మెయిన్ ఫీచర్

కొత్త ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి. వేసవి. దసరా. తెలుగు సినిమా పరిశ్రమకు -కాసులు కురిపించే సీజన్లివి. వందల కోట్ల వినోద వ్యాపారంతో
-బాక్సాఫీసు కళకళలాడే రోజులు. స్టార్ హీరోలు.. టాప్ హీరోయిన్లు... మెగా డైరెక్టర్లు.. గొప్ప నిర్మాణ సంస్థలు.. ఈ మూడు సీజన్ల ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకునే సినిమాలు చేస్తుంటారు. కలిసొచ్చే కాంబినేషన్లు.. వైవిధ్యమైన కథా చిత్రాలు.. మల్టీస్టారర్లు.. భారీ బడ్జెట్ చిత్రాలూ దాదాపుగా ఈ సీజన్లను నమ్ముకునే బాక్సాఫీస్ ముందుకొస్తుంటాయి. అయితే
-చాలాకాలంగా పాతుకుపోయిన స్ట్రాటజీ గత రెండు మూడేళ్లుగా పనిచేయడం మానేసింది. ఫలితాలివ్వడం ఆగిపోయింది.
లవ్, యాక్షన్, హారర్, థ్రిల్లర్, డ్రామా.. ఇలా జోనర్ ఏదైనా పెద్ద, మీడియం రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ తింటున్నాయి. ఉన్నవాటిలో ఇది బావుందనో, అదృష్టం కలిసొచ్చో ఒకటో రెండో సినిమాలు మాత్రమే అయితే టాప్ రేంజ్‌కు
చేరుతున్నాయి. లేదంటే గట్టెక్కేసి -హమ్మయ్య అనిపించుకుంటున్నాయి. ఈ ఏడాది పరిస్థితినే చూస్తే -గడచిన సంక్రాంతి పెద్ద సినిమాకు పెట్టుబడి కూడా తీసుకురాని పరిస్థితి కనిపించింది. సీజనల్ వినోదానికి ముక్తాయింపుగా విడుదలైన నాగార్జున -సోగ్గాడే చిన్నినాయినా మాత్రం పెద్ద‘మూట’కట్టుకుంది. బాలరాజు పంచె పాత్రతో హడావుడి చేసిన నాగార్జున
వసూళ్ల విషయంలో దుమ్ము దులిపేశాడు. సంక్రాంతి మొత్తాన్ని తన ఖాతాలో వేసేసుకున్నాడు.
---
ఇప్పుడు వేసవి సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్‌లో అందరికంటే ముందేవచ్చిన నాగార్జున -‘ఊపిరి’తో హిట్టు అందుకున్నాడు. ఈసారి మార్చినుంచే ఎండలు మండుతుంటే -చల్లని దొరువులా వినోదాత్మకంగా ఆడియన్స్‌ని పలకరించాడు. ఫ్రెంచ్‌లో హిట్ మార్క్ అందుకున్న ఇన్ టచబుల్స్ లైన్‌ను తెలుగుకు అనుకూలంగా మార్చుకుని ‘ఊపిరి’పోశాడు. నాగార్జున, కార్తీ, తమన్నా తారగణంతో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తయారై మొన్ననే విడుదలైన ఊపిరి దుమ్ముదులిపేసే బిజినెస్ అందుకుంది. వీల్‌చైర్‌కే పరిమితమైన పాత్రలో నాగార్జున క్రెడిట్ కొట్టేశాడు. రానున్న రెండునెలల్లో వచ్చే సినిమాలకూ ఊపిరి కొత్త ఊపిరి అందించనుందన్న ఆశాభావం పరిశ్రమలో వ్యక్తమవుతోంది.
***
సమ్మర్ సంగ్రామంలో స్టార్ ఇమేజ్‌తోను, యాక్షన్‌తోను, ఫీల్ లవ్‌తోను, మాస్ హంగామాతోను -ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి పెద్దా, మీడియం రేంజ్ సినిమాలు వరుసపెట్టనున్నాయి. ఇక ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రూపుదిద్దుకుంటున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సైతం సమ్మర్ వినోదాత్మక సినిమాగా రాబోతోంది. షూటింగ్ దశనుండే అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచిన పవన్‌కల్యాణ్, ఈ సినిమాతో నిన్న మొన్నటి సినిమాలకంటే తన రేంజ్‌ని మరో మెట్టుపైకి తీసుకెళ్తాడని అంటున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం -పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రం. పైగా హిందీలోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కెఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్ నిర్మిస్తున్నాడు. సినిమా ఆడియో హక్కులే 2 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. తెలుగు సినిమా చరిత్రకు ఇదొక హైలెట్. దాంతోపాటు బిజినెస్ వర్గాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న చిత్రాన్ని -అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. సమ్మర్ సీజన్‌లో పవన్‌కల్యాణ్ సినిమాలకు ఎలాగూ గిరాకీ ఉంటుంది కనుక, లెక్కకుమించి థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. అందాల భామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీరాయ్, సంజన ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తార్ట. ఇక యూత్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ని సృష్టించుకున్న అల్లు అర్జున్ ‘సరైనోడు’ సైతం ఈ సమ్మర్‌లోనే విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మీడియా వర్గాల్లో అమితాసక్తి నెలకొల్పింది. మెగా అభిమానుల్లోనూ భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. చిత్రమైన మేకోవర్‌తో అభిమానులను అట్రాక్ట్ చేస్తున్న అర్జున్ -ఏప్రిల్ 22న థియేటర్లకు వస్తాడని అంచనా వేస్తున్నారు. ఎలాంటి హంగామా లేకుండా ఏప్రిల్ 1న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి పాటల్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం పెద్ద హీరోల సినిమాల్లో ఇటీవలి హైలెట్. బన్నీతో తొలిసారి రకుల్‌ప్రీత్‌సింగ్ జోడీ కడుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన బన్నీ సినిమా -బిజినెస్‌పరంగా ఇప్పటికే సంచలనం సృష్టిస్తోందని అంటున్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ నిర్మించిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిపెంచిన చైతూ -ఏప్రిల్ తొలివారంలోనే థియేటర్లకు రావొచ్చని అంచనా. నాగచైతన్య సరసన మంజిమామోహన్ కనిపించబోతోంది. చైతూ మరో చిత్రంతోనూ ఈ సమ్మర్‌ను టార్గెట్ చేస్తున్నాడు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ప్రేమమ్ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో రూపొందుతున్న ప్రేమమ్ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్నీ ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయడానికి జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరో -నారా రోహిత్ సైతం సమ్మర్ షేర్ కోసం తాపత్రయపడుతున్నాడు. కార్తికేయప్రసాద్ దర్శకత్వంలో వస్తోన్న ఆ చిత్రమే -పండగలా వచ్చాడు. రోహిత్‌కు హీరోయిన్‌గా నీలం ఉపాధ్యాయ్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మూడోవారంలో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచు మనోజ్ కూడా -సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంతో వేసవి ఆడియన్స్‌పై అటాక్ చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని నిర్మాత సి కళ్యాణ్ నిర్మించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో క్రేజీ కెరీర్ కొనసాగిస్తున్న జగపతిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం హైదరాబాద్ నేపథ్యంలో సాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్ 15న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హాట్ సమ్మర్‌లో కూల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్ముకొని రంగంలోకి దిగుతున్నాడు మంచు విష్ణు. హ్యాట్రిక్ విజయాలతో యంగ్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న రాజ్‌తరుణ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం -ఈడోరకం ఆడో రకం. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తికావొచ్చిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు హీరో ఆది కూడా సమ్మర్‌కు -చుట్టాలబ్బాయిగా వస్తున్నాడు. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రణీత హీరోయిన్. ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేస్తారని వినికిడి. సమ్మర్‌లో బ్రహోత్సవం రుంచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో మహేష్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లు. మే 6న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సమ్మర్ రేస్‌లో తానూ ఉన్నానంటూ సత్తా చాటేందుకు మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సైతం ట్రై చేస్తున్నాడు. పటాస్‌తో యాక్షన్ డైరెక్టర్ రేంజ్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఆ చిత్రమే -సుప్రీమ్. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో హీరోయిన్‌గా రాశిఖన్నా కనిపించబోతుంది. ఏప్రిల్ నెలాఖరుకు థియేటర్లకు తెచ్చే ప్రయత్నంలో టీంమొత్తం వేగంగా పని చేస్తుంది.
మొత్తానికి సమ్మర్‌లో సత్తా చాటడానికి భారీ సినిమాలతోపాటు యువ హీరోల సినిమాలూ సిద్ధవౌతున్నాయి. ఎవరి సత్తా ఏమిటో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ‘ఊపిరి’ తీసుకుంటాయో చూద్దాం.

శ్రీ