రివ్యూ

అదృశ్య కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*దృశ్యకావ్యం

తారాగణం:
రామ్‌కార్తీక్, కశ్మీరా కులకర్ణి, మధునందన్, పృథ్వీ తదితరులు
సంగీతం:
‘ప్రాణం’ కమలాకర్
నిర్మాత:
పుష్యమి ఫిల్మ్‌మేకర్స్
దర్శకత్వం:
బెల్లం రామకృష్ణారెడ్డి

---

ఓ దెయ్యం కథకి ‘దృశ్యకావ్యం’ అన్న భావుకత్వపు టైటిల్ పెట్టడం వరకూ.. కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. ఐతే -ఆ దెయ్యం చేష్ఠల్లో మాత్రం వెరైటీ ప్రోగ్రామింగ్‌లేవీ లేవు. పాత దెయ్యం కథలన్నీ... నేలమాళిగలోనో సమాధిలోనో పెట్టి.. ఇనే్నళ్లకో ఇన్నాళ్లకో తీసి తెర కెక్కిస్తే.. ఆ హారరే వేరనుకోటానికీ లేదు. కానీ- కాస్త శృతిమించి ‘పార్ట్-2’ అంటూ జనం చెవుల్లో సరికొత్త పూలు పెట్టడం చూస్తే.. ఆహా నిజంగానే ‘ఇదో దృశ్య కారం’ అనిపించక మానదు. నిజానికి ఈ కథలో కొత్తదనం లేకపోలేదు. అదేంటో చూద్దాం.
కథ: -అఖిల్ (రామ్ కార్తీక్), అభినయ (కశ్మీరా కులకర్ణి) -ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఒకానొక రోజు అభినయ కుటుంబం మొత్తం ప్రమాదవశాత్తు మరణించటంతో ఆమెపట్ల మరింత ప్రేమని కనబరుస్తాడు అఖిల్. ఆ ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. వారి ప్రేమకి ప్రతిరూపం అనన్య. జీవితం ఇలా సాఫీగా నడిచిపోతూంటుంది. ఇంతలో -ఆఫీస్ పని మీద అఖిల్ యూరప్ వెళ్లాల్సి వస్తుంది. ట్రిప్ కోసం బయల్దేరుతుండగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే దారిలోనే యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. ఐతే - అఖిల్ ఎప్పటిలానే ఫ్యామిలీకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూంటాడు. మరోవైపు అఖిల్ ఇంట్లో ఏవో శక్తులు తిరుగుతూంటాయి? ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
మరణించిన అఖిల్ ఫోన్ ఎలా చేశాడు? ఆ ఇంట్లో తిరుగాడే అదృశ్య శక్తులు ఏమిటి? ‘నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’ అంటూ ముగించిన ఈ కథలో కొన్ని ప్లస్ పాయింట్లు.. బోలెడన్ని మైనస్ పాయింట్లు దొర్లాయి.
సినిమా అంతా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో.. ఓ నాలుగైదు పాత్రల మధ్య నడుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని లవ్‌ట్రాక్‌తో నడిపించి.. హారర్ ఏ మాత్రం టచ్ చేయకపోవటంతో.. ప్రేక్షకుడు కొద్దిగా సందిగ్ధంలో పడతాడు, అసలు దర్శకుడు ఏం చెబుతాడా? అని. ఇప్పటికే ఒక ‘కట్టప్ప’తోనే జనం ఛస్తూంటే.. ‘దృశ్య కావ్యం-2’లో అసలు హారర్ ఉంటుందనటం అతిశయోక్తి కాక మరేమిటి? ఇన్ని రీళ్లలోనూ ఏం చెప్పారన్నదే ప్రధాన ప్రశ్న. ఇక - చెప్పటానికి ఏం మిగిలిందని ఈ మంత్రం వేశారో అర్థం కాలేదు.
హారర్ కథల రోజులివని.. తెగ ముచ్చటపడి మరీ కథని రాసుకొనేప్పుడు.. లాజిక్ మిస్సవటం సహజం. ఐతే -ఆ లాజిక్‌కి దొరక్కుండా కూడా కథని రాయ్యొచ్చు. ఇక్కడ -ఒక్కటే లోపం. తమ కథని తామే అత్యద్భుతంగా ఊహించుకోవటం. పేజీలపై ‘దృశ్య కావ్యం’గా భావించిన కథ స్క్రీన్‌పైకి వచ్చేప్పటికి.. అటు భావయుక్తంగా కాకండా.. భయపెట్టేదిగానూ లేకపోవటంతో ‘కావ్యం’ కారం నసాళానికి అంటింది. కథకుడిగానే అర్థం కానప్పుడు.. దర్శకుడిగా ఏమర్థమవుతాడు. అదీగాక - ఈ చిత్రానికి సృజనకు పదును పెట్టాల్సిన పనిలేదు. సన్నివేశాలన్నింటినీ ఏ రీతిన తీయాలో... మునుపటి ‘దెయ్యం’ కథలే చెప్పాయి. కాబట్టి కొత్తగా ఆవిష్కరించాల్సిందేమీ లేదు. దర్శకుడి ఊహ ప్రకారం ఆ ఒక్క ‘సస్పెన్స్’ కథని నడిపిస్తుందనుకున్నాడు. కానీ- ఆ ఫీల్‌ని ప్రేక్షకుల్లో కలిగించలేక పోయాడు.
‘ప్రాణం’ కమలాకర్ సంగీతం బాగుంది. పాటల్లో మెలోడీ తొణికిసలాడింది. ఐతే -అవేవీ శ్రోతల్ని చేరతాయా? లేదా? అన్నది సందేహమే. సంతోష్ షనమోని ఫొటోగ్రాఫర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
నటనాపరంగా - మధునందన్ మెప్పించాడు. రామ్‌కార్తీక్ హావభావాలు సోసో. కశ్మీరా చూట్టానికి బాగుంది కానీ.. మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తెప్పించటానికి చాలా కృషి చేసినట్టుంది. తెర మీదికి ఫైనల్ వచ్చినవి చూస్తే- ‘కృషి’ కనిపిస్తోంది. పాప కేరెక్టర్ ఈ సినిమాకి ప్రాణం. మిగతా పాత్రధారులంతా నవ్వించటానికో.. ఏడిపించటానికో.. భయపెట్టడానికో కష్టపడ్డారు. కానీ అంత ‘దృశ్యం’ లేదు.

-ప్రనీల్