Others

భూకైలాస్ (ఫ్లాష్‌బ్యాక్@ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవియం నిర్మించిన
మల్టీస్టారర్ పౌరాణిక చిత్రం -్భకైలాస్. విశ్వవిఖ్యాత
నట సార్వభౌమ ఎన్టీ రామారావు తొలిసారి ప్రతి నాయకుని పాత్రలో రావణబ్రహ్మగా నటించిన చిత్రం 1958
మార్చి 20న విడుదలైంది.

రచన: సీనియర్ సముద్రాల
ఛాయాగ్రహణం:
మాధవ్ బుల్‌బులే
నృత్యం: కెఎన్ దండాయుధపాణి
కళ: ఎ బాలు
సంగీతం:
ఆర్ సుదర్శనం, గోవర్ధనం
నిర్మాత: ఏవి మొయ్యప్పన్.
దర్శకత్వం:
శంకర్

రావణాసురుని తల్లి కైకసి (హేమలత) ప్రతిరోజూ ఇసుకతో శివలింగాన్ని చేసి సముద్రపుఒడ్డున ఈశ్వరుని పూజిస్తుంటుంది. ఆమె పూజా ప్రభావంతో రావణాసురుడు అన్ని లోకాలు జయించి అమర లోకంపై దాడి చేయ నిర్ణయిస్తాడు. కైకసి పూజ భగ్నంచేస్తే రావణశక్తి నశిస్తుందని తెలుసుకున్న దేవతలు, ఆమె పూజించే లింగాన్ని సముద్రంపాలు చేస్తారు. తల్లి ఆదేశంపై సైకత లింగానికి బదులు ఈశ్వరుని ఆత్మలింగాన్ని సాధించి తెస్తానని బయలుదేరుతాడు రావణాసురుడు. తపోశక్తితో ఈశ్వరుని ప్రసన్నం చేసుకుంటాడు. ఆత్మలింగంకోరే తరుణంలో మాయామోహితుడై పార్వతీదేవిని కోరుకుంటాడు. అనుగ్రహించి వెళతాడు ఈశ్వరుడు. జగన్మాతను రావణ బారినుంచి తెలివిగా ఈశ్వరుని వద్దకు చేర్చిన నారదుడు (అక్కినేని), పాతాళలోకంలో మయాసురుని (ఎస్‌వి రంగారావు) పుత్రిక మండోదరి (జమున) పార్వతి అని నమ్మించి, మండోదరికి రావణాసురునికి వివాహం జరిపిస్తాడు. భార్యతో లంకకు వెళ్ళిన రావణునికి ఆమె పార్వతి కాదని, తాను మాయావశుడైనానని గ్రహించి తిరిగి తపస్సుకు వెళ్ళి ఆత్మత్యాగంతో ఈశ్వరుని మెప్పించి ఆత్మలింగం సాధిస్తాడు. దాంతో లంకకు వెళ్తుండగా, నారదుడు, వినాయకుని సాయంతో ఉపాయంగా ఆ లింగాన్ని భూమిపై పెట్టిస్తాడు. నేలపైని శివలింగం అంతకంతకు పెరిగి రావణాసుడు పెకిలింప అశక్తుడౌతాడు. ఆ శివలింగానికి తల బాదుకుని రోధిస్తున్న రావణునికి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఈ క్షేత్రం గోకర్ణక్షేత్రంగా రావణాబ్రహ్మ పేరుమీదుగా చిరస్థాయిగా నిలుస్తుందని శెలవిచ్చి అంతర్ధానమవుతాడు. నాటినుంచి ఈ పవిత్ర క్షేత్రం భక్తులను తరింపజేస్తోంది.
ఈ చిత్రంలో ఈశ్వరునిగా నాగభూషణం, పార్వతిగా బి సరోజాదేవి, ఇవి సరోజ, కమలాలక్ష్మణ్, రాజశ్రీ నటించారు. కైలాసంలో భరంగి (గోపీనాథ్) నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పురాణాలు వాటియందలి పాత్రలపట్ల విశేష పరిజ్ఞానం కలిగిన ఎన్‌టి రామారావు తొలిసారి ప్రతి నాయకుడైన రావణునిగా, హీరోయిజమ్ ఎలివేట్ అయ్యేలా హరిపట్ల ద్వేషం, హరునిపట్ల భక్తి విశ్వాసాలు, మాతృవిధేయునిగా అణుకువ, అమరులపై యుద్ధానికి, మయాసురునితో పోరుకు తలపడటంలో శౌర్య, వీర, రౌద్రాలను, ఈశ్వరుడు తనను మోసంచేసాడని నమ్మిన దైవం పైనే తిరుగుబాటుకు సిద్ధమవటం, మాయామోహితుడై పార్వతిని ఆశించటంలో ఓమైమరపు, మండోదరిని పార్వతిగా భావించిన ప్రణయ సన్నివేశంలో పారవశ్యం, తల్లివద్దకు వెళ్ళాక తాను మోసపోయానని గ్రహించి తల్లికిచ్చిన మాట నిలపుకోలేని అశక్తుడని విచారంతో ఆత్మత్యాగానికి సిద్ధపడటం, తిరిగి అచంచల భక్తితో శిరస్సు ఖండించుకొని ఆత్మలింగం సాధించటం, వినాయకుని చూసి ముచ్చటపడి సంధ్యావందనము చేసి వచ్చేలోగా ఆత్మలింగం భూమిపై పెట్టడంతో అతనిపై క్రోధం -నన్ను సర్వనాశనం చేశావు కదరా అంటూ ఇక ఆత్మలింగాన్ని, పెకలించ వ్యర్థప్రయత్నంలో తన సర్వశక్తిని ఒడ్డటం, చివరికి మరోమారు ఆత్మత్యాగానికి సిద్ధపడడం... ప్రతి సన్నివేశాన్నీ కడు పరిపూర్ణతతో, అనితర సాధ్యమైన నటనతో మెప్పించటం, ఎన్‌టిఆర్ ప్రతిభకు తార్కాణం.
ఈ చిత్రంలో మొదట నారద పాత్ర పరిధి తక్కువగా వుంది. ఈ పాత్రను అక్కినేనిచే నటింపచేయాలని నిర్మాతలు సంకల్పించగా వారు దానిలో ఎలా మార్పులు చేయాలో సూచించటం, సముద్రాలవారు ఆ పాత్ర నిడివిని, రావణ, నారదుల మధ్య చక్కని చమత్కార సంభాషణలను రూపొందించటం, దాంతో రావణాసురుని పాత్రతోపాటు నారదుని భాగస్వామ్యం చిత్రం అంతటా కన్పించటం జరిగింది. తొలిసారి అక్కినేని నారదునిగా నటించిన ఈ చిత్రంలో వారు ఎంతో సమర్ధవంతంగా, ఆకట్టుకునేలా నటించి మెప్పించారు.
రావణుని పట్ల ప్రేమ, అనురాగంతో కూడిన మండోదరిగా జమున ముగ్ధమనోహరంగా, పార్వతిగా బి సరోజాదేవి తన పాత్ర పరిధి మేరకు, కైకసిగా హేమలత ధీరగంభీరమైన సంభాషణలతో, తన కుమారుని హరిహర ద్వేషం మానమని చెప్పటం, పార్వతిని తెచ్చి అపచారం చేశాడని నిందించటం, తిరిగి తన కుమారుడు ఏ తప్పుచేయలేదని అతన్ని అనునయించటం, ఇలా ఆ పాత్రను ఎంతో వైవిధ్యంగా పోషించింది.
మయాసురునిగా ఎస్‌వి రంగారావు హరిభక్తునిగా, హరిని నిందించిన రావణునితో తలపడడం, కూతురి ప్రేమకు, నారదుని హరిహర ద్వేషం వలదన్న సూచన పాటించటం, రావణాసురుని అల్లునిగా స్వీకరించటం, ఎంతో ఉదాత్త, గంభీర, సాత్విక అభినయాన్ని నటనలో చూపారు.
దర్శకులు శంకర్ చక్కని సన్నివేశాలలో ప్రతిభావంతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. సముద్రాల చక్కని చతుర సంభాషణలతో విశిష్ట సమాసాలతో, అలరించే గీతాలతో చిత్రానికి పరిపుష్టిచేకూర్చారు. దానికి తగ్గ సంగీతాన్ని అందించారు సుదర్శనం, గోవర్ధనం. చక్కని సెట్టింగులతో కళాదర్శకులు, కెమెరామెన్ వారి పనితనం చూపారు.
భూకైలాస్ చిత్ర గీతాలు:
రావణుని తల్లి కైకసి సముద్ర తీరంలో సైకత లింగాన్ని పూజిస్తూ పాడే గీతం -దేవమహదేవ మము బ్రోవుము శివా (యంయల్ వసంతకుమారి). పాతాళలోకంలో మయాసురుడు ఎస్‌వి రంగారావు ముందు సభలో కమలా లక్ష్మణ్ శ్రీహరి దశావతారాలను స్తుతిస్తూ పాడే గీతం -మున్నీట పవళించు నాగశయనా (యంయల్ వసంతకుమారి). మండోదరి (జమున) తన చెలికత్తెలతో భూలోకానికి వచ్చి పాడే గీతం -అందములు విందులయే, అవని యిదేగా కమలాసనునీ కోటి శిల్పకూటమిదేన (పి సుశీల బృందం). రావణా, నారదులపై చిత్రీకరించిన భక్తిగీతం మొదట శివస్తుతిలో, తరువాత శ్రీహరి స్తుతితో సాగటం విశేషం. అది -దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమోనమో (ఘంటసాల). ఎన్‌టిఆర్, అక్కినేనిల అభినయం అద్భుతం. పార్వతి, బి సరోజాదేవి శ్రీహరిని స్థుతించే పద్యం -నీవే దానవ దేవమానవ మృగానీకంబు సృష్టించి (ఏపి కోమల), రావణాసురుడు తపస్సు చేస్తూ పాడేగీతం, అతనిలో ప్రకృతిలో మార్పులు సూచిస్తూ అద్భుతంగా చిత్రీకరణ -నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్ను గావరా (ఘంటసాల). ఎన్టీఆర్ ముందు హిందీ నర్తకి, హెలెన్ అప్సరసగా రావణునికి తపోభంగం కావించవచ్చి చేసే అద్భుత నృత్యగీతం, గీతం చివర ఘంటసాల -ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రం చివర రావటం అప్సరస దాన్ని గానంచేయటం విశేషం. -సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము (సుశీల, ఘంటసాల ఆలాపన). అక్కినేనిపై చిత్రీకరించిన గీతం, నారదుడు రాబోయే రామావతార విశేషాలను తెలుపుతూ సాగుతుంది. సంక్షిప్తంగా రామాయణాన్ని తన కలంతో ఈ గీతంలో అజరామరం చేశారు సముద్రాల. -రాముని అవతారం రఘుకుల సోముని అవతారం. సీతగా విజయనిర్మల నటించింది. రావణుని వద్దకు వస్తూ నారదుడు పాడే గీతం -అగ్నిశిఖలతో ఆడకుమా నీవు (ఘంటసాల). రావణుడు పార్వతికోసం వెదకుచుండగా మండోదరి ఓ శివాలయంలో ఈశ్వరుని భక్తితో పాడే గీతం -తీయని తలపులు తీవెలుసాగే జిలిబిలి రాగాలేవో, వలపు సఫలముచేయుము మహదేవా (పి.సుశీల). రావణాసురునితో తన ప్రేమ విఫలమై తిరిగి వారు కలుసుకున్నట్టు మండోదరి కలకంటుంది. ఆ కలలోని వారి యుగళగీతం -మన రాగమేగా అనురాగం, మొదట విషాదంగా -ప్రేమలీవిధమా విషాదమే ఫలమా (సుశీల, ఘంటసాల). నారదుడు అక్కినేనిపై చిత్రీకరించిన పద్యం -జలధర శ్యామ మంగళనామా. రావణాసురునితో పెళ్ళి జరిగాక మండోదరి ఆనందంతో పాడే గీతం.. (ఎన్టీఆర్ సంగీత వాయిద్యాలను పలికిస్తుంటే, ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరణ) -నా నోము ఫలించెనుగా నేడే సురభామినులు తలచే వలచే (పి.సుశీల). పార్వతి బదులు మండోదరితో వివాహం జరిపించాడని నారదుడిపై రావణుడు ఆగ్రహించగా, దానికి నారదుని సమాధాన పద్యం ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల నటన ఆకట్టుకుంటుంది -సైకత లింగంబు జలధి పాలవునాడు తల్లికిచ్చినమాట తప్పినావు (ఘంటసాల). రావణుడు, తిరిగి ఈశ్వరుని వేడుకుంటూ, తల నరక్కుని స్వామి అర్పించటం, ఆ తల ఒక్కటి కదిలి శివుని వేడుకోవటం, చక్కని చిత్రీకరణ -గునావరమీయ ఈ నీతి దూరునకు, పరమపాపునకు (ఘంటసాల). రావణబ్రహ్మ ఆత్మలింగం చేతిలో పట్టుకు తీసుకెళ్తుండగా, విఘ్నేశ్వరుడు ఓ పశువుల కాపరి బాలునిగా ఎదురయ్యే సందర్భంలోని గీతం తత్వబోధనలో సాగుతుంది -ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా మిత్తివెన్నంటి (ఏపి కోమల). ఆత్మలింగం భూమిపై నుండి కదలకపోవటంతో రావణుడు విచారంతో పాడే పద్యం -నా కనులముందొలుకు నీ కృపామృతధార (ఘంటసాల).
భూకైలాస్ చిత్రం మ్యూజికల్‌గానూ, వివిధ ఆకట్టుకునే అంశాలతోను విజయం సాధించింది. ఈ చిత్రంలోని దేవదేవ ధవళాచల, నీలకంధరా శివస్తుతులు, రాముని అవతారం భక్తిగీతాలు అజరామర గీతాలుగా నిలవటం విశేషం. కన్నడంలో ప్రఖ్యాతిగాంచిన ఓ నాటకం ఆధారంగా సరస్వతీ సినీ ఫిలింస్ 1940లో భూకైలాస్ నిర్మించారు. దానికి రచన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. దర్శకులు సుందరరావు నడకర్ణి. కన్నడకు చెందిన ఆర్ నాగేంద్రరావు, యంవి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీబాయి ప్రధాన పాత్రలు పోషించారు. 1958లోని ఎవిఎం భూకైలాస్ సైతం అత్యుత్తమంగా నిలవటం హర్షణీయం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి