ఉత్తరాయణం

రైతుల్ని నమిలేస్తున్న ‘లేస్ చిప్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా బహుళజాతి కంపెనీ ‘పెప్సికో’ లేస్ చిప్స్‌ని తయారుచేసి లాభాల్ని బాగానే పిండుకొంటోంది. భారత్ దానికి ఒక పెద్ద మార్కెట్. తనకు ఏ రకమైన బంగాళా దుంపలు కావాలో వాటిని ఇక్కడే, ఈ దేశంలోనే రైతులతో కాంట్రాక్టు కుదుర్చుకొని పంట సమకూర్చుకొంటుంది. ఇప్పుడు ఆ కంపెనీ గుజరాత్‌లో తొమ్మిది మంది రైతులపై కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ వ్యాజ్యాన్ని వేసింది. ఆ రైతులు తమకు అవసరమైన రకం బంగాళాదుంపల్ని తమ నిబంధనలను దాటి పండిస్తున్నందున నష్టపరిహారం చెల్లించాలంటూ, ఈ రకం విత్తనాలపై తమకు పూర్తి పేటెంట్ హక్కులున్నట్టు, వాటిని మీరడం వల్ల తమకు నష్టమంటూ ఆ కంపెనీ వాదిస్తోంది. వాస్తవానికి దేశీయ చట్టాల్లో రైతులపై అలాంటి పరిమితులు లేవు. పైగా హక్కులున్నాయి. తాము పండించేది ప్రత్యేక రకమైనా- ఆ విత్తనాల్ని దాచుకొనే, నాటుకొనే, మళ్ళీ నాటుకోడానికి దాచుకొనే, రైతులు తమమధ్య మార్పిడి చేసుకొనే హక్కుల్ని కలిగి ఉంటారు. ఇప్పుడీ కంపెనీ రైతుని కోర్టుకి లాగడం అంటే వారి హక్కుల్ని ఉల్లంఘించడమే. కేవలం అహంకారంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ చర్య పంటపై, మార్కెట్‌పై గుత్త్ధాపత్యం పొందే ప్రయత్నం మాత్రమే కాదు.. రైతు స్వేచ్ఛని, దేశ ఆహార భద్రతనీ ఛాలెంజ్ చేసినట్టే భావించాలి. మన దేశం ఆ కంపెనీపై పరిమితులు విధించాల్సిందిపోయి కంపెనీయే దేశంపై పెత్తనం చేసినట్టున్న విపరీత చర్య. గుజరాత్ ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పక్షాలూ పెప్సికో దుందుడుకు ప్రయత్నాన్ని ఖండించాలి. మార్కెట్ పెత్తనాన్ని ఇప్పుడు అడ్డుకోకుంటే బహుళజాతి కంపెనీలు మున్ముందు మరింత తీవ్రమైన దాడులకు తెగబడతాయి. అమెరికా అధ్యక్షుడు తమ బైకులపై పేపర్ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నుల గురించి విపరీతంగా బాధపడుతున్నప్పుడు, మన ఉత్పత్తుల్నీ, రైతుల్నీ వారి కంపెనీల నుండి కాపాడుకోవడం మన విద్యుక్త్ధర్మం. మన భూమినీ, వనరుల్నీ, మార్కెట్‌నీ వినియోగించుకొని మళ్ళీ మన రైతుపై పెత్తనం చేసే అవకాశం వారికి ఇవ్వరాదు.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం
ఆరోగ్య భద్రతకు భరోసా ఏదీ?
ఆరోగ్య సమస్యల కారణంగా సామాన్య మానవుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోంది. సకాలంలో సరైన వైద్యం అందక లక్షలాదిమంది పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక, ఖరీదైన కార్పొరేట్ వైద్యానికి నోచుకోక పేద, మధ్య తరగతి వారు ఆరోగ్య భద్రతకు దూరమవుతున్నారు. అట్టడుగు వర్గాల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంది. పారిశుద్ధ్య లోపం, పలురకాల కాలుష్యాల వల్ల ప్రజారోగ్యం నేడు ప్రమాదంలో పడింది. అధిక జనాభా, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యల వల్ల చాలామంది సమతుల ఆహారం తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. పోషకాహార లోపం శిశువులు, మహిళల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. స్వచ్ఛతపై సామాన్య ప్రజల్లో ఇప్పటికీ తగిన అవగాహన లేకపోవడం, ఆహారంలో కల్తీ కారణంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. అసంక్రమిత వ్యాధులైన క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలే గాక, సంక్రమిత వ్యాధులైన క్షయ, న్యుమోనియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, మలేరియా వంటి రోగాలు వ్యాపించడంతో ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధుల నివారణకు ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలి. నేటి ఆధునిక యుగంలో శారీరక శ్రమకు దూరం కావడంతో ఎంతోమంది ఊబకాయం, రక్తపోటు వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ‘జీవనశైలి వ్యాధుల’ పట్ల ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలను చైతన్యవంతం చేయాలి. కాలానుగుణంగా వచ్చే (సీజనల్) వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహారం వంటి విషయాల్లో పకడ్బందీ చర్యలు అమలు చేసేలా వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు సమర్ధవంతంగా పనిచేసేలా అధికారులు పర్యవేక్షించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రుల వరకూ తగినంతగా మందులు, ఆధునిక వైద్య పరికరాలను అందజేయాలి. వైద్య సిబ్బందిని, డాక్టర్లను, ఇతర నిపుణులను నియమించాలి. పేదలకు ఉచితంగా వైద్య సేవలను, మందులను అందజేయాలి. మద్యం, గుట్కాలు, ధూమపానం వంటి చెడు వ్యసనాలను అంతమొందించేలా అందరిలో ముఖ్యంగా యువతలో అవగాహన పెంచాలి. శిశువులకు, తల్లులకు, గర్భిణులకు ఉచితంగా పోషకాహారాన్ని అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి తగినంతగా నిధులను కేటాయించాలి. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని ప్రభుత్వం గుర్తించాలి.
- సంపతి రమేష్ మహారాజ్ 99595 56367