Others

ఎప్పటికీ.. సోగ్గాడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణ్ధ్యాయాన్ని సృష్టించిన ఘనకీర్తి సొంతం చేసుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన తనయుడు అక్కినేని వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన నాగార్జున, ఈ ఏడాదితో (గత ఫిబ్రవరి) హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయనను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తొలి చిత్రం విక్రమ్, 1986 ఫిబ్రవరి 18న విడుదలైంది. ముప్ఫై ఏళ్ల నట జీవితం చెప్పుకోతగ్గ విషయమేమీ కాదు. కాని ఈ మూడు దశాబ్దాల నటప్రస్థానంలో నాగార్జున నటుడిగా సాధించిన విజయాలు, ముఖ్యంగా అక్కినేని వారసుడిగా ఆయన కీర్తిని ఏమేరకు, ఎంతవరకు తీసుకువెళ్లారనేది చర్చనీయాంశం. ఎందుకంటే విభిన్న పాత్రలతో ఏడున్నర దశాబ్దాలకు పైగా నట శిఖరాలనధిరోహించిన అక్కినేని తనయుడు కాబట్టి. ఈ విషయం ప్రస్తావించవలసి వస్తే నట వారసులుగా తెలుగులో పలువురు చిత్రరంగ ప్రవేశం చేసినా, నిజమైన నటవారసుడు అనిపించుకున్నది నాగార్జున ఒక్కడే. తండ్రి బాటలో తన సమకాలీన నటులకు భిన్నంగా సాహసంతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని నటించి ఇంకా చెప్పాలంటే జీవించి మెప్పించిన నటుడు. తండ్రి బాటలో పాత్రలను ఎంపికైతే చేసుకున్న నాగార్జున.. ఆయన నటనను అనుకరించే ప్రయత్నం చేయకుండా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగారు. తొలి చిత్రం విక్రమ్ ప్రేమకథాంశంతో కూడినదే అయినా, యాక్షన్ మూవీగా కూడా నాగార్జున అటు క్లాస్‌నీ ఇటు మాస్‌నీ ఆకట్టుకున్నారు. అప్పట్లో హీరోగా మొదటి చిత్రంతోనే సుమారు 30 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకున్న నటుడు నాగార్జున. ఈ చిత్రం విడుదలై క్లాస్‌మాస్ తేడా లేకుండా, మహిళలనూ ఆకర్షించింది. విక్రమ్‌తో జైత్రయాత్ర ప్రారంభించిన నాగార్జున నిన్నటి ‘ఊపిరి’ వరకు సహచర నట దిగ్గజాల (చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్) పోటీని తట్టుకుంటూ తనదైన ముద్రతో, ప్రత్యేకమైన గుర్తింపుతో విజయపథంలో సాగుతున్నారు. ఈ 30 ఏళ్ల నట జీవితంలో ఆటుపోట్లను, జయాపజయాలను చవిచూస్తూ, రొటీన్‌కు భిన్నంగా పాత్రలను ఎంచుకుని ఎదురీదే ప్రయత్నంలో ఏమాత్రం నాగ్ రాజీపడలేదు. ఈ విషయంలో తండ్రి వారసత్వం నాగార్జునలో స్పష్టంగా కనిపిస్తుంది. పౌరాణికాలతో చిత్రరంగ ప్రవేశం చేసిన అక్కినేని అటుపై జానపద చిత్రాలలో దూసుకుపోవడం మనకు తెలిసిందే. పౌరాణిక, జానపదాల ముద్రపడిన ఆయన తొలిసారిగా 1949లో ‘లైలామజ్ను’ చిత్రంలో మజ్నుగా ట్రాజెడీ పాత్రకు ఎంపికై పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అనంతరం ఈ చిత్ర ఘన విజయం విమర్శకుల నోళ్లు మూయించింది. అప్పటికి లైలామజ్ను అక్కినేనికి పదవ చిత్రం. ఈ తరహా పాత్ర నాగార్జున 1987లో తన నాలుగవ చిత్రంగా విడుదలైన ‘మజ్ను’ చిత్రంతో అత్యంత క్లిష్టమైన ట్రాజెడీని అద్భుతంగా పండించి తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. తండ్రిలాగే ఎన్నో సందర్భాల్లో ఇటువంటి పాత్రలను ఎంచుకుని శెభాష్ అనిపించుకున్నారు నాగార్జున. మజ్ను తరువాత కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన అనేక మాస్ చిత్రాలలో (కలక్టర్‌గారి అబ్బాయి, ఆఖరి పోరాటం, జానకిరాముడు, వీక్కీదాదా, శివ, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, వారసుడు, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, నినే్నపెళ్లాడుతా, నువ్వువస్తావని, నినే్న ప్రేమిస్తా, శివమణి, మాస్, డాన్ మొదలైన) తన సత్తాచాటారు. చిత్ర పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేయడంలోను, కొత్త టెక్నాలజీని స్వాగతించడంలోనూ నాగార్జున ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1989లో రాంగోపాల్‌వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన శివ చిత్రం ఒక చరిత్ర. ఇదే సంవత్సరంలో విడుదలై ఘన విజయం సాధించిన గీతాంజలి చిత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ రెండు చిత్రాలలోని పాత్రల మధ్య వైవిధ్యం, ఆ పాత్రల్లో ఇమిడిపోతూ నాగార్జున కనబరచిన నట వైదుష్యం అద్భుతం. నటుడిగా, నిర్మాతగా ఆయన ఉత్తమాభిరుచిని ప్రశంసించనివారు లేరంటే అతిశయోక్తికాదు. 1997లో ఆయన నటించిన ‘అన్నమయ్య’ నాగార్జున నట జీవితంలో ఒక మైలురాయి. ఈ చిత్ర నిర్మాణ సమయంలో పూర్తిగా డీగ్లామరైజ్డ్ పాత్ర అయిన అన్నమయ్యకు నాగార్జున న్యాయంచేయగలడా అని చిత్ర పరిశ్రమలో ఎన్నో సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. పరమభక్తుడి పాత్ర అయిన అన్నమయ్య చిత్రం విషాదంగా ముగియడం చిత్ర విజయానికి మరో మైనస్. అయితే వీటన్నింటిని తోసిరాజని నాగార్జున తన అద్భుత నటనాకౌశలంతో అక్కినేని తరువాత అటువంటి పాత్రలు నాగార్జునకే సాధ్యమని మెప్పుపొందారు. ఈ చిత్రం కమర్షియల్‌గాను, అవార్డుల పరంగాను ఎంతో ఘనవిజయం సాధించింది. 2006లో వచ్చిన ‘శ్రీరామదాసు’ చిత్రంలోని గోపన్న (రామదాసు) పాత్ర కూడా అన్నమయ్య తరహాదే కావడం తెలిసిందే. ఈ పాత్రనూ సవాలుగా తీసుకున్న నాగార్జున చిత్రం ఆద్యంతం తన హావభావాలతో మెప్పించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. 2012లో వచ్చిన శిరిడీసాయి చిత్రంలోను ఆయన నటన ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచివేసింది. అదేవిధంగా గగనం, రాజన్న వంటి చిత్రాలు ఆయన ఉత్తమాభిరుచికి నిదర్శనాలు. వారసులుగా ఎందరు చిత్రరంగ ప్రవేశంచేసినా అక్కినేని తనయుడిగా నాగార్జున మాత్రమే ఆయన పోషించిన (్భక్తుడు, భాగవతోత్తముడు వంటి) పాత్రల్లో అద్భుతంగా నటించి భేష్ అనిపించుకున్నారు. ఈ తండ్రీ తనయులు సాధించిన మరొక అనితర సాధ్యమైన విజయాన్ని ప్రస్తావించుకోవాలి. వీరిద్దరు హీరోలుగా నటించిన చిత్రాలు ఒకే సంవత్సరంలో విడుదలై రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను కైవసం చేసుకోవడం. 1989లో నాగార్జున నటించిన గీతాంజలి చిత్రానికి ప్రథమ నంది, అక్కినేని నటించిన సూత్రధారులు చిత్రానికి తృతీయ నంది అవార్డు లభించడం విశేషం. తన 30 ఏళ్ల నటప్రస్థానంలో ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం పోటీ చిత్రాలన్నింటినీ అధిగమించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం తన సమకాలీన నటులు ఎవ్వరూ సాధించలేనంత రికార్డు కలక్షన్‌లను వసూలుచేసి 50కోట్ల క్లబ్‌లో చేరి నాగార్జున సాధించిన విజయపరంపరలో మరో కలికితురాయిగా నిలిచింది.
ఈ రికార్డుతో మరో దశాబ్దంపాటు ఎవర్‌గ్రీన్ హీరోగా దూసుకుపోయే స్టామినాను ఇచ్చిందని అనుకుంటున్న తరుణంలోనే -వేసవి సీజన్‌లో ప్రారంభంగా విడుదలైన ఊపిరి చిత్రం నాగ్‌కు మరింత బలాన్నిచ్చింది. చిత్రం ఏమంటే, ప్రస్తుతం కుర్ర హీరోల చిత్రాల మాదిరిగా ఏమాత్రం హడావుడి లేకుండానే నాగ్ చిత్రాలు విడుదలైనా -ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున ప్రశంసలు అందుకోవడం. వసూళ్లలో మిగిలిన సినిమాల కంటే మెరుగైన ఫలితాలు కనబర్చడం.
ముఖ్యంగా విషాద పాత్రలను మెప్పించడంలో ట్రాజెడీ కింగ్ అక్కినేనికి నిజమైన నట వారసుడు నాగార్జునే అనిపించారు. ఇలా మరెన్నో విభిన్నమైన పాత్రలతో మరిన్ని దశాబ్దాలపాటు నాగార్జున ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

-గంజి కృష్ణ