మెయిన్ ఫీచర్

మళ్లీ తెరపైకి.. అందమైన కాశ్మీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యే జవానీ యే దివానీ.. 7 ఖూన్ మాఫ్
హైదర్.. లమ్హా
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్.. యహాన్
జబ్ తక్ హై జాన్ .. మిషన్ కాశ్మీర్
హైవే .. కొద్ది నెలల కిందటి...
రాక్‌స్టార్..... బజరంగీ భాయ్‌జాన్

గత ఐదేళ్లలో కాశ్మీర్ అందాలను తెరపై ఆవిష్కరించిన బాలీవుడ్ చిత్రాలివి. 60, 70 దశకాల్లో వెండి తెరమీద పల్లపర్చుకున్న కాశ్మీర్ అందాలు -తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోవడం, భద్రతా కారణాల దృష్ట్యా క్రమంగా కనుమరుగయ్యాయ. 90వ దశకం నుంచీ దాదాపుగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌పడింది. అలా అదృశ్యమైపోయన కాశ్మీర్ అందాలు -మళ్లీ తెరకెక్కుతున్నది ఇటీవలి కాలంలోనే. పచ్చదనం, మంచుదనం పల్లపర్చుకున్న కాశ్మీరం -దాదాపు 20ఏళ్లపాటు సినిమా షూటింగ్‌లకు దూరంగానే ఉంది. అయతే, దూరమైపోయన బాలీవుడ్‌ను మళ్లీ కాశ్మీర్‌కు తీసుకొస్తానని, ఇక్కడి పర్యాటక రంగానికి పూర్వ వైభవం తేవడమే కాదు, ప్రపంచ పర్యాటకులు ప్రేమించే అత్యంత గొప్ప ప్రదేశంగా కాశ్మీర్‌కు ఖ్యాతి సాధిద్దామని కొన్ని నెలల క్రితం కాశ్మీర్‌లో నిర్వహించిన ర్యాలీకి హాజరైన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అయతే, ప్రధానంగా పర్యాటకరంగంపైనే ఆధారపడిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టకుని, అక్కడి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సినిమా షూటింగ్‌లకు అవసరమయ్యే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించడం ఇప్పుడే ప్రారంభమైందేమీ కాదు. ముఖ్యమంత్రిగా ఫరూక్ అబ్దుల్లా ఉన్నప్పటి 1999లోనే కాశ్మీర్‌ను మళ్లీ వెండితెరపై చూపించి పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయ. అప్పటి ప్రయత్నాలు ఇప్పటికి ఫలితాలిస్తుండటంతో -మళ్లీ కాశ్మీర్ అందాలను చూపించేందుకు అటు బాలీవుడ్ ఆసక్తి చూపుతుంటే, ఇటు దక్షిణాది సినిమాలు సైతం కాశ్మీరం అందాలపై మళ్లీ దృష్టి పెడుతోంది.
***
నిజానికి -ఈ పరిణామాలే భూతల స్వర్గంగా భావించే జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో తిరిగి సినిమా షూటింగ్‌లు జోరందుకునే పరిస్థితులకు ఊతమిస్తున్నాయ. అత్యద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి మచ్చుతునక జమ్మూ-కాశ్మీర్. ఒకప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్‌లు యమజోరుగా సాగేవి. అలాంటి పరిస్థితి నుంచి షూటింగ్‌లు ఒక్కసారిగా దూరమైపోవడానికిగల కారణాలు పరిశీలిస్తే -తీవ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా 90వ దశకం నుంచీ సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌పడింది. అదే సమయంలో రాష్ట్రంలోని సినిమా థియేటర్లూ మూతపడ్డాయి. 1999లో అప్పటి సిఎం ఫరూక్ అబ్దుల్లా సినిమా థియేటర్లను పునఃప్రారంభించడం కోసం కృషి చేశారు. శ్రీనగర్‌లోని రీగల్ సినిమా హాల్‌ను పునఃప్రారంభింపచేశారు. అయితే, సినిమా హాల్‌లో ప్రదర్శించిన మొదటి ఆట సమయంలోనే గ్రేనేడ్ ప్రేలి ఒకరు మరణిస్తే, 12మందికి గాయాలయ్యాయి. దీంతో ఫరూక్ అబ్దుల్లా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఒకవైపు తీవ్రవాదుల బెడద, మరోవైపు సినిమా హాళ్ల మూసివేతతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కాశ్మీర్ అందాలను క్రమంగా మర్చిపోతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో -విదేశీ పర్యటనల పరిస్థితులు సులభతరం కావడంతో బాలీవుడ్ పరిశ్రమ యూరోప్ అందాలను చూపించడం మొదలెట్టింది. తెలుగు సహా దక్షిణాది సినిమా పరిశ్రమ సైతం యూరోప్ టూర్లకు వెళ్తుండటం, గత ఏడాది సెప్టెంబర్‌లోనే కాశ్మీర్ అందాలను వరదలు చిదిమేయడంతో ఇక చిత్ర పరిశ్రమ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.
ఈ నేపథ్యంలో జమ్మూ-కాశ్మీర్ సిఎం దివంగత ముఫ్తీమహమ్మద్ సరుూద్ కాశ్మీర్‌కు తిరిగి బాలీవుడ్‌ను తెచ్చేందుకు ప్రయత్నించారు. తమ రాష్ట్రంలో తిరిగి షూటింగ్‌లు జరపాలంటూ బాలీవుడ్ పెద్దలతో సంప్రదింపులు నెరిపారు. కొద్దిరోజుల క్రితం మామి (ముంబయ అకాడెమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్) ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనపుడు సూపర్‌స్టార్లు షారూక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లాంటి పలువురిని కలిశారు. గత ఐదేళ్లుగా ఒక్కొక్కటిగా పెరుగుతున్న బాలీవుడ్ సినిమాలు ఇటీవలి కాలంలో దాదాపుగా కాశ్మీర్‌కు క్యూ కడుతున్నాయ. పర్యాటక కోణంలో సినీ పరిశ్రమకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని, సినీ షూటింగ్‌లకు రాష్ట్రంలో ఏక గవాక్ష విధానం కింద అనుమతులు మజూరు చేస్తామని పదేపదే ముఫ్తీ చేసిన సూచనలు, విజ్ఞప్తులతో బాలీవుడ్‌లోని చాలావరకూ పెద్ద బ్యానర్లు మళ్లీ కాశ్మీర్‌పై దృష్టిపెట్టాయ. మరోపక్క భద్రతాపరమైన చిక్కులు తొలగిపోవడం, ఉగ్రవాద ముష్కరుల దాడులు తగ్గడం కూడా బాలీవుడ్ షూటింగ్‌ల వేగం పెరగడానికి కారణమైంది. ముఫ్తీ మహమ్మద్ మరణించటంతో, ఆయన స్థానంలో సిఎం బాధ్యతలు స్వీకరించనున్న మెహబూబా ముఫ్తీ సైతం కాశ్మీర్ పర్యాటక అంశంపై దృష్టి కేంద్రీకరిస్తానని చెప్తుండటం -సినిమా షూటింగుల విషయంలో మరికొన్ని వెసులుబాట్లు కలిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
***
గత ఏడాది కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ సినిమా దాదాపుగా కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చింది. సినిమా హిట్టుకొట్టి కోట్లు కొల్లగొట్టడంతో -మళ్లీ బాలీవుడ్ జనాలు కాశ్మీరం వైపు దృష్టి పెట్టడానికి ఊతమిచ్చినట్టయ్యంది. ప్రస్తుతం కాశ్మీర్‌లో పదివరకూ బాలీవుడ్ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయ. ఈ ఏడాది విడుదల కాబోయే ఉడ్తా పంజాబ్, మొహంజదారో, ఫితూర్, లుటేరే, సనమ్‌రేలాంటి చిత్రాల్లో మళ్లీ కాశ్మీర్ అందాలు కనువిందు చేయనున్నాయ. బాలీవుడ్ దృష్టి కాశ్మీర్‌పై పడటంతో, సహజంగానే దక్షిణాది సినిమాలు సైతం కాశ్మీర్ అందాలను బ్యాక్‌డ్రాప్‌లో చూపేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అడపాతడపా చిత్రాల షూటింగ్‌ల కోసం కాశ్మీర్‌కు వెళ్తున్నవారి సంఖ్య ఇకపై పెరిగే అవకాశం ఉంటుందన్న అంచనాలూ వినిపిస్తున్నాయ. సినిమాల షూటింగ్‌లు ఎక్కువగా జరగడం వలన, పర్యాటకుల సందడి పెరుగుతుంది. పర్యాటకులు పెరిగితే, రాష్ట్ర ఆదాయం పెరగడంతోపాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుంది. తద్వారా ప్రజలు తీవ్రవాద సంస్థల ప్రలోభాలకు లొంగే పరిస్థితులుండవు. అందువల్లనే, అక్కడి ప్రజాప్రతినిధులు బాలీవుడ్ దర్శక, నిర్మాతలను తమ రాష్ట్రానికి రావాలంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మరోపక్క వందలాది సినిమాల్లో ఇప్పటికే యూరోప్‌లోని అందాలను సినీ పరిశ్రమ చూపించేసింది కనుక, మళ్లీ కొత్తగా కాశ్మీర్ అందాలు తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. కాశ్మీర్‌లో షూటింగ్‌లు పెరగడం వలన చిత్ర నిర్మాణ వ్యయం తగ్గడమేకాకుండా విదేశీ మారక ద్రవ్యం కూడా మిగులుతుంది. ప్రేక్షకులకు సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యాన్ని చూపించే అవకాశం దక్కుతుంది. మొత్తంమీద జమ్మూ-కాశ్మీర్‌లోని ప్రకృతి సౌందర్యం వెండితెర మీద ప్రేక్షకులను మళ్లీ అందే అవకాశాలు మెరుగువుతున్నాయి.

-పి మస్తాన్‌రావు