ఉత్తరాయణం

సీఆర్‌ఎస్ ఉద్యోగులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1991-92లో నూతన ఆర్థిక విధానాల పర్యవసానంగా మూసివేసిన కేంద్ర ప్రభుత్వ కర్మాగారాల ఉద్యోగులను 2002లో బలవంతంగా పదవీ విరమణ (సీఆర్‌ఎస్) చేయించి 1987లో అప్పటి వేతనాల ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలను చెల్లించారు. ఉద్యోగ సంఘాలు అనేక విన్నపాలు చేసిన మీదట మూసివేసిన పద్దెనిమిది కర్మాగారాలు తిరిగి పునరుద్ధరణకు నోచుకుంటే ఉద్యోగులకు 1992, 1997లో నిలిపివేసిన వేతన సవరణలను జరిపి ఆమేరకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రతిపాదన చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రతిపాదనను ఆ తర్వాత ఎన్‌డీఏ సర్కారు తుంగలోకి తొక్కడం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. గత జూలైలో మూతపడిన ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులు కేంద్ర ఎరువులు-రసాయనాల మంత్రి సదానంద గౌడ్‌ను కలవగా, 1992 వేతన సవరణ ప్రకారం బకాయిలు చెల్లించగలమని ఆయన నోటి మాటగా వాగ్దానం చేశారు. సహ ఉద్యోగులు మాత్రం పూర్తి వేతనాలు పొందుతున్నారు. పునరుద్ధరణను పూర్తిచేసుకున్నా ఖాయిలాపడిన ఎఫ్.సి.ఐ.ఎల్. తదితర సంస్థలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 1992, 1997 వేతనాలపై బకాయిలు చెల్లించినట్లయితే న్యాయ సమ్మతంగాను, ధర్మబద్ధంగాను ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదన అర్థం అవుతుందని ఇంకా ఆశతో రిటైరైన ఉద్యోగులు జీవనయానం సాగిస్తున్నారు.
- ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్
వామపక్షాల వింత వైఖరి
పాకిస్తాన్ తీవ్రవాదులకు, మన దేశంలోని వేర్పాటువాదులకు, కుహనా లౌకిక వాదులకు ఆయుధంగా మారిన 370 ఆర్టికల్‌ను మోదీ ప్రభుత్వం రద్దుచేయడంపై- కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేస్తున్న దుష్ప్రచారాలను స్వాభిమానం గల ప్రతి భారతీయుడు తీవ్రంగా ఖండించాలి. 370వ అధికరణం రద్దుతో కశ్మీర్‌కు చీకటి రోజులేనని విమర్శిస్తున్నాయి మన వామపక్షాలు. 1990లో లక్షల మంది హిందువులను కశ్మీర్ లోయ నుంచి తరిమివేయడమేగాక అత్యాచారాలకు, విధ్వంసక చర్యలకు, హత్యాకాండలకు తీవ్రవాదులు పాల్పడినప్పుడు ఖండించని వామపక్షాలకు 370 ఆర్టికల్ రద్దుపై విమర్శించే నైతిక హక్కులేదు. 370 ఆర్టికల్ రద్దుని సాహసోపేతంగా అమలు చేసిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు అభినందనీయులు.
-వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం
అయ్యో.. కాంగ్రెస్..!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో తాను కొనసాగేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో- చివరికి గతి లేక సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించడం సహజ పరిణామమే. 1857లో తొలి స్వాతంత్య్ర సమరం ఆరంభమైనది మొదలు ప్రజల ఆకాంక్షను తొక్కిపెట్టి, అరిచే వారిని బుజ్జగించడానికి అన్నట్లు- 1895లో హ్యూం అనే ఆంగ్లేయుడు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ‘లాల్ బాల్ పాల్’ (లాలాలజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్) ఆ సంస్థ నుంచే స్వాతంత్య్రం కోసం తొలిసారి నినదించారు. 1930 నుంచి గాంధీ అహింసామార్గాన ఉద్యమానికి సారథ్యం వహించారు. తొలి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, ఆ తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, అటు పిమ్మట సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చలాయించారు. ఇపుడు పార్టీ అధ్యక్ష పదవిలో ‘నేనుండను.. నేనుండను..’ అని రాహుల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోనియా నేతృత్వమే ఆ పార్టీకి దిక్కు అయింది. ఎవరు ఏర్పరచిన కాలుష్యం వారే తుడవాలి గదా మరి.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
ధార్మిక కార్యక్రమం అంటే ఏమిటి?
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సులు నడుపుతూ, అనేక సత్రాలను నిర్మించి భక్తులకు తక్కువ ధరకు వాటిని అద్దెకు యివ్వడం, దర్శనం త్వరగా జరిపించేందుకు అనేక నూతన మార్గాలు అనే్వషించడం వగైరా కార్యక్రమాలన్నీ ధార్మిక నియమావళి కిందకే వస్తాయా? కొండపైన జన సమూహానికి సౌఖ్యంగా వుండేందుకు గత ప్రభుత్వం 650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలబెట్టిన ‘గరుడ వారధి’ నిర్మాణం ధార్మిక నియమావళికి విరుద్ధం అని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం అన్యాయం. గత నిర్ణయాలు, నిర్మాణాలలో లోపాలు వెతకటమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కారుకు తక్షణ కర్తవ్యమా? ప్రస్తుత పాలకుల తీరు చూస్తుంటే లేనిదానిపై అనవసర రాద్ధాంతాలు చేయడమే ధ్యేయంగా కనిపిస్తోంది.
-పెంటకోట అప్పలనాయుడు,విశాఖ
సత్వర తీర్పులు అవసరం
అధికారంలో ఉన్నపుడు అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన నేతలపై కేసులు నమోదు చేయడానికి దశాబ్దాల తరబడి జాప్యం జరగడం వాంఛనీయం కాదు. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరంను అరెస్టు చేయడంపై ఇపుడు మీడియాలో నానా హడావుడి జరుగుతోంది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మ్యాక్స్ ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆర్థిక నేరాలు జరిగినట్టు సీబీఐ కేసులు నమోదు చేసింది. అక్రమ లావాదేవీల్లో చిదంబరానికి భారీగా ముడుపులు అందినట్టు ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాధారాలను సేకరించడానికి, కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడానికి ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. ఈ కేసులపై కోర్టులో వాదోపవాదాలు జరగడానికి, తుది తీర్పు రావడానికి ఎనే్నళ్లు పడుతుందో చెప్పలేం. నిందితుడిని అరెస్టు చేసినంత మాత్రాన అవినీతి వ్యవహారాలపై ఉక్కుపాదం మోపినట్లు అధికారంలో ఉన్న నేతలు గొప్పగా ప్రచారం చేసుకోవడం సరికాదు. చిదంబరం అరెస్టు వ్యవహారాన్ని కక్ష సాధింపుచర్యగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని అధికారంలో ఉన్న భాజపా నాయకులు అంటున్నారు. అయితే, చట్టం తన పని తాను చేసుకునేలా పరిస్థితులు లేకపోవడం వల్లే వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేతల అవినీతి కేసులను సత్వరం విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో తీర్పులను ప్రకటించాలి. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభావితం చేస్తున్నారనడానికి ఆస్కారం ఉండరాదు.
-కె.వౌనిక, కొమ్మాది (విశాఖ)