Others

పరమానందయ్య శిష్యుల కథ (ఫ్లాష్‌బ్యాక్ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు, కొన్ని పద్యాలు:
వెంపటి సదాశివబ్రహ్మం
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
కళ: వాలి
కూర్పు: బి గోపాలరావు
స్టంట్స్: సాంబశివరావు
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం: సి పుల్లయ్య

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాస్తవ్యులు తోట సుబ్బారావు తొలుత బస్ సర్వీసులు నడిపేవారు. బస్ రూట్లు జాతీయం చేయటంవల్ల, ఆ వృత్తికి స్వస్తి పలికారు. ‘దొంగను పట్టిన దొంగ’ అనే డబ్బింగ్ చిత్రం ద్వారా నిర్మాతగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. తెలుగు సినిమాకు ఒక నిర్ధుష్టమైన ప్రణాళిక లేదని, కొత్తదనంతో కొత్త తరహాలో చెప్పగలిగే ప్రతి కథను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మే నిర్మాత తోట సుబ్బారావు. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సి పుల్లయ్య దర్శకత్వంలో సుబ్బారావు నిర్మించిన చిత్రం -పరమానందయ్య శిష్యులకథ. 1966 ఏప్రిల్ 7న విడుదలైంది.
--
కైలాసంలో శివపార్వతుల మధ్య నిజమైన భక్తుడెవరని చర్చ జరుగుతుంది. ఈశ్వరుడు (శోభన్‌బాబు) భూలోకంలో నందివర్ధన మహారాజు (ఎన్టీ రామారావు)ను చూపుతాడు. మహారాజు రాజనర్తకి రంజని (ఎల్ విజయలక్ష్మి) సాంగత్యంలో మధుపానలోలుడై రాజ్యవ్యవహారాలు మంత్రి శివానందం (ముక్కామల)కు అప్పగిస్తాడు. రాజగురువు పరమానందయ్య (నాగయ్య) ఆదేశంపై ఏ స్థితిలోవున్నా నిత్యం శివపూజను నిర్వహిస్తుంటాడు. ఒకనాడు రాజనర్తకి ఇంట నిద్రించిన మహారాజు శివపూజకు అనుకూలమైన ప్రతిమ లభించక ప్రేయసి స్థనములో శివలింగాన్ని దర్శించి దానే్న భక్తితో పూజిస్తాడు. ఆ పూజను ఈశ్వరుడు గ్రహించగా పార్వతి ఏవగించుకుంటుంది. ఆ మహారాజును సన్మార్గంలో మార్చగల యువతి చిత్రరేఖ (కెఆర్ విజయ) గంధర్వ రాజకుమార్తె అని తెలియచేస్తాడు ఈశ్వరుడు. చిత్రరేఖకు ఒక రుద్రాక్షమాలనిచ్చి తన సముఖానికి వచ్చేటప్పుడు ధరించమంటాడు. భూలోక విహారంచేస్తూ చిత్రరేఖ, ఆ మాలను అక్కడ మర్చిపోతుంది. జలకాలాడుతున్న తమను గమనించారని అరుణ కేశిముని శిష్యులను బుద్ధిహీనులు కమ్మని శపిస్తుంది. తన వివాహంనాడు వారికి శాప విమోచనం కలుగుతుందని తెలియచేస్తుంది. అరుణముని, ఆమెకు భూలోకంలో మానవుని సంపర్కం కలిగితే మానవిగా మారిపోతుందని చెబుతాడు. మర్చిపోయిన రుద్రాక్షమాల కోసం భూమికి వచ్చి చిత్రరేఖ పాముగామారి రాజమందిరం ప్రవేశించి, మహారాజు చేయితాకి మానవిగా మారుతుంది. రాజు ఆమె అందం చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. పరమానందయ్య రుద్రాక్షమాల ఆమెకిచ్చి నిజం తెలుసుకుంటాడు. మహారాజును ద్వేషిస్తూ శివార్చనలో కాలం గడుపుతుంటుంది చిత్రరేఖ. ఆమె సూచనలు పాటించిన మహారాజు రాజనర్తకి సావాసం, మధుపానం మానివేసి ప్రజలను రక్షిస్తుంటాడు. అడవికి వెళ్ళిన చిత్రరేఖను దొంగల బారినుంచి కాపాడతాడు. రాజనర్తకి రంజన మహారాజుకు, మంత్రి శివానందం కుట్ర తెలిపి అతని చేతిలో మరణిస్తుంది. బంధిఖానా నుంచి తప్పించుకున్న మంత్రి తిరిగి మహారాజుపై దాడిచేయటం, పరమానందయ్య ప్రాపకంలోవున్న శిష్యులు తమ అమాయకత్వంతో మహారాజును మేల్కొలపటం, మహారాజ ద్రోహులను బంధించి చిత్రరేఖ అంగీకారంతో, శిష్యుల సాయంతో ఆమెను వివాహం చేసుకోగా, వారికి నిజరూపాలు రావటం, గురువుల ఆశీర్వాదంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో పార్వతిదేవిగా అత్తిలి లక్ష్మి, పరమానందయ్య భార్య ఆనందిగా ఛాయాదేవి, శివుడిగా సోభన్‌బాబు అతిథి పాత్రలు పోషించారు. ఇక శిష్యులు నందిగా పద్మనాభం, గణపతిగా రాజ్‌బాబు, అల్లు రామలింగయ్య, కోళ్ళ సత్యం, సారథి, రామచంద్రరావు, పెళ్ళి పెద్ద విరూపాక్షయ్యగా డాక్టర్ శివరామకృష్ణయ్య, గజదొంగ జగ్గారాయుడిగా సత్యనారాయణ, దొంగగా జగ్గారావు, అతిథి పరబ్రహ్మశాస్ర్తీగా వంగర నటించారు.
దర్శకులు సి పుల్లయ్య చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దారు. బుద్ధిహీనులైన శిష్యులు పరమానందయ్య ఇంటిలో తలుపులు పగలగొట్టగా, ధనంపాతర బయటపడటం, గురువుగారికి కాళ్ళుపట్టే సన్నివేశంలో పాము బయటకు రావటం, సున్నాలువేసి పెళ్ళి చెడగొట్టడం, విషం అని సున్నుండలు తిని బ్రతకటం, దొంగలు వచ్చినపుడు పెద్ద మనుషులని భావించి, తరువాత దొంగలని తెలిసి దేహశుద్ధిచేయటం, రాజమందిరంలో వంటలు చేసుకొని పూజ చేయటం కొంత తెలివిని, శివరామకృష్ణయ్యచే లెంపకాయ, జెల్లకాయ నేర్పించటంలాంటి సన్నివేశాల్లో అమాయకత్వాన్ని చూపిస్తూ అర్ధవంతంగా తీర్చిదిద్దారు. రాజనర్తకి రంజని పాత్రను ఓ వేశ్యగాకాక ఓ ప్రణయినిగా, రాజ్యక్షేమంకోరే వనితగా, సంస్కారంగల యువతిగాను, చిత్రరేఖ పట్ల మొదట అసూయపడటం, తిరిగి ఆమెపట్ల ప్రసన్నభావం ఎంతో విపులంగా రూపొందించారు. తనను మానవ కన్య మార్చినందుకు మహారాజును, అతని అలవాట్లను ద్వేషించిన చిత్రరేఖ, ఆమె వైఖరిలో కొద్దికొద్దిగా మార్పు, అయినా శివసానిధ్యం చేరాలని వ్రతసంకల్పం, మానవిగా కొన్ని లక్షణాలను, గత జన్మ గుర్తులతో విచారాన్ని, మారిన మహారాజుపట్ల అభిమానం, జాగరూకత, అనురాగం ఎంతో సౌకుమార్యంగా, ఆవేశంగా, దురుసుగా, పారవశ్యంతోనూ పలు భావాలు చక్కని మురిపంతో అలరించేలా నటించింది కెఆర్ విజయ.
నందివర్ధన మహారాజుగా, ప్రేయసితో ప్రణయాన్ని, శివపూజలో భక్తితత్పరతను, చిత్రరేఖపట్ల అనురాగం, తన ప్రవర్తన మార్చుకోవటం, ఆపైన హుందాతనంతో ఒకనాటి ప్రేయసి రంజనిపట్ల విముఖత, కార్యశూరత్వం, తెలివితో రాజకార్యాలు చక్కదిద్దుకొని, మంత్రి కుట్ర భగ్నంచేసి చిత్రరేఖను వివాహం చేసుకోవటం.. ఇలా సన్నివేశాలకు తగ్గ ఔచిత్యాన్ని నటనలో ప్రదర్శించారు నట సార్వభౌమ ఎన్టీ రామారావు. అడవిలోని గుహలో దొంగలు మహారాజుపై దాడి చేయటంలోని స్టంట్లు చక్కగా రూపొందించారు స్టంట్స్ మాస్టర్ సాంబశివరావు.
చిత్ర గీతాలు:
మహారాజు ముందు రాజనర్తకి నృత్యం చేస్తూ పాడే గీతం -ఇదిగో వచ్చితి రతిరాజా/ మధువే తెచ్చితి మహరాజా (ఎస్ జానకి). కైలాసంలో ఈశ్వరుని ప్రార్థిస్తూ మునులుపాడే పంచాక్షరీ మంత్రం -ఓం నమశ్శివాయ నమో నమస్తే ఓం ఓం ఓం పాహిపాహి. మహారాజు ఎన్టీఆర్ ఈశ్వరుని ప్రార్థించే శ్లోకం -వందే శంభుముపాతిం (ఘంటసాల). రాజనర్తకి ఇంట్లో అందమైన మగువల శిల్పాలు, జాబిలి, పూల చెట్ల బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్, యల్ విజయలక్ష్మిపై చిత్రీకరించిన అలరించే గీతం -ఎనలేని ఆనందమీరేరుూ/ మనకింక రాబోదు ఈ హాయి (ఎస్ జానకి, ఘంటసాల- సదాశివబ్రహ్మం). శివపూజకు తగిన ప్రతిమ కనిపించక మహారాజు విలపించే పద్యం -అక్కట కన్నుగానక మదాంధుడనై (ఘంటసాల- సదాశివబ్రహ్మం). ఈశ్వరుని పూజిస్తూ ఎన్టీఆర్ స్తుతించే గీతం -ఓం శివాయ నమః ఓం శివలింగాయనమః. ఘంటసాల బృందం అర్పించే స్తుతి -ఓం నిధనపతయేనమహః. చిత్రరేఖ కెఆర్ విజయ కైలాసంలో ఈశ్వరుని ప్రార్థిస్తూ పాడే గీతం -ఓ మహదేవా నీ పద సేవ భవతరణానికి నావ (పి సుశీల). మహారాజు పూజించిన పుష్పాన్ని చిత్రరేఖ తలలో దాల్చటం అర్ధవంతంగా శివ పార్వతులు ఒకరినొకరు చూసుకోవటం -దర్శకుని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.
ఎన్టీ రామారావు కలలో గంధర్వలోకంలో కెఆర్ విజయతో పాడిన యుగళ గీతాన్ని అలరించే సంగీతంతో ఆకట్టుకునేలా చిత్రీకరించారు. అది -నాలోని రాగమీవే నడయాడు తీగవీవె (పి సుశీల, ఘంటసాల; రచన-సినారె). ఎన్టీ రామారావుపై చిత్రీకరించిన పద్యం -నవ నవోజ్వలమగు యవ్వనంబు (ఘంటసాల- సదాశివబ్రహ్మం). కెఆర్ విజయపై చిత్రీకరించిన పద్యం -వౌనివరేణ్య శాపమున (పి సుశీల- సదాశివబ్రహ్మం). విచారంలోనే కెఆర్ విజయ ఈశ్వరుని పూజిస్తూ పాడే గీతం -శోకముతోనే మానినినై ఈ లోకములో మనగల నా ఓ మహాదేవా (పి సుశీల). పరమానందయ్య శిష్యులు పద్మనాభం తదితరులపై చిత్రీకరించిన హాస్య గీతం -పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా. ఎన్టీఆర్, ముందు కెఆర్ విజయ, యల్ విజయలక్ష్మి పాడే నృత్య గీతం -వనిత తనంతటతానే వలచిన ఇంత నిరాదరణా (పి లీల, ఎపి కోమల). ఈ గీతం అద్భుతమైన నృత్యం, సంగీతంతో సాగుతుంది. రాజసభలో ముక్కామల, ఎన్టీఆర్, కెఆర్ విజయలు గమనిస్తుండగా యల్ విజయలక్ష్మి పాడే నృత్యగీతం -కామినీ మదనరారా నీ కరుణకోరి పిలిచేరా (ఘంటసాల ఆలాపన, పి లీల గానం- రచన సముద్రాల సీనియర్).
పరమానందయ్య శిష్యుల కథ చిత్రం అప్పట్లో విజయవంతమైంది. సంగీతం, పాటలు శ్రోతలను మరింతగా అలరింపచేసింది. హాస్యనటుడు కస్తూరి శివరావు, ఎలైట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో పరమానందయ్య శిష్యులు చిత్రాన్ని నిర్మించారు. 1950లో విడుదలైన ఈ చిత్రంలో అక్కినేని, లక్ష్మీరాజ్యం హీరో హీరోయిన్లుగా నటించారు. సియస్‌ఆర్, హేమలత, రేలంగి ఇతర పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి