ఉత్తరాయణం

పదవులకే కళంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణంలో పీకలదాకా కూరుకుపోయి జైల్లో ఊచలు లెక్కబెట్టే దయనీయ పరిస్థితికి చేరుకోవడం దేశవ్యాప్తంగా పెనుసంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ‘కంచే చేను మేస్తే’ ఇక అడ్డుచెప్పేది ఎవరు? ఆపేది ఎవరు? అన్న చందాన ఈ మాజీ ఆర్థికమంత్రి తన కుమారుడికి పుత్ర వాత్సల్యంతో ఏకంగా 300 కోట్లు ముడుపులు విదేశాల్లోని ‘డొల్ల’ కంపెనీల ద్వారా అందేలా పరోక్షంగా సహకారం అందించి ఈ అవినీతి పాపంలో పాలుపంచుకోవడం ఆయన పదవులకే కళంకం తెచ్చి పెట్టింది. ఈ ముడుపుల కుంభకోణం చిదంబరం కీర్తి ప్రతిష్టలను మసకబారేలా అధఃపాతాళానికి పడిపోయేలా చేసింది. దేశానికి ఆర్థికమంత్రిగా అత్యంత గౌరవప్రదమైన హోదాలో వుంటూ కాసుల కోసం కక్కుర్తిపడి కొన్ని కంపెనీలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించేలా చేసి అక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటైన వ్యవహారం. డబ్బు కోసం నానా గడ్డి తినే నైజానికి ఒక నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన. తండ్రీకొడుకులు ఎంతగా అవినీతి మరక అంటించుకున్నారో మనకు బాగా బోధపడుతున్నది. అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో మలేసియా, బ్రిటన్, స్పెయిన్ వంటి దేశాల్లో ఆస్తులు కూడబెట్టడంతో మన దేశం పరువు పోయింది. ప్రజానీకానికి జవాబుదారీగా ఉండాల్సిన ఈ పెద్దమనిషి భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చేలా, తలవంపులు తీసుకువచ్చేలా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ. ఇలాంటి అవినీతిపరులను మన న్యాయవ్యవస్థ చూసీ చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది మొదటికే మోసం వస్తుంది. అత్యంత గౌరవప్రదమైన మన న్యాయ వ్యవస్థ దేశానికి చీడపురుగుల్లా తయారైన అవినీతి పరులపై కొరడా ఝుళిపించాల్సిన ఆవశ్యకత ఎంతయినా వుంది. ఇప్పటికయినా మన రాజకీయ నాయకులు అవినీతికి ఆమడ దూరంలో వుంటూ ప్రజలకు మంచి పాలన అందిస్తే అది ఈ దేశ ప్రగతికి, అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.
-బుగ్గన మధుసూదన రెడ్డి, బేతంచెర్ల
అనర్హులకు అందలం వద్దు
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ పాఠశాలలకు, ఆదర్శ పాఠశాలలకు ప్రిన్సిపాళ్లను ఎంపిక చేసేందుకు 2018లో డిఎస్సీ జరిగింది. అర్హుల జాబితా మేరకు డిఎస్‌సి నిబంధనలు ప్రకారం ప్రతి అభ్యర్థి పూర్వపు సర్వీసు, అర్హత కలిగిన వేతన స్కేళ్ళు కల్గి వుండాలి. ఇలా అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేస్తే పాఠశాలల నిర్వహణపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఇటీవల ప్రిన్సిపాల్ అభ్యర్థులలో కొందరికి తగిన అర్హతలు లేవు. కొంతమందికి మేలుచేయడం కోసం ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్‌లో ‘వేతన స్కేళ్ల నిబంధన’ తొలగించి పోస్టులను కట్టబెట్టాలనే విద్యాశాఖ ఆలోచన అవినీతికి అవకాశం కల్గించినట్టు వుంది. అర్హులు లేకపోతే తదుపరి జాబితాలో ఉన్న అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయాలి కానీ పోస్టుకు అవసరమైన ముఖ్యమైన నిబంధనల తొలగింపు ప్రతిపాదన విడ్డూరం. సర్వీసుపరంగా అనుభవం ఉన్న వారు మాత్రమే ప్రిన్సిపాల్స్ పోస్టులకు ఎంపిక చేసి, వారిని మెరిట్ జాబితాలో ఉంచాలి. 2013 మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ భర్తీలో అనర్హులను ఎంపిక చేసారు. కనీసం ఇంటర్వ్యూతో కూడిన మార్కుల జాబితా కూడా లేదు. ప్రస్తుతం నిబంధనలు మార్పు పేరుతో అనర్హులను ఎంపిక చేస్తే విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. దరఖాస్తు చేసినప్పుటు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని తొలగించి వారి స్థానంలో మెరిట్ లిస్ట్‌లో అన్ని అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేయాలి. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ పోస్టుల ఎంపికను పారదర్శకంగా జరిపి సకాలంలో పోస్టింగులు ఇవ్వాలి.
-బి.సురేష్, శ్రీకాకుళం