ఉత్తరాయణం

లంకకు ఉగ్రవాదం కాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడం, 500 మంది తీవ్ర గాయాల పాలవ్వడం అత్యంత విషాదకరం. ఈస్టర్ రోజున చర్చిలను, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని పలుచోట్ల మారణకాండకి పాల్పడడం ద్వారా తీవ్రవాదులు తమ విష వ్యూహాన్ని అమలు చెయ్యగలగడం నాగరిక ప్రపంచానికే అవమానం. విషాదంలో, సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు మద్దతుగా నిలవడంతోపాటు, ఈ వైపరీత్యాన్ని పాఠంగా తీసుకోవడంలో భారత్ ముందుండాలి. గత ఏడాదిగా రాజకీయ సంక్షోభంలో ఆ దేశం ఉంది. ప్రధానికి, అధ్యక్షునికీ నడుమ విభేదాలు తారస్థాయికి చేరి పార్లమెంటుపై, పాలనపై ఆ దుష్ప్రభావం పడింది. తీవ్రవాదుల నుండి పొంచి ఉన్న ముప్పు గురించి ముందస్తు హెచ్చరికల ద్వారా తెలుసునని అధ్యక్షుడు చెప్తే, ఆ విషయం తన వరకూ రాలేదని అక్కడి ప్రధాని అంటున్నారంటే వారి మధ్య ఎంత సమన్వయ లేమి వుందో అర్థమవుతోంది. మరోవైపు వందలాదిగా బాంబులు వివిధ ప్రాంతాల్లో బయటపడడం, అవి ఆ స్థాయికి చేరేవరకూ నిఘా వర్గాలేవీ గుర్తించలేకపోవడం తీవ్ర వైఫల్యమే. అప్పుల్లో కూరుకొని, అభివృద్ధి మందగమనంలో ఉన్న ఆ దేశానికి ఇప్పుడు తీవ్రవాద సమస్య మరో ముప్పు. రాజకీయంగా, ఆర్థికంగా ఆ దేశం స్థిరత్వం సాధించేలా జరిగే కృషిలో భారత్ ముఖ్య పాత్ర వహించాలి. స్నేహంగా ఉన్న పొరుగు దేశం సంక్షోభంలో పడితే ఆ నీలినీడలు మనకూ వ్యాపిస్తాయి. తీవ్రవాదాన్ని తీవ్రవాదంగా చూడలేక పోవడమే ఇప్పుడు ప్రపంచ దేశాల సమస్య. అందులో కూడా తరతమ బేధాలు, లాభనష్టాలు చూడడంవల్ల అన్ని దేశాలూ నష్టపోతున్నాయి. తీవ్రవాదాన్ని అణిచివెయ్యడం కన్నా అందులో చలి కాచుకోడానికే పెద్ద దేశాలు మొగ్గు చూపడం వల్ల భారత్ లాంటి దేశాలు నష్టపోతున్నాయి. ఒంటరి యుద్ధం చెయ్యాల్సి వస్తోంది. అయినా ఈ తప్పనిసరి యుద్ధంలో అంతర్గతంగా బలోపేతం కావడం, మిగతా దేశాల్ని కలుపుకొని పోవడం అత్యంత కీలకం.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం