాయి. పెద్ద సినిమాలు లేకపోతేనే చిన్న సినిమాలకు థియేటర్లు దొరుకుతున్నాయి. అందుకే అన్ని సినిమాలకు ఛాన్స్ కల్పించేలా ప్రైవేట్ సంస్థలు షాపింగ్ మాల్స్ కూడలిలోనూ, బస్‌స్టేషన్‌లలోనూ మినీ థియేటర్లను ప్లాన్ చేస్తున్నాయి. అంటే- కష్టం లేకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా కావాల్సినపుడు సినిమా చూసే భాగ్యం కల్పిస్తున్నాయన్న మాట. ఈ కాలక్షేపం థియేటర్లు రోజు రోజుకు ప్రేక్షకుల చెంతకు వెళ్తున్నాయి.
కంటైనర్ థియేటర్లు.. ఓపెన్ ఎయిర్ థియేటర్లు, డ్రైవ్ ఆన్ థియేటర్లు.. ఇలా విచిత్ర పేర్లతో విస్తృతంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సినిమా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మినీ థియేటర్లు ఏర్పాటు చేసేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రయివేట్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రణాళికలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసుకుని ఆవిర్భావ స్థితికి చేరుకున్నాయి. కంటైనర్ థియేటర్లని సోలార్ సిస్టమ్‌లో నడిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా హాళ్ళు మూతబడిన గ్రామీణ ప్రాంతాల్లో కంటైనర్ థియేటర్ల ద్వారా సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధునిక పోకడలతో థియేటర్‌ను నిర్మించాలంటే భారీ నిర్మాణ వ్యయం అవుతుంది కనుక -అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కంటైనర్ థియేటర్లను నెలకొల్పే ఆలోచనలు ఊపందుకుంటున్నాయి. ఈ విధానంలో ప్రదర్శించే సినిమాకు ఏవిధంగా టాక్స్ చెల్లించాలనేది పూర్తిగా నిర్ణయం కావాల్సివుంది. ఎఫ్.ఎమ్‌కు అనుసంధానం చేయబడిన సౌండ్ సిస్టమ్.. శాటిలైట్‌కు అనుసంధానం చేయబడిన సినిమాను కంటైనర్ థియేటర్‌లో ప్రదర్శిస్తారు. కంటైనర్ థియేటర్లు ఒకవిధంగా మొబైల్ థియేటర్లని చెప్పాలి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు ఈ విధానంలో విశాఖపట్నంలో సినిమాను కాసేపు తిలకించారు. ఈ విధానం వలన కొత్త సినిమాలు గ్రామీణ ప్రాంతాలకు ఇట్టే చేరే అవకాశం ఉంది. ఈ సిస్టమ్‌లో సినిమాను ప్రదర్శించినపుడు ఖాళీ ప్రదేశంలో కంటైనర్ ఏర్పాటు చేసుకుంటే పార్కింగ్‌కు కూడా అవకాశం ఉంటుంది. సినిమా ప్రేక్షకుడ్ని వెదుక్కుంటూ వెళ్లినపుడు కాలక్షేపం కోసం సినిమా చూసే అవకాశం కూడా వుంటుంది. పైగా కంటైనర్ సినిమాలు సినిమా హాళ్ళులేని ప్రదేశాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. తక్కువ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీ సౌకర్యాలతో కంటైనర్ థియేటర్లు గ్రామీణస్థాయి ప్రేక్షకుల్ని కొత్త సినిమాలతో బాగానే మెప్పించే అవకాశం వుంది. కంటైనర్ చుట్టూ సినిమా పోస్టర్‌ని ప్రదర్శించే ఏర్పాట్లు చేసుకోవడం వలన ప్రేక్షకులకు థియేటర్లు ఇట్టే తెలుస్తాయి. సోలార్ సిస్టమ్ ద్వారా ప్రదర్శన జరుగుతుంది కాబట్టి ప్రదర్శనలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. తక్కువ ధరతో సినిమా చూసే అవకాశం కల్పించి కంటైనర్ థియేటర్ గ్రామీణ స్థాయి ప్రేక్షకుడ్ని మెప్పిస్తుందనే చెప్పాలి.
***
ఓపెన్ ఎయిర్ థియేటర్లు కూడా పట్టణ నగర వాసులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ. ఈ థియేటర్లు కూడా ఎఫ్‌ఎమ్ సౌండ్ సిస్టమ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే భారతదేశంలో ముంబయి, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్లు ప్రేక్షకులను రంజింపచేస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేయాలంటే అతి పెద్ద స్థలం అవసరం కనుక నగర శివార్లలో నిర్మాణం జరుపుతున్నారు. త్వరలోనే విశాఖ ప్రేక్షకులకూ ఈ బహిరంగ తెర అందుబాటులోకి రానుంది. ఓపెన్ థియేటర్ విషయంలో బహిరంగ స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. చుట్టూ కార్లు పార్కింగ్ చేసుకునేలా మార్కింగ్ ఇస్తారు. ప్రేక్షకులు కార్లలోనే కూర్చుని దూరంలోని స్మార్ట్ స్క్రీన్‌పై సినిమా చూస్తూ, కారులోని ఎఫ్‌ఎమ్ సిస్టమ్ సౌండ్‌లో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. కొత్త స్క్రీన్ విధానం పట్ల ఇప్పటికే ఆసక్తి కనిపిస్తోంది. సినిమాను కుటుంబ సమేతంగా కార్లలోనే ఏసి వేసుకుని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఈ విధానంలో సినిమా మధ్యలో వెళ్లిపోవాలంటే కూడా కారును బయటకు తీసుకొచ్చేసేలా పార్కింగ్ విధానం ఉంటుంది. అయితే ఓపెన్ సినిమా విధానం కూడా నగరవాసుల కాలక్షేప వినోదమనే చెప్పాలి. ఇవి ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకునే వీలు తక్కువ.
ఇలా రకరకాల సినీ థియేటర్ల నిర్మాణం ప్రేక్షకుడు చుట్టూ తిరుగుతూ ఉంది. సినిమాలు థియేటర్లలో ఎక్కువ కాలం నడిచే పరిస్థితి ప్రస్తుతం లేదు. అందుకే వీలైనన్ని మార్గాల ద్వారా ప్రేక్షకులకు చేరువ చేసి మొదటి వారంలోనే పెట్టుబడినిగాని పెట్టుబడికి మించిన రెండు మూడు రెట్లు వసూళ్లు సాధించడంగానీ చేయాలి. ఆ తర్వాత టాక్ బాగుంటే ఓకె. లేదంటే కొంతవరకైనా సేఫ్ అవుతుంది. సినిమా మార్కెట్ వందల కోట్లు దాటుతుంటే నిర్మాణ వ్యయం కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. అందుకే వసూళ్లపై సైతం మార్గాలు అనే్వషించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
గతంతో పోల్చుకుంటే సినిమా థియేటర్ల సంఖ్య మూడొంతులు తగ్గినా ఇటీవల మళ్లీ పెరుగుతున్న వైనం కనిపిస్తుంది. మినీ సినిమా థియేటర్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వాలు సైతం శ్రద్ధ చూపుతున్నాయి. వీటికోసం ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇటీవల తమిళనాడులో సామాన్య ప్రేక్షకుడిని తక్కువ ధరతో వినోదింపచేయడానికి జయలలిత ప్రభుత్వం త్వరలో అమ్మ థియేటర్లను విరివిగా నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విధానం వలన కలెక్షన్లు దెబ్బతింటాయన్న
వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. ఎంతైనా సినిమా -నీదరికి నేనొచ్చానని ప్రేక్షకుడిని పిలవడం ఒకింత ఆనందమే కదా!
డ్రైవ్ అండ్ థియేటర్!
కారు దిగక్కర్లేదు. కాలు కింద పెట్టాల్సిన పని లేదు. పిక్నిక్‌కు వెళ్లిన ఫ్యామిలీలా -మొత్తం సభ్యులు కారులోనే కూర్చోవచ్చు. దూరంగా స్మార్ట్ స్క్రీన్‌పై, దగ్గరగా కారులోని ఎఫ్‌ఎం సిస్టమ్‌లో సౌండ్‌తో సినిమా చూసే సౌకర్యం. పైగా కావాల్సిన తినుబండారాలు కారు దగ్గరకు తెప్పించుకునే సౌలభ్యం. ఇంకేంటి ఓ పక్క ఎంటర్‌టైన్‌మెంట్. మరోపక్క ఎంజాయ్‌మెంట్ కదూ! ఇవే డ్రైవ్ అండ్ థియేటర్లు. ఈ ‘బహిరంగ’ సినీ వేదిక విశాఖలో సిద్ధమైంది. విదేశీ పరిజ్ఞానంతో విశాఖ విమానాశ్రయనికి సమీపంలో షీలానగర్ వద్ద ఎస్టీబిఎల్ సినీ వరల్డ్ దీన్ని సిద్ధం చేసింది. ఐదు కోట్ల వ్యయం. సుమారు 2 ఎకరాల విస్తీర్ణం. 100 కార్లు పట్టే థియేటర్. 90న40 అడుగుల స్క్రీన్. 250 అడుగుల దూరం నుంచీ స్మార్ట్ స్క్రీన్‌పై స్పష్టంగా సినిమాను ఆవిష్కృతం చేసే డిజిటల్ ప్రొజెక్టర్, సాంకేతిక పరికరాలు. రోజూ ఫస్ట్ అండ్ సెకెండ్ షో. ముందుగా థియేటర్‌కు చేరుకుంటే -పిల్లలు ఆడుకోడానికి పరికరాలు. పెద్దలు ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్లు. ఇంతకంటే మోడ్రన్ ఎమ్యూజ్‌మెంట్ ఏముంటుంది? కారు లేకుండా థియేటర్‌కు వెళ్లినా కంటైనర్‌లో సినిమా చూసే అవకాశం. భలే చాన్స్ కదూ!
వై స్క్రీన్స్
ఇదో తరహా సినిమా. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో రూపుదిద్దుకున్న శాటిలైట్ థియేటర్. రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాల్లో వై స్క్రీన్స్ వృద్ధి చేయడానికి ప్రణాళికలూ సిద్ధమవుతున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే టీవీ బదులు వైడర్ స్క్రీన్ కలిగిన ఆత్యాధునిక వెయిటింగ్ రూంలన్నమాట. ప్రయాణ సమయాల్లో బస్ స్టేషన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చినపుడు -సమయాన్ని వృధా చేసుకోకుండా ఎంటర్‌టైన్‌మెంట్ పొందేందుకు అవకాశం కల్పించే థియేటర్లన్న మాట. తక్కువ పరిమితిగల సీట్లతో బస్టేషన్లు, ముఖ్య కూడళ్లలో ఈ తరహా స్క్రీన్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. మొత్తంగా చూస్తే -రెండు రాష్ట్రాల్లో ఏదోకరూపంలో స్క్రీన్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వారానికి మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటే -చిన్న సినిమాకు థియేటర్లు దొరకని పరిస్థితి. ఈ ఇబ్బంది భవిష్యత్‌లో ఉండకపోవచ్చు. మినీ, కంటైనర్, డ్రైవ్ ఆన్ థియేటర్, సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తే -సినిమాయే ప్రేక్షకుడి లోగిలికి వచ్చేసినట్టే.

.....................
కార్ ఆన్ థియేటర్.. డ్రైవ్ ఆన్ థియేటర్.. పేరు ఏది చెప్పుకున్నా.. కొత్తగా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్న థియేటర్ స్వరూపం ఇదీ.. పార్కింగ్ ప్లేస్ నుంచే సినిమా చూసే సదవకాశాన్ని కల్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పుట్టుకురాబోతున్నాయ.
..........................
ఆ రోజులే వేరు!
ఒంటెద్దు బండిమీదో, వీధుల్లోని పెద్దింటి గోడలకో అంటించిన పోస్టర్లు చూసుకుని.. ఫలానా సినిమా ఫలానా రోజున విడుదలవుతుందని తెలసుకునే పరిస్థితి. పెద్ద పండగకో, వేసవి సెలవులకో, ప్రత్యేక దినాల్లోనో ఎన్టీవోడిదో.. ఏఎన్నారుదో సినిమా విడుదలైతే చాలు. -కుటుంబమంతా బండి కట్టించుకుని ముందుగా థియేటర్‌కు చేరి.. అతి కష్టంమీద క్యూలో నిలబడి.. నేలకో బెంచికో టికెట్లు సంపాదించి.. సినిమా చూసి వచ్చే ఆనందం. ఇంటిదగ్గర ఆలస్యమైతే.. థియేటర్ వద్ద బుకింగ్ క్లోజ్. వెళ్లిన బండిలోనే తిరుగు ముఖం పట్టడం.
.......................
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మినీ థియేటర్లు ఏర్పాటు
చేసేందుకు అటు ప్రభుత్వం,
ఇటు ప్రయివేట్ సంస్థలు
ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రణాళికలు ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసుకుని
ఆవిర్భవించే స్థితికి చేరుకున్నాయి.
..........................

-బాసు, ప్రవవి