మీ వ్యూస్

వెరైటీ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత చింతకాయపచ్చడి లాంటి సినిమాలు చేసినా చూస్తారన్న ధీమా దర్శక, నిర్మాతలకు ఉంది. అందుకే బ్రహ్మోత్సవం చిత్రాన్ని చావుదెబ్బతీశారు. హిట్టయ్యిందని అవే లాజిక్‌లు, కథనాలు పెడితే చాలదు. కథాబలం, మంచి పాటలు, కళాత్మక విలువలు వినోదభరితంగా సినిమా ఉంటే ఆదరిస్తారని మహేష్ తెలుసుకోవాలి. సినిమాలో సరైన పట్టులేకపోవడంతో బిచ్చగాడులాంటి డబ్బింగ్ సినిమాకు ఆదరణ పెరిగింది.
- పి.శేషగిరిరావు, విశాఖపట్నం

అభిప్రాయం ఏంటి?
ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ సినిమాలు రివ్యూలు రాసేవారి గురించి ఇలా అన్నాడు. సమీక్షలు రాసేవారికి సినిమా గురించి అసలు తెలియదనిపిస్తుంది. వాళ్లంతా బాగా చదువుకున్నవాళ్లే. వారి స్థాయిలోనే ఆలోచిస్తారు. 4జి, వాట్సాప్ అంటూ ఎక్కడెక్కడో ఉండిపోతారు. ఇక్కడి ఆడియన్స్ గురించి వాళ్లకు ఎలా తెలుసు? సినిమాను సినిమాలాగ చూసే వాళ్లు నాకు కనిపించలేదు అన్నాడు. అతడు చెప్పినదానికి ఉదాహరణగా సరైనోడు చిత్ర సమీక్షల్లో విమర్శించినా కనకవర్షం కురుస్తుంది కదా? అని ఎదురు ప్రశ్న వేశాడు. ఈ విషయంపై చర్చ జరగాల్సిన అవసరం వుంది.
- శాండోప్రచండ్, శ్రీనగరం

ఎందుకీ హంగామా?!
ఫస్ట్‌లుక్ అదిరింది. ఫస్ట్ పోస్టర్ బ్రహ్మాండం. రిలీజైన గంటలోనే లక్షల మంది చూశారని మీడియా హైప్ సృష్టిస్తుంది. లుక్స్, పోస్టర్స్ ఎంత అదిరినా సినిమా మొదటి ఆటవరకే వాటి ప్రభావం. తెలుగు చిత్రాలు చూసే కోట్లాది మందిలో ఈ లక్షలాది మంది ఏపాటి?! ఆ సత్యం గుర్తించక సినిమాపై సూపర్ అంచనాలకు రావడం, తర్వాత ఆశాభంగం చెందడం తగదు. ఫస్ట్‌లుక్ చూసి భ్రమపడినవాళ్లు మొదటిరోజు మొదటి ఆట చూసి ఎంతమంది ఎన్ని తిట్టుకున్నారో ఆ లెక్కలు చెప్పదు మీడియా. అంచనాలు అందుకొని చిత్రాలపై అంతర్జాలంలో ఎంతమంది జోకులేస్తున్నారో, ఎన్ని కార్టూన్లు వస్తున్నాయో ఆ లెక్కలూ పత్రికలోకి రావు. మరెందుకీ హంగామా?
- పి.చంపక్, మాధవనగరం

సీక్వెల్ జోరు
పూర్వం వచ్చిన రామాయణ, భారత, భాగవతాల కథలతో నిర్మించబడ్డ అనేక సినిమాలను సీక్వెల్‌తో పోల్చవచ్చు. కానీ సీక్వెల్‌గా అవి ముద్రపడ లేదు. బాహుబలి, ది బిగినింగ్ అని ముందే ప్రకటించి సినిమాను సశేషం చేయడం వలన ఎండింగ్ పార్టు తీస్తున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న సీక్వెల్స్, వీటి ముందు సినిమాలు హిట్టవుతేనే తీస్తున్నారు. కానీ అన్నీ హిట్లు కొట్టట్లేదు. ఆర్య-2, రెండవ గబ్బర్‌సింగ్ మిస్‌ఫైర్ అయ్యాయి. కథలో కొత్తదనం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ ప్రతిభ, ఇక నటనలు సమపాళ్ళలో రంగరిస్తేనే ఆదరణ పొందేది. పాత పేరుతో కాకుండా కొత్త పేరు పెడితే ప్రేక్షకులకు ఫ్రెష్‌గా కనిపిస్తుంది. డబ్బులు విరజిమ్మే నిర్మాతలు ఆలోచించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

ఒక్క సీను లేదు
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం ప్రేక్షకులకు నచ్చని ఉత్సవంలా మిగిలింది. నేడు సినిమా అంటే ప్రేక్షకులకు పాటలు, ఫైట్లు, కామెడీ, మాస్ ఇమేజ్ దృశ్యాలు ఉండాలి. ఈ చిత్రం పేరుగన్నంలా తినడంలా ఉంది. తండ్రికి చెప్పులు తొడిగే దృశ్యం ఆకట్టుకుంది. సత్యరాజ్ పాత్రను మధ్యలో ముగించడం అర్ధంకాని పజిల్. అత్త పాత్రలో జయసుధ, మామగా రావు రమేష్, నరేష్ పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లాయి. ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు అంటూ బద్రినాథ్, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలు తిరగడం బోర్ కొట్టింది. కాజల్, సమంతల పాత్రలపై జాలి కలిగింది. ఈ సినిమా సామాన్య ప్రజలకి నచ్చదు. హృదయానికి హత్తుకుపోయే ఒక్క సీనూ లేదు. దర్శకుడు ఏం ఆశించి ఈ సినిమా తీశాడో తెలియదు.
- కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

స్క్రీన్‌ప్లే ఏదీ?
హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో చక్కని సరికొత్త కథాకథనాలతో సినిమాలు వస్తున్నాయి. సందేశంతో కూడుకున్నవి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పిల్లలు, పెద్దలను కట్టిపడేస్తున్నాయి. కోట్లు కుమ్మరిస్తున్నాయి. హాలీవుడ్‌లో పిల్లలకోసమే వచ్చిన జంగిల్‌బుక్, బాలీవుడ్‌లో త్రీఇడియట్స్, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, తమిళంలో వెనకటి నుండి వస్తున్న భారతీయుడు, ఒకే ఒక్కడు, జంటిల్‌మెన్, రోబో, 24 వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. తెలుగు సినిమాల పరిస్థితి ఏమిటి? పాత హిట్ సినిమాల కథలు, సన్నివేశాలు అతికించి తీసిన సినిమాలనే మళ్లీ మళ్లీ వాడుకొని ప్రేమకథలే ప్రధానంగా రక్తపాతంతో కూడిన ఫైట్లు చేర్చి ఇదే సినిమా అంటున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతోంది. ఎలాంటి గొప్ప చిత్రాలు తీసినా చక్కని కథ, స్క్రీన్‌ప్లేలతో తీయాలి. అదీ లేదు.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

ఇదీ అసలు ఉత్సవం
బ్రహ్మోత్సవం గురించి అమెరికనాంధ్రుల అభిప్రాయాలిలా ఉన్నాయి. 30 మంది మంచి నటుల్ని కొన్ని గ్రూపులుగా అక్కడక్కడ ఉంచి సిసి కెమేరాలతో వాళ్లేం మాట్లాడుకున్నా చిత్రించి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేర్చి వదిలేశారు. ఇదే సినిమా అంటూ. టెలీ సీరియల్ లాగ ఉంది. 18 నిమిషాలు కట్ చేసి పారేసినా రెండో సగంలో ప్రేక్షకులు పారిపోతున్నారు. ఉత్సవం లాగ కాకపోయినా పార్టీలాగ కూడా లేదు. విపరీత ప్రచారంతో ప్రేక్షకుల అంచనాలు పెంచేసి ఆ స్థాయి అందుకోలేని ప్రభావం ఇది. ఇదీ వారి అభిప్రాయం. ఇంక ఈ చిత్రం మీద జోకులకు లెక్కేలేదు. అంతర్జాలంలో వాటిని చూసి తరించండి!
- మైథిలి, సర్పవరం