ఉత్తరాయణం

వేసవిలో దాహం కేకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులతో అన్ని ప్రాంతాల్లోనూ నీటికొరత అనివార్యమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీటిని అందివ్వడానికి ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ భగీరథ’ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ పనులు పూర్తికాక- ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు మంచినీటిని సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణ ప్రాంతాలలో నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాలలో మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. శాశ్వత చర్యలు తీసుకోనందున నీటి సమస్య ప్రతి వేసవిలోనూ ఎదురవుతోంది. కాగా, వరుస ఎన్నికల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ విధులలో నిమగ్నం అవడంతో నీటి సమస్యలను పరిష్కరించడంలో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారు. సర్పంచ్‌లకు పూర్తిస్థాయిలో అధికారాలు బదలాయింపు జరగకపోవడంతో నీటి సమస్యను పరిష్కరించడంలో వారు చొరవ తీసుకోలేకపోతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో బోర్లను వేయించడం, పాత బోర్లకు మరమ్మతులు చేయడం, పైపులైన్లలో లీకేజీలను అరికట్టడం వంటి పనులను చేపట్టవలసిన అవసరం ఉంది. నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. నిత్యం జనసమూహం ఉండే బస్టాండ్‌లలో, రైల్వేస్టేషన్లలో వాటర్ బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడాన్ని అరికట్టాలి. చలివేంద్రాలు ఏర్పాటుచేసి చల్లని మంచినీటిని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది. రోడ్లపై రద్దీ ఉన్న ప్రాంతాలలో చలువ పందిళ్ళు ఏర్పాటు చేసి ఎండ తీవ్రతనుండి ప్రయాణికులను కాపాడాలి. ట్యాంకర్ల ద్వారా ప్రతి ఇంటికీ ప్రతిరోజూ నీటిని అందివ్వాలి. పశువులకు తాగునీటి సమస్య తలెత్తకుండా సిమెంటు కుండీలను ఏర్పాటుచేసి నిత్యం నీటితో నింపాలి. వ్యవసాయ బావుల దగ్గర చిన్న చిన్న గుంతలు ఏర్పాటుచేసి పక్షులు, జంతువుల దాహార్తిని తీర్చాలి. గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు సర్పంచ్‌లకు నిధులను కేటాయించాలి.
-సంపతి రమేష్ మహారాజ్, వెంకట్రావుపల్లి
ప్రజలు బిచ్చగాళ్లు కాదు..
చాలామంది రాజకీయ వేత్తలు ఎన్నికల సమయంలో ప్రజలను బిచ్చగాళ్లుగా పరిగణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ వేత్తలు వోట్లు పొందడానికి ప్రజలకు లంచాలు ప్రకటిస్తున్నారు. ఓట్ల కోసం రాయితీలు, నజరానాలు, ఉచిత పథకాలను ఇవ్వడం ప్రజాస్వామ్యానికే చేటు. ఉద్యోగస్థుడు ప్రజల నుంచి లంచాలు తింటే నేరం. లంచం ఇచ్చినవాడు, తిన్నవాడు నేరస్థులే! ప్రజల నుంచి లంచాలను ఉద్యోగస్థుడు తీసుకోరాదు. కాని రాజకీయ నాయకులు ఓట్ల కోసం లంచాలివ్వవచ్చా? ఇది తప్పుకదా! చట్టం ఏం చేస్తున్నది? ఉద్యోగస్థుడు లంచం తింటే నేరం, అతనికి లంచం ఇస్తే నేరం. రాజకీయ నాయకుడు ఓట్లను ఆశించి ప్రజలకు డబ్బు పంపిణీ చేయడం నేరం కాదా? ఉద్యోగులకు ఒక నీతి, రాజకీయ నాయకులకు మరొక నీతి సమంజసమా? రాజకీయ వేత్తలు శిక్షార్హులే కదా! దేశంలో చట్టం నిద్రపోతోందా? న్యాయవ్యవస్థ మేల్కొనాలి. ప్రజలు కూడ ఓట్ల కోసం లంచాలు పుచ్చుకోరాదు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ వోటు వేయడం పవిత్రమైన బాధ్యతగా ప్రజలు గుర్తించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురము