ఉత్తరాయణం

ఆ తీర్పు చరిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య సంఘటనలో కామోన్మాది ప్రవీణ్‌కు ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి చరిత్రాత్మక తీర్పును ఇవ్వడం అభినందనీయం. జూన్ 18న అర్ధరాత్రి సమయంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసిపాపను కామాంధుడు ప్రవీణ్ అత్యాచారం, హత్య చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కిరాతకంగా ప్రవర్తించిన ప్రవీణ్‌ను బహిరంగంగా ఉరితీయాలని రాష్టవ్య్రాప్తంగా ప్రజాసంఘాలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. చిన్నారి తల్లిదండ్రులు కూడా న్యాయపోరాటం చేశారు. నేరస్థుడి పక్షాన వాదించేది లేదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. 20 రోజుల లోపే పోలీసులు చార్జీషీట్ దాఖలుచేసి పోలీసుశాఖ గౌరవాన్ని పెంచారు. నలభై ఎనిమిది రోజులలోనే తీర్పు వెలువడడం పట్ల సర్వజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. కామోన్మాదులకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో విచారణ పూర్తిచేసుకున్న కేసుగా రికార్డు నమోదు చేసుకుంది. వరంగల్ పోలీసులు విచారణను వేగవంతం చేసి ‘శభాష్’ అనిపించుకున్నారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచింది. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలపై ఇలాంటి తీర్పులు మరెన్నో వెలువడాల్సిన అవసరం ఉంది. నిందితుడికి ఉరిశిక్ష విధించిన రోజే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
మధ్యంతర భృతిలో వివక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులందరికీ ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతిని విడుదల చేసింది. ఆర్థిక శాఖ ఉత్తర్వులు ప్రకారం జూలై నెల వేతనంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలను అందుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో రెగ్యులర్ సిబ్బందికి మధ్యంతర భృతి (ఐ.ఆర్) అమలు చేయకుండా వివక్షకు గురిచేయడం సరికాదు. మధ్యంతర భృతి అమలుకు సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి ఈ సిబ్బందికి తక్షణం ఐ.ఆర్‌ను వర్తింపచేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మోడల్ స్కూళ్ల సిబ్బందికి మధ్యంతర భృతి అమలుకు సంబంధించిన బడ్జెట్ విడుదల ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోపాటు డీఎస్సీ-2018లో భర్తీకాబోతున్న 900కు పైగా మోడల్ స్కూల్స్ సిబ్బందికి కావలసిన బడ్జెట్ కూడా విడుదల చేసి, ప్రతి నెలా జీతాలు అందజేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
-బి.సురేష్, శ్రీకాకుళం
‘సోమశిల’కు జలాలివ్వండి..
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాలలోని ఆల్మట్టి, నారాయణపూర్ తదితర జలాశయాలు పూర్తిగా నిండడంతో వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటితో పోటెత్తుతోంది. శ్రీశైలానికి వరద ఉధృతి అధికంగా ఉన్నందున ఆ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా నదికి మళ్లించగలిగితే, గత నాలుగేళ్లుగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లాకు ఎంతో మేలు జరుగుతుంది. సింహపురి వరప్రదాయిని అయిన సోమశిల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో కేవలం 2.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ జిల్లాలో మరో ముఖ్యమైనది కండలేరు జలాశయం. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 68 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. రెండు ప్రాజెక్టుల్లోనూ కనీసం డెడ్ స్టోరేజిలోనూ నీటిమట్టం కూడా లేదు. ఈ రెండు జలాశయాలను శ్రీశైలం వరద నీటితో నింపగలిగితే ఒకటి రెండు సంవత్సరాలపాటు నెల్లూరు జిల్లా ప్రజలకు ఎలాంటి నీటికొరత ఉండదు. శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పెన్నానదికి మళ్లించాలి. అక్కడి నుండి ఆ జలాలు నేరుగా సోమశిలకు వచ్చి చేరుతాయి.
- బి.రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూర్