మెయిన్ ఫీచర్

కథ తక్కువ.. క్యారెక్టర్లెక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరపై కనిపించే పాత్రలన్నీ కుదురుగా ఒక బాటలో నడిస్తే అది -కథ. తెరమీది పాత్రలన్నీ ఎవరి దారిన వాళ్లు పదిదారుల్లో నడిస్తే అది -కత. ఏ తోవలో పోవాలో తెలీక -పాత్రలన్నీ తెరపై దిష్టిబొమ్మల్లా నిలబడిపోతే -తెలుగు సినిమా అని చమత్కరించాడు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న ఓ కుర్రాడు.
**
ఒకప్పుడు హీరో హీరోయిన్లు పాటేసుకునే పద్ధతుండేది. బోర్ ఫీలవుతున్న ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి -తెరపైకి గ్రూప్ సాంగ్స్ తెచ్చిపడేశారు దర్శక నిర్మాతలు. (స్వర్ణయుగం కాలంనాటి సినిమాల్లోనూ బృంద నృత్యాలు ఉన్నా -అవి సందర్భాను సారం ఉండేవి). 90వ దశకం వచ్చేసరికి తెలుగు సినిమాల్లో మెజారిటీ పాటలన్నీ -గ్రూప్ సాంగ్సే.
తాజాగా తెలుగు స్క్రీన్‌పైకి గ్రూప్ సాంగ్స్‌తోపాటూ గ్రూప్ సీన్సూ వచ్చేశాయి. అంటే
-ఒకప్పటి సకుటుంబ చిత్రాలన్న మాట. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే -అప్పటి కుటుంబ కథా చిత్రాల్లోని ప్రతి పాత్రకూ ఎంతోకొంత ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ప్రాధాన్యత లేకున్నా -లెక్కలేనన్ని పాత్రలు ఉంటున్నాయి. అంతే తేడా.
సినిమాకు కథే ముఖ్యం. కథను వదిలేసి కతలల్లాలనుకుంటే జనం రీళ్లు తెగ్గొస్తారనేది ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న సినిమాలన్నీ ఆ బాపతే. సినిమాలో లెక్కలేనంత మంది తారలను పెట్టి జిగేల్ మనిపిస్తే -ఒక్క టికెట్‌పై అంతమందిని చూడ్డానికి ప్రేక్షకుడు ఎగబడి వస్తాడన్న ధోరణి బలపడిపోతుంది. అయితే, గుంపులు గుంపులుగా ఆర్టిస్టులను తెరపై కుక్కేసినా -కథలో సరుకు లేకపోతే ప్రేక్షకుడు కిక్కురుమనకుండా తిప్పికొడతాడన్నది బ్రహోత్సవంతో తెలిసిన ముచ్చట. స్క్రీన్ ఆన్ అయింది మొదలు తెర నిండుగా ఉండాలని కొంతమంది దర్శకులు భావించడం సహజం. ఈ కోవలో తమిళ దర్శకుడు మణిరత్నం ముందుంటే తెలుగులో కృష్ణవంశీది ఫస్ట్ ప్లేస్. కృష్ణవంశీతో సినిమా అంటే నిర్మాత బడ్జెట్‌ను మరచిపోవాలన్నది పరిశ్రమలో చాలామంది నుంచి వినిపించే కామెంట్.
చాలాకాలంగా తెలుగు సినిమా తీరు మారుతూనే వస్తోంది. పొట్టిపొట్టి డైలాగులు, ఊహకందని ఫైటింగులు, విలన్ల సీరియల్ కామెడీల్లాంటివి నేటి సినిమా ధోరణికి అద్దం పడుతోంది. ఇప్పుడు కొత్తగా ‘కుటుంబ కథా చిత్రం’ బ్రాండు మాటున భారీ తారాగణాన్ని చొప్పించటం అలవాటుగా మారుతోన్న కొత్త ధోరణి. అయితే చిక్కంతా ఇక్కడే. సరైన కథ లేకపోతే ఎంత జనంవుంటే ఏం లాభం? అన్నట్టు కొన్ని సినిమాలు బయ్యర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో బిజీగావుండే ఆర్టిస్టులతోపాటు పాతబడిపోయిన ఆర్టిస్టులకు సైతం పని లభిస్తుంది. కానీ చాలా పాత్రల్ని కథలోకి ఇమడ్చలేకపోవడంతో -ఆ పాత్రలన్నీ తెరపై తమ ముఖం చూపించే బొమ్మల్లా మిగిలిపోతున్నాయి.
ఒకప్పుడు అవసరమైనంత మంది ఆర్టిస్టులు సినిమాకు పనిచేసేవారు. ఈ విషయంలో పౌరాణికాలు ఫస్ట్‌ప్లేసులో వుండేవి. సాంఘికాల్లో ఎక్కువ మంది కనిపించినా వారందరికీ పనివుండేది. ‘దేవుడుచేసిన మనుషులు’ తీసుకుంటే హేమాహేమీ నటులంతా ఉండటంతోపాటు తగినంత పాత్రలు, ఆ పాత్రలకు ఒకింత ఔచిత్యం ఉండటం వలన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ తరహా సినిమాలు చేయాలంటే ఆ రోజుల్లో కథపై చాలా కరసత్తు చేసి జాగ్రత్తగా మలిచేవారు. నేడు అందివచ్చిన టెక్నాలజీతో ఇట్టే లాగించేస్తున్నారు. అందుకే ఫలితం కూడా అట్టో ముక్కో అన్నట్టే ఉంటుంది. నేటి ట్రెండ్‌లో ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరుగా శ్రీనువైట్లను చెప్పొచ్చు. ఈయన చిత్రాల్లో ఎక్కువ శాతం కాస్టింగ్ ఎక్కువ వున్నవే. ఇదే ట్రెండ్‌లో శ్రీకాంత్ అడ్డాల కూడా వరస చిత్రాలు తీసుకొచ్చాడు.
తెరను కలర్‌ఫుల్‌గా చేయాలని చాలామంది దర్శకులు శ్రమపడటం కనిపిస్తుంది. అందుకే సినిమాలో ఒక్క సీన్ అయినా బోలెడంత మంది ఆర్టిస్టులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది సినిమాకు హెల్ప్ అవుతుందా? లేదా? అనేది చివరకు కథపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణ వలన ఆర్ట్ డైరెక్టర్లకూ బాగా పని పడుతుంది. సినిమాను కలర్‌ఫుల్‌గా తీయడం కాదు, కథ ఫుల్‌గా తీయాలని నేడు సగటు ప్రేక్షకుడే చెప్పేస్తున్నాడు. అలా లేకపోతే వౌత్‌టాక్‌తోనే సినిమాను మడతపెట్టేస్తున్నాడు.
నేడు హీరోలంతా ఫేషనేటెడ్ ఫ్యామిలీ బ్రాండ్ సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. ఈ కోవలో భారీ తారాగణంతో ఎక్కువ హిట్స్‌కొట్టిన హీరోగా వెంకటేష్‌కి మంచి పేరుంది. మహేష్‌బాబు గతంలో మురారి, సీతమ్మవాకిట్లో చేసి మెప్పించినా బ్రహ్మోత్సవంతో బోల్తాపడ్డాడు. దూకుడు మహేష్‌బాబు కెరీర్‌లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలతో మంచి మార్కులే సాధించాడు. రామ్‌చరణ్ గోవిందుడు అందరివాడేలే!, బ్రూస్‌లీ చిత్రాలతో భారీ తారాగణంతో మెప్పించలేక బోర్లాపడ్డాడు. బృందావనంతో జూ.ఎన్టీఆర్ బాగానే ఎంటర్‌టైన్ చేశాడు. లౌక్యంతో కొత్త ట్రెండ్‌లోకి వచ్చిన గోపీచంద్ ఆ తర్వాత సౌఖ్యంతో చతికిలపడ్డాడు.
కుర్ర హీరోల్లో రామ్ రెడీతోనూ, విష్ణు ఢీతోనూ మెప్పిస్తే సాయిధరమ్‌తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్‌తో పెద్ద గ్రాస్ కలెక్ట్ చేశాడు. ఓపెనింగ్ సినిమా ముకుందతో వరుణ్‌తేజ్ పాస్ పాస్ అనిపించుకున్నాడు. ప్రభాస్ చక్రంతో చతికిలపడినా, విజువల్ ఫీస్ట్ జోనర్‌లో పాత చింతకాయపచ్చడి కథ బాహుబలితో శభాష్ అనిపించుకున్నాడు. ఫిఫ్టీ ఇయర్స్ దాటిన హీరోల్లో బాలయ్య సింహాతో రికార్డులు బ్రేక్‌చేసినా డిక్టేటర్‌తో వెనకబడ్డాడు. ఇప్పుడు తన నూరవ సినిమాను భారీ తారాగణంతో ప్లాన్ చేసుకున్నాడు. నాగ్ మనంతో మంచి హిట్ సాధించడమే కాకుండా సోగ్గాడే చిన్నినాయనాతో సంక్రాంతి హిట్ కొట్టి తన ఖాతాలో 50 కోట్ల క్లబ్బుని ఓపెన్ చేశాడు. పవన్‌కళ్యాణ్ గతంలో గుడుంబా శంకర్‌తో మెప్పించలేకపోయినా అత్తారింటికి దారేది?తో బాగా అలరించి రికార్డులు బ్రేక్ చేశాడు. ఆ తర్వాత గన్స్ అండ్ గట్స్‌తో స్క్రీనంతా హడావుడి చేసినా సర్దార్‌కు ఫలితం అంతగా దక్కలేదు. పోస్టర్ మొదలుకొని సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో నిండా ఆర్టిస్టులను నింపేసే దర్శకులు సరిగ్గా కథపై కాన్సన్‌ట్రేషన్ చేయకపోతే ఫలితం ఎలావుంటుందో చాలా సినిమాలు నిరూపించాయి.. నిరూపిస్తూనే వున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సినిమాలు తీయాలంటే కోట్ల బడ్జెట్ తప్పనిసరి. అందుకే ఇలాంటి చిత్రాలకు కో-ప్రొడ్యూసర్లుగా హీరోలు కూడా పనిచేయడానికి ‘సై’ అనకతప్పడం లేదు. ఈ విధానంలో మహేష్ ముందువరసలో ఉన్నాడు. ఎంబి ప్రొడక్షన్స్‌పై ‘శ్రీమంతుడు’, బ్రహ్మోత్సవాలకు కో-ప్రొడ్యూసరయ్యాడు. దీనివలన ప్రమోషన్‌కి కూడా హెల్ప్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఎంత రిచ్‌గా తీసినా.. ఎంత తారాగణాన్ని కుక్కినా కథ ప్రేక్షకులను అలరించకపోతే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరో సైతం బయ్యర్లనుండి ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. లాభంవస్తే మాట్లాడని బయ్యర్లు నష్టాల్లో అరవడం కూడా కరెక్ట్ కాదన్నది ఇండస్ట్రీ వాదన. ఎంతైనా సినిమా కళాత్మక వ్యాపారం కనుక కథపై కరసత్తుచేయాల్సిందే. జనంకన్నా కథ ముఖ్యమని నమ్మకం ఎప్పటికీ సముచితమే.

-బాసు