మెయిన్ ఫీచర్

స్టార్‌డమ్‌డమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో హీరోయే కింగ్. వరుసగా రెండు మూడు హిట్లు పడ్డాయంటే -అతని చుట్టూ కథలల్లుకుంటారు. అతనికోసమే ప్రాజెక్టులు, ప్రయోగాలు సిద్ధం చేస్తూంటారు దర్శకులు. అతన్ని దృష్టిలో పెట్టుకొనే మాటల రచయితలు అద్భుతమైన పంచ్‌లు రాస్తారు. హీరోను దృష్టిలో పెట్టుకొనే సెట్టింగ్స్ సిద్ధమవుతాయ. కాస్ట్యూమ్స్ డిజైన్ చేయబడతాయ. హీరోని దృష్టిలో పెట్టుకునే -కాంబినేషన్లు ఏర్పడతాయ. మొత్తంగా సినిమా అంటే -హీరో. ఇదంతా ఓ ప్రాసెస్.

సరిగ్గా చెప్పాలంటే అదే -హీరో స్టార్‌డమ్. అది చూసి, ఆ స్థాయికి వెళ్లిపోవాలన్న ఆలోచనలతో పరిశ్రమలోకి అడుగు పెడుతున్న వాళ్లు మాత్రం ‘్ఢమాల్’ అంటున్నారు. హీరోగా ఓ స్టేటస్‌కు రావడం అంటే అంత సులువేం కాదు. ఒక రేంజ్‌కు చేరిన వాళ్లకే -ఎప్పుడూ అక్కడే ఉంటామన్న గ్యారంటీ సినిమాల్లో ఉండదు. అలాంటిది -పరిశ్రమలోకి అడుగుపెట్టడంతోనే టాప్‌హీరో రేంజ్‌కు వెళ్లిపోతామన్న ఆలోచనలు కుర్ర హీరోల కెరీర్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నాయన్నది నిజం.
సినిమా హీరో పాపులార్టీ చూసి -ఆ క్రేజ్‌పై ఆశపడుతున్న వాళ్ల సంఖ్య ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువే అయ్యింది. ఆశ పడటంలో తప్పులేదు, అందుకు ఎలాంటి అవకాశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి? నటనపై ఉన్న ఆసక్తి, అనుభవమెంత? లాంటి క్వాలిఫికేషన్లు చూసుకోకుండానే స్క్రీన్‌కు వచ్చేస్తున్నారు. తాము హీరో మెటీరియల్ అవునా? కాదా? అనేది ఆలోచించడం లేదు. అందరూ నటిస్తున్నారు కాబట్టి మనం నటించలేమా? అన్న భావనతో సినిమా హీరోలైపోతున్నారు. దర్శకులు, రచయితలు, కెమెరామెన్లు ఏవో తంటాలు పడి హీరోని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసినా, బెడిసికొడుతున్న సినిమాలే ఎక్కువ. ‘తన గురించి తాను తెలుసుకున్నవాడే నిజమైన హీరో’ అన్నది అక్కినేని సుభాషితం. ఇది జీవితం గురించే చెప్పినా, చెప్పిన వ్యక్తి గొప్ప నటుడు కనుక స్క్రీన్‌కూ అన్వయించుకోవడం తప్పేం లేదు. నువ్వు హీరోలా ఉన్నావ్ అన్న స్నేహితుల మాట పట్టుకునో, డబ్బుంది కదా.. ట్రై చేస్తే పోలా? అన్న ఉద్దేశంతోనో హీరో అయిపోదామని వస్తున్న వాళ్ల పప్పులు ఉడకడం లేదని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలు. ఎక్స్‌ప్రెషన్స్ పలికించలేకపోయినా, కండలు చూపించి యాక్షన్ ఎడిసోడ్స్ రక్తికట్టించగలిగితే హీరో అయిపోయినట్టేనన్న భావనలోనూ చాలామందే కనిపిస్తున్నారు. ఎక్స్‌ప్రెషన్స్ పలకకపోతే -పక్కనున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌పైకి కెమెరా ఫోకస్ చేసే డైలాగ్‌ను మేనేజ్ చేద్దామన్న దర్శకుల మాటలు నమ్మి వస్తున్నా వాళ్లూ బాక్సాఫీస్ గుమ్మం దగ్గర బోర్లాపడుతున్నారు. ఇలాంటి ఉదాహరణలు ప్రస్తుత చిత్రసీమలో లెక్కలేనన్ని. ఇదంతా సరే.. సినిమా విడుదలయ్యాక అసలు పాట్లు మొదలవుతాయి. స్టార్‌డమ్ ఊహల్లో విడుదలైన తొలి సినిమాకు -్థయేటర్లు దొరక్క, తీసుకున్న అడ్వాన్స్‌కు తగిన విధంగా సినిమా ఆడించక మొదటిరోజే తీసేసి మరో చిత్రం థియేటర్లో పడినపుడు అసలు విషయం అర్థమవుతుంది. తొలి సినిమాతోనే హీరో మెటీరియల్ కాదన్న అపవాదు భుజానమోస్తూ -ఇండస్ట్రీకి సెట్‌కాక, వెండితెరపై వెలగలేక కెరీర్‌పై కన్ఫ్యూజన్‌తో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా దెబ్బతిన్నవాళ్లలో చాలామంది -అక్రమంగా డబ్బు సంపాదనకో, మాదక ద్రవ్యాల వ్యాపారాలకో, అసాంఘిక కార్యకలాపాలకో పాల్పడి చీకట్లో కలిసిపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందీ అంటే -తనను తాను అంచనా వేసుకోకపోవడం. అగ్రహీరోలను చూసి అలాంటి స్టార్‌డమ్‌తో వెలిగిపోవాలన్న ఆశల్లో విహరించటం వల్ల. కెమెరాకు తగిన విధంగా నటించడం, డాన్స్ చేయడం, ఫైట్లు చేయడం లాంటివి మాత్రమే ఆలోచించకుండా తనగురించి తాను విశదంగా ఆలోచించుకొని హీరోగా నటించడానికి ముందుకొస్తే బాగుంటుందని ఇటీవల విడుదలైన అనేక చిత్రాలు గమనించాక పలువురు చెబుతున్న విషయం.
ఈ ఏడాది కొత్తగా పరిశ్రమకు హీరోగా పరిచయమై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఒకరిద్దరు మాత్రమే అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని, వైవిధ్యమైన కథనంతోసాగే సినిమాలు చేసి హీరోగా నిలబడ్డారు. దాదాపు 90 శాతం కొత్త హీరోలు అడ్రస్ లేకుండా వెళ్లిపోయినోళ్లే. చాలావరకూ మంచి కథతో వచ్చినా, దర్శకుడి ప్రతిభ కనిపించినా -హీరోలో కరెంట్ కరవై టపా కట్టేసిన సినిమాలే ఎక్కువ. నవీన్‌చంద్ర చేసిన ‘లచ్చిందేవికి లక్కుంది’, అజ్మల్ హీరోగా సీనియర్ డైరెక్టర్ వంశీ తీసుకొచ్చిన ‘వెనె్నల్లో హాయ్ హాయ్’, జాతీయస్థాయి గుర్తింపు పొందిన ఆది హీరోగా వచ్చిన ‘మలుపు’, వంద చిత్రాల హీరో శ్రీకాంత్ ‘టెర్రర్’, శివాజీ హీరోగా ‘సీసా’, నారా రోహిత్ ‘సావిత్రి, రాజా చెయ్యివేస్తే’ చిత్రాల కథ కథనాలపరంగా బావున్నా ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. టీవీ స్టార్ సాగర్ హీరోగా వచ్చిన ‘సిద్ధార్థ’ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. అతనికి టీవీ మాథ్యమంలో మంచి గుర్తింపు ఉంది. కానీ వెండితెరపైకి వచ్చేసరికి ఆ గుర్తింపు దేనికీ పనికిరానిదైంది. నవీన్ విజయ్‌కృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘నందిని నర్సింగ్ హోం’ చిత్రం కూడా కథాపరంగా ఓకె. కానీ హీరోపరంగా తేలిపోయింది. కొద్దోగొప్పో అనుభవం ఉన్నవాళ్లు, పెద్ద డైరెక్టర్ల చేతినుంచి వచ్చిన సినిమాలే బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఇక అంతా ఫ్రెష్ అంటూ వచ్చిన సినిమాల్లో కొత్త హీరోల పరిస్థితి మరీ దారుణం.
చునియా దర్శకత్వంలో కార్తిక్‌రాజా హీరోగా వచ్చిన ‘పడేసావే’, మానస్ హీరోగా ‘ప్రేమికుడు’, సుధీర్‌వర్మ, సుధాకర్ కొమ్మాకుల లాంటి ఇద్దరు హీరోలున్న ‘కుందనపుబొమ్మ’ను ఎవరూ పట్టించుకోలేదు. వీరివీరి గుమ్మడిపండు, గుంటూరు టాకీస్, శౌర్య, తుంటరి, తులసీదళం, ఓ స్ర్తి రేపురా, నేనూ మా కాలేజీ, దృశ్యకావ్యం, రొమాన్స్ విత్ ఫైనాన్స్, రన్, మెహబ్బత్‌మే, అమ్మారుూ ఆరుగురు లాంటి చిత్రాల్లో కొత్త హీరోలైన ఆశీష్‌గాంధీ, రామ్‌కార్తిక్, రామచంద్ర, కార్తీక్, ఆదిత్య ఆనంద్‌లాంటి హీరోలను పట్టించుకోలేదు. 7 టు 4లో ఆనంద్ బచ్చు, రోజులు మారాయితో చేతన్, చరణ్‌దీప్ హీరోగా అంతం, సంజీవ్ కథానాయకుడిగా ఇద్దరం, సూరి కథానాయకుడిగా బొమ్మల రామారం, రోషన్ కథానాయకుడిగా నిర్మలా కానె్వంట్, నిఖిల్‌కుమార్ హీరోగా జాగ్వార్, అదిత్ అమన్ హీరోగా ఎల్7, తేజ కాకుమాను హీరోగా తను వచ్చెనంట చిత్రాలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు ఆ థియేటర్ల వైపు చూడకపోవడంతో రెండో రోజే టపా కట్టేశాయి. ఒక్క విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లిచూపులు’, అర్జున్ యజత్ హీరోగా ‘అర్థనారి’ సినిమాలు కంటెంట్ వైవిధ్యంగా వుండడంతో ప్రేక్షకులు ఆదరించారు.
హీరో నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలానైనా వుండాలి. లేదా సినిమా కథలో సరికొత్త కంటెంట్ అయినా వుండాలి. ఈ రెంటిలో ఏదివున్నా -చిన్న సినిమా సేఫ్‌జోన్‌లో ఉంటుంది. అలాకాకుండా పాత సినిమా మూస పద్ధతిలోనే కథనం రాసుకుని, కేవలం ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల్లో లైక్‌లతో హీరోలైపోయామన్న ఆలోచనలతో చేసిన చిత్రాలు ఢమాల్ మంటున్నాయి. ఫేస్‌బుక్‌ల్లో లైక్‌లతో హీరోలు కాలేమన్న విషయాన్ని -స్టార్‌డమ్ ఆలోచనలతో ఇండస్ట్రీని వెతుక్కుంటూ వస్తున్న కుర్రాళ్లు గుర్తించాలి. లేదంటే కెరీర్ కన్ఫ్యూజన్‌లో పడటం ఖాయం.

-జి.రాజేశ్వరరావు