మెయిన్ ఫీచర్

ఎంతైనా హీరోలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ హీరోయే -నిర్మాత అయితే?
ఏముందీ, సినిమా బడ్జెట్ పావువంతు తగ్గుతుంది. ఖర్చుల మీద కంట్రోల్ పెరుగుతుంది. మొత్తంగా
-బయటపడే బడ్జెట్ పరిమితితో
ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. కాలం
కలిసొచ్చి సినిమా హిట్ కొడితే -కోట్లు
మిగుల్చుతుంది. స్టార్ హీరోకి
రెమ్యునరేషన్‌తోపాటు వాటాలు..
భాగస్వామి నిర్మాతకు
-నిలదొక్కుకునే లాభాలు.
టోటల్‌గా పరిశ్రమ సేఫ్.

1 (నేనొక్కడినే) దారుణంగా దెబ్బతిన్న తరువాత -తెలుగు పరిశ్రమలో హైయస్ట్ పెయిడ్ స్టార్ హీరో మహేష్ ఆలోచించింది ఇదే. స్టామినా
పెంచుకున్న తెలుగు సినిమా.. బడ్జెట్‌నూ అంతే వేగంగా పెంచుకుంటూ పోతుంటే -ఎదురు దెబ్బ తగిలినపుడు ఏంచేయాలన్న ఆలోచన నుంచి పుట్టిన కొత్త ప్రణాళిక. ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలతోపాటు అప్‌కమింగ్
జనరేషన్ హీరోలూ -స్టాయినిబట్టి ఇదే ప్రణాళికను అనుసరిస్తున్నట్టు
కనిపిస్తోంది పరిశ్రమలో. ఒకందుకు ఇది మంచిదే అనుకోవాలి.
**
ఏ భాషలోనైనా ఎన్ని సినిమాల్లోనైనా -హీరో తెలివైనవాడు. చురుకైనవాడు. రూపాయిని పది చేయగల సమర్థుడు. కోట్ల రూపాయల విలన్ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చగలవాడు. నచ్చింది చేయగలడు. కార్య నిర్వహణపై అవగాహన లేకున్నా -కర్తవ్యం అతన్ని నడిపిస్తుంది. అందుకే -హీరోకి తెలియనిది ఉండదు. తెలుసుకోవాల్సింది కష్టంగా అనిపించదు. కథలో హీరో పాత్ర ఏదైనా -ఆ పాత్రకు సంబంధించిన అన్ని గుడ్ క్వాలిటీస్ అతనికి ఉంటాయి. హీరో- కార్యసాధకుడు.
రీల్ హీరో సరే.. మరి రియల్ లైఫ్‌లోనూ అలాంటి బలాలు ప్రదర్శించే హీరోలుంటారా? అంటే... ‘యస్’ అనిపించుకోడానికి ఈ తరం హీరోలు కొందరు తహతహలాడుతున్నారు. స్క్రీన్ మీదున్నట్టు కాకున్నా -లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ సీన్ చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అది -కెరీర్‌కు కాస్త రిలీఫైంది కావొచ్చు. చిన్నప్పటి నుంచీ వంటబట్టింది కావొచ్చు. లేదా... కెరీర్ ముగిసే సరికి వ్యాపారంలా నిర్వహించే వ్యాపకం కావొచ్చు. మొత్తానికి -ఎక్కడ సంపాదిస్తున్నారో అక్కడే పెట్టుబడులు పెట్టి సంపాదనను రెట్టింపు చేయాలన్న ఆలోచనలు, తలంపుల్లో హీరోలు కనిపిస్తున్నారు. అందుకే -ఎలాంటి అదురు బెదురు లేకుండా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాణ సంస్థ బ్యానర్‌ను బాక్సాఫీస్ దగ్గర రెపరెపలాడించే ప్రయత్నాల్లో తలమునకలు అవుతున్నారు.
***
ఒకప్పటి సినిమా పరిస్థితి వేరు. కథ ఒకరు రాస్తే.. పాటలు మరొకరు రాసేవారు. రెండూ కలగలిపి కథనాన్ని ఇంకొకరు సిద్ధం చేసేవారు. ఇవన్నీ రెడీ అయిన తరువాత -సంభాషణలకు మరొకరు ఉపక్రమించేవారు. దర్శకుడు, నిర్మాత పర్యవేక్షణలో ప్రీ ప్రొడక్షన్ పేరిట.. ఇలా ఎవరు చేసే పని వాళ్లు చేసేశాక -చేతికందిన బౌండ్ స్క్రిప్ట్‌తో సెట్స్‌కు వచ్చేవాడు దర్శకుడు. క్రమంగా ఈ పద్ధతి కనుమరుగైంది. ప్యాకేజీల ప్రభావం పెరిగింది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు.. వీలైతే పాటలు, సంగీతం, దర్శకత్వం -అన్నీ సింగిల్ కార్డుపై ప్యాకేజీగా చేసుకొచ్చే పనోళ్లు పరిశ్రమకు అందివచ్చారు. ఇలా -‘ఎ టు జెడ్’ చేసుకొచ్చే దర్శకులే సొంత సంస్థలు పెట్టి నిర్మాణ బాధ్యతలూ తీసుకున్నారు. లేదా పెట్టుబడి పెట్టే నిర్మాతతో -ప్రాజెక్టుకు ‘రేటు’ మాట్లాకుంటూ వచ్చారు. ఇది డైరెక్టర్ ఇనె్వస్ట్‌మెంట్. దీనికి స్టార్ హీరో కాల్షీట్లు ఇచ్చి -తాను తీసుకునే రెమ్యునరేషన్‌లో కొంత పెట్టుబడిగా వదిలేస్తే... హీరోయే షేర్‌హోల్డర్. ఇక మిగిలిన స్టార్ కాస్ట్, నిర్మాణ పెట్టుబడికి మరో నిర్మాతను చూసుకుంటే చాలు. ప్రాజెక్టును తక్కువలో తక్కువ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చినట్టే. ఇది సరే -సినిమాకు కాల్షీట్లు ఇవ్వాల్సిన హీరో కీలకం కనుక -స్టార్ హీరోలే ఈ నిర్మాణ బాధ్యతను తీసుకుంటే, ఇక తిరుగే ఉండదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అదే జరిగింది. నచ్చిన కథను సినిమాగా తీయాలన్న అభిరుచి, మరోపక్క లాభాలు గడించేఅవకాశం ఉన్న తరుణంలో -ఎన్టీఆర్, కృష్ణలాంటి అగ్ర హీరోలు అదే పని చేశారు. అన్నీ తామై సినిమాలు నిర్మించారు. విజయాలతోపాటు లాభాలూ సొంతం చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు.. -కొంతమంది నవతరం హీరోలు ఇదే ఆలోచనలతో ముందుకొస్తున్నారు. వాస్తవానికి తెలుగు చిత్రసీమలో సింహభాగం హీరోలు -నిర్మాణ సంస్థల, భారీ నిర్మాతల వారసులే. కాబట్టి సినిమా గురించి అణువణువూ తెలుసు. నిర్మాణం లోటుపాట్లు బాగా తెలుసు. దాన్ని మార్కెట్ చేసుకునే నెట్‌వర్కూ తెలుసు. ఈ అనుభవాలతోనే -సినిమా నిర్మాణాల వైపు వేగంగా అడుగులేస్తున్నారు. సొంత బ్యానర్లు పెట్టి రెపరెపలాడించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే సినిమా నిర్మాణంపై మక్కువ చూపుతోన్న హీరోల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హీరోలే నిర్మాతలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో.. వీళ్లనుచూసి -చిన్న హీరోలు, భవిష్యత్ హీరోలు స్వీయ నిర్మాణ ప్రణాళికలతోనే పరిశ్రమకు వస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతి టార్గెట్‌తో వస్తున్న చిరంజీవి 150వ సినిమాకు -ఆయన కొడుకు రామ్‌చరణ్ నిర్మాత. తండ్రి 150వ సినిమా రికార్డులు సొంతం చేసుకునే ఉద్దేశంతోనే -కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట కొత్త నిర్మాణ సంస్థకు రూపమిచ్చాడు. సినిమా నిర్మాణంపై చరణ్‌కు మక్కువ ఇప్పటిదేం కాదు. కొంతకాలంగా ఆ మాటను పబ్లిక్‌గా అంటూనే ఉన్నాడు. తన ఆలోచనకు ముహూర్తాన్ని -తండ్రి సినిమాతో కుదుర్చుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్‌తోపాటు -చిన్న చిత్రాల్ని నిర్మించే లక్ష్యంతో ‘వైట్ హార్స్ ప్రొడక్షన్స్’పైనా చరణ్ దృష్టి పెట్టినట్టు ఇండస్ట్రీలో వినిపించే మాట.
‘1’-నేనొక్కడినే తరువాత -హీరో మహేష్ సైతం ఇదే ఆలోచనకు వచ్చాడు. జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నిర్మాణ సంస్థకు రూపమిచ్చాడు. తొలి ప్రయత్నంగా ‘శ్రీమంతుడు’లో భాగం పంచుకున్నాడు. ముందు సినిమాతో మసకబారిన కెరీర్‌కు ‘శ్రీమంతుడు’ కొత్త ఊపునిచ్చింది. ఆ ఊపులోనే తరువాతి చిత్రం ‘బ్రహ్మోత్సవం’ నిర్మాణానికీ చేయి అందించాడు. మంచి కథలు తీసుకొస్తే తన నిర్మాణ సంస్థపై చిన్న చిత్రాలు నిర్మించే ఆలోచన ఉందని మహేష్ ఎప్పుడో ప్రకటించాడు.
‘సర్దార్’తో పవన్‌కల్యాణ్ నిర్మాతే కాదు, కథకుడూ అయ్యాడు. సొంత సంస్థ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ భాగస్వామ్యంలోనే ‘సర్దార్’ నిర్మించాడు. ఇదే నిర్మాణ సంస్థ నుంచి ఇకపై విరివిగా సినిమాలు రూపొందించే ఆలోచనలూ పవన్‌కు బలంగానే ఉన్నాయి. అన్నపూర్ణా స్టూడియోస్ బాధ్యతలు నాగార్జున చేతికి వచ్చిన తరువాత -ఆయన నటిస్తూనే సినిమా నిర్మాణంపై దృష్టిపెడుతోన్న విషయం లోకవిధితమే. వారసుల హీరోలుగా వచ్చిన కల్యాణ్‌రామ్, విష్ణులాంటి కథానాయకులూ ఎప్పుడో నిర్మాతలయ్యారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై విష్ణు సినిమాలు నిర్మిస్తుంటే, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ చిత్రాలు రూపొందిస్తున్నాడు. ఇక బాహుబలి హీరో ప్రభాస్ -యూవీ క్రియేషన్స్ సంస్థ వ్యవహారాల్లో భాగస్వామిగా కొనసాగుతున్నాడని ఇండస్ట్రీ టాక్. నటన, నిర్మాణం.. ఇలా ద్విపాత్రాభినయం చేస్తున్న హీరోల జాబితాలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో -వెంకటేష్, అల్లు అర్జున్, రామ్, నితిన్, అల్లరి నరేష్ లాంటివాళ్లను చేర్చాలి. వీళ్లందరికీ సొంతింటి నిర్మాణ సంస్థలున్నాయి మరి. మీడియం రేంజ్ హీరోల్లో కెరీర్‌ను టాప్ గేర్‌లోకి తీసుకొచ్చిన నాని కూడా సినిమా నిర్మాణం వైపు ఆసక్తి చూపుతున్నట్టు వినికిడి. చాలాకాలం క్రితం ‘డి ఫర్ దోపిడీ’ నిర్మాణంలో పాలు పంచుకున్న నాని -ఇకపై రెగ్యులర్‌గా సొంత సినిమాలు చేయాలన్న ఆలోచనకూ పదును పెడుతున్నట్టు చెబుతున్నారు.
బ్యాక్‌గ్రౌండ్ మొత్తం సినీ పరిశ్రమే కావడం, పుట్టి పెరిగినప్పటి నుంచీ పరిశ్రమను పరిశీలిస్తూ రావడంలాంటి పరిణామాల్లో -నవతరం హీరోలంతా వ్యాపార దక్షత ప్రదర్శించే ఉత్సుకతతో కనిపిస్తున్నట్టే. క్రియేటివ్ ఫీల్డ్ పట్ల అభిరుచి, మరోపక్క నటనలో సంపాదించుకున్న ఇమేజ్, పట్టుచిక్కిన వ్యాపార మెళకువలు.. వెరసి ఇప్పుడు స్టార్ హీరోలే నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. ఆచితూచి అడుగులేస్తే నిర్మాణం లాభసాటి వ్యాపారమే కనుక -అదురు బెదురు లేకుండా వ్యూహాత్మకంగా సినిమా నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు. భవిష్యత్ పరిశ్రమలో -సరికొత్త మార్పు కనిపించబోతోందన్న మాట.

-ప్రవవి