ఉత్తరాయణం

న్యాయవ్యవస్థకు జవసత్వాలు ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జూన్ 18వ తేదీ నాటికి దేశంలో 3.5 కోట్లకు పైగా వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయి. సివిల్ కేసులు 89 లక్షలు, క్రిమినల్ కేసులు 2.6 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న సిబ్బంది, వౌలిక సదుపాయాలను అనుసరించి చూస్తే ఈ కేసులన్నింటినీ పరిష్కరించేందుకు అరవై సంవత్సరాలు పడుతుందని జాతీయ లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దేశంలో ఇన్ని కేసులు పెండింగ్‌లో ఉండటానికి కారణాలు అనేకం. కేసుల పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి లేకపోవటం, న్యాయమూర్తులు, ఉద్యోగుల కొరత, అధిక సంఖ్యలో వార్షిక సెలవులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కొన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి. వౌలిక సదుపాయాల కొరత, అసంఖ్యాకంగా భూసంబంధిత వివాదాలు, కోర్టులకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కొరవడటం వంటివి ఇతర కారణాలు. లోక్ అదాలత్‌ల్లో కొన్ని కేసులు పరిష్కారం అయ్యేందుకు అవకాశం వున్నా ఆ వ్యవస్థ వేళ్ళూనుకోలేదు. మన న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి విచారణ సాగడం, తీరుబడిగా తీర్పులు వెలువడటం రివాజే. కోర్టుల్లో పేరుకుపోయిన కేసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆందోళన వ్యక్తం చేయడం సబబుగా వుంది. కొనే్నళ్ళ కిందటి అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సభలో ఈ అంశంపై కన్నీళ్ళు పెట్టుకోగా, తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికపై భవనాల నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం చేపడతామని ప్రధానమంత్రి వాగ్దానం చేశారు. అయితే అప్పటినుండి ఈ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కొత్త కోర్టు భవనాల నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, డాక్యుమెంట్ల డిజిటలీకరణ, ప్రాంతీయ భాషలలోనే అభియోగ పత్రాల, సాక్ష్యుల వాంగ్మూలం నమోదు వంటి చర్యలను వెంటనే చేపడతామని ప్రధాని చేసిన వాగ్దానం ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు అయిదేళ్ల కాలం పట్టింది. మహిళలపై అత్యాచారాల విషయంలో సత్వర విచారణకు జిల్లాకొక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ వాగ్దానం కూడా అమలుకు నోచుకోలేదు. న్యాయవ్యవస్థకు వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు అరకొర నిధులు కేటాయించడం కూడా ఈ సమస్య తీవ్రతరం అయ్యేందుకు దోహదపడుతోంది. మన దేశంలో సగటున విచారణ పూర్తయ్యి, నిందితులకు శిక్షలుపడేందుకు పుష్కరకాలం పడుతోంది. కొన్ని కీలకమైన కేసులలో దర్యాప్తులు సమర్ధవంతంగా సాగక, పటిష్టమైన ఆధారాలను సేకరించడంలో పోలీస్‌శాఖ విఫలమవడం వల్ల నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం క్రమంగా సడలుతోందన్నది నిర్వివాదాంశం. చట్టాలకు తగు సవరణలు చేసి వ్యాజ్యాల పరిష్కారానికి కాలపరిమితి నిబంధన తేవాల్సిన ఆవశ్యకత ఉంది.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
శాసనసభ ప్రతిష్ట పెంచండి
ప్రజాసమస్యలపై చర్చించేందుకు శాసనసభ వేదికగా సమావేశాలు జరగడం పరిపాటి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సొంత డబ్బా, పరనిందగా శాసనసభ అపకీర్తిని మూటగట్టుకుంటోందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైకాపాకు ఊహించని రీతిలో మెజార్టీ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో అధికార పక్షం ఉంది. గత పాలకుల నిర్ణయాలను, చేపట్టిన పనులను తిరగతోడతామని, అనుమతుల్లేని భవనాలను కూల్చివేస్తామని చెప్పేందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారిస్తే కొన్నైనా కొలిక్కి రాగలవు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం, బహిష్కరణకు గురిచేయడం వంటివి చూస్తుంటే సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో సగటు మనిషికి అంతుచిక్కని పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్‌ను అధికార పార్టీ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తుతూ దేవదూతగా అభివర్ణిస్తూ భజన చేయటంలో ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. వీళ్ళ మాటలు తనను ఆశ్చర్యానికి గురిచేస్తుండటంతో ముఖ్యమంత్రి తనలోతానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ముఖ్యమంత్రి మెప్పుపొందేందుకు విపక్ష సభ్యులపై వైకాపా ఎమ్మెల్యేలు మాటలతో దాడి చేస్తున్నారు. సభ నిర్వహణకు గంటకు లక్షలాది రూపాయలు ప్రజాధనం వెచ్చిస్తున్నారు. భజన చేసేందుకు, తిట్టుకోవడానికి వేరే వేదికలు ఉంటాయి. శాసనసభను రాబోయే తరాలకు ఆదర్శంగా నడపాలి. ఏపీ శాసనసభలో గతంలో సభ్యులుగా పనిచేసిన వారు అందరినీ ఆకట్టుకొని కేంద్ర మంత్రులుగా, లోక్‌సభ స్పీకర్‌గా, ఉప రాష్టప్రతిగా, రాష్టప్రతిగా పనిచేసి తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారి వారసులుగా పనిచేస్తూ, శాసనసభ ప్రతిష్టను పెంచేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో పనిచేయాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
మాటలకందని అమానుషం
ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార బాధితురాలు ఎదుర్కొంటున్న తీవ్ర సంఘటనలు ఆ రాష్ట్రంలో అరాచక పాలనకు సంకేతం. నిందితుడు బలవంతుడైతే బాధితులకు ఏ మాత్రం రక్షణ లేకపోగా, మరింత ప్రమాదం తప్పదని చెప్తోన్న ఈ ఉదంతం మన దేశం ‘ప్రజాస్వామిక నాగరిక సమాజం’ అని చెప్పుకోడానికే సిగ్గుపడేలా చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రెండేళ్ల క్రితం అక్కడి అధికార పార్టీ శాసనసభ్యుడే తనపై అత్యాచారం చేసాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. న్యాయం జరిగే పరిస్థితి కానరాక సాక్షాత్తూ ముఖ్యమంత్రి ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈ విషయం నలుగురి దృష్టిలోకి వచ్చాక ఆ ప్రబుద్ధునిపై కేసు నమోదైంది. వెంటనే ఆమె తండ్రిపై ఏదో నేరారోపణ రావడం, ఆయన లాకప్‌లోనే మరణించడం జరిగిపోయాయి. అటు పిమ్మట ఆమె మేనమామపై మరో కేసు. ఆయన సైతం జైలుపాలు. ఇలా న్యాయం కోసం ధైర్యంగా నిలబడిన ఆమె కుటుంబంపై బెదిరింపులు అనేకం. ఆమె తన కుటుంబంతో ప్రయాణిస్తున్న కారును సరైన నెంబర్ ప్లేట్ లేని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆమె మేనత్త చనిపోయింది. బాధితురాలికి, ఆమె న్యాయవాదికి తీవ్ర గాయాలయ్యాయి. అది ఆమెపై జరిగిన హత్యాప్రయత్నం అని ప్రాథమికంగా గుర్తించడానికి పోలీసు ఉన్నతాధికారులు వెనకడుగు వేశారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్టు అంతకుముందే ఆమె సుప్రీం కోర్టుకి లేఖ రాసింది. సంవత్సర కాలంగా ప్రభుత్వపు పెద్దల దృష్టిలో ఉన్న కేసులోనే ఇంత అన్యాయం జరగడం గర్హించాల్సిన విషయం. ‘నిర్భయ’ ఉదంతం తర్వాత అత్యాచారాల్ని అదుపుచేయడానికి కఠిన చట్టాల్ని తీసుకువచ్చారు. అయినా లాభమేమిటి? చట్టాల్ని అమలు చేయాల్సిన యంత్రాంగం, పాలకులు బాధితులను మరింతగా వేధిస్తున్నపుడు, నేరస్తులతో చేతులు కలుపుతున్నపుడు చట్టాలు ఏం చేస్తాయి? ఇనే్నళ్లయినా ఆమెకు జరిగిన అన్యాయంపై విచారణ మొదలుకాలేదంటేనే పాలకుల చిత్తశుద్ధి తెలియడం లేదా?
-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం