Others

భలే గొప్ప జక్కన్న శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి..
భలే గొప్ప సినిమా!
ఈ మాటని మొన్న జనాంతికంగా మనం అనుకున్నాం.. ఆ తరువాత ప్రపంచం గుర్తించినపుడు మనమంతా ముచ్చటపడ్డాం...
ఇప్పుడు భారత ప్రభుత్వం ఇది ఉత్తమ చిత్రం అని ప్రకటించినపుడు.. గర్వపడుతున్నాం. గర్వం ఎందుకంటే.. మన తెలుగువాళ్ళు ఈ సినిమాని తీశారు కాబట్టి. అదికూడా మామూలు సినిమాల్లా కాకుండా ప్రపంచంలో చాలామంది సినిమావాళ్ళు, మీడియావాళ్ళు, సినీ ప్రముఖులు, విమర్శకులు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా తీశారు కాబట్టి..
ఇది నిజంగా తెలుగువారంతా గర్వించాల్సిన సందర్భం. ఊరికే ఇస్తుందా.. భారత ప్రభుత్వం.. ఉత్తమ చిత్రంగా పురస్కారం. మీకో విషయం తెలుసా?
తెలుగు సినిమా వయస్సు ఇంచుమించు ఏనభై ఐదేళ్ళు. ఆ తరువాత ఎప్పుడో.. అరవై మూడేళ్ల క్రిందట మన దేశంలో నిర్మించే సినిమాలలో ఉత్తమమైన చిత్రాలకు జాతీయ అవార్డులు అందించే ప్రక్రియని భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇప్పటికీ 62 ఏళ్ళుగా ప్రతి ఏటా ఉత్తమ చిత్రాలు ఎంపికవుతూనే వున్నాయి. కానీ.. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా.. ఒక్క తెలుగు సినిమా కూడా ఇంతవరకూ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాలేదు. అంటే, మన తెలుగులో గడచిన 62 ఏళ్ళల్లో ఒక్క మంచి చిత్రమూ లేదనేనా అర్థం?! ఏడాదికి నూటికిపైగా సినిమాలు నిర్మించి, బాలీవుడ్ తరువాత అంత స్థానంలో రాశిలోనూ వాసిలోనూ నిలిచే తెలుగు చిత్రసీమ.. ఒక్క ఉత్తమ చిత్రం కూడా తీయలేకపోయిందా అనేగా సందేహం!
కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.విశ్వనాధ్, బాపు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, రాంగోపాల్‌వర్మ, బి.నరసింగరావు.. ఇంకా ఎంతోమంది దిగ్గజాల్లాంటి దర్శకులు అద్భుతమైన సినిమాలు తీసి మన తెలుగువారిని అలరించారు. ఇక్కడ తీసిన ఎన్నో హిట్ సినిమాలు ఎన్నో భాషల్లోకి రీమేక్ అయి.. ఎన్నో ప్రాంతాల సినీ ప్రియుల్ని అలరించాయి. ఇంతమందున్నా కానీ.. మనకి ఒక్క స్వర్ణకమలం రాలేదు. అందుకు వంద కారణాలు ఉండనీ.. కానీ ఆ కొరతను ఈరోజు ఎస్.ఎస్.రాజవౌళి తీర్చేశారు. 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగువారి జెండాను సగర్వంగా ఎగరేశాడు. బాహుబలి సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. స్వర్ణకమలం సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమా అయింది.
కొనే్నళ్లుగా.. ఇన్ని తెలుగు సినిమాలకు రాని స్వర్ణకమలం బాహుబలికే ఎందుకొచ్చింది? ఇంత ఫక్తు కమర్షియల్ సినిమాకి జాతీయ గౌరవం ఎందుకు దక్కింది? ఇందుకు కూడా వంద కారణాలు! ఎస్.ఎస్.రాజవౌళి బహుబలిని ఒక సినిమాగా చూడలేదు. ఒక సినిమాగా తీయలేదు. ఆయన మాహిష్మతి అనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. తను సృష్టించిన వింతైన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం కనీసం ఆరేళ్లపాటు అహరహం శ్రమించాడు. అహోరాత్రులు కష్టపడ్టాడు. ఆ సృష్టిలోనుంచి ఒక శివగామిని పుట్టింది. ఒక కట్టప్ప పుట్టుకొచ్చాడు. క్రూరుడైన భల్లాలదేవుడు ఉద్భవించాడు. అందాల అవంతిక అవతరించింది. దేవసేన కథ పుట్టింది. ఆ దేవసేనే అమరేంద్ర బాహుబలి మనసు దోచింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా మహేంద్ర బాహుబలి పుట్టాడు. అతను అడవుల్లో పెరిగి పెద్దయ్యాడు. ఓ జానపద నాయకుడయ్యాడు. అవంతికతో ప్రేమలో పడి ఎన్నో సాహసాలు చేశాడు. కొండలు దాటాడు. కోనలు దూకాడు. చివరికి అవంతికను చేరుకున్నాడు. ఆమెకోసం ఇంకో సాహసం చేశాడు. మాహిష్మతిలో దేవసేనను విడిపించుకొచ్చాడు. అప్పుడు తెలిసింది తను విడిపించుకొని వచ్చిన దేవసేన.. తన తల్లే అని.. మరి తన తండ్రి అమరేంద్ర బాహుబలి ఏమయ్యాడు? అతడిని కట్టప్ప చంపేశాడు, ఎందుకు?
ఇలా ఓ కథ అల్లిక మెల్లగా మొదలై.. మనల్ని అందులోకి మమేకం చేస్తుంది. మనల్ని ఆ మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడి అందాలు, వింతలు, సాహసాలు, కాలకేయుడితో చేసే యుద్ధాలూ, మంచి చెడు.. అన్నీ మన కళ్లముందుంచింది. ఇంకోలా చెప్పాలంటే, కనికట్టే చేసింది. మనం సినిమాని సినిమాగా చూస్తే.. అది మామూలు సినిమా. మనం సినిమాని ఓ నిజంగా చూస్తే.. అది గొప్ప సినిమా. బాహుబలి.. మనల్ని ఓ మాహిష్మతి ఉన్నట్లుగా నమ్మించింది. దేవసేన హింసపడితే మనకి కంట తడి పెట్టించింది. శివుడు కొండలు దూకుతుండగా మనల్ని ఊపిరి బిగపట్టేలా చేసింది. ఈ సినిమాలో ప్రతి పాత్రా భావోద్వేగాలతో ప్రేక్షకులుగా మనం మమేకం అయిపోతాం. ఆ పాత్రలతో పాటు ప్రయాణిస్తాం. మాహిష్మతి సామ్రాజ్యం, ఆనాటి ప్రపంచం అంతా నిజం అని నమ్మిస్తుంది. అందుకే బాహుబలి గొప్ప సినిమా అయింది. ఒక సినిమాలో హీరో, ఆ హీరోకి ఒక హీరోయిన్, వాళ్ళిద్దరిమధ్యా రొమాన్స్, వీలైతే రెయిన్ డ్యాన్స్ లేదంటే మంచుకొండల్లో అదేదో డాన్స్. హీరో ఉన్నాడు కాబట్టి ఓ విలనూ. విలన్ ఊరికే ఉండడు కాబట్టి ఒకటో నాలుగో ఫైట్లు. చచ్చినట్టు హీరో గెలవాలి కాబట్టి క్లైమాక్స్‌లో విలన్‌ని చావుదెబ్బకొట్టి.. మధ్యమధ్యలో పదో పరకో పంచ్ డైలాగులు కొట్టి.. హీరో తనని ఎందుగు గొప్పోడో చాటుకుంటాడు. ఒక సగటు తెలుగు సినిమాలో ఇంతకన్నా కథేముంటుంది?
ఇలా వందమంది ఆలోచిస్తుంటే.. ఇంకోలా ఆలోచించినందుకు అతను.. ఇప్పుడు.. ఎస్.ఎస్.రాజవౌళి అయ్యాడు. కథే కాదు, తెలుగు సినిమా తీరు కూడా మార్చే ప్రయత్నం చేశాడు. ఆ మాటకొస్తే భారతీయ సినిమా తీరే మార్చాడన్నా తప్పులేదు. బుర్రుంటే.. దానికి కాస్తో కూస్తో ఆలోచించే శక్తి వుంటే.. తెలుగు సినిమా మీద వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవచ్చునని నమ్మాడు. తన నిర్మాతల్ని నమ్మించాడు. తన హీరోలైన ప్రభాస్, రానాల్ని నమ్మించాడు. హీరోయిన్లంటే అందమైన లొకేషన్లలో డాన్సులు చేయడమే కాదు, కత్తియుద్ధాలు చేయవచ్చంటూ.. హీరోయిన్లయిన అనుష్క, తమన్నాలను నమ్మించాడు. గంపగుత్తగా వాళ్లు తన సినిమాకు డేట్లు ఇచ్చేంతగా వాళ్ల కాన్ఫిడెన్స్‌ను గెలుచుకున్నాడు. తన తోటి టెక్నీషియన్లను కన్విన్స్ చేశాడు. వాళ్లంతా కూడా తన కలగన్న సామ్రాజ్యాన్ని నిర్మించేలా చేశాడు. ఒక తెలుగు సినిమా తీసి.. దాన్ని హిందీ, తమిళం, మలయాళం, చైనీసు లాంటి భాషలతో సహా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయవచ్చని నిరూపించాడు. తెలుగు సినిమా.. కాదు కాదు భారతీయ సినిమా సరిహద్దుల్ని ఇంకొంచెం విస్తృతం చేశాడు. 50 కోట్లు, 60 కోట్లు.. చేసే తెలుగు సినిమాకి 500 కోట్ల రూపాయల గౌరవం కూడా వస్తుందని నిరూపించాడు. అందుకే రాంగోపాల్ వర్మ అంటాడు, దర్శకుల్లో రాజవౌళి.. నిజమైన బాహుబలి అని! జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాల జ్యూరీకి అధ్యక్షుడు, దిగ్ధర్శకుడు రమేష్ సిప్పీ కూడా ఇదే చెప్పాడు. బాహుబలి ఒక అద్భుతమైన సృష్టి. దాని నిర్మాణ విలువలు అంతకన్నా గొప్పవి. వెండితెరమీద ఒక కాల్పనిక జగత్తును సృష్టించిన సినిమాటిక్ బ్రిలియన్స్ అమోఘం. అంతకుమించి.. పాత్రల భావోద్వేగాలు, నాటకీయ సందర్భాలను చూపించడానికి ఉపయోగించిన స్పెషల్ ఎఫెక్ట్ అనన్యసామాన్యం. ఇన్ని ఉత్తమ విలువలు ఉన్నాయి కనుకనే బాహుబలి ఉత్తమ చిత్రం అయింది అంటారు రమేష్‌సిప్పీ. ఇప్పుడు ఎస్.ఎస్.రాజవౌళి అమాంతం గొప్ప దార్శనికుడయ్యాడు. 63 ఏళ్ళతో తెలుగు సినిమాకి మొదటి స్వర్ణకమలం సాధించిపెట్టారు. ఇప్పుడు సగటు సినీ అభిమాని కూడా కాలరెత్తుకొని తిరిగేలా చేశాడు. కానీ.. ఇంకా చాలదు. రాజవౌళి ఈసారి దర్శకుడిగా స్వర్ణకమలం సాధించాలి. మహామహా దిగ్ధర్శకుల సరసన కూడా నిలవాలి. ఆస్కార్‌కీ వెళ్లాలి. అక్కడా గెలవాలి. అయినా.. ఇంత చేసినవాడికి.. అదేమంత కష్టం? మళ్లీ మన తెలుగువాళ్ళమంతా కాలరు ఎగురవేసే ఆ సందర్భాలకోసం ఎదురుచూద్దాం.. అందాకా.. ఎస్.ఎస్.రాజవౌళికి థాంక్స్ చెబుదాం.
థ్యాంక్యూ రాజవౌళి!

-సతీష్ వివిఎన్