రివ్యూ

పక్కా.. స్క్రీన్‌ప్లే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**కథకళి

తారాగణం:
విశాల్, కేథరిన్ ట్రెస్సా, మైమ్ గోపి, మధుసూదన, కరుణాస్ తదితరులు
సంగీతం:
హిప్‌హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ:
బాలసుబ్రహ్మణ్యం
నిర్మాత:
విశాల్
దర్శకత్వం:
పాండీరాజ్

--
ఫర్వాలేదు
--
ప్రేక్షకుణ్ణి రెండు గంటలపాటు థియేటర్‌లో కూర్చోపెట్టాలంటే మంచి కథే అవసరం లేదు. సరైన స్క్రీన్‌ప్లే ఉన్నా సాధ్యమేనని కథకళి చెబుతుంది. ఓ చిన్న పాయింట్‌తో కథ తీసుకుని దానికి ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే రాసుకుని, సన్నివేశాలను తెరపై కథాకళి చేయిస్తే ప్రేక్షకుడు సీట్లోనుంచి లేవడు అనడానికి ఈ చిత్రం ఓ ఉదాహరణ. కథలనేవి కొన్నిరకాలే. స్క్రీన్‌ప్లే మాత్రం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. అలాంటిదానికి ఉదాహరణే కథకళి.
కథేంటి?
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కమల్ (విశాల్) తన ప్రేయసి మల్లీశ్వరి (కేథరీన్ ట్రెస్సా)ని పెళ్లిచేసుకోవడానికి స్వంత ఊరైన కాకినాడ వస్తాడు. అతని కుటుంబానికి ఊర్లో వుండే జాలర్ల సంఘం అధ్యక్షుడు సాంబకు మొదటినుండీ చిన్న చిన్న గొడవలు వుంటాయి. ఈ నేపథ్యంలో సాంబ హత్యకు గురవుతాడు. నేరం ఎవరు చేశారో తెలియదు. కానీ మొదటినుండీ ఉన్న గొడవలవల్ల కమల్ నేతృత్వంలో ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులతోపాటుగా ఊరి ప్రజలు అనుమానిస్తారు. ఆ అనుమానం నిజమా? కాదా? అనేదే మిగతాసినిమా. హత్యనుండి ప్రారంభమైన కథనం ఎత్తుపల్లాలు దాటుకుంటూ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుణ్ణి గుక్క తిప్పుకోకుండా చేస్తుంది. అసలు కమల్ కుటుంబానికీ సాంబకు వున్న గొడవేంటి? పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిన ఈ అవాంతరాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరమైన కథనం.
ఎలా వుంది?
మొదటినుండీ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్ కొట్టదు. కాకపోతే, కథ చిన్నది కనుక ఆ లోపాన్ని కనపడకుండా స్క్రీన్‌ప్లేను ఎమోషన్స్‌తో మేళవించి రాసుకోవడం ప్లస్‌పాయింట్ అయింది. అయతే, ఏమోషనల్ సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగా కుదరకపోవడంతో సన్నివేశాలు సోసోగా సాగాయి. ఒక్కొక్కసారి మరీ ఓవర్ అయినట్టుగా కూడా అనిపిస్తుంది. దానికితోడు సందర్భం లేకుండా వచ్చిపడే పాటలు ప్రేక్షకుడిని పక్కదారి పట్టిస్తాయి. అయినాకానీ స్క్రీన్‌ప్లే బలంతో లోటు కనపడదు.
సినిమాకు మొదటినుండీ సస్పెనే్స హైలెట్ కనుక దర్శకుడు ఎక్కడా అది రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడిపాడు. అన్ని సంఘటనలకు సరైన కారణాలను చూపుతూ అన్ని కోణాల్లో అల్లుకున్న స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశం. సినిమాలో పగ, ప్రతీకారాలు అనే అంశాన్ని కథానాయకుడు వైపున, విలన్ వైపున రెండు కోణాల్లో చెప్పినా, అసలు విషయాన్ని చెప్పకుండా సెకండాఫ్‌లో సినిమాను వేగంగా నడిపించడంలోనే దర్శకుడి పనితనం కనిపిస్తుంది. విశాల్ సినిమా అంటేనే యాక్షన్ నేపథ్యంలోవున్న ఫ్యామిలీ డ్రామా. ఈ కథ అందుకు మినహాయింపు కాదు. కుటుంబ కథకే హత్యానేపథ్యం జోడించడంతో ఓ సరికొత్త ఫ్లేవర్‌ను ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. పూర్తి స్థాయి మర్డర్ మిస్టరీకి సరిపడే కథనం కాకపోయినా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుణ్ణి మాయచేశారు. అక్కడక్కడా అవసరం లేని సన్నివేశాలు వచ్చినా అవి పక్కకు తొలగిపోతాయి. కథకళి అన్న పేరే ఈ చిత్రానికి సరైనది అన్నట్టే చేశారు. థ్రిల్లర్ అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి క్లైమాక్స్ కథనాన్ని తగ్గించారు. వైజాగ్ నుంచి కాకినాడ బయలుదేరిన హీరో ప్రయాణంలోనే కథనాన్ని పరిగెత్తించారు. స్క్రీన్‌ప్లే ఎలా సాగిందో అదేవిధంగా క్లైమాక్స్‌లో కూడా సాగినట్టయితే సినిమాకు మరింత బలం చేకూరేది. సినిమా కథనంలో రకరకాల మలుపులు కనపడడంలో అక్కడక్కడా అనుమానాలు ప్రేక్షకుడికి కలగడం ఖాయం. సాంకేతికంగా అన్ని అంశాలను చక్కగానే డీల్ చేశారు. లవ్‌ట్రాక్‌లో మాత్రం అక్కడక్కడా పక్కదారులు పట్టించినా మేకింగ్ పరంగా ఓ ప్రయోగంగానే చెప్పుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయంట్ అయంది. కెమెరాపనితనం సినిమాకు హైలైట్. ముఖ్యంగా వేగంగా సాగే సినిమాను చీకట్లో చూపించిన విధానం నచ్చుతుంది. నిర్మాణ విలువలు ఓకె. విశాల్ ఎప్పటిల్లాగే తన ట్రాక్‌లో చేసుకుంటూ పోయాడు. కేథరిన్ అందాల ఆరబోతకే పరిమితమైంది. పాటలు సోసోగా సాగాయి. దర్శకత్వ పరంగా ఓ ప్రయోగంగా పాండ్యరాజ్ కథకళిని తెరపై ఆడించడంలో ఫర్వాలేదనిపిస్తాడు.

-ద్వివేది