ఉత్తరాయణం

యువతలో క్రీడా సంస్కృతి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య ఐరోపాలోని పోలండ్, చెక్ రిపబ్లిక్‌ల్లో జరిగిన పరుగుపందేల్లో ఐదు స్వర్ణ పతకాలు సాధించి మన దేశం గర్వించేలా ప్రతిభ చూపారు హిమాదాస్. అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మన దేశం తరఫున అంతర్జాతీయ పోటీలో ఒకేనెలలో ఐదు స్వర్ణ పతకాలు సాధించడం ఎంతటి గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు. అస్సాంలో కనీస అవసరాలు కూడా సరిగాలేని ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో హిమాదాస్ ఇలాంటి అద్భుత విజయాలు సాధించడం స్ఫూర్తిదాయకం. మన దేశంలో మట్టిలో మాణిక్యాల్లాంటి ప్రతిభావంతులు కోకొల్లలు. కానీ వారికి అవగాహన లేక, అవగాహన ఉన్నా సరైన ఆర్థిక వనరులు లేక వారి ప్రతిభాపాటవాలను నిరూపించుకునే అవకాశం రాకపోవడం వల్ల మన దేశం మేటి క్రీడాకారుల్ని కోల్పోతోందనే చెప్పాలి. మన దేశంలో క్రికెట్, బాడ్మింటన్‌కు తప్ప మిగతా ఏ క్రీడలకూ కూడా అంతర్జాతీయ స్థాయి వౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేటురంగ భాగస్వామ్యంతోనైనా వౌలిక సదుపాయాలను సమకూర్చి, యువతకు క్రీడలంటే ఒక్క క్రికెట్ మాత్రమే కాదని, రకరకాల ఆటల పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ చూపి, మన దేశానికి మంచి గుర్తింపుతీసుకువచ్చే క్రీడాకారులకు తగిన నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి, వారికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని క్రీడా సంస్కృతిని పెంపొందించాలి. ఈ విధమైన చర్యలు తీసుకున్నప్పుడు యువత క్రీడలనే ఒక వృత్తిగా ఎంచుకొని, వాటిలో రాణించి మన దేశప్రతిష్టను ఇనుమడింపచేస్తారనడంలో సందేహం లేదు.
-malli.mejari@gmail.com

కారుణ్య నియామకాలు జరఫండి
ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాలల)లో శాశ్వత ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం దొరకటం లేదు. ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నేతలు చెబుతున్న మాటలు నీటి మీద రాతలుగా మిగిలిపోయాయి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాల పరిస్థితి దీనంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లా ఒక ఉపాధ్యాయుడు చనిపోతే కారుణ్య నియామకాల అంశాన్ని పరిష్కరించకపోవడం దారుణం. సర్వీసులో ఉండి చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి. కారుణ్య నియామకాలకు అవసరమైన చర్యలు ప్రారంభించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వం మిగతా యాజమాన్యాలలో పనిచేస్తున్న సిబ్బందికి అన్నిరకాల సౌకర్యాలను కల్పించి కేవలం ఆదర్శ పాఠశాలల రెగ్యులర్ సిబ్బందికి సౌకర్యాల కల్పనలో ముందుకు అడుగువేయక పోవడం విచారకరం. పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్టే ఇచ్చి, వాటి అమలులో సాంకేతిక కారణాలను సాకుగా చూపి నిలిపివేసారు. హెల్త్‌కార్డులు, ట్రెజరీ ద్వారా జీతాలు, సర్వీసు నిబంధనలు, మధ్యంతర భృతి అమలు కాగితాలకే పరిమితమయ్యాయి. మోడల్ స్కూళ్ల సిబ్బంది సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.
- బి.సురేష్, శ్రీకాకుళం
నిర్వీర్యం చేసే సవరణలు
పాలనలో పారదర్శకతను పెంచి, అవినీతిని నిర్మూలించేందుకు దోహదపడే సమాచార హక్కు చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. సమాచార హక్కు సవరణ బిల్లు-2019 లోక్‌సభలో ఆమోదింపచేసుకున్నారు. ప్రజల చేతిలో వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టాన్ని 2005 యూపీఏ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సమాచార హక్కు చట్టం రావాలని కోరుతూ దేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. చాలా సంవత్సరాలు పోరాటాలు జరిగాయి. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, సామాజిక కార్యకర్తలు సందీప్‌పాండే, అరుణారాయ్ తదితరులు చట్టం రావడానికి కృషి చేశారు. ఈ చట్టం అన్ని రాష్ట్రాలలో అమలవుతోంది. అధికారులలో జవాబుదారీతనం కాస్త పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరణల పేరుతో సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సవరణలలో కేంద్ర సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల పదవీ కాలపరిమితి 5 సంవత్సరాలు వుంది. ప్రస్తుత సవరణల్లో కాలపరిమితి ఎంతో స్పష్టం చేయలేదు. కేంద్ర సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు పూర్వపు ప్రభుత్వంలో అందజేసిన పెన్షన్, పదవీ విరమణ సదుపాయాలను ఈ బిల్లులో తొలగించారు. వాస్తవ దృష్టితో ఆలోచిస్తే స్వతంత్రంగా పనిచేస్తున్న కేంద్ర సమాచార కమిషన్‌ను ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడమే సవరణ బిల్లు ఉద్దేశంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా స.హ.చట్టం సవరణలపై ఉద్యమకారులు తమ నిరసనలను తెలుపుకున్నారు. మేధావులు, అన్నివర్గాల ప్రజలు సైతం ఈ సవరణలను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి, చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి. చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేయకుండా గతంలోవున్న విధంగానే అమలుచేయాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట