మెయిన్ ఫీచర్

పెద్ద పండుగకి... పాత బాసులే..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ హీరోగా చారిత్రక కథ -గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా సిద్ధమవుతోంది. భక్తిరసాన్ని మళ్లీ భుజానికెత్తుకున్న నాగార్జన -హాథీరామ్‌బాబా పాత్రలో ఓం నమో వేంకటేశాయ అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ట్రాక్ మార్చుకుని కుటుంబ కథా చిత్రాలతో అలరిస్తున్న వెంకటేష్ -ఒక్కసారిగా స్పోర్ట్స్ ట్రాక్‌లోకి మారాడు. బాక్సింగ్ కోచ్ క్యారెక్టర్‌తో ‘గురు’గా అలరించబోతున్నాడు. రాజకీయాలకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టి -మళ్లీ మేకప్‌కు సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’గా ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు. నలుగురు సీనియర్ హీరోలు. ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా స్టయిల్. ఈసారి నలుగురూ -సంక్రాంతి బరిలో
నిలుస్తున్నారు. సినిమా అభిమానికి ఈసారి
ఇదే ‘ఫెస్టివల్ బొనాంజా’. హిట్టు ఫట్టులతో
సంబంధం లేకుండా -నలుగురూ తమ సత్తా ప్రూవ్
చేసుకున్నవాళ్లే. నలుగురూ సంక్రాంతి
సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాలన్న
ప్రణాళికల్లో ఉన్నారు. అందుకే -ఈసారి సినిమా సంక్రాంతి కొత్త శోభ సంతరించుకుంటుందన్న ఆసక్తి ఆడియన్స్‌లో
ఇప్పటినుంచే కనిపిస్తోంది.

ట్రెండ్ మారింది. లైఫ్ స్టయిల్ వేగం పెరిగింది. టైం దొరికితేనే -సినిమా. వౌత్‌టాక్ బలంగా వినిపిస్తేనే -చూడదగ్గ సినిమా. హీరోని బట్టి, అతని క్యారెక్టర్‌ని తెలుసుకుని, కంటెంట్‌ను కాలిక్యులేట్ చేసుకున్నాక.. వెళ్లాలా? వద్దా? అన్న నిర్ణయం. కానీ -దశాబ్దాలు నడుస్తున్నా తెలుగు సినీ చరిత్రలో సంక్రాంతి సెంటిమెంట్ మాత్రం మారదు, మారడం లేదు. పెద్ద పండుగకు ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్టుకొట్టే హీరో ఎవరన్న అంశంపై క్లాస్‌లోను, మాస్‌లోనూ కామన్ ఆసక్తి కనిపిస్తోంది. అందుకే -ఏటా సంక్రాంతిని టార్గెట్ చేసుకుని పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారీ పండగ బరిలోకి పెద్ద సినిమాలే దిగుతున్నాయి. కాకపోతే, ప్రత్యేకత ఏమిటంటే -బాక్సాఫీస్ దగ్గర సత్తా తేల్చుకోవడానికి సీనియర్ హీరోలు సిద్ధమవుతున్నారు.
తహతహలాడుతున్న మెగా ఫ్యాన్స్ కోసం, చాలాకాలం తరువాత మళ్లీ మేకప్‌కు ఓకే చెప్పాడు -చిరంజీవి. స్క్రీన్‌మీద ‘మెగా’ అనిపించుకుని, స్టార్ హీరో ఇమేజ్‌తోనే పాలిటిక్స్‌లోనూ ‘మెగా’ అనిపించుకోవాలన్న ఆశతో రాజకీయ అరంగేట్రం చేశాడు. -ఆ బిజీలో కొంతకాలం తెరకు దూరంకాక తప్పలేదు. అయినా అడపాదడపా స్క్రీన్‌పై గెస్ట్‌రోల్స్‌లో కనిపిస్తూనే వచ్చాడు. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ (2007లో విడుదలైన శంకర్‌దాదా జిందాబాద్) తరువాత -పూర్తి నిడివి పాత్రతో మళ్లీ ప్రాజెక్టు చేస్తున్నాడు చిరంజీవి. అతిధి పాత్రలు చేసిన సినిమాలతో కలిపి 149 చిత్రాల రికార్డుకు చేరిన చిరుకి -సంక్రాంతికి విడుదలవుతున్న తాజా చిత్రంతో 150 పూర్తవుతాయి. రికార్డు చిత్రాన్ని రికార్డు సృష్టించేలా చేయాలి కనుక -సరైన కథ కోసం చిరంజీవి చాలాకాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. తమిళ చిత్రం ‘కత్తి’ని రీమేక్ చేయాలన్న ఆలోచనకు వచ్చిన తరువాత కూడా -రీమేక్‌కు వెళ్లాలా? స్ట్రెయిట్ చిత్రం చేయాలా? అన్న అంశంపై కాలయాపన జరిగింది. చివరకు తమిళ చిత్రం మురగదాస్ ‘కత్తి’ని తీసుకుని, తన కెరీర్‌కు ప్రాణం పోసిన ‘ఖైదీ’ టైటిల్, సినిమా నెంబర్ 150 ప్రతిబింబించేలా ‘ఖైదీ నెం 150’ అంటూ రాజకీయ నేపథ్యమున్న చిత్రానికి ఓకే చెప్పాడు చిరంజీవి. కొడుకు రామ్‌చరణ్ బ్యానర్ ‘అంజనా ప్రొడక్షన్స్’పై వివి వినాయక్ దర్శకత్వంలో, చిరుకు జోడీగా క్యూట్ హీరోయిన్ కాజల్‌తో శరవేగంగా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ముఖ్య విషయాలు ఏంటంటే? పుష్కర కాలం తరువాత చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు థియేటర్ల వద్ద పోటీ పడటానికి సిద్ధపడటం. 2004లో చిరంజీవి ‘అంజి’తో, బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహ’తో బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. లక్ష్మీనరసింహ చిత్రం బాలకృష్ణ రేంజ్‌ను అమాంతం పెంచేస్తే -తెలగు ఇండస్ట్రీకి భారీ గ్రాఫిక్స్‌ను పరిచయం చేస్తూ సోషియో ఫాంటసీగా వచ్చిన చిరంజీవి ‘అంజి’ అనుకున్న ఫలితాలు అందించలేకపోయింది. పైగా చిరంజీవి కెరీర్‌లో ఇప్పటి వరకూ సంక్రాంతి సీజన్‌లో వచ్చిన సినిమాలు దాదాపు పదిహేను వరకూ ఉంటే, -కొన్ని సినిమాల మాత్రమే చిరు స్టార్ ఇమేజ్‌కు ఉపయోగపడ్డాయి. చట్టంతో పోరాటం, దొంగమొగుడు, ముఠామేస్ర్తీ, హిట్లర్‌లాంటి చిత్రాలు చిరు రేంజ్‌కు తగిన సినిమాలు అనిపించుకున్నాయి. పనె్నండేళ్ల తరువాత మళ్లీ పండగ సినిమాల రేసులో నిలబడుతున్న చిరంజీవి సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.
***
శాతవాహనుల కాలంనాటి చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను ఎంపిక చేసుకుని చారిత్రక కథతో పండుగ ఆనందం అందించేందుకు వస్తున్నాడు హీరో బాలకృష్ణ. పుష్కరకాలంలో పదహారు చిత్రాల వరకూ చేసినా -‘లక్ష్మీనరసింహ’లాంటి సక్సెస్ బాలకృష్ణ ఖాతాలో ఒక్కటీ పడలేదు. ఒక్కమగాడు, పరమవీరచక్ర, గత ఏడాది వచ్చిన డిక్టేటర్‌లాంటి చిత్రాలు సంక్రాంతి సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. డిక్టేటర్ డిజాస్టర్ తరువాత -చారిత్రక నేపథ్యమున్న కథను ఎంచుకున్నాడు. ఆ తరహా చిత్రాలు రూపొందించడంలో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న దర్శకుడు క్రిష్‌తో కలిసి చేస్తున్నాడు. కొత్త రాష్ట్రంగా ఆంధ్ర అవతరించిన తరువాత రాజధానిగా ‘అమరావతి’ ప్రాధాన్యత పతాకస్థాయికి రావడం, శాతకర్ణి పాలనాప్రాంతంలో ‘అమరావతి’ ప్రస్తావనలు ఉండటంలాంటి అంశాల సమన్వయంలో.. చిత్రంపై అంచనాలు పెరిగాయి. పౌరాణిక, జానపద చిత్రాల పాత్రల పోషణలో తండ్రి ఎన్టీఆర్ తరువాత.. అనిపించుకున్న బాలకృష్ణ -శాతకర్ణి పాత్ర చిత్రణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ కాలంనాటి దృశ్యాలను క్రిష్ ఎలా ఆవిష్కరించనున్నాడన్న ఆసక్తీ ఉంది. వెరసి -సంక్రాంతికి బాలకృష్ణ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్పెషల్ ఫీస్టే అనుకోవాలి.
***
ప్రస్తుతం కెరీర్‌ను టాప్‌గేర్‌లో నడిపిస్తున్న వెటరన్ హీరోల లిస్టులో సీజనల్ హిట్లు కొడుతున్నది నాగార్జున ఒక్కడే. ఒకదశలో నాగార్జున హీరోయిజం క్యారెక్టర్ ఆర్టిస్ట్ టర్న్ తీసుకోవాల్సి వచ్చిన సమయంలోనూ -ఒకటి రెండు హిట్లతో మళ్లీ హవా కొనసాగిస్తున్నాడు. భాయ్, గ్రీకువీరుడు చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో -నాగ్ పనైపోయిందనే అనుకున్నారు. ‘మనం’ చిత్రం తరువాత నాగార్జున హవా మళ్లీ మొదలైంది. కుర్ర హీరోల రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా హిట్లు అందుకుంటూనే ఉన్నాడు. గత సంక్రాంతికి ‘సొగ్గాడే చిన్నినాయినా’ అంటూ తండ్రి ఏఎన్నాఆర్ హిట్‌సాంగ్‌లోని పల్లవిని టైటిల్ చేసుకుని వచ్చిన నాగ్ -పంచెకట్టు పాత్రతో దుమ్ము దులిపేశాడు. వెంటనే ‘ఊపిరి’లాంటి క్లాసిక్‌తో హిట్టుకొట్టి కెరీర్‌కు టాప్‌గేర్ వేశాడు. నిజానికి నాగ్ కెరీర్‌లో వచ్చిన సంక్రాంతి సినిమాలు దాదాపు హిట్లే. ప్రాభవం తగ్గుతున్న టైంలో కెరీర్‌కు ఊపునిచ్చినవే. ఒకప్పటి మజ్ను, తరువాత కిల్లర్, ఆవిడా మా ఆవిడే, స్టైల్ చిత్రాలు పండగ సీజన్‌లో వచ్చినవే. దాదాపు హిట్లుకొట్టిన నాగ్ -గత ఏడాది సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయినా’తోనూ సెంటిమెంట్ హిట్ అందుకున్నాడు. -ఈసారీ సంక్రాంతిని టార్గెట్ చేసుకుని సినిమా చేస్తున్నాడు. భక్తిరస పాత్రలకు ప్రాణం పోయగల హీరోగా క్రేజ్ తెచ్చుకున్న నాగ్ -సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావుతో కలిసి హాథీరామ్ బాబాగా కొత్త అవతార్‌తో వస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. ‘ఓం నమో వెంకటేశాయ’ తన కెరీర్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందన్న ధీమాతోవున్న నాగ్ -సంక్రాంతి రేసులో ఏ ప్లేస్‌లో నిలబడతాడో చూడాలి.
***
ఏ జానర్‌లోనూ చిక్కుకోకుండా -కెరీర్‌ను సెపరేట్ ట్రాక్‌పై నడిపిస్తున్న హీరో -వెంకటేష్. మినిమం గ్యారెంటీ సినిమాలతో వచ్చే వెంకటేష్ -‘బాడీగార్డు’ హిట్టు తరువాత కెరీర్‌కు కొత్త టర్న్ ఇచ్చాడు. కుర్ర హీరోల పోటీ పెడుగుతుండటంతో -తెలివిగా వాళ్లకు రూట్ ఇస్తూనే ‘మల్టీస్టారర్’ అంటూ కలిసి ట్రావెల్ చేయడానికి సిద్ధపడ్డాడు. వందే జగద్గురుం, సీతమ్మవాకిట్లో.. మసాలా, గోపాలగోపాల లాంటి చిత్రాలు ఆ తరహాలో వచ్చినవే. మధ్యలో చేసిన షాడో నిరాశను మిగిలిస్తే, మొన్నటికి మొన్న ‘బాబు బంగారం’ కుంగదీసింది. రీమేక్ చిత్రం ‘దృశ్యం’తో కొత్త ప్లేవర్‌ను అందించిన వెంకటేష్ -ఈ సంక్రాంతికి రీమేక్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యమున్న కథను తీసుకుని బాక్సింగ్ కోచ్‌గా ‘గురు’ అవతారం ఎత్తాడు. ఈ చిత్రం -సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా? అన్న సందేహాలున్నా -చివరి క్షణంలో రేసులోకి రావొచ్చన్న లెక్కలూ లేకపోలేదు. సో.. నలుగురు వెటరన్ హీరోలు. నాలుగు జోనర్లు. ఎవరి సత్తా ఏమిటన్నది -సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర తేలుతుంది. ఆ పందెం ఏ రేంజ్‌లో ఉండబోతుందన్న అంశం మాత్రం అభిమానుల్లో ఇప్పటినుంచే ఆసక్తి రేపుతోంది.

-ప్రవవి