ఉత్తరాయణం

సీమాంధ్ర ‘అవతరణ’ ఎప్పుడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్రలో కొన్ని శుభకరమైన రోజులు ఉంటాయి. కొన్ని అశుభకరమైన రోజులూ ఉంటాయి. శుభములు పొందిన ప్రజలు ఆ రోజున పండుగ చేస్తారు. అశుభములు కలిగిన ప్రజలు అలాంటి రోజున ఆవేదనలు గుర్తుచేసుకుంటారు. చిత్రమేమిటంటే- దేశ చరిత్రలో ఒకే రాష్ట్రంగా బతుకుతున్న తెలుగు ప్రజలను విడదీసి కొందరికి మంచిని, ఇంకొందరికి చెడ్డను మిగిల్చిన రోజు అది. ఆరోజు వచ్చిందంటే తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలు తమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, సీమాంధ్రలోని ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఆవేదన చెందుతుంటారు. ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగాన్ని, మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం రద్దుకావటాన్ని గుర్తు చేసుకుంటారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రావతరణ వేడుకలు జరగటం మనకు తెలుసు. మరి నేటి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు? ఆ వేడుకలు ఏవీ? గడచిన ఐదేళ్ళుగా నవ్యాంధ్రలో అవతరణ దినం ఊసే లేదు. జూన్ 2వ తేదీన జరపాలా? నవంబర్ 1వ తేదీన జరపాలా? అనే మీమాంస వీడనే లేదు. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందిగ్ధానికి సమాధానం చెప్పలేక జూన్ 2వ తేదీని ‘నవ నిర్మాణ దీక్షగా కొనసాగించారు. ఆరోజున ఎ.పీ.కి జరిగిన అన్యాయాలపై, గాయాలపై ఏకరువుపెట్టి నవ నిర్మాణానికి సమాయత్తం కావాలని సందేశం ఇచ్చేవారు. ఇలా అయిదేళ్లు గడిచిపోయాయి. మరి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 2వ తేదీన ఏం చేస్తారు? ఎలాంటి సందేశం ఇస్తారు? జూన్ 2వ తేదీని రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తారా? నవంబర్ 1వ తేదీనే అవతరణ జరుపుకుందామని పిలుపునిస్తారా? ఏదేమైనా సీమాంధ్రలోని ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం లేకపోవటం తెలుగువారికి మహా బాధాకరం. ఇప్పటికైనా తెలుగు ప్రజలకు రాష్ట్ర అవతరణపై స్పష్టత ఇవ్వాలి. తక్షణం అవతరణ దినోత్సవాన్ని ప్రకటించి ప్రభుత్వమే ఉత్సవాల నిర్వహణకు బాధ్యత వహించాలి. వాడవాడలా తెలుగు దనాన్ని నింపాలి. ప్రభుత్వ కర్తవ్యాలలో ‘అవతరణ దినోత్సవ వేడుకలు’ కర్తవ్యం కావాలి.

-పోతుల బాలకోటయ్య 98497 92124