క్రైమ్ కథ

ఓ వర్షపు రాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షంలో కనపడే ఆ మైలురాయి మీద డోవర్ 41 అని రాసుండడం కారు నడిపే డోనాల్డ్ చూశాడు. అతని నోట్లోంచి ఓ ఈల పాట వెలువడసాగింది. దాని పేరు ‘ది సాంగ్ ఆఫ్ ది స్కై బోట్ మేన్’. అది ఫ్రెంచ్ పాట. ఫ్రాన్స్ నించి విదేశాలని కనిపెట్టడానికి వెళ్లిన నావికులని కీర్తించే పాట అది.
అతని కారు విండ్ షీల్డ్ మీద వర్షపు చినుకులు చప్పుడు చేస్తూ పడుతున్నాయి. వైపర్స్ అటు ఇటు తిరుగుతూ చేసే చప్పుడు ‘కొత్త జీవితం. కొత్త జీవితం’ అని ధ్వనిస్తున్నట్లుగా అతనికి అనిపించింది. తడి రోడ్డు మీద కార్ల టైర్ల శబ్దం కూడా వినిపిస్తోంది. మర్నాడు తను ఫ్రాన్స్‌కి వెళ్లిపోతాడు అనుకున్నాడు. కారు రేడియోలో వార్తలు వస్తున్నాయి.
‘... ఇది ఇంకో ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వాన్ని రాజీనామా చేయమని మిస్టర్ మైఖేల్ ఫుట్ కోరాడు.’
కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత అనౌన్సర్ గొంతులో చిన్న మార్పు.
‘కెంట్‌లో హత్య, కెంట్ శివార్లలోని ఆష్‌లీ అనే గ్రామంలో మిసెస్ మేరీ ఫోర్డ్ అనే వృద్ధురాలి శవం ఆవిడ ఇంట్లో కనుగొనబడింది. ఆవిడ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపాక, నేరస్థులు ఇల్లంతా బాగా వెదికారు. మిసెస్ ఫోర్డ్ ఎవరితోనూ కలిసేది కాదు. ఒంటరి జీవి. ఆవిడ తనింట్లో పెద్ద మొత్తంలో నగదు దాచిందని వదంతి. పోలీసులు పరిశోధిస్తున్నారు’
అక్కడ నించి ఆష్‌లీ గ్రామం ఐదు మైళ్లు ఉండచ్చని డోనాల్డ్ అనుకున్నాడు. తర్వాత రేడియోలో ఓ అందాల రాణితో వచ్చే ఇంటర్వ్యూని అతను ఆసక్తిగా వింటూండగా, ఎదురుగా రోడ్డుకి అడ్డంగా ఏదో పడి ఉండటం కనిపించింది. తక్షణం అది మనిషని గ్రహించి బ్రేక్ వేయడంతో తడి రోడ్డు మీద కారు కొద్దిగా అదుపు తప్పింది. తిరిగి దాన్ని ఆధీనంలోకి తెచ్చుకుని కారుని ఆపి, అద్దం దింపి కోపంగా అరిచాడు.
‘రోడ్డు మధ్య ఏం చేస్తున్నావు?’
‘టార్చిలైట్ వెలుగు చూడలేదా?’ ఆ వ్యక్తి నవ్వుతూ అడిగాడు.
‘ఆ వెలుతురు నాకు కనపడలేదు. కొంచెంలో నిన్ను గుద్దేవాణ్ని’
‘నాకు సహాయం చేయగలరా? నా కారు పాడైంది’ అతని కంఠం మొరటుగా ఉంది.
డోనాల్డ్‌కి కారు హెడ్‌లైట్స్ వెలుగులో ఎక్కడా ఇంకో కారు కనపడలేదు. అడని ప్రశ్నకి ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు.
‘నువ్వు దాటి వచ్చిన సైడ్ రోడ్‌లో నా కారు ఉంది. ముందు ఏక్సిల్ విరిగింది అనుకుంటాను’
అతను మళ్లీ గట్టిగా నవ్వాడు. డోనాల్డ్‌కి ఆ నవ్వు అర్థరహితంగా అనిపించింది.
‘దయచేసి నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? ముందు కొద్ది దూరంలో ఓ కెఫే ఉంది. నన్నక్కడ దింపితే, నేను మెకానిక్‌కి ఫోన్ చేస్తాను’
తక్షణం డోనాల్డ్‌కి అతన్ని కారులో ఎక్కనివ్వకూడదు అనిపించింది. ఐనా తన పక్క సీట్ తలుపుని తెరిచాడు. ఆ వ్యక్తి తన తడిరెయిన్ కోట్‌ని విప్పి, వెనక సీట్లో పడేసి కూర్చున్నాడు. అతను తనకన్నా చిన్నవాడని, ఇరవై ఆరు, ఇరవై ఏడేళ్లు ఉండచ్చని లోపలి వెలుగులో డోనాల్డ్ గమనించాడు. ఆ వ్యక్తి తలుపు మూయగానే లైట్ ఆరిపోయింది.
‘సారీ. మీ కారుని తడుపుతున్నాను’ చెప్పాడు.
డోనాల్డ్ జవాబు చెప్పలేదు. కారు డ్రైవ్ చేస్తూ మళ్లీ ఫ్రెంచ్ పాటని ఈల వేయసాగాడు.
‘చాలా దూరం వెళ్తున్నారా?’ అతను కొద్దిసేపాగి అడిగాడు.
‘డోవర్‌కి వెళ్లి ఇంగ్లీష్ ఛానల్‌ని దాటి ఫ్రాన్స్‌కి వెళ్లిపోతాను’ డోనాల్డ్ ఉత్సాహంగా చెప్పాడు.
‘అదృష్టం. నేనెప్పుడూ ఫ్రాన్స్ వెళ్లలేదు’
‘ఇంగ్లండ్ విసుగు కలిగించే దేశమని నా అభిప్రాయం. ఈ దేశం నించి వెళ్లిపోతున్నందుకు నాకు ఆనందంగా ఉంది’ కొద్దిసేపాగి అతని మనోభావాలు దెబ్బ తిన్నాయేమో అనే అనుమానంతో డోనాల్డ్ మళ్లీ చెప్పాడు.
‘మార్చి నెలలో ఇంగ్లండ్ నించి వెళ్లడం బావుంటుందని చెప్పడం నా ఉద్దేశం’
‘నాకు అర్థమైంది. నేను ఉద్యోగరీత్యా సేల్స్ కాన్ఫరెన్స్‌కి ఫ్రాంక్‌ఫర్ట్‌కి ఐదేళ్ల క్రితం వెళ్లాను. భార్య, ఇద్దరు పిల్లలు ఉంటే విదేశాలకి వెళ్లడం కుదరదు. ఏటా మా బడ్జెట్ లిటిల్ హేంప్టన్‌కి వెళ్లడానికే సరిపోతుంది. అక్కడ బంధువులు ఉన్నారు. మీకు పెళ్లయిందా?’
‘లేదు’ డోనాల్డ్ జవాబు చెప్పాడు.
‘అదృష్టవంతులు. లండన్‌లో సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో ఉంటూ, మీకేం తోస్తే అది చేయచ్చు. ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లచ్చు. నాకు ఒక్కోసారి అలాంటి వారి మీద అసూయ పుడుతూంటుంది’
‘లండన్‌లో నాకో ప్లాట్ ఉందని నేను చెప్పలేదు. నేను రచయితని. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌ని’ డోనాల్డ్ అసహనంగా చెప్పాడు.
‘ఫ్రీలాన్స్ అంటే స్వతంత్రం. కారు చెడిపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది. నేను రోడ్ రాజాని’
‘అర్థంకాలేదు. అంటే?’
‘కమర్షియల్ ట్రావెలర్. ఈ రాత్రికల్లా నేను ఫోకెస్టోన్‌కి చేరుకోవాలి. రేపు ఉదయం నాకు అక్కడ ఓ అపాయింట్‌మెంట్ ఉంది. నా కారుని మెకానిక్ వెంటనే బాగు చేయగలిగితే మంచిది. లేదా ఇబ్బందుల్లో పడతాను. దయచేసి మీరు నన్ను ఫొకెస్టోన్‌లో దింపగలరా? అది మీ దారిలోనే ఉంది. అది మీరు నాకు చేసే పెద్ద సహాయం అవుతుంది’
అతను చెప్పిన కట్టుకథకి తిరస్కరించాలి అని డోనాల్డ్‌కి అనిపించింది.
‘మీ కారు బాగవకపోతే అలాగే’
‘మీరు చాలా మంచివారు. ఆ కెఫే దగ్గర ఐదు
నిమిషాలు ఆగితే నేను గేరేజ్‌కి ఫోన్ చేస్తాను’
‘మీరు ఏం అమ్ముతారు?’ డోనాల్డ్ అకస్మాత్తుగా అడిగాడు.
‘ఉలెన్స్. అన్ని రకాల ఉలెన్ బట్టలు’
‘మీ దగ్గర శాంపుల్స్ ఉన్నాయా?’
క్షణం ఆలస్యంగా జవాబు వచ్చింది.
‘ఆ పెట్టె కారులో ఉంది. సూట్‌కేస్ కూడా. వాటిని వెంట తీసుకురాలేదు’
శాంపుల్స్ లేకుండా అమ్మకాలని ఎలా బుక్ చేసుకుంటాడనే ఆలోచన డోనాల్డ్‌కి కలిగింది.
‘ఆ హత్య షాకింగ్‌గా అనిపించింది’ ఆ కొత్త వ్యక్తి చెప్పాడు.
‘ఏ హత్య?’ డోనాల్డ్ ప్రశ్నించాడు.
‘కొద్ది మైళ్ల దూరంలో ఆష్‌లీ అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లోని ఓ వృద్ధురాలిని తల మీద కొట్టి చంపారు. పోలీసులు హంతకులని తప్పకుండా పట్టుకుంటారు. ఆ ఇంట్లోంచి అతను వెళ్లడం సాక్షులు చూశారని పందెం. లేదా పోలీసులు జో డోవెన్స్‌ని ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పరు. హత్య తేలిక. ఉదాహరణకి నేను నా తుపాకీని నీ డొక్కలో గుచ్చి కారుని ఆపమంటాను. తర్వాత కాల్చి, నిన్ను బయట పడేసి కారులో ఉడాయించి, దాన్ని ఎక్కడో వదిలేసి రైళ్లు, బస్సులు రెండు మూడు మారి దూరంగా వెళ్తే, ననె్నవరూ పట్టుకోలేరు. ఇలా చాలాసార్లు జరిగింది’ ఆ కొత్త వ్యక్తి కొద్దిసేపాగి మళ్లీ చెప్పాడు.
‘కానీ ప్రతీ హంతకుడు వేలిముద్రలు, కాలి ముద్రలు లాంటి ఆధారాల విషయంలో పొరపాటు చేస్తూంటాడు.. నేను గ్లవ్స్ తొడుక్కుని ఉండాల్సింది.. నాలోని సెన్సాఫ్ హ్యూమర్‌కి మీరు క్షమించాలి. నాకు గుర్తుంటే కెఫే ఆ మలుపులో ఎడమవైపు ఉంది. హత్య ఆకర్షణీయమైంది కదా?’
డోనాల్డ్ సమాధానం చెప్పలేదు. ఫెర్రీ ఎక్కి ఆ రాత్రి ఫ్రాన్స్‌కి వెళ్లబోతున్నాను అనుకున్నాడు.. మళ్లీ అతని నోట్లోంచి ఈల పాట వచ్చింది.
‘ఒకడు హాల్లోని ఓ వృద్ధురాలిని తల మీద బాది, ఐదు వందలో, వెయ్యో దొంగిలించి పారిపోయాడు’ కొత్త వ్యక్తి చెప్పాడు.
వర్షం ఆగింది. రోడ్డుకి ఎడమవైపు లైట్లు కనిపించాయి. కారు వైపర్స్‌ని ఆపు చేశాక శబ్దం ఆగింది. డోనాల్డ్ ఈలపాటని ఆపేసి జోస్ కెఫే ముందు కారుని ఆపాడు. కొత్త వ్యక్తి కారు దిగుతూ అడిగాడు.
‘మీరూ వస్తున్నారా?’
డోనాల్డ్ అతని చెప్పిన కథ అబద్ధం అని నిర్ణయించాడు. దాని గురించి ఏదైనా చేయాలనుకున్నాడు. అయిష్టంగానే కారు దిగాడు. అతని వెంట జోస్ కెఫేలోకి వెళ్తూ అతని బూట్ల వంక చూశాడు. వాటికి బురద అంటుకుని ఉంది.
ప్లాస్టిక్ టేబుల్స్ మీద సాస్ సీసాలు ఉన్నాయి. మాంసం వేయించే వాసన వస్తోంది.
కౌంటర్ వెనక వ్యక్తి వచ్చి తన పేరు జో అని చెప్పాడు.
‘రెండు కప్పుల స్ట్రాంగ్ టీ. మాకు సాసేజెస్, చిప్స్ చేసి ఇవ్వగలరా?’ కొత్త వ్యక్తి అడిగాడు.
‘నాకు తినడానికి ఏం వద్దు’ డోనాల్డ్ నవ్వే ఆ కొత్త వ్యక్తితో కఠినంగా చెప్పాడు.
‘మనిద్దరి కడుపుల్లోకి వేడిగా ఏదైనా వెళ్తే మంచిది’
‘నాకేం వద్దని చెప్పాగా? నేను సాసేజెస్‌ని తినను’
‘ఇదవకండి. నా పేరు గోలైట్లీ. మిత్రులు గోలీ అని పిలుస్తారు’
‘మీరు టెలిఫోన్ చేయడానికి వచ్చారనుకున్నాను’ డోనాల్డ్ చెప్పాడు.
‘అవును. జోని గేరేజి గురించి అడిగి ఫోన్ చేస్తాను’ చెప్పి లేచి జోతో మాట్లాడి, మూల ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్లి ఫోన్‌లో మాట్లాడి తల ఊపాడు.
అతన్ని వదిలేసి వెళ్లిపోతే? అన్న ఆలోచన డోనాల్డ్‌కి వచ్చింది. జో చిప్స్, సాసేజెస్, రెండు కప్పుల టీతో వచ్చాడు. గోలీ చెప్పిన ఓ విషయం తనిఖీ చేయాలనుకుని డోనాల్డ్ జోని అడిగాడు.
‘మీ దగ్గర ఈవెనింగ్ పేపర్ ఉందా?’
‘రేసుల ఫలితాల కోసమా? ఓ డ్రైవర్ ఈవెనింగ్ పేపర్ని తీసుకొచ్చాడు’ జో అతనికి ఆ పేపర్ని తెచ్చిచ్చాడు.
దాన్ని జాగ్రత్తగా చదివి మడిచాడు. ‘గోలైట్లీ నిజంగా ఫోన్ చేస్తున్నాడా? లేక అలా నటిస్తున్నాడా?’ ఈల ఆపి టీని చప్పరించాడు.
గోలైట్లీ చేతులు రుద్దుకుంటూ నవ్వుతూ వచ్చి చెప్పాడు.
‘సాసేజ్ అండ్ చిప్స్ నాకిష్టం. రెండు గేరేజెస్‌కి ఫోన్ చేస్తే, రెండో వాడు వచ్చి నా కారుని తీసుకెళ్తానని చెప్పాడు. ఈ రాత్రే పని పూర్తి చేస్తానని అన్నాడు. మీతోపాటు ఫోకెస్టోన్ దాకా వస్తాను’
‘అక్కడ మీరు హోటల్‌లో ఉంటారా?’ డోనాల్డ్ ప్రశ్నించాడు.
‘కాదు. నాకో మిత్రుడు ఉన్నాడు’
‘లిటిల్ హేంప్టన్‌లో బంధువుల్లానా?’
‘ఈమె లేడీ ఫ్రెండ్. సేల్స్‌మేన్ ప్రతీ నౌకాశ్రయంలో ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉండే నావికుడి లాంటివాడు. నిజానికి నేను ఫోకెస్టోన్‌కి ఈ రాత్రి వెళ్లడానికి కారణం అదే. ఇంగ్లీష్ ఛానల్ దాటాక అక్కడ మీకో గర్ల్‌ఫ్రెండ్ ఉందా? నేను ఎక్కువగా మాట్లాడుతూంటాను’ గోలైట్లీ చెప్పాడు.
‘నిన్ను నాతో తీసుకెళ్లడం లేదు..’ డోనాల్డ్ చెప్పాడు.
‘నన్ను తీసుకెళ్లడం లేదా?’ అతని చేతిలోని కప్పు కొద్దిగా వణికింది.
‘నేను ఇన్‌వాల్వ్ కాదల్చుకోలేదు’
‘అంటే?’ గోలైట్లీ అడిగాడు.
‘మీరు చెప్పినవన్నీ అబద్ధాలు. మీరు కమర్షియల్ ట్రావెలర్ అని, రేపు ముఖ్యమైన అపాయింట్‌మెంట్ ఉందని చెప్పారు. శాంపుల్స్ లేకుండా సేల్స్‌మేన్ తన పనిని ఎలా చేయగలడు? మీ శాంపుల్స్ కారులో ఉన్నాయి. వాటిని తీసుకుని బయలుదేరే ఆసక్తి మీలో లేదు’
‘రేపు నాకు శాంపుల్స్ అవసరం లేదు’
‘శాంపుల్స్ సంగతి అలా ఉంచండి. మీరు సేల్స్‌మేన్‌లాగా నాకు తోచడం లేదు. అసలు మీకు కారే ఉందనుకోను. మీ కారు నెంబర్ ఎంత?’ డోనాల్డ్ ప్రశ్నించాడు.
‘ఏకెటి 113 హెచ్’
‘మేక్?’
‘ట్రయంఫ్ హెరాల్డ్’
‘రుజువు చేయండి. మీ విజిటింగ్ కార్డు చూపించండి’
‘నా దగ్గర విజిటింగ్ కార్డులు లేవు’
‘విజిటింగ్ కార్డు లేని కమర్షియల్ ట్రావెలరే ఇంగ్లండ్‌లో ఉండరు’
‘సరే. నేను నిజం చెప్పలేదు. అయినా ఫోకెస్టోన్‌కి వెళ్లాలి. నాకు లిఫ్ట్ కావాలి’
సరిగ్గా ఆ మాట వినగానే డోనాల్డ్ లేచి బయటికి వెళ్లాలని అనుకున్నాడు. కానీ గోలైట్లీ ప్రవర్తన వెంటనే అతని మనసుని మార్చింది.
‘సరే. పదండి’ చెప్పాడు.
‘నన్ను తీసుకెళ్తున్నారా?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘మీకు చెవుడా?’
గోలైట్లీ మారు మాట్లాడలేదు. బిల్లు చెల్లించి వౌనంగా డోనాల్డ్ వెనక కారు దగ్గరికి నడిచాడు. అతని మొహం కొద్దిగా పాలిపోయింది. కారు కదిలాక డోనాల్డ్ అడిగాడు.
‘మీరెవరో, ఏం చేస్తున్నారో నిజం చెప్పండి. మీ బూట్లు, వాటి మీద బురద రోడ్డు మీద నడవడం వల్ల అంటినట్లు లేదు. పొలంలో నడవడం వల్లో, పరిగెత్తడం వల్లో అంటిన బురద అది’
‘అది బురద సందు’
డోనాల్డ్ ఓసారి తన కోటు జేబు మీద చేతిని వేసి తడిమి తర్వాత చెప్పాడు.
‘మిసెస్ ఫోర్డ్ హత్య చేయబడ్డ ఆష్‌లీ దగ్గర మిమ్మల్ని పికప్ చేశాను. సేల్స్‌మేన్ అని అబద్ధం ఆడారు. మీరు నాకు ఆ హత్య గురించి చెప్పడం విచిత్రంగా ఉంది. దాని గురించి అసలు మీకెలా తెలిసింది?’
‘పేపర్లో చదివాను’
‘నేనూ కెఫేలో ఈవెనింగ్ ఎడిషన్ చదివాను. అందులో దాని గురించి రాయలేదు. రాత్రి ఏడుకి హత్య జరిగితే ఎలా రాస్తారు? మీకెలా తెలిసింది? నేను రాత్రి పది గంటల న్యూస్‌లో కారు రేడియోలో దాని గురించి విన్నా కాబట్టి నాకు తెలిసింది’
‘మీలాగే నా కారు రేడియోలో వినుంటారు’
‘అబద్ధం. అది విన్న ఒకటి రెండు నిమిషాల్లోనే మిమ్మల్ని పికప్ చేశాను. పైగా రేడియోలో ఆవిడని హాల్లో చంపారని చెప్పలేదు. అది మీకెలా తెలిసింది?’
నిశ్శబ్దం.
కారు హెడ్ లైట్స్‌లో ఫోకెస్టోన్ బైపాస్‌కి వెళ్లే ఏష్‌ఫర్డ్ బోర్డ్ కనిపించింది. కారుని ఎడమవైపు తిప్పాడు. అతను చెప్పిందంతా అబద్ధం అని తను రుజువు చేశానని డోనాల్డ్ మనసులో గర్వంగా అనుకున్నాడు.
‘నేనో పొరపాటు చేసినట్లున్నాను’ గోలైట్లీ నెమ్మదిగా చెప్పాడు.
‘అవును’ డోనాల్డ్ నోట్లోంచి మళ్లీ ఆ మెలొడీ ఈల రూపంలో వచ్చింది.
‘సరే. నేను ఆ వృద్ధురాలిని చంపాను అనుకుందాం. జోస్ రెస్టారెంట్ నించి పోలీసులకి ఫోన్ చేసి, నాకు చెప్పిన కారణాలు వాళ్లకీ చెప్పి ఎందుకు నా మీద ఫిర్యాదు చేయలేదు’ గోలైట్లీ అడిగాడు.
‘ఎందుకంటే. నాకు ఇంగ్లండ్ అంటే అసహ్యం. ఎప్పుడు చూసినా మంచు తెర. మురికి వాతావరణం. అసహ్యమైన కెఫే. నీలాంటి మనుషులు అంటే నాకు ఇష్టం లేదు. నేను పోలీసులకి ఫోన్ చేస్తే స్టేట్‌మెంట్ ఇవ్వాలి. సాక్షిగా ఆగిపోవాలి. నేను కొన్ని రోజులు లేదా వారాలపాటు ఇంగ్లండ్‌ని వదిలి వెళ్లలేను. అందువల్ల నువ్వు హంతకుడవైతే నాకేంటి?’
‘మనిద్దరం ఒకరికొకరు పరిచయం కాలేదు కదా? మీకు నా పేరు తెలుసు. కాని మీ పేరు చెప్పలేదు. ఐనా అది నాకు తెలుసు’ గోలైట్లీ చెప్పాడు.
‘ఏమిటి?’
‘డోనాల్డ్ గ్రాంట్. అవునా?’
‘నువు నా కారు లాగ్‌బుక్‌ని దొంగతనంగా చూసావు’ డోనాల్డ్ సగం నిజం కోపం, సగం తెచ్చి పెట్టుకున్న కోపంతో చెప్పాడు.
‘లేదు. చూడలేదు. మిసెస్ ఫోర్డ్ అనే వృద్ధురాలి గురించి మీకో చిన్న కథ చెప్తాను. ఆవిడ చాలా మంచావిడ. కొడుకులు లేరు. కూతుళ్లు లేరు. కాబట్టి ఆవిడని పట్టించుకునే వాళ్లే లేరు. కానీ డబ్బుని అంటిపెట్టుకుని జీవించేది’
డోనాల్డ్ ఏక్స్‌లేటర్‌ని నొక్కాడు. అతను సాధారణంగా కారుని వేగంగా పోనివ్వడు. కానీ డెబ్బై నించి ఎనభై తొంభై దాకా తను వినే కంఠం నించి దూరం అవ్వాలా అన్నట్లుగా కారు వేగాన్ని పెంచాడు. కానీ ఆ కంఠం సూదిలా అతని ఒంట్లో గుచ్చుకుంటున్నట్లుగా వినిపించింది.
‘ఐనా ఆవిడ మేనల్లుడు మిసెస్ ఫోర్డ్ బాగోగులు చూసుకునేవాడు. ‘నేను పోయాక మొత్తం నీదవుతుంది’ అని ఎప్పుడైనా ఓ ఐదు పౌండ్ల నోటుని అతనికి ఇస్తూండేది అనుకుంటాను. డబ్బుకి బాధపడే ఆ యువకుడు పెద్దగా ఆర్జన లేని ఫ్రీలాన్స్ రైటర్. దాంతో ఓ వర్షపు సాయంత్రం మిసెస్ ఫోర్డ్ హత్య చేయబడింది. అది దొంగల పని అనిపించేలా సామానంతా చిందరవందర చేయబడింది. కానీ అది దొంగల పని కాదు’ చిన్నగా నిట్టూర్చి పూర్తి చేసాడు.
‘ఆ మేనల్లుడి పేరు నేను నీకు చెప్పక్కరలేదనుకుంటాను’
డోనాల్డ్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
‘మేము మీ ఫ్లాట్ బెల్ కొట్టడానికి మునుపే నీ గురించి చాలా తెలుసుకున్నాం. నీ రూమ్ మేట్ ఛార్లెస్ నువ్వు అకస్మాత్తుగా విదేశాల్లో గడపడానికి వెళ్తున్నట్టు చెప్పాడు. మేము నీ కోసం వెదుకుతున్నాం. ఏ రోడ్డు తీసుకుంటావో మాకు తెలీదు. డిటెక్టివ్ సార్జెంట్ గోలైట్లీ నిన్ను ప్రశ్నించడానికి స్టేషన్‌కి తీసుకెళ్లొచ్చు. కానీ నీ దగ్గర రివాల్వర్ ఉందా?’
డోనాల్డ్ వేళ్లు కోటు జేబు లోపలి రివాల్వర్‌ని బయటి నించే తడిమాయి. వారి కారు వెనుక వచ్చే పోలీస్ కారు లైట్లు ఆరి వెలుగుతున్నాయి.
‘నేను దోషినని ఎలా కనుక్కున్నావు?’ డోనాల్డ్ బలహీనంగా అడిగాడు.
‘నువ్వు ఒకటి రెండు తప్పులు చేయబట్టి. నాలా కావాలని కాదు. మిసెస్ ఫోర్డ్ ఏడు గంటల ప్రాంతంలో చంపబడిందని చెప్పావు. అది నిజమే. కానీ రేడియోలో ఆ విషయం చెప్పలేదు’ గోలైట్లీ చెప్పాడు.
‘మాటలు గాల్లో కలిసిపోయాయి. నేనా మాట అనలేదని చెప్తాను’ డోనాల్డ్ చెప్పాడు.
‘ఇంకోటి. మిసెస్ ఫోర్డ్ ఇంట్లోంచి నువ్వు బయటికి రావడం ఓ సాక్షి చూశాడు. నువ్వు అతనికి తెలీదు కాని నిన్ను వర్ణించాడు. ఇంకోసారి చూస్తే గుర్తు పడతానన్నాడు’
‘ఒకే సాక్షి! మంచి లాయర్ ఉంటే...’
‘నువ్వు ఈల వేస్తున్నావు. ఇది నీ ఫేవరేట్ పాట కదా? ఆ సాక్షి దీన్ని స్పష్టంగా విన్నాడు’
గోలైట్లీ ఆ ఈల పాటని ట్యూన్‌తో పాడాడు.
‘కేరీ ది మేన్ హూ వజ్ బార్న్ టు బి కింగ్ ఓవర్ ది సీ టు స్కై’
తక్షణం రెండు సంఘటనలు సంభవించాయి.
వెనక వచ్చే పోలీస్ కారు సరిగ్గా వారి కారు పక్కకి వచ్చింది. దాన్నించి స్పాట్ లైట్ కారు మీద పడటమే కాక సైరన్ మోగసాగింది. రివాల్వర్ కోసం జేబులోకి వెళ్తున్న డోనాల్డ్ కుడిచేతిని గమనించిన గోలైట్లీ స్టీరింగ్ వీల్ మీదకి పడ్డాడు. డోనాల్డ్ తను ఎడమ చేతితో కారుని కంట్రోల్ చేయలేనని గ్రహించాడు. పెద్ద శబ్దం. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.
* * *
గోలైట్లీకి హాస్పిటల్‌లో మెలకువ వచ్చింది. సూపరింటెండెంట్ అతని వంక కోపంగా చూస్తూ చెప్పాడు.
‘నువ్వు మూర్ఖుడివి గోలీ. నువ్వు జీవించడం అదృష్టం. డోనాల్డ్ గ్రాంట్ పోయాడు’
‘ఎలా?’ గోలైట్లీ ప్రశ్నించాడు.
‘కారు ముందు అద్దం ముక్క మెడలో గుచ్చుకుని. నువ్వు అతని కారులోకి ఎక్కాల్సిన అవసరం లేదు. అతను ఏ రోడ్డులో ఉన్నాడో చెప్తే సరిపోయేది. మేం వచ్చేసేవాళ్లం’
‘ఎస్ సర్. అప్పుడది మంచి పథకం అనిపించింది’
‘మాకు ఫోన్ చేశాక నువ్వు ఆ కెఫేలోంచి అతనితోపాటు ఎందుకు వెళ్లావు?’
‘అతను హంతకుడని నాకు తెలీనట్లు ప్రవర్తించాను. అప్పుడు అతన్ని పట్టుకోవడం తేలిక అనుకున్నాను. కానీ నేను ఆడిన ఓ అబద్ధాన్ని అతను పసిగట్టాడు.’
‘ఏం పొరపాటు చేసావు?’
గోలైట్లీ హాల్‌లో హత్య జరిగిందని చెప్పిన సంగతి వివరించాక చెప్పాడు.
‘అతను కూడా ఆవిడ చనిపోయిన టైం విషయంలో ఓ పొరపాటు చేశాడు. దాన్ని అతను కోర్ట్‌లో ఒప్పుకునేవాడు కాదు. కానీ అతని ఈలపాటని గుర్తు పట్టిన ఓ సాక్షి ఉన్నాడని చెప్పాక భయపడ్డాడు’
‘కానీ అలాంటి సాక్షులు లేరుగా?’ సూపరింటెండెంట్ అడిగాడు.
‘అవును. లేరు సర్. ఆ విషయం అతనికి తెలీదు. అతనికి ఆ ఫ్రెంచ్ పాట ఇష్టం. కారులో దానే్న పాడాడు. నాకు ఈల ఇష్టం ఉండదు. చెడ్డ అలవాటు, అమర్యాద. ఒక్కోసారి కష్టాలని కూడా తెచ్చిపెడుతుంది’ గోలైట్లీ చెప్పి నవ్వబోయి గాయం తాలూకు బాధకి మొహం ముడిచాడు.
*
(జూలియన్ సైమన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి