Others

పెళ్ళిసందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ:
సముద్రాల జూనియర్
స్క్రీన్ ప్లే:
సముద్రాల (జూ.),
యోగానంద్, సీతారామ్,
ఫొటోగ్రఫి: బిఎస్ జాగీర్దార్
కళ:
ఘోడ్‌గాంకర్

సంగీతం:
ఘంటసాల.

చదువుకునే రోజులనుంచి సినిమాల పట్ల ఆకర్షణ గల వ్యక్తి సి సీతారాం. సైలెంట్ మూవీల కథానాయకుడు మాష్టర్ విఠల్‌పట్ల అభిమానం. వీటితో ప్రముఖ పంపిణీ సంస్థ పూర్ణా పిక్చర్స్ మద్రాస్ శాఖలో మేనేజర్‌గా చేరారు. చిత్ర నిర్మాణంలోని అన్ని శాఖలపట్ల మెళకువలు అధ్యయనం చేశారు. సొంతంగా ‘రిపబ్లిక్ ప్రొడక్షన్స్’ సంస్థ ప్రారంభించి, ఒక బాలుడి చేతిలో ఎగురుతున్న పావురం లోగోతో ఏర్పాటు చేసిన బ్యానర్ తొలిసారి నిర్మించిన చిత్రం -పెళ్ళిసందడి. 1959 ఫిబ్రవరి 4న చిత్రం విడుదలైంది.
తొలుత ‘అమ్మలక్కలు’ (1953)తో దర్శకత్వం చేపట్టి, ‘తోడుదొంగలు’, ‘జయసింహ’, ‘ఇలవేలుపు‘ చిత్రాల ద్వారా సమర్ధత నిరూపించుకున్న యోగానంద్ దర్శకత్వంలో సి సీతారాం తమ తొలి చిత్రం రూపొందించారు. తరువాత వీరు నిర్మించిన చారిత్రక చిత్రం ‘బొబ్బిలి యుద్ధం’కు దర్శకత్వం చేపట్టి, ఆ చిత్రంలోనే ఒక ముఖ్యపాత్ర కూడా పోషించి సీతారాం తన అభిరుచి, ప్రతిభ చూపారు.

కాలిపాడు జమిందారు (రాజనాల) కుమారుడు వాసు (ఎఎన్నార్). వారి వంశాచారం ప్రకారం 25ఏళ్లు వచ్చాక స్వయం సంపాదనతో ఏడాది అజ్ఞాతవాసం గడపాలి. ఆ నియమం కారణంగా పిడుగు అనే పత్రికాఫీసులో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తుంటాడు వాసు. అతని స్నేహితుడు గురునాథ (చలం) ధనవంతుడు. రావుబహద్దూర్ గంగాధరం (సియస్‌ఆర్) అబ్బాయి. కెప్టెన్ కోటా (గుమ్మడి), అతని తమ్ముడు జనార్ధన్ (రమణారెడ్డి), కోటా చెల్లెలు లక్ష్మి (ఆదోని లక్ష్మి). వీరయ్య (ఆర్ నాగేశ్వరరావు) అనే తాగుబోతు, మోసకారిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఒక ఆడపిల్లను కని అన్న చేతిలోపెట్టి మరణిస్తుంది. ఆ అమ్మాయి అనురాధ (అంజలిదేవి). అనురాధను, తన కూతురు ప్రియంవద (బి సరోజాదేవి)తో సమానంగా పెంచి, విద్యతోపాటు నృత్యం నేర్పించి ప్రవీణులను చేస్తాడు కోటా. పెళ్ళిళ్ళ పేరయ్య ప్రొ.రొయ్య (పేకేటి శివరామ్) ద్వారా గంగాధరరావు అబ్బాయి గురునాథ్‌కు విమలాపురంలో వీరితో పెళ్ళిచూపులు ఏర్పాటవుతాయి. అంతకుముందు తమ ఊరిలో లైబ్రరీలో విరాళంకోసం అంగ్ల, పింగ్లా అనే మారు పేర్లతో అనురాధ, ప్రియంవద ఇచ్చిన నృత్య ప్రదర్శనలో ప్రియంవదను చూసి, గురునాథ్ ప్రేమిస్తాడు. ఆ పెళ్ళిచూపులు తప్పించుకోవటం కోసం, తనబదులు వాసును ఒప్పించి విమలాపురం పంపుతాడు. అక్కడ వాసు, వారి అభిమానం అనురాధ ప్రేమ పొంది, వారి బలవంతంపై ఉద్యోగానికి రాజీనామా ఇస్తాడు. తండ్రికి తెలియకుండా వాసు గదిలో దాగివున్న గురునాథ్ ఇంటికి వచ్చి విమలాపురం సంబంధం వద్దని చెప్పటం, కెప్టెన్ కోటా, నాథ్ తమవద్ద ఉన్నాడని, పెళ్ళికి సిద్ధమని టెలిగ్రాం ఇవ్వటం. జరిగిన విషయం తెలుసుకోవాలని గంగాధరం, ఈ గుట్టు తెలుసుకోవాలని జనార్ధన్ వైజాగ్ రావటం, సుబేదార్ ఆంజనేయులు (డా శివరామకృష్ణయ్య) ఇంటవుండి వారి అమ్మాయి ఉమ (బాలసరస్వతి)ను అభిమానించటం. విమలాపురం వెళ్ళిన గురునాథ్ ప్రియంవదకు తన ప్రేమ వెల్లడించటం. వారి చనువుచూసి మందలించిన అనురాధను, ప్రియంవద, కులం తక్కువ దానివని, నీవు నా అక్కవుకావని ఎదిరించి మాట్లాడడం. జైలుకువెళ్ళిన వీరయ్య వచ్చి కోటాపై హత్యాప్రయత్నం చేయగా, అనురాధ అతన్ని గాయపరచి, తన తండ్రి అని తెలిసి కుమిలిపోతుంది. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించిన ఆమెను, తన కుమారుడు వాసును తేవాలని బయలుదేరిన జమిందారు కాపాడడం. ఈ ప్రయత్నంలో అనేక తర్జనభర్జనలు జరిగి అందరూ ఏకం కావటం. పెళ్ళిసందడితో జంటలు పెద్దల ఆశీస్సులు పొందటం చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో చలం తల్లిగా హేమలత, ఏఎన్నార్ తల్లిగా రమాదేవి, గుమ్మడి నౌకరుగా వేళంగి, సియస్‌ఆర్ నౌకరుగా రామకోటి, ఎడిటర్‌గా చదలవాడ కుటుంబరావు, ఇంకా నల్లరామ్మూర్తి, డాక్టరుగా కాండారావు నటించారు.
పెళ్ళిసందడి చిత్రం హాస్యరస చిత్రంగా, చక్కని సన్నివేశాలతో ఆహ్లాదకరంగా చిత్రీకరించారు దర్శకులు. ఏఎన్నార్ ఉండే షెడ్‌లో బెడ్‌రూమ్, కిచెన్ ఆరెంజిమెంట్సును హెడ్డింగ్స్‌తో చూపిస్తారు. అంజలిని తోటలో పాము కాటువేయగా, తాళానికున్న చాకుతో గాటిపెట్టి నోటితో విషం తీయటం, ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు వచ్చే సన్నివేశంలో.. చలంనుంచి వచ్చిన టెలిగ్రామ్‌లో ‘టైగర్ స్టార్‌టెడ్, గోట్ కేర్‌పుల్’ అని పేర్కొని, అనువాద ఉత్తరంలో ‘పులి బయలుదేరినది. మేకా జాగ్రత్త’ లాంటి చతురోక్తిని ప్రదర్శించి సున్నితమైన హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. చెల్లెలు మోసగాడిని పెళ్ళాడిందని అన్నగా ఆగ్రహం, బిడ్డనుకని అప్పచెప్పినపుడు విషాదం, ప్రియంవద తనను ఎదిరించిన సందర్భంలో అనూరాధ విచారం, తనను పెంచిన మేనమామ ద్వారా నిజం గ్రహించి వేదన, తండ్రి హత్యాప్రయత్నం చేస్తుండగా వెనకనించి కుండీతో తల పగలగొట్టి, తరువాత తండ్రి అని తెలిసి కుమిలిపోయిన వైనం.. తనను కొట్టింది కూతురేనన్న బాధతో వీరయ్య వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళే సన్నివేశం హృదయాలను కదిలిస్తుంది. ఇక చలం కాళ్ళకు ఒక బూటు లేకుండానే కారులో, కాలి నడకన వెళ్ళటం లాంటి సున్నితమైన, హాస్యరస స్పోరకమైన సన్నివేశాలతో బాలన్స్ చేస్తూ చిత్రాన్ని తీర్చిదిద్దారు యోగానంద్. పాటల చిత్రీకరణలోనూ వైవిధ్యాన్ని చూపారు. అంగ్లా, పింగ్లా పేరుతో వచ్చే నృత్యగీతంలో తొలుత భరతనాట్యంతో ‘సమయమిదిడాయరా’ అని వెనకాల గుడి ఆవరణ సెట్స్, రెండో చరణం, సముద్రం, బెస్తల వేషం, ఆకసంలో చందమామలో గుడిసె సెట్స్, ‘రావోయి చక్కనోడా’ 3వ చరణంలో బర్మాడ్రెస్‌తో గొడుగు, చిత్ర వేషధారణతో హైవేలో నారాజా అన్న గీతాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. మరో గీతం ‘జాలి బొంబైలే మామా ఓ మామా’ గుమ్మడి, రమణారెడ్డి, ఏఎన్నార్, అంజలిదేవి, బి సరోజాదేవిలపై వారి మనోగతాలు వెల్లడయ్యేలా చిత్రీకరించారు. హుషారుగా రమణారెడ్డి ఈలవేయటం అలరించే అల్లరిలా సాగుతుంది. ఏఎన్నార్ హీరో వాసుగా ఈజ్‌తో, సహజంగా నటించి మెప్పించారు. అంజలిదేవి మొదట అల్లరిగా, ఆపైన పెద్దరికం, బాధ్యతగల యువతిగా పరిపూర్ణత ప్రదర్శించగా, బి సరోజాదేవి చెల్లెలుగా, ఉడుకుమోత్తనం, అల్లరి, కొంత గాంభీర్యం అన్నిటినీ అలవోకగా నటనలో చూపారు. చలం గురునాథ్‌గా పాత్రోచితంగా నైపుణ్యాన్ని ఆకట్టుకునేలా నటించారు. మిగిలిన వారందరూ సన్నివేశాలను తమ ప్రతిభతో సునాయాసంగా రక్తికట్టించారు.
అంజలిదేవి, బి సరోజాదేవిలపై చిత్ర ప్రారంభంలో వచ్చే నృత్య గీతం -నల్లని వాడే చల్లనివాడే/ పిల్లనగ్రోవీ గోపాలుడే (పి లీల, కె రాణి). ఏఎన్నార్ ఊహలో అంజలీదేవిపై.. ఓ తోటలో అలరించే చిన్న స్టెప్పుతో ఆధునిక యువతి లక్షణాలను ఆనాడే ఏకరువుపెడుతూ తీసిన గీతం -అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా/ అది తెలిసి మసులుకో బస్తీ చిన్నదా (పి లీల). అక్కినేని, అంజలీదేవి అలరించే అభినయంతో.. పిక్‌నిక్‌లో చక్కని పూల దోటలో, వంతెనలపై, నది జలపాతాలపై చూడచక్కగా చిత్రీకరించిన ఆహ్లాదకర గీతం ఒకటుంది. పాటకు ముందు సాకీ ఘంటసాల గళంలో మైమరపును కలిగిస్తుంది. -చూపుల తీపితో కొసరుచున్/ కూర్మి జవరాలొక వైపు రేపటి ఆశ/ నిన్నటి వెతలేల నేటి సుఖాల తేలుమా/ రావే ప్రేమలతో నీవే నా కవితా’ మంచి సందేశంతో సాగుతుంది (ఘంటసాల, ఆర్ బాలసరస్వతిదేవి). అంజలీదేవి, అక్కినేనిలపై చిత్రీకరించిన మరో యుగళ గీతం -చమక్ చమక్ తారా ఝణక్ ఝణసితారా (ఘంటసాల, పి లీల). బి సరోజాదేవి, చలంలపై చిత్రీకరించిన గీతం -బైటోబైటో పెళ్ళికొడుకా, ఆల్ రైటోరైటో నా పెళ్ళికూతురా (జిక్కి, జెవి రాఘవులు).
పెళ్ళిసందడి గీతాలన్నీ చక్కని అలరింపుతో సాగటం, ‘జాలి బొంబైలే’ హుషారుగా అక్కినేని, అంజలిదేవి, బి సరోజాదేవిల స్టెప్స్‌తో సాగటం చక్కని అనుభూతిని అందిస్తుంది. ఓ చక్కని కుటుంబ, హాస్యరస చిత్రంగా తీర్చిదిద్దబడినది పెళ్ళిసందడి.
ఇదే టైటిల్‌తో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, దీప్త్భిట్నాగర్, రవళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కూడా హాస్యంతో మెప్పించటం, సక్సెస్ సాధించటం విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి