మెయిన్ ఫీచర్

మన హీరోలంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు సినిమా విడుదలవుతుందంటే -ప్రేక్షకుడు ముందే ఓ అంచనాలో ఉంటాడు. కథ ఏమై ఉండొచ్చు? కథనం ఎలా ఉంటుంది? మహేష్ స్టయిల్.. డైలాగ్ డెలివరీ.. హీరోయిన్లతో కెమిస్ట్రీ.. ఇలా అన్నింటిమీదా స్పష్టమైన అవగాహనతో ఉంటాడు. అలాంటి అంచనాలు, ఊహలను ఆశిస్తూనే ప్రేక్షకుడో, అభిమానో థియేటర్‌లోకి అడుగుపెడతాడు. వాళ్ల ఇమాజినేషన్‌కు తగ్గట్టుగానో, ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగినట్టో సినిమా ఉంటే సరే. లేదంటే ఢమాల్. ఏమాత్రం వాళ్ల ఊహలు, అంచనాలకు కాస్త దగ్గరగా ఉన్నా -అది రొటీన్ సినిమానే అయినా ‘హిట్టు’టాక్‌ను భుజాన మోసేస్తాడు.

ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి మనవాళ్లు మహాదూరం. దూరం కాదనుకుని -ఒకవేళ చేద్దామనుకున్నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఫ్యాన్స్ ఒప్పుకున్నా -సినిమా వర్కవుట్ అవ్వదు. వర్కవుట్ అయనా -కమర్షియల్ హీరోయజానికి కలసిరాదు. కలిసొచ్చినా -్థయేటర్ల వద్ద వసూళ్లుండవు. ఆ ఒక్క సినిమాకూ వసూళ్లు కూడా వచ్చాయనుకున్నా -ఇక ఆ హీరో ప్రయోగాత్మక హీరోగానే ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇన్ని కష్టాలున్నపుడు తెలుగు హీరో ప్రయోగాలవైపు ఎందుకు దృష్టిపెడతాడు. ఒకవేళ ఏ తమిళ హీరోలనో చూసి ప్రయోగాలపై ప్రయోగం చేద్దామనుకున్నా -గత అనుభవాలు వెనక్కి లాగుతాయ. ఒకప్పుడు చిరుకి రుద్రవీణ, వెంకీకి శీను, మహేష్‌ను నాని -ప్రయోగాల్లాంటి వైవిధ్యమైన చిత్రాలే. కానీ వర్కవుట్ కాలేదు. ఇలా ఇంకొదరు హీరోలూ ప్రయోగాత్మక కసరత్తులు చేసి ఢమాల్ అన్నవాళ్లే. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌తోనే తెలుగు హీరోలు కమర్షియల్ స్టోరీలకు కనెక్టయనంత సులువుగా కంటెంట్ సినిమాలపై దృష్టిపెట్టరు.

మహేష్‌కు అన్వయించి చెప్పినా, ఇది మహేష్‌కు సమస్య మాత్రమే కాదు. అల్లు అర్జున్ కావొచ్చు. రామ్‌చరణ్ కావొచ్చు. సీనియర్ హీరోలైన బాలయ్య, నాగ్, వెంకటేష్‌లు కావొచ్చు. మిడిల్ ఆర్డర్‌లో నడిచే గోపీచంద్‌లు, రవితేజలు.. రామ్‌లాంటి కుర్ర హీరోలు. ఇలా ఎవరిని తీసుకున్నా ఇదే వరస. సినిమా విడుదలకు ముందు -ఇదొక డిఫరెంట్ సినిమా అనో, వైవిధ్యమున్న పాత్ర చేస్తున్నాననో, స్టోరీ గురించో, ట్రీట్‌మెంట్ గురించో.. రకరకాల స్టేట్‌మెంట్లు, ఇంటర్వ్యూల్లో చెప్పడం తప్ప నిజంగా ప్రయోగం అనుకునే సినిమా చేయడానికి మన తెలుగు హీరోలు సాహసం చేయరు, చేయడం లేదన్నది పచ్చి నిజం. వైవిధ్యమైన సినిమా చేయడానికి నిజానికి హీరోలు ఇష్టపడినా.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అలాంటి చిత్రాల జోలికి పోవడమే మానుకున్నారు. సినిమా కళాత్మక వ్యాపారం కనుక, వ్యాపారంలో ప్రయోగాలు చేయడంకన్నా సరైన అంచనాతో ఏది సేలబులో చూసుకుని సినిమా తీయడం బెటరన్న ఆలోచనలకు నిర్మాతలు వచ్చేశారు. ఇక దర్శకుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బ్రాండెడ్ ఫ్యాక్టరీ నుంచి ‘్ఫర్మాట్’ను పుణికిపుచ్చుకుని -ఆ ఫార్మాట్ ప్రకారం ఒక్కొక్కరూ ఒక్కో తరహా సినిమా చేసేయడం, పక్కా మాస్, టాప్ కమర్షియల్ ఎలిమెంట్స్.. ఇలా రకరకాల ట్యాగ్‌లైన్లు తగిలించి బయటకు వదలేస్తున్నారు. -ఏ సినిమా చూసినా బలమైన విలనిజం, దాన్ని ఎదుర్కోడానికి అంతకంటే పచ్చి హరోయిజం.. ఇదే ఫార్మాట్ తప్ప తెలుగు సినిమాల్లో ఇంకేమీ కనిపించటం లేదన్నది ఎవరూ కాదనలేని నిజం.
***
తెలుగునాట ఒకప్పుడు అపరిచితుడు విడుదలై కోట్లు కొల్లగొట్టి ఆశ్చర్యపర్చింది. విక్రమ్ మార్కెట్‌ను తెలుగులో విస్తృతం చేసింది. తర్వాత రోబో విడుదలై ఏకంగా తెలుగు స్ట్రయిట్ చిత్రాల గ్రాస్ మార్క్‌కే చెక్ పెట్టి చూపించింది. కమల్.. రజనీ సినిమాలకు తమిళంలోకంటే తెలుగులో బాగా క్రేజ్ ఎక్కువ. ఇటీవలి కాలంలో సూర్య 24 ఏకంగా తెలుగులో 10 కోట్ల షేర్‌ని సాధించడం విశేషం! సూర్య కూడా గజిని... యముడు... సింగం-2 వంటి సినిమాలతో తెలుగులో స్ట్రాంగ్ ఇమేజ్‌ని సంపాదించాడు. కార్తీ కూడా అడపాదడపా డబ్బింగ్‌లతో తెలుగులో హల్‌చల్ చేసినా ఏకంగా నాగ్‌తో జోడికట్టి ఊపిరితో 40 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిపోయాడు. విక్రమ్ ‘ఐ’ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి ప్లాప్ మూటగట్టుకున్నా, గత సినిమాల రుచితో ప్రయోగాలకు విక్రమ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ నిర్మిస్తున్న రోబో-2పైనా భారీ అంచనాలే వున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే.. ప్రతి చిత్రం వెనుక ఏదోక ప్రయోగాత్మకత కనిపిస్తోంది.
తెలుగు హీరో అంటే ఇలాగే ఉండాలని గిరిగీసుకుని నటించడం నాకు చాతకాదు, అని చెప్పే ప్రతి హీరో చేసేది అదే. గిరిదాటితే ఫలితం ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకే విభిన్న కథలను దూరంగా ఉంచి రొటీన్ రొడ్డకొట్టుడుకే ఓటేస్తారు. చేసిన కథనే విభిన్న కోణాల్లో మళ్లీ మళ్లీ చేసేందుకు ప్రయత్నం చేస్తూంటారు. ఎప్పుడైనా ప్రయోగం చేద్దామని అనిపించి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో, ప్రయోగాలన్నీ ఫ్లాపులేనన్న నిర్ణయానికి హీరోలు వచ్చేసినట్టు కనిపిస్తోంది. చిరు రుద్రవీణ.. వెంకీ శ్రీను.. మహేష్‌బాబు నానివంటి సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో తెలుగు హీరోలు ఇక ఎక్కువగా ప్రయోగాలవైపు వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు చేసి సక్సెస్ కొట్టిన హీరోల్లో ప్రధానంగా నాగార్జునే కొద్దోగొప్పో కనిపిస్తాడు. కమల్ సైతం తెలుగులో కొన్ని చిత్రాల్లో ప్రయోగాలు చేశాడు. తమిళనాట ప్రయోగాలకే పెద్దపీట. అందుకే అక్కడ అగ్ర హీరోలు ప్రయోగాలతోపాటు సాధారణ కథలతోనూ మెప్పిస్తూంటారు. తెలుగులో బాలకృష్ణ భైరవద్వీపం.. రామ్‌చరణ్ మగధీర.. ప్రభాస్ బాహుబలి సినిమాలు ప్రయోగాత్మక చిత్రాలైనప్పటికీ మూడూ జానపద జోనర్‌వి కావడం విశేషం! తమిళనాట అగ్ర హీరోనుండి అప్‌కమింగ్ హీరో వరకు అందరూ ప్రయోగాల బాటలోనే పయనిస్తారు. అందుకే అవన్నీ తెలుగునాట రిలీజై పెద్దహిట్‌ని సొంతం చేసుకున్నాయి. ఆఖరికి విజయ్ ఆంటోని నటించి నిర్మించిన ‘బిచ్చగాడు’ సైతం తెలుగులో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇంకా రాబడుతోంది. ప్రేమిస్తే.. షాపింగ్‌మాల్.. జర్నీ ఇలా ఎన్నో సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించి ఆయా హీరోలకు తెలుగులో మంచి మార్కెట్‌నిచ్చాయి. సిక్స్ ప్యాక్‌లు చేసి అలరించే తెలుగు హీరోలు ప్రయోగాల జోలికి అస్సలుపోరు. ఈ విషయంలో మధ్యతరం హీరోగా చిరంజీవి స్వయంకృషి.. ఆపద్బాంధవుడు.. ఆరాధన వంటివి చేసి శభాష్ అనిపించుకున్నా అవి పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాకపోవడం ఇక్కడ గమనార్హం!
ప్రతి నటుడికి తన కెరీర్‌లో ఒకసారైనా ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. కానీ తెలుగులో ఆ సాహసం అగ్ర హీరోలు త్వరగా చేయరు. ఇలా చేయాలంటే కావాల్సినన్ని కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సినిమా పూర్తయ్యేవరకు వేరే సినిమా చేయడానికి కూడా అవకాశం ఉండదని వీరి భావన. దీనికి భిన్నంగా నాగార్జున ‘శ్రీరామదాసు’ చేస్తున్న టైమ్‌లో అదే హెయిర్ స్టయిల్‌తో పూరీ దర్శకత్వంలో ‘సూపర్’ సినిమా చేసే సక్సెస్ అనిపించుకున్నాడు.
తెలుగులో సంగీత దర్శకుడిగా రాణించిన ఆర్‌పి పట్నాయక్ ‘లక్ష్మీ.. శ్రీను..వాసంతి’ సినిమాలో పుట్టిగుడ్డివానిగా నటించి మెప్పుపొందినా సినిమా సక్సెస్ కాలేదు. రాజేంద్రప్రసాద్ సైతం రాంబంటు.. మేడమ్ సినిమాలతో చేతులు కాల్చుకున్నాడు. గంటల తరబడి మేకప్ వేయించుకునే ఇంట్రస్ట్ తెలుగు ఇండస్ట్రీలో లేకపోవడంవలనే వెరైటీ కానె్సప్ట్ కథలతో సినిమాలు రావడం లేదని చెప్పాలి. తమిళనాటే కాదు బాలీవుడ్‌లోనూ అగ్ర నటులు ప్రయోగాలుచేసి సక్సెస్‌లు కొట్టారు. కొడుతున్నారు. షారూక్.. సంజయ్‌దత్.. హృతిక్ రోషన్.. అమీర్‌ఖాన్ వంటి వారితోపాటు బిగ్‌బి అమితాబ్ సైతం పలుమార్లు వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించాడు. ‘పా’ సినిమాలో అమితాబ్ నటనకు అగ్రాసనం వేశారు. ఐశ్వర్య.. కంగనా.. దీపిక.. శ్రీదేవి ఇలా ఎందరో హీరోయిన్లు సైతం ప్రయోగాల క్యారెక్టర్లు చేసి మెప్పుపొందడం విశేషం! ఇలాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం కలెక్షన్లు కొల్లగొట్టడం జరిగింది.
విభిన్న పాత్రలకోసం శరీరాకృతులను మార్చుకోవడం తమిళనాట బాగా అలవాటు. కమల్, రజనీలు మాత్రం పాత్రల కోసం మేకప్‌నే ఎంచుకుంటారు. దీనివలన ఆరోగ్యపరమైన చిక్కులను అధిగమించవచ్చన్నది వారి భావన. కనీసం ఇలాంటి నిర్ణయంతోనైనా తెలుగునాట ప్రయోగాలు జరగకపోవడం చూస్తుంటే ప్రేక్షకులు హీరోలకు ఎంతగా ఎడిక్ట్ అయిపోయారో తెలుస్తుంది. అందుకే తెలుగు సినిమా అంటే దేశవ్యాప్తంగా.. అంతర్జాతీయంగా చిన్నచూపు. ప్రస్తుతం మేకింగ్ స్టయిల్ మారడం వలన తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది. 75 ఏళ్లకు ఓ జాతీయ అవార్డు దక్కింది. తెలుగు హీరోల వయస్సు ఐదు పదులు దాటినా కుర్ర హీరోయిన్‌లనే ఎంచుకుంటారు. ఇప్పటికీ మేమే హీరోలమంటారు. ఇకనైనా ఈ విధానానికి స్వస్తిచెప్పి కొత్తతరహా పాత్రల్తో ప్రయోగాలకు తెరతీస్తే మరి కొంతకాలం ధీటైన హీరోయిజాన్ని పొందగలరనేది వాస్తవం. కుర్ర హీరోలు సైతం రొడ్డకొట్టుడు కథలకు స్వస్తిపలికి ధైర్యంచేసి కొత్త క్యారెక్టర్ల వైపు అడుగులేస్తే తెలుగు సినిమా స్థాయికూడా పెరుగుతుంది. ఈ పరంపరలో ప్రభుత్వ ప్రోత్సాహమిచ్చే ‘ఆస్కార్ వైపు అడుగులకు’ కూడా పునాది పడుతుందేమో ఆలోచించాలి. వీలైతే నాలుగు పంచ్‌లు.. కుదిరితే సాధ్యంకాని స్టంటులు వదిలిపెట్టి తెలుగు హీరోలు ప్రయోగాల వైపు ఎప్పుడు పయనిస్తారో వేచి చూద్దాం.

-పోలిశెట్టి