ఉత్తరాయణం

దీనావస్థలో గ్రంథాలయ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్నా, ఒక భాష స్థితిగతులు, వర్తమాన పరిస్థితులు భవిష్యత్ తరాలకు చరిత్రగా అందించాలన్నా అది గ్రంథాల ద్వారా మాత్రమే సాధ్యం. ఎన్నో వేల, లక్షల గ్రంథాలను భద్రపరిచి ప్రజలను విజ్ఞానవంతులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దేదే గ్రంథాలయ వ్యవస్థ. బాల సాహిత్యం నుండి అంతర్జాతీయ వార్తలను విశే్లషణాత్మకంగా ప్రజలకు అందించి మానవ మనుగడను ఉన్నతీకరించే స్థాయిలో తీర్చిదిద్దే దేవాలయం గ్రంథాలయం. సాధారణ పాఠకుల నుండి విశ్వవిద్యాలయ పరిశోధకుల వరకు అవసరమైన సమాచారాన్నంతా ఒక్కచోట భద్రపరిచి సామాజిక సేవ అందించే గొప్ప సాధనం గ్రంథాలయం వ్యవస్థ. అంతటి విశిష్టమైన గ్రంథాలయ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక నిర్వీర్యమైన దిశలో కొట్టుమిట్టాడుతోంది.
స్థానిక సంస్థలైన పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ప్రజల నుండి ఇంటి పన్నుతో కలిపి ముక్కుపిండి వసూలు చేస్తున్న గ్రంథాలయ సెస్సును విడుదల చెయ్యడంలో మాత్రం వెనుకంజ వేస్తున్నాయి. దీంతో గ్రంథాలయ వ్యవస్థ ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతోంది. తమ ఉద్యోగులకు సక్రమంగా జీతభత్యాలు ఇవ్వలేని స్థితిలో నేటి గ్రంథాలయాలున్నాయి. ఇక పుస్తక ప్రచురణ కర్తలకు రచయితలు నుండి వాటిని కొనే పరిస్థితి, గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు అందించే అవకాశం ఎక్కడుంటుంది?
రచయితలు, కవుల నుంచి పుస్తకాలను కొనుగోలు చేసి పాఠకులకు అందించవలసిన గ్రంథాలయ వ్యవస్థ చాలాకాలంగా వెనుకంజలో ఉంది. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మొక్కుబడిగా నిర్వహించడం తప్పించి, కొత్త పుస్తకాలను గ్రంథాలయాలకు రప్పించడంలో అధికారులు, పాలకులు విఫలమవుతున్నారు. గత ఏడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో పుస్తక ప్రచురణకర్తల నుండి, రచయితల నుండి కొత్త పుస్తకాలు కొనుగోలు చేపట్టవలసిన ప్రక్రియను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చేపట్టకపోవడంతో ప్రచురణ రంగంలో అభివృద్ధి కుంటుపడింది. ప్రచురణకర్తల వద్ద, రచయితల వద్ద పుస్తకాలు చెదలు పట్టి పాడైపోతున్న దుస్థితి దాపురించింది.
గతంలో ప్రతి రచయిత తమ రచనలను వెయ్యి ప్రతులకు పైగా ప్రచురించుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రంథాలయ వ్యవస్థ ద్వారా అవి అమ్ముడైపోయేవి. కాని నేడు కేవలం రెండువందల నుండి ఐదు వందల ప్రతుల లోపే ప్రచురించుకొని ఉచితంగా పంచుకునే దుస్థితిలో నేటి రచయితలు ఉండడం దురదృష్టకరం. గతంలో కలకత్తాలోని రాజారామమోహన రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఏటా ప్రతి రాష్ట్రంలో గ్రంథాలను ప్రచురణకర్తలు, రచయితల నుండి 350 ప్రతుల వరకు పుస్తకాలు కొనుగోలు చేసేది. సంబంధిత రాష్ట్ర గ్రంథాలయ సంస్థలు ద్వారా కొనుగోళ్లు జరిగేవి. జిల్లా గ్రంథాలయ సంస్థలు సైతం నేరుగా పుస్తకాలను కొనుగోలు చేసేవి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ను నియమించనందున పుస్తకాల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. రచయితలు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పుస్తకాలు ప్రచురించుకుంటుంటే ఎలక్ట్రానిక్ మీడియా విజృంభణతో వాటిని కొనే పరిస్థితి లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ద్వారా, గ్రంథాలయ వ్యవస్థ ద్వారా ప్రోత్సాహకాలు అందడం లేదు. ప్రభుత్వాలను నిలదీయడానికి బదులు రచయితల సంఘాలు, ప్రచురణకర్తలు నీరసపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నవ్యాంధ్రలో ఆవిర్భవించిన ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేయాలని సంకల్పించింది. స్టేట్ సెంట్రల్ లైబ్రరీని మంగళగిరికి తరలించాక పుస్తకాల కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వాన్ని ఏపీ రచయితల సంఘం కోరింది. రాష్ట్ర ప్రచురణల రిజిస్ట్రారు కార్యాలయానికి పలుసార్లు వెళ్లి, ఈ విషయమై విన్నవించడం జరిగింది. గత ప్రభుత్వం తన పదవీకాలం ముగియడానికి కొద్ది నెలల ముందు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ను నియమించి చేతులు దులుపుకొంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పుస్తకాల కొనుగోలు ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వమైనా గ్రంథాలయ వ్యవస్థపై దృష్టి సారించాలి. గ్రంథాలయ వ్యవస్థను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణలో పుస్తకాల కొనుగోళ్ల ప్రక్రియను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. రచయితలు, ప్రచురణకర్తలను ఆదుకొనేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాల్సి ఉంది. గ్రంథాలయ వ్యవస్థను కాపాడడం ద్వారా తెలుగు భాష మనుగడ సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించాలి. పరిస్థితులు ఇలాగే ఉంటే- మరో గ్రంథాలయ ఉద్యమం అవసరమని రచయితలు, విద్యావంతులు, మేధావులు ముందుకు సాగాలి.
-చలపాక ప్రకాష్ 92474 75975
సహకార స్ఫూర్తికి విఘాతం..
తెలంగాణలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. రైతులకు ఎరువులను, విత్తనాలను ఇతర సబ్సిడీ పరికరాలను ప్రభుత్వం ప్రభుత్వ సహకార సంఘాల ద్వారా సరఫరా చేయడం ఆనవాయితీ. రైతులు ప్రభుత్వ సహకార సంఘాల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక సహకార సంఘం సరఫరా చేసిన యూరియా పూర్తిగా గడ్డకట్టి గట్టి రాయిలాగ మారడంతో దానిని మరో బలమైన బండరాతితో కొడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. ఈనెల 5న ఒకచోట రైతు క్యూలో నిలబడి స్పృహతప్పి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. చాలాచోట్ల ఎరువుల కొరత వుందని, స్టాకు రాలేదని సహకార సంఘాల అధికారులు చేతులు పైకెత్తేసి రైతులను వెనక్కి పంపిస్తున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో సహకార సంఘాల స్ఫూర్తి దెబ్బతిన్నదని మరోసారి నిరూపితమైంది. ఒకరికోసం అందరూ.. అందరికోసం ఒక్కరు.. అనే సహకార లక్ష్యం ఎప్పుడో గాలికెళ్లిన విషయం గురించి వేరే చెప్పవలసిన పనిలేదు.
ప్రజలకు బ్యాంకులంటే ఏమిటో తెలియని రోజుల్లోనే ప్రజలు సంఘ జీవనాన్ని మెరుగుపరుచుకొనేలా సహకార సంఘాలు ఆవిర్భవించాయి. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలోనే 1905లో ఈ సంఘాల ప్రాధాన్యతను గుర్తించి మొట్టమొదటిసారి సహకార చట్టం ఏర్పడింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో సహకార సంఘాలు కూడా ఉద్యమ స్థాయిలో అభివృద్ధి చెందాలని మహాత్మాగాంధీ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకు అందరు ప్రధానులు సహకార సంఘాల ప్రాధాన్యతను సందర్భం వచ్చిన ప్రతిసారీ నొక్కివక్కాణిస్తూ స్ఫూర్తినిచ్చే పలుకులు చెబుతున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో ఈ సహకార సంఘాలు పక్కదోవ పట్టడం ఆందోళన కలిగించే పరిణామం. రైతుల శ్రేయస్సును గురించి పూర్తిస్థాయిలో ఆచరణలో పట్టే నాయకులు నేడు లేనందున సహకార సంఘాలు స్వాహా సంఘాలుగా మారాయి. రైతుబంధు పథకంతో సేవ చేయాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సహకార సంఘాలను బలోపేతం చేయవలసి వుంది. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాలలో సహకార సంఘాలకు ఎన్నికలు జరగకపోవడం బాధాకరం. ఇకనైనా పాలకులు మేల్కొని సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపించి, రైతులకు సేవచేసే సంఘాలుగా వీటిని తీర్చిదిద్దాలి.
- తిప్పినేని రామదాసప్పనాయుడు 99898 18212