మీ వ్యూస్

డిఫరెంట్-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

24 చిత్రం సాదా సీదా చిత్రాలకు భిన్నంగా సాగింది. మూడు పాత్రలలో సూర్య అభినయం బాగుంది. ఆత్రేయ పాత్రలో అతి క్రూరమైన నటన ప్రదర్శించాడు. తొట్రుపాటు లేకుండా సినిమాను విక్రమ్ బాగా నడిపించాడు. నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా సోసో. తిరు ఫొటోగ్రఫీ కట్టిపడేసింది. ఎఆర్ రెహమాన్ పాటలకన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రొటీన్ సినిమాల మధ్య కొట్టుకుపోతున్న తెలుగు ప్రేక్షకులకు 24 చిత్రం ఎడారిలో ఒయాసిస్ లాంటిది. హేట్సాఫ్ సూర్య, విక్రమ్.
- కొవ్వూరి జగాశ్రీనివాసరెడ్డి, కొంకుదురు

ఒకే ఇబ్బంది
గలగలా వాగడం తప్ప తమ మాటలకు అర్ధం తెలియనివారు, అజ్ఞానమే సుజ్ఞానమని భావించేవారు చానల్స్ యాంకర్లుగా తయారైపోతున్నారు. ఒక చానల్‌లో యాంకరమ్మ సమంతకు సవతిపోరు ఎక్కువైందని చెప్పింది. సవతి అంటే ఏమిటో తెలియని యాంకరమ్మ దుస్థితి అది. ఆమె ఉద్దేశంలో సమంత ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్న చిత్రాల్లో నటిస్తూ ప్రాముఖ్యం కోల్పోతున్నదని అట! స్టార్ హీరో పక్కన ఏ హీరోయిన్‌కి ప్రాముఖ్యం ఉంటుంది? ప్రాముఖ్యం లేని పాత్రల్లో నటించనని ఆయా చిత్రాలలో నిత్యామీనన్ తప్పుకొంది. నటించకూడదనుకుంటూనే కాజల్ నటించేస్తోందట. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లున్నప్పుడు అందరిదీ ఒకటే ఇబ్బంది. సమంతను అలా నిందించనేల? యాంకరమ్మ పనిచేస్తున్న చానల్‌లో ఇంకా ఇతర మహిళలూ ఉన్నారు. వాళ్లు అలా ఆలోచిస్తే యాంకరమ్మ పరిస్థితి ఏంటి?
- కె.ప్రవీణ్, కాకినాడ

సీక్వెల్ ఢాం!
మెగా కుటుంబమే కాదు ఇతరులు కూడా రీమేక్‌ల మీద పడడానికి కారణం విజయవంతమైన కథ. ఉన్నది ఉన్నట్లు దించేస్తే చాలు. పెద్దగా శ్రమపడనక్కరలేదని వారి భావన. ఒక విధంగా సీక్వెళ్లూ అంతే. ఆ నటులే ఆ సంఘటనలే కాకపోతే కాస్త మసాలా కలిపితే చాలు అనుకుంటున్నారు. కానీ సీక్వెల్‌కు కూడా పటిష్టమైన కథ ఉండాలి. దాని వేళ్లు మొదటి భాగంలో ఉండాలి. పునాది అదే అయినా కళాత్మక భవనం నిర్మించాలి అని అనుకోవడం లేదు. అందుకే సీక్వెల్ ఢాం అంటుంది. సీక్వెల్ అయినా కాకపోయినా ప్రేక్షకులకు నచ్చడం ముఖ్యం. బాగున్న కూర దాచిపెట్టి రెండురోజుల తర్వాత తింటే ఎలా వుంటుంది?
- బి.స్నేహమాధురి, పెద్దాపురం

ఇదో ఉదాహరణ
గుండమ్మకథ షూటింగ్ ప్రారంభమైందని తెలిసి రేలంగి చక్రపాణి దగ్గరకు వెళ్లారట. మీ ప్రతి చిత్రంలో నేను నటించాను. అయితే గుండమ్మ కథలో ఎందుకు నాకు వేషం లేదు? అని అడిగారు. నీకు తగ్గపాత్ర గుండమ్మకథలో లేదు అని చక్రపాణి చెప్పారు. అయితే రమణారెడ్డికిచ్చిన పాత్ర నాకివ్వచ్చుకదా? అన్నారట రేలంగి. ఇవ్వచ్చుకానీ ప్రేక్షకులు చూడరు అని జవాబిచ్చారట చక్రపాణి. ఈ చిన్న ఉదాహరణ చాలు, ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు ఎవరు ఏ పాత్ర ధరించడానికి సరిపోతారు అన్న విచక్షణా జ్ఞానంతో ఉండేవారు అనడానికి! మరి ఈ రోజుల్లో అలా వుందా?
- డి.ఎస్.శంకర్, వక్కలంక

హోరు ఉంది అంతే!
ఇటీవల వెనె్నలలో ఒక వ్యాసంలో పాత సినిమాల్లో పాటలు మంచివని, నేటి పాటలు దిగజారిపోయాయని రాశారు. 1971నాటికే ఎన్నో అశ్లీలమైన పాటలు వచ్చాయి. 1971 తర్వాత వచ్చిన వాటిలో అనురాగం అనుబంధం అంతా ఒక బూటకం, వౌనమే నీ భాష ఓ మూగ మనసా, అలలు కదలినా పాటే, ఆదిభిక్షువువాడినేది కోరేది, వౌనంగానే ఎదగమని, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, చిలకా ఏ తోడులేక లాంటి ఎన్నో మంచి పాటలు వచ్చాయి. నాటి గీతాలకు, నేటి పాటలకు తేడా సాహిత్యం కాదు. సంగీత వాద్యాల హోరు బాగా పెరిగిపోవడంతో పాట చెవులకు వినిపించడం లేదు.
-వానపల్లి గంగరాజు,
సీతమ్మపేట

కొత్త ఉత్సాహం
ఈమధ్య వచ్చే చిత్రాల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. మొన్న విడుదలైన బిచ్చగాడు సినిమా చక్కగా చిత్రీకరించిన తగిన రీతిలో పాత్రల పరిధిని ఎన్నుకొని, నటీనటులంతా చక్కగా నటించారు. దర్శకత్వ పరంగా మెచ్చుకోదగిన విధంగా వుంది. ఇలా వెరైటీ చిత్రాలు వస్తే ప్రేక్షకులకు కనువిందుతోపాటు కమ్మని కాలక్షేపం.
- చోడవరపు నాగేశ్వరరావు, అంబర్‌పేట

బయోపిక్ మోసం
ఏదైనా రంగంలో గొప్పగా రాణించిన వ్యక్తి కథ ఉన్నది ఉన్నట్లు చిత్రిస్తే దాన్ని బయోపిక్ అనాలి. కాస్త మసాలాలు, కాస్త కల్పన జోడించేసి ఒకవంతు నిజ జీవితం, మూడొంతులు కల్పన జోడించి తీసినవి బయోపిక్‌లనడం మోసం. మనవాళ్లకి సంఘ విద్రోహులంటే మోజు. అనేక కల్పనలతో వీరప్పన్, హర్షద్‌మెహతా లాంటి వాళ్ల కథలు తీశారు. మ్యాచ్‌ఫిక్సింగ్‌లో దొరికిపోయి బహిష్కరణకు గురైన అజారుద్దీన్, ఏక్తాకపూర్‌కి హీరోగా కనిపించాడు. అతడిని కలిసి చర్చించి, తగ్గట్టు కథ రాసుకొని తీసినవాటిని బయోపిక్‌లనడం పచ్చిమోసం.
- కె.సుభాష్, శ్రీనగర్

పోటీ విశ్వామిత్ర
శరత్‌కాలంలో విశ్వామిత్ర గురించి రాశారు. ఆనాటి రాజకీయ విషవలయంలో చిక్కుకున్న చిత్రమది. వైరి వర్గంలోవున్న దాసరి నారాయణరావు అర్జంట్‌గా హిందీలో విశ్వామిత్ర సీరియల్ తీసి దూరదర్శన్‌లో ప్రసారం మొదలుపెట్టేశారు. అందులో పాత్రల మాటలు, నటన చూసి ఉత్తరాదివారు ఎలా గేలిచేసి నవ్వుకున్నారో. తెలుగు చిత్రం చూడకపోయినా టీవీలో వచ్చిన బిట్ చూశాం. అప్పటికే ఎన్టీఆర్‌కు స్థూలకాయం వచ్చేసి మాటల్లో ఆయాసం వినిపించేది. స్టూడియోలో తీసిన అడవి దృశ్యాల్లో ప్లాస్టిక్ పూలు, ఆకులతో వికారంగా కనిపించేవి. అది హిందీలో రాకపోవడమే మంచిదైందన్నది ఎన్టీఆర్ అభిమానులుగా మేం భావించాం.
- ఎ.శాంతిసమీర, వాకలపూడి